సైంటిస్టు... మెమోలు చేస్తున్నాడు

మీకో విషయం తెలుసో లేదో... చికెన్‌ తినడంలో తెలుగువారే టాప్‌! అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలవాళ్ళే కోడిమాంసాన్ని ఎక్కువగా తింటున్నారట.

Published : 07 Apr 2024 00:08 IST

మీకో విషయం తెలుసో లేదో... చికెన్‌ తినడంలో తెలుగువారే టాప్‌! అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలవాళ్ళే కోడిమాంసాన్ని ఎక్కువగా తింటున్నారట. ఆ విషయం తెలిసే- తనకిష్టమైన మోమోలని చికెన్‌తో అందించి తెలుగు రాష్ట్రాల్లో సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు శౌవిక్‌ ధార్‌. హైదరాబాద్‌ కేంద్రంగా ‘జోమోజ్‌’ చెయిన్‌ రెస్టరంట్‌ని ప్రారంభించి దేశంలోని టాప్‌ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిపాడు. మోమోల తయారీ కోసం తొలిసారి ‘ఏఐ’ మెషీన్‌లనీ రూపొందించి సంచలనం సృష్టించిన శౌవిక్‌ గెలుపు కథ ఇది...

2005 నాటి మాట. భారత సైన్యానికి ఆయుధ సంపత్తిని అందించే డీఆర్‌డీఓ సంస్థ డెహ్రాడూన్‌ క్యాంపస్‌ అది. అప్పట్లో రాడార్‌ ఆపరేటర్‌లకి యుద్ధసమయంలో ఎలా పనిచేయాలో నేర్పడానికి- అసలైన యుద్ధవిమానాలనే వాడి శిక్షణ ఇస్తుండేవారు. అందుకు ఖర్చు ఎక్కువగా ఉండటంతో- దానికి బదులు కంప్యూటర్‌ ‘సిమ్యులేటర్‌’ను సిద్ధంచేస్తే మంచిదనుకుంది డీఆర్‌డీఓ. ఆ సంస్థకి అలాంటి సిమ్యులేటర్‌ రూపొందించి ఇచ్చిన యువ సైంటిస్టుల్లో ఒకడు- శౌవిక్‌ ధార్‌. ఆ రకంగా డీఆర్‌డీఓకి రోజుకు మూడులక్షల రూపాయల ఖర్చుని తగ్గించేశాడు. పాతికేళ్ళు నిండకుండానే అలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పనిచేసి- మంచి గుర్తింపు సాధించాడు. కానీ, ఎంత సైంటిస్టయినా ఉద్యోగే కదా- తన జీవితం అలాగే ఉండిపోకూడదనుకున్నాడు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)లో చేరాడు. అక్కడ ఎంబీఏ పూర్తిచేశాక- ఫ్రెండ్‌తో కలిసి హైదరాబాద్‌లో ఓ స్టార్టప్‌ని ప్రారంభించాడు. అప్పుడే- ఇక్కడ తనకిష్టమైన ‘మోమోల’ కోసం వెతకసాగాడు. ఎవర్నడిగినా ‘మోమోలా... ఏమో తెలియదండీ!’ అనడం చూసి విస్తుపోయాడు.

అమ్మదే ఆ స్ఫూర్తి!

మోమో టిబెట్‌కి చెందిన వంటకం. గోధుమపిండి లోపల మాంసాన్నో, కాయగూరల్నో కూరి కుడుముల్లా ఆవిరిపైన ఉడికించే ఓ ఆహార విశేషం. అది టిబెట్‌ నుంచి నేపాల్‌ మీదుగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలకి చేరింది. శౌవిక్‌ ధార్‌ది అసోం రాష్ట్రమే. వాళ్ళమ్మ పండగలప్పుడు వీటిని చేసేదట. వాటిని తిన్నవాళ్ళందరూ ‘వీటితో నువ్వు ఓ పెద్ద రెస్టరంట్‌ పెట్టొచ్చమ్మా!’ అంటుంటే ఆమె నవ్వి ఊరుకునేదట. అక్కడ కట్‌ చేస్తే- హైదరాబాద్‌లో స్థిరపడి మోమోల కోసం మొహం వాచి ఉన్న శౌవిక్‌కి ఆ జ్ఞాపకాలు గుండెల్లో మెదిలి నోట్లో నీళ్ళూరుతుండేవి. అప్పుడే- ‘మోమోలని హైదరాబాద్‌లోనే తయారుచేసి విక్రయిస్తే ఎలా ఉంటుంది?’ అన్న ఆలోచన వచ్చిందతనికి. వెంటనే అసోం నుంచి ఇద్దరు వంటవాళ్ళని తీసుకొచ్చాడు. తన ఫ్లాట్‌లోనే వాటిపైన రకరకాల ప్రయోగాలు చేయసాగాడు. మామూలుగా ఈశాన్య రాష్ట్రాల్లో గొర్రె మాంసాన్నేమోమోల్లో స్టఫ్‌గా ఉపయోగిస్తుంటారు. శౌవిక్‌కి కూడా అలా తినడమే అలవాటు. కానీ ‘తెలుగువాళ్ళకి చికెన్‌ అంటేనే ఇష్టం. వాటితో ట్రై చేయండి’ అని ఎవరో సలహా ఇచ్చారట. దాంతో- హైదరాబాదీల కోసం ‘హాట్‌ అండ్‌ క్రిస్పీ’గా ఈ మోమోల్ని రూపొందించాడు. 2016లో- ఇనార్బిట్‌ మాల్‌లో ‘జోమోజ్‌’ పేరుతో చిన్న ఔట్‌లెట్‌ తెరిచి విక్రయించసాగాడు. స్పందన అదిరిపోవడంతో ఐటీ కారిడార్‌లోని పలుచోట్ల ఔట్‌లెట్‌లు పెట్టాడు. ఏడాదికల్లా అవన్నీ లాభాల్లో నడవసాగాయి. అప్పుడే పీవీఆర్‌ సంస్థవాళ్ళు తెలుగురాష్ట్రాల్లోని తమ థియేటర్‌లన్నింటా జోమోజ్‌ ఔట్‌లెట్‌లు పెట్టాలని కోరడంతో వాటిని ఏర్పాటుచేశాడు. దాంతో సంస్థ తిరుగులేని వృద్ధిని సాధించింది. కానీ కరోనా లాక్‌డౌన్‌ వీళ్ళని కుదేలు చేసింది. ఏడాదిపాటు కోలుకోలేని దెబ్బతీసింది.

సైంటిస్టులు తలో చేయి...

‘మా దుకాణాలున్న థియేటర్‌లూ, మాల్‌లూ మూత పడడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఉద్యోగులందరూ వెళ్ళిపోయారు...’ అంటాడు శౌవిక్‌ నాటి బాధల్ని గుర్తుకుతెచ్చుకుంటూ. అప్పుడే అతనికి ఓ ఆలోచన వచ్చింది. సిబ్బంది అవసరం పెద్దగా లేకుండానే మోమోల్ని తయారుచేసే మెషీన్‌లని కనిపెట్టాలనుకున్నాడు. దాంతో మళ్ళీ సైంటిస్టుగా మారాడు. శౌవిక్‌కి సాయపడటానికి- ఒకప్పుడు డీఆర్‌డీఓలో అతనితోపాటు చేసిన సైంటిస్టులందరూ ముందుకొచ్చారు. అలా అందరూ కలిసి- ఏడాది కష్టపడి ‘ఏఐ’తో పనిచేసే మెషీన్‌ని ఆవిష్కరించారు. కాయగూరలు తురమడం, మాంసాన్ని చిన్న ముక్కలు చేయడంతో మొదలుపెట్టి మోమోల పైపొర కోసం పిండి కలపడం, వాటిలో స్టఫ్‌ని కూరడం దాకా- అన్ని పనులూ చేసే అద్భుత మెషీన్‌ అది.

రోజుకి రెండున్నర లక్షల మోమోల్ని తయారుచేయగల సామర్థ్యం దానిది! దానితో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి... ఇట్టే లాభాలబాట పట్టాడు! రెండేళ్ళలో దేశంలోని టాప్‌బ్రాండ్‌లలో ఒకటిగా తన సంస్థను నిలిపాడు. ‘జోమోజ్‌’కి ఒక్క హైదరాబాద్‌లోనే ఇప్పుడు 30 దుకాణాలున్నాయి. విజయవాడ, రాజమండ్రిలోనూ వీళ్ళ మోమోస్‌ని రుచి చూడొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ అయ్యాక బెంగళూరు, మంగళూరు, చెన్నై, పుణె వంటి నగరాలన్నింటా కలిపి 75 ఔట్‌లెట్స్‌ పెట్టారు. వీటన్నింటి ద్వారా ఏటా పాతిక కోట్ల రూపాయల టర్నోవర్‌ని సాధిస్తోందీ సంస్థ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..