ఆ పసిమొగ్గల మృతికి కదిలిపోయి..!

పాతికేళ్ళకిందట వెంకటేశ్‌ హీరోగా తెలుగులో ‘గణేష్‌’ అనే సినిమా వచ్చింది... గుర్తుందా! ఆ సినిమాలోని హీరోలాంటివాళ్ళే ఈ యువ దంపతులు.

Published : 09 Mar 2024 23:35 IST

పాతికేళ్ళకిందట వెంకటేశ్‌ హీరోగా తెలుగులో ‘గణేష్‌’ అనే సినిమా వచ్చింది... గుర్తుందా! ఆ సినిమాలోని హీరోలాంటివాళ్ళే ఈ యువ దంపతులు. సర్కారు ఆసుపత్రుల్లోని అలసత్వానికి నిరుపేదలెందరో మరణించడాన్ని కళ్ళారా చూసినవాళ్ళు. తమ సొంతవాళ్ళనీ కోల్పోయారు. అయినా- గణేష్‌లా వీళ్ళు హింసవైపు వెళ్ళలేదు. చట్టమనే అంకుశంతో సర్కారు వైద్యాన్ని సామాన్యులవైపు కదిలించారు! దక్షిణాదిన మరే రాష్ట్రానికీ లేనన్ని వసతులు తమిళనాడులోని జిల్లా ఆసుపత్రులకీ వచ్చేలా చూశారు. వాళ్ళ విభిన్న పోరాట కథ ఇది...

నంద్‌రాజ్‌ పుట్టిపెరిగింది బెంగళూరులో. చిన్నప్పుడే తండ్రికి హృద్రోగం వస్తే- నిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరగడంతోనే గడిచింది అతని బాల్యం. వాళ్ళమ్మ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులమ్మి మరీ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తుండేది. అంతచేసినా తండ్రి చనిపోయారు. వైద్యానికి ఉన్నదంతా ఊడ్చిపెట్టి మరీ ఖర్చుచేయడంతో వీళ్ళు వీధినపడ్డారు. దాంతో- పొట్టచేతపట్టుకుని తమిళనాడుకి వచ్చారు. ఆనంద్‌రాజ్‌ డిగ్రీ ముగించి ‘ఎవిడెన్స్‌’ అనే ఎన్జీఓలో చేరి పల్లెసీమల్లో పేట్రేగిపోతున్న పరువు హత్యలకి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టాడు. అలా ఓ కేసు కోసం ఓ రోజు రాత్రి మదురై ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వచ్చాడు. మార్చురీ దగ్గర నిల్చుని ఉండగా- అక్కడికో స్ట్రెచర్‌ని తెచ్చారు పనివాళ్ళు. దానిపైన ముగ్గురు పసికందులు! ఆ ముందురోజు పుట్టి- ప్రాణాలు వదిలిన శిశువులు. దూరంగా ఏడవడానిక్కూడా ఓపికలేక మౌనంగా రోదిస్తున్న ముగ్గురు పేద తల్లులు!  

తొలి ‘పిల్‌’...

‘ఏమైందా పిల్లలకి?’ అని అడిగాడు ఆనంద్‌ అక్కడి సిబ్బందిని. ‘నెలలు తక్కువగా పుట్టారు సార్‌! మనదగ్గర ఇన్‌క్యుబేటర్‌లు చాలినన్ని లేవు, దాంతో చనిపోయారు’ అన్నారట. ‘ఇంత పెద్ద ఆసుపత్రిలో ఇన్‌క్యుబేటర్‌ల కరవు ఎందుకొస్తోంది?’ అన్న ప్రశ్న ఆనంద్‌ని తొలిచేసింది. సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఈ ఒక్క ఆసుపత్రిలోనే ఇలా ఏటా 700 మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తేలింది! ‘ఇది అమానుషమంటూ’ మద్రాసు హైకోర్టు- మదురై ధర్మాసనంలో ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌) వేశాడు ఆనంద్‌. హైకోర్టు తనదైన శైలిలో కొరడా ఝళిపించింది. దాంతో ప్రభుత్వం రూ.150 కోట్ల ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో సమగ్ర శిశుసంరక్షణకేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఆనంద్‌ అందుకున్న తొలి విజయం అది. ఆ తర్వాత ఆర్టీఐ చట్టం, ప్రజాహిత వ్యాజ్యాలని ఆయుధాలుగా మలచుకుని- రోగుల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టాడు. ఆనంద్‌ భార్య వెరోనికా మేరీ కూడా ఆనంద్‌తో చేయి కలిపింది. ఇద్దరూ విడిగానూ, కలిసీ ఇప్పటిదాకా 120 పిల్స్‌ వేశారు. దేశంలో ఇంకెక్కడాలేని విధంగా జిల్లా ఆసుపత్రుల్లోనే చక్కటి వసతుల్ని కల్పించగలిగారు.

ఇంకెక్కడా లేవు...

తమిళనాడులో ఒకప్పుడు పది జిల్లా ఆసుపత్రుల్లోనే సీటీ, ఎమ్మారై స్కాన్‌లు ఉండేవి. దూరప్రాంతాల రోగులు ఆ అవసరాలకోసం కనీసం 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఆ పరిస్థితిని మార్చి 46 ప్రధాన జిల్లా ఆసుపత్రులన్నింటా ఎమ్మారై వసతుల్ని ఏర్పాటుచేయించారీ దంపతులు. బధిర చిన్నారులకి చెవి వినపడేలా చేసే ‘కాక్లియర్‌ ఇంప్లాంట్‌’ ఆపరేషన్‌లూ తొలిసారి సర్కారు ఆసుపత్రుల్లో జరగడానికి కారకులయ్యారు. అలా ఇప్పటిదాకా 211 ఆపరేషన్‌లు జరిగాయి- ప్రైవేటులో రూ.9 లక్షలయ్యే శస్త్రచికిత్స ఇది! అంతేకాదు- పళ్ళ సమస్య వస్తే రూట్‌కెనాల్‌ చికిత్స చేసే ‘సెరామిక్‌ కేర్‌’ వసతి ఒకప్పుడు రాష్ట్రం మొత్తానికి ఒకే ఒక్క ప్రభుత్వాసుపత్రిలో ఉండేది. ఒక్క పిల్‌తో అన్ని జిల్లా ఆసుపత్రులకూ ఆ సదుపాయం వచ్చేలా చూశారు. ఇలాగే ఉచిత ఫెర్టిలిటీ కేంద్రాల్నీ తెచ్చారు. అంతేకాదు, తమిళనాడులోని అన్ని
ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోనూ నేడు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారంటే కేవలం వీళ్ళ చలవే!           

 

నిర్లక్ష్యంపైనా!

గర్భిణి నొప్పులతో అల్లాడుతుంటే ఆసుపత్రిలో లేకుండాపోయి ఆమె మృతికి కారణమైన వైద్యుల్నీ పుట్టిన పసికందుల్ని ఆగంతకులు ఎత్తుకెళ్ళిపోతుంటే చూసీచూడ నట్టుండే సెక్యూరిటీ ఆఫీసర్లనీ అందర్నీ బోనెక్కించారు- ఈ దంపతులు! మూడువేల మంది బాధితులకి పరిహారం అందేలా చూశారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. తమ కుటుంబంలో ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా సర్కారు ఆసుపత్రికే వెళ్ళాలన్న నియమం పెట్టుకున్నారు. ఓ రోజు మేరీ కొవిడ్‌ సోకిన తన తల్లిని అలాగే ఆసుపత్రికి తీసుకెళితే... ‘అంత తొందరైతే ఎలా... ముందు అడ్మిషన్‌ ప్రొసీజర్‌ పూర్తి కావాలి’ అంటూ తీవ్ర కాలయాపన చేశారట అక్కడి వైద్యులు. దాంతో మేరీ చేతుల్లోనే ఆమె తల్లి చనిపోయింది! అంత దుఃఖంలోనూ ‘ఇలా ఎంతమంది చనిపోయుంటారో!’ అన్న ఆలోచనే వచ్చింది మేరీకి. వెంటనే ‘ఈ అనవసర కాలయాపనని ఆపండి!’ అంటూ కోర్టుకెక్కింది. దాంతో ప్రభుత్వం ‘జీరో అడ్మిషన్‌ ప్రొసీజర్‌’ పథకాన్ని తెచ్చి అమలు చేయడం మొదలుపెట్టింది!

ఈ విజయాలన్నీ చూస్తుంటే- ఆనంద్‌, మేరీల్లాంటి వాళ్ళు ప్రతిరాష్ట్రంలోనూ ఉంటే బావుణ్ణనిపిస్తోంది కదూ?!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..