బిర్యానీతో రోజుకి రూ.60 లక్షలు!

బిర్యానీని ఎక్కడైనా రెగ్యులర్‌, లేదా ఫ్యామిలీ ప్యాక్‌ రూపంలో అందిస్తారు. చిన్న హోటళ్లు అయితే సింగిల్‌ లేదా ఫుల్‌ ప్లేట్‌ విధానంలో వడ్డిస్తాయి.

Updated : 10 Mar 2024 07:06 IST

బిర్యానీని ఎక్కడైనా రెగ్యులర్‌, లేదా ఫ్యామిలీ ప్యాక్‌ రూపంలో అందిస్తారు. చిన్న హోటళ్లు అయితే సింగిల్‌ లేదా ఫుల్‌ ప్లేట్‌ విధానంలో వడ్డిస్తాయి. వాటికి భిన్నôగా కిలోల పరిమాణంలో పొయ్యి మీది నుంచి వినియోగదారులకు నేరుగా అందిస్తోంది ‘బిర్యానీ బై కిలో’. బిర్యానీ ప్రియులకోసం ప్రత్యేకంగా బ్రాండ్‌ను సృష్టించి రోజుకు రూ.60 లక్షల ఆదాయం అందుకోవడంతోపాటు- దేశవ్యాప్తంగా అతి పెద్ద బిర్యానీ డెలివరీ స్టార్టప్‌గా ఆ సంస్థను తీర్చిదిద్దారు కౌశిక్‌ రాయ్‌, విశాల్‌ జిందాల్‌లు.

ఫ్రెండ్స్‌తో పార్టీ అయినా, ఫ్యామిలీ ఫంక్షన్‌ అయినా బిర్యానీ ఉంటే చాలు- చాలామంది తృప్తిగా కడుపు నిండా లాగించేస్తారు. అలాంటి బిర్యానీ... దిల్లీ నుంచి గల్లీ దాకా రకరకాలుగా తయారవుతుంది. అనేక రుచుల్లో లభ్యమవుతూ భోజన ప్రియులకు నోరూరిస్తూ ఉంటుంది. హైదరాబాదీ, లఖ్‌నవీ, కోల్‌కతా, సింధీ, అంబర్‌... ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం బిర్యానీ ఫేమస్‌ కదా. ఎక్కడికక్కడ వాటిని అందించే రెస్టరంట్లూ లెక్కలేనన్ని ఉన్నాయి మన దేశంలో. వాటన్నింటితో పోటీపడుతూ పాన్‌ ఇండియా స్థాయిలో బిర్యానీ విక్రయించి, లాభాలను ఆర్జించడం కూడా విశేషమే. దాన్ని సుసాధ్యం చేసి చూపించారు ‘బిర్యానీ బై కిలో’ వ్యవస్థాపకులు కౌశిక్‌ రాయ్‌, విశాల్‌ జిందాల్‌లు.

వెనకడుగు వేయకుండా...

ఆగ్రాకు చెందిన విశాల్‌ జిందాల్‌ ఐఐటీ(బీహెచ్‌యూ) పూర్వ విద్యార్థి. అమెరికాలో ఎంబీఏ చేసి, అక్కడే ఓ ఏడాది ఉద్యోగం చేశాడు. 1996లో స్వదేశానికి తిరిగొచ్చి తన అన్నతో కలిసి ఎలక్ట్రానిక్స్‌ ట్రేడింగ్‌ కంపెనీని ప్రారంభించాడు. పదేళ్ల తరవాత వెంచర్‌ క్యాపిటలిస్ట్‌గా మారాడు కానీ, ఎక్కడా పనిలో సంతృప్తి లభించలేదు. బిర్యానీ ప్రియుడైన విశాల్‌ 2012లో ఆగ్రా వెళ్లినప్పుడు అక్కడ హోటళ్లలోనూ, బయటా బిర్యానీ కోసం వేచి చూసే వినియోగదారుల్ని చూశాడు. ప్రాంతం పరంగా బిర్యానీకి పేరు ఉంది తప్ప... దానికోసం ప్రత్యేకంగా ఓ బ్రాండు లేదని అప్పుడే అనిపించింది. మెక్‌డొనాల్డ్స్‌, బర్గర్‌ కింగ్‌, స్టార్‌బక్స్‌ మాదిరి బిర్యానీకి కూడా ఓ బ్రాండ్‌ ఉండాలనీ అందుకోసం ఓ ఫుడ్‌ చైన్‌ను మొదలుపెట్టాలనీ అనుకున్నాడు. ఆ విషయం చెప్పినప్పుడు ఇంట్లోవాళ్లూ, స్నేహితులూ ఒప్పుకోలేదు. ‘అంత చదివి బిర్యానీ అమ్ముతావా...’ అని తేలిగ్గా తీసి పడేశారు. విశాల్‌ని వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. అయినా నిరుత్సాహ పడకుండా మార్కెట్‌ను అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఆ క్రమంలో కౌశిక్‌ రాయ్‌ పరిచయమయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన కౌశిక్‌ భోపాల్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివి వెయిటర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. కష్టపడిపైకొచ్చి ఓ సంస్థకు సీఓఓ అయ్యాడు. విశాల్‌ ఆలోచన నచ్చడంతో 2015లో ‘బిర్యానీ బై కిలో’(బీబీకే) ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాడు కౌశిక్‌. గుడ్‌గావ్‌లో మొదటి బీబీకే అవుట్‌లెట్‌ను ప్రారంభించిన విశాల్‌, కౌశిక్‌లు- ఇప్పుడు దేశవ్యాప్తంగా 45 నగరాలకు ‘బిర్యానీ బై కిలో’ను విస్తరించి వందకుపైగా క్లౌడ్‌కిచెన్‌లను ఏర్పాటు చేశారు. రోజుకు దాదాపు రూ.60 లక్షలకు పైగా ఆదాయాన్ని బిర్యానీల ద్వారా ఆ సంస్థ ఆర్జిస్తోందని ఫోర్బ్స్‌ ఇండియా వెల్లడించింది.

ఎక్కడైనా అదే రుచి...

తక్కువ కాలంలోనే ఈ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించడంతోపాటు మంచి ఆదరణ పొందడానికి చాలానే కారణాలున్నాయి. తిని వెళ్లే పద్ధతిలో కాకుండా క్లౌడ్‌ కిచెన్‌ ఏర్పాటు చేసి డెలివరీ అవుట్‌లెట్‌గా మొదట సంస్థను ప్రారంభించి- బిర్యానీని అరకేజీ, కేజీ పరిమాణంలో విక్రయించడం విశాల్‌, కౌశిక్‌లకు బాగా కలిసొచ్చింది. ముందుగానే బిర్యానీ వండి ఉంచి ఆర్డర్‌ రాగానే దాన్ని వేడి చేసి పార్సిల్‌ చేసే పద్ధతి ఇక్కడ ఉండదు. వినియోగదారులు ఆర్డర్‌ ఎంతిస్తే అంతే వండి తాజాగా అందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు ఈ ఇద్దరు మిత్రులు. ఆర్డర్న్‌ు బట్టి మట్టికుండలో అప్పటికప్పుడు వండి... వేడివేడిగానే బిర్యానీని వినియోగదారులకు అందిస్తారు. మట్టికుండ మందంగా ఉంటే త్వరగా వేడి తగ్గకుండా ఉంటుందని కుండల్ని కూడా ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. అప్పటికప్పుడు బిర్యానీ వండటానికీ, మందపాటి కుండలో ఉడకడానికీ సమయం పట్టినా సరే- రుచీ, తాజాదనం విషయంలో రాజీ పడకపోవడం వల్ల బీబీకేకు చాలా తక్కువ సమయంలోనే మంచి ఆదరణ లభించింది. ప్రాంతాన్ని బట్టి బిర్యానీ రుచిలోనూ, మసాలాల వాడకంలోనూ కొన్ని తేడాలుంటాయి. కానీ దేశవ్యాప్తంగా దొరికే బీబీకే బిర్యానీ రుచి మాత్రం ఒకేలా ఉంటుంది. అందుకోసం ప్రత్యేకంగా మసాలాలను రూపొందించడంతోపాటు ఏ పరిమాణంలో వండే బిర్యానీకి ఎంత మసాలా వాడాలో కూడా పలు ప్రయోగాలు చేసి ముందే నిర్ణయించారు విశాల్‌- కౌశిక్‌లు. క్లౌడ్‌కిచెన్‌ నుంచి డైన్‌ ఇన్‌ సేవల్లోకి కూడా అడుగు పెట్టిన బీబీకేలో హైదరాబాదీ, లఖ్‌నవీ, కోల్‌కతా బిర్యానీలూ, కబాబ్‌లూ, గ్రేవీ కూరలూ, స్టార్టర్స్‌, డెజర్ట్‌లూ అందుబాటులో ఉన్నాయి. బీబీకేను వెయ్యి కోట్ల టర్నోవర్‌ కలిగిన సంస్థగా విస్తరించడంతోపాటు మన బిర్యానీ ఘుమఘుమలను విదేశాలకూ తీసుకెళ్లాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారీ మిత్రులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..