వీరికి గెలవడం తెలుసు!

అంకుర పరిశ్రమలు స్థాపించి వాటిని గెలుపుబాటలో నడిపించడానికి ఐఐటీల్లో చదవడం మాత్రమే కాదు, పుట్టిపెరిగిన నేపథ్యమూ తోడ్పడుతుందంటారు నిపుణులు.

Updated : 17 Feb 2024 23:58 IST

అంకుర పరిశ్రమలు స్థాపించి వాటిని గెలుపుబాటలో నడిపించడానికి ఐఐటీల్లో చదవడం మాత్రమే కాదు, పుట్టిపెరిగిన నేపథ్యమూ తోడ్పడుతుందంటారు నిపుణులు. ఓడినా గెలిచేవరకూ రంగంలో నిలవడం, అవసరాన్ని బట్టి దారి మార్చుకోవడం అందరికీ చేతకాదు మరి!


స్నేహితులను చూసి...

స్మీత్‌ థిండ్‌ ముంబయి కుర్రాడు. 2013లో హిందుస్తాన్‌ యూనిలీవర్‌లో సబ్బుల విభాగంలో మూడేళ్ల ఉద్యోగం అతడికి వ్యక్తుల్ని నిశితంగా పరిశీలించే అలవాటు చేసింది. ఫ్యాషన్‌ మీద ఇష్టంతో ఎడాపెడా బ్రాండెడ్‌ దుస్తుల్ని కొని మోజు తీరాక పారేయలేకా, మళ్లీ మళ్లీ వేసుకోలేకా స్నేహితులు పడుతున్న అవస్థని గమనించాడు. ఖరీదైన ఆ దుస్తుల్నీ యాక్సెసరీల్నీ కాస్త తక్కువ ధరకి మళ్లీ అమ్మేస్తే ఇటు అమ్మేవాళ్లకీ, అటు బ్రాండెడ్‌ వస్తువుల్ని ఎక్కువ ఖరీదు పెట్టి కొనుక్కోలేనివాళ్లకీ కూడా లాభమే కదా అనుకున్నాడు. స్నేహితురాలు మహిమతో కలిసి 2016లో ఫ్యాషన్‌ రీ కామర్స్‌ మార్కెట్‌ప్లేస్‌గా ‘కౌట్‌లూట్‌’ని ప్రారంభించాడు. దుస్తులు, యాక్సెసరీస్‌, బూట్లు... ఇక్కడ అమ్మొచ్చు, కొనొచ్చు. ప్రారంభించిన కొద్ది రోజులకే వేలల్లో స్టాక్‌ వచ్చింది. రోజూ కనీసం 50 ఆర్డర్లు రావడం మొదలైంది. చిన్న మొత్తాలే అయినా నిధులు కూడా సమయానికి అందాయి. పది లక్షల రూపాయలతో పనిచేయడం ప్రారంభించిన సంస్థ ఆపరేటింగ్‌ రెవెన్యూ రెండు కోట్లకు చేరింది. బ్రాండెడ్‌ వస్తువులకే పరిమితమైతే లాభం లేదనుకున్న జస్మీత్‌ అన్‌బ్రాండెడ్‌ విభాగంలోకీ విస్తరించాడు. కొనుగోలుదారులకీ అమ్మకందారులకీ కలిసి ఒకే వేదికలా పనిచేసే దీన్ని ఆప్‌లాగా తేవడమేకాక గృహాలంకరణ, విద్యుత్‌ పరికరాలూ లాంటివన్నీ కూడా చేర్చడంతో సంస్థ విజయపథాన సాగుతోంది. ఈ రంగంలో ఎక్కువ పోటీ లేదనీ ఆ అవకాశాన్ని తాము ఉపయోగించుకుంటున్నామనీ అంటాడు జస్మీత్‌.


డెలివరీ బాయ్‌గా చేరి..!

శైలేష్‌ కుమార్‌ది బిహార్‌లోని సమస్తిపూర్‌ అనే చిన్న టౌను. శిక్షణ పొంది పరీక్ష రాసినా ఐఐటీలో సీటు రాలేదు. దాంతో తండ్రి బలవంతం మీద పంజాబ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. దిల్లీ వెళ్లి 32వేలకు ఒక ఉద్యోగంలో చేరితే తనని ఆఫీసుకు తీసుకెళ్లే క్యాబ్‌ డ్రైవర్‌కి 60వేలు వస్తుందని తెలిసి సిగ్గుపడ్డాడు. తనే కారు కొని క్యాబ్‌లా నడపడం మొదలెట్టాడు. ఇంతలో దాన్ని ఎవరో దొంగిలించారు. జీతమంతా దాని ఈఎంఐ కట్టడానికి సరిపోయేది. పోలీసుల వెంటపడి పదే పదే బ్రతిమిలాడుకుంటే మొత్తానికి కారు దొరికింది. అప్పుడు మళ్లీ లోన్లు తీసుకుని మరికొన్ని కార్లు కొని క్యాబ్‌ బిజినెస్‌ నడిపాడు. నష్టం రావడంతో దాన్ని మూసేసి ఈ-కామర్స్‌ బిజినెస్‌ పెట్టాడు. అందులోనూ నష్టమే వచ్చింది. ఉద్యోగ వ్యాపారాల్లో నిలదొక్కుకోలేకపోవడం, మరోపక్క భార్యాబిడ్డలూ పెరుగుతున్న బాధ్యతలూ... అన్నీ కలిసి అతడిని తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా చేరేలా చేశాయి. కానీ అతనిలోని వ్యాపారవేత్త మాత్రం పరిస్థితులతో రాజీపడలేకపోయాడు. ఉద్యోగం చేస్తూనే రవాణా రంగాన్ని బాగా అధ్యయనం చేసి ఏడాది తిరిగేసరికి క్రియేటివిటీ ఎట్‌ బెస్ట్‌ టెక్నాలజీస్‌(సీఏబీటీ) పేరుతో లాజిస్టిక్స్‌ కంపెనీ పెట్టాడు. 2018లో ప్రారంభమైన ఈ కంపెనీ విలువ ఇప్పుడు రూ.150 కోట్లు. రెండువేలమంది ఉద్యోగులతో 23 రాష్ట్రాల్లో సేవలందిస్తున్నా బయటినుంచి రూపాయి పెట్టుబడి తీసుకోలేదు. ‘ఐఐటీలో సీటు తెచ్చుకోలేకపోయినప్పటి నుంచి ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్న నేను ఇన్నాళ్లకు సొంతూరికి గర్వంగా వెళ్లగలుగుతున్నా’ అంటాడు శైలేష్‌.


గెలిచి తీరాలనుకున్నా!

సోం రాష్ట్రంలో మారుమూల పల్లె శివబ్రతదాస్‌ది. మాతృభాష అస్సామీ అయితే స్కూల్లోనేమో బెంగాలీ మాధ్యమం ఉండేది. ఎలాగో కష్టపడి పదో తరగతి గట్టెక్కితే ఆ తర్వాత ఇంగ్లిషు భూతంలా భయపెట్టింది. అది చాలదన్నట్లు ఒకసారి ఏకంగా 730 రోజులపాటు వాళ్ల ఊరికి కరెంటూ నీళ్లూ లేవు. ఆ కష్టాలే అతడిలో కసినీ పెంచాయి. కష్టపడి చదివి ఐఐటీ బోంబేలో సీటు సంపాదించాడు. డిగ్రీ చదివేటప్పుడే రకరకాల వ్యాపారాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. అయినా పట్టా పుచ్చుకోగానే 2013లో స్నేహితుడు మనోజ్‌ మీనాతో కలిసి ‘ఆటంబర్గ్‌’ అనే టెక్నాలజీ కన్సల్టింగ్‌ సంస్థ పెట్టాడు. మూడేళ్లు రకరకాల ప్రయోగాలు చేసి నష్టాల్లో తేలారు. దాంతో ఊరూ, అక్కడి కష్టాలూ గుర్తొచ్చాయి. ఎలాగైనా గెలిచితీరాలనుకుని పల్లెలకు పనికొచ్చేలా తక్కువ కరెంటుతో పనిచేసే స్మార్ట్‌ ఫ్యాన్ల తయారీ చేపట్టాడు. వాటికి మంచి ఆదరణే లభిస్తుండగా డబ్బు అయిపోయింది.

పెట్టుబడి పెట్టమని వెంచర్‌ కాపిటల్‌ సంస్థలకు దరఖాస్తు చేస్తే ‘మార్కెట్లో హేమాహేమీల్లాంటి బ్రాండ్లు ఉండగా మీ ఫ్యాన్లు ఎవరు కొంటారూ, పైగా ఆన్‌లైన్‌లో ఫ్యాన్లు అమ్మడమేంటీ’ అని వెటకారం చేశారట. జీతాలు ఇవ్వలేక కంపెనీ మూసేసే పరిస్థితి వచ్చినా శివబ్రత ధైర్యం కోల్పోలేదు. పట్టుదలగా ప్రయత్నించి నెల రోజుల్లో వెయ్యికోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాడు. ఆటంబర్గ్‌ ఇప్పుడు ఫ్యాన్లూ మిక్సీలూ స్మార్ట్‌ తాళాలూ తయారుచేస్తోంది. పుణెలోని వీళ్ల ప్లాంటుకి నెలకి పదిలక్షల ఫ్యాన్లు తయారుచేసే సామర్థ్యం ఉంది. 2020లో రూ.69 కోట్లున్న సంస్థ ఆపరేటింగ్‌ రెవెన్యూ మూడేళ్లలో 645 కోట్లకు పెరిగింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..