శస్త్రచికిత్స లేకుండానే వినిపిస్తుంది!

‘నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూశావా’ అంటాడు తనికెళ్ల భరణి ‘అతడు’ సినిమాలో. నిజంగానే నిశ్శబ్దాన్ని ఎవరూ ఎక్కువ సేపు భరించలేరు.

Published : 28 Apr 2024 00:08 IST

‘నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూశావా’ అంటాడు తనికెళ్ల భరణి ‘అతడు’ సినిమాలో. నిజంగానే నిశ్శబ్దాన్ని ఎవరూ ఎక్కువ సేపు భరించలేరు. అలాంటిది ఎదుటివాళ్ల మాటలనూ, మరే ఇతర శబ్దాలనూ వినలేని వారి బాధను ఊహించడమూ కష్టమే. కొందరికి ఆపరేషన్‌ చేయించుకుంటే ఆ సమస్య తీరుతుంది కానీ, దానికి దాదాపు పదిలక్షల రూపాయల ఖర్చవుతుంది. ఆ అవసరం లేకుండా వినికిడి సమస్యకు పరిష్కారం చూపించే హియరింగ్‌ ఎయిడ్‌ను తయారుచేశారు కనిష్క పటేల్‌, రాజ్‌ షాలు. ఆ పరికరం ద్వారా ఎంతోమంది బధిరుల జీవితాల్లోంచి నిశ్శబ్దాన్ని దూరం చేస్తున్నారు.

నిమిదేళ్ల స్మితకి వినికిడి లోపముంది. పేదరికం కారణంగా లక్షలు ఖర్చుపెట్టి తల్లిదండ్రులు శస్త్రచికిత్స చేయించకపోవడంతో తన జీవితం మూగబోయింది. దాదాపు వందమంది చిన్నారులతో కలిసి బధిరుల పాఠశాలలో సైగల భాషలోనే చదువుకుంటోంది. ఒకరోజు కనిష్క పటేల్‌, రాజ్‌లు ఆ స్కూలుకు వెళ్లి జీవితంలో ఇక వినలేదు అనుకున్న స్మితకు అమ్మానాన్నల మాటలనూ తోబుట్టువుల పిలుపునూ- ప్రకృతిలోని రాగాలనూ పక్షుల కిలకిలరావాలనూ పరిచయం చేశారు. ఆ శబ్దాలను విని ఆనందంతో విప్పారిన స్మిత ముఖం చూశాక ఒకవైపు తాము చేసిన ప్రయోగం ఫలించిందన్న సంతోషం... మరోవైపు వినలేని వారికి ధ్వనిని పరిచయం చేసే మరిన్ని పరికరాలను తయారు చేయాలన్న పట్టుదలా కలిగాయి. ఆ స్ఫూర్తితోనే కనిష్క, రాజ్‌లు 2021లో ‘విహియర్‌’ స్టార్టప్‌ను ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణం సాగిస్తున్నారు.

అహ్మదాబాద్‌లోని ఎల్‌డీ ఇంజినీరింగ్‌ కాలేజీలో కనిష్క పటేల్‌ ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. రోబోటిక్స్‌ పట్ల ఆసక్తి ఉండటంతో రకరకాల పోటీల్లో పాల్గొనేవాడు. వాటికోసం దేశవిదేశాల్లో జరుగుతున్న కొత్త కొత్త ప్రయోగాలూ, ఆవిష్కరణల గురించి తెలుసు కుంటుండేవాడు. ఆ క్రమంలోనే ఓ వార్త కనిష్క కంటపడింది. అదేంటంటే... తుపాకులూ, బాంబుల పేలుళ్లతో యుద్ధరంగంలో భయంకరమైన శబ్దాలు ఆవహించేస్తుంటాయి. ఆ శబ్దాల వల్ల సైనికులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీలు ఉండదు. అందుకే బ్రిటీష్‌ డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ సంస్థ... అమెరికన్‌ సైనికుల కోసం ప్రత్యేకమైన హెల్మెట్లు తయారుచేసింది. హోరెత్తించే శబ్దాల మధ్యలో ఆ హెల్మెట్‌ను పెట్టుకుంటే బయటి సౌండ్లు ఏమీ వినిపించకపోగా, పక్కన వాళ్లు మాట్లాడేది చక్కగా వినిపిస్తుంది. ‘బోన్‌ కండక్షన్‌ టెక్నాలజీ’తో తయారైన ఆ హెల్మెట్‌ గురించి చదవగానే కనిష్క బుర్రలో ఓ ఆలోచన మెరిసింది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని హియరింగ్‌ ఎయిడ్‌ను తయారుచేస్తే- వినికిడిలేమితో బాధపడుతున్న వాళ్లకి మేలు జరుగుతుందని ప్రయోగాలు మొదలుపెట్టాడు. అప్పుడే స్నేహితుడు రాజ్‌ కూడా కనిష్కకు తోడయ్యాడు.

బధిరులకు బహుమతి

శస్త్రచికిత్సలతో కొందరికి వినికిడిలోపం దూరమవుతుంది కానీ అందుకు దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల వరకూ ఖర్చవుతుంది. ఎలాంటి చికిత్సలూ అవసరం లేకుండానే కనిష్క, రాజ్‌లు బోన్‌ కండక్షన్‌ టెక్నాలజీని ఉపయోగించి హియరింగ్‌ ఎయిడ్‌ను తయారు చేశారు. ఈ పద్ధతిలో చిన్న ఇయర్‌ఫోన్‌లాంటి పరికరాన్ని చెవికి వెనకభాగంలో పెడతారు. అది చెవి వెలుపలి భాగాలకు బదులు కణతల దగ్గరున్న ఎముకను వాహకంగా చేసుకుంటుంది. దాని ద్వారా ధ్వనితరంగాలను వైబ్రేషన్స్‌ రూపంలో చెవిలోపల ఉండే కాక్లియాకు నేరుగా పంపిస్తుంది. అక్కడి నుంచి అవి మెదడుకు చేరి- వినికిడి లోపమున్నవారికి ధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. ‘హియర్‌ఎన్‌యూ’ పేరుతో ఈ పరికరాన్ని తయారు చేస్తున్న కనిష్క, రాజ్‌లు... దాన్ని తక్కువ ధరకే పేదలకు అందించాలనుకున్నారు. కార్పొరేట్‌ సంస్థలను సంప్రదించి సీఎస్‌ఆర్‌లో భాగంగా పేదపిల్లలకు ‘హియర్‌ఎన్‌యూ’ను ఉచితంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకూ ముంబయి, బెంగళూరు, చెన్నైకి చెందిన పలు సంస్థలు... కనిష్క, రాజ్‌లు గుర్తించిన 7000 వేల మంది పేద చిన్నారులకు వీటిని అందించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి. మొత్తంగా ఈ మూడేళ్లలో 12000 మందికి వినికిడి శక్తిని ప్రసాదించిన ఈ స్నేహితులు బోన్‌ కండక్షన్‌ టెక్నాలజీతోనే పనిచేసే ‘విహియర్‌ ఓక్స్‌’ అనే ఇయర్‌ఫోన్స్‌నూ తయారుచేశారు. అందుకోసం ఓ మొబైల్‌ ఆప్‌ను కూడా రూపొందించారు. మనం వినే విషయాన్ని దాదాపు 80 భాషల్లో ఆటోమేటిగ్గా అనువదించి వినిపించే సదుపాయం ఆ ఆప్‌లో ఉంటుంది. ఆధునిక టెక్నాలజీతో ప్రయోగాలు చేస్తూ సామాన్యులకు మేలు చేస్తున్న ఈ స్నేహితులు హియర్‌ఎన్‌యూకు పేటెంట్‌ పొందడంతోపాటు జర్మనీ, ఫ్రాన్స్‌, కెన్యా, సింగపూర్‌, ఖతార్‌, శ్రీలంక, కువైట్‌... ఇలా దాదాపు ఇరవై దేశాలకు సరఫరా చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..