యూట్యూబ్‌ ఛానల్‌తో... రూ.కోట్లు!

సోషల్‌మీడియాలో సరదాగా వీడియోలూ, ఫొటోలూ షేర్‌ చేస్తూ వాటికొచ్చే లైకులూ, కామెంట్లూ చూసి మురిసిపోవడం అందరూ చేసేదే.

Published : 07 Apr 2024 00:13 IST

సోషల్‌మీడియాలో సరదాగా వీడియోలూ, ఫొటోలూ షేర్‌ చేస్తూ వాటికొచ్చే లైకులూ, కామెంట్లూ చూసి మురిసిపోవడం అందరూ చేసేదే. కానీ అదే సోషల్‌మీడియాని మన పనికి వేదికగా మార్చుకుంటే... కాలక్షేపమే క్యాష్‌ అవుతుందంటున్నారు కొందరు యూట్యూబర్లు. వయసుతో సంబంధం లేకుండా సృజనను కంటెంట్‌గా చేసుకుని ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారి కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అలాంటి కొంతమంది టాప్‌ యూట్యూబర్ల సంగతులివి!

నదేశంలో అత్యధికంగా నాలుగు కోట్లకుపైగా చందాదారులున్న యూట్యూబ్‌ ఛానల్‌ ‘క్యారీమినాటీ’. దీని సొంతదారు అజయ్‌ నాగర్‌. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన అజయ్‌... హాస్యం, వ్యంగ్యం, వీడియో గేములకు సంబంధించిన వీడియోలతో మూడు ఛానళ్లు నడుపుతున్నాడు. పదేళ్లకే గేమింగ్‌ వీడియోలతో యూట్యూబ్‌లో అడుగుపెట్టాడు అజయ్‌. దాన్నే కెరీర్‌గా మలచుకుని దూరవిద్యలో చదువు కున్నాడు. తక్కువ కాలంలోనే మూడుకోట్ల చందాదారులతో దేశంలో ఆ మైలురాయిని చేరుకున్న మొదటి యూట్యూబర్‌గా నిలిచాడు. ఈ పాతికేళ్ల కుర్రాడు ప్రకటనలూ స్పాన్సరర్ల ద్వారా సంపాదించిన ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లు.

కామెడీ ఇన్‌ఫ్లుయెన్సర్‌!

మహారాష్ట్రకు చెందిన ఆశిష్‌ చంచ్లానీకి నటనంటే ఇష్టం. అందుకే ఇంజినీరింగ్‌ చదివిన ఈ కుర్రాడు 2014లో ‘ఆశిష్‌ చంచ్లానీ వైన్స్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. వీడియోలు చేస్తూనే బాలీవుడ్‌ సినిమాల ప్రమోషన్‌ ఈవెంట్లకీ వెళ్లేవాడు. బెస్ట్‌ కామెడీ
ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారడానికి ఆశిష్‌కు ఎంతో కాలం పట్టలేదు. తమాషా మాటలతో నవ్వు పుట్టించే కాన్సెప్ట్‌లతో అలరిస్తూ ఇప్పటి వరకూ మూడుకోట్ల ముప్ఫైలక్షల మంది చందాదారుల్ని సంపాదించాడు. యూట్యూబ్‌ స్టార్‌గా ఎన్నో అవార్డులూ అందుకున్నాడు. ఇతని సంపాదన దాదాపు రూ.41 కోట్లు.

ఒక్క వీడియోతో మొదలు

దిల్లీకి చెందిన భువన్‌- పాటల రచయిత, గాయకుడు, నటుడు కూడా. ఒకసారి కశ్మీర్‌ వరదల్లో కొడుకును పోగొట్టుకున్న ఒక తల్లిని విలేకరి అడుగుతున్న ప్రశ్నలతో ఉండే వీడియోని భువన్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడట. అది బాగా వైరల్‌ అవ్వడంతో తానే ఒక యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టాలనుకున్నాడు. అలా 2015లో షార్ట్‌ కామెడీ వీడియోలతో ఛానల్‌ను మొదలుపెట్టి రెండున్నరకోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. 30 ఏళ్ల భువన్‌ సంపాదన రూ.122 కోట్లు. ఫ్యాషన్‌ దుస్తుల కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ పనిచేస్తున్నాడు.

టెక్‌ గురూ!

ఏ ఫోన్‌ కొనాలీ... ఏ కారు మంచిదీ... డిజిటల్‌ స్కామ్‌లతో ఎంత జాగ్రత్తగా ఉండాలీ... అంటూ యువతకు ఉపయోగపడే ఎన్నో విషయాల్ని చెబుతూ టెక్నికల్‌ గురూజీగా మారాడు 32 ఏళ్ల గౌరవ్‌ చౌధురి. రాజస్థాన్‌లోని అజ్మేర్‌కి చెందిన గౌరవ్‌ తండ్రితో కలిసి దుబాయ్‌ వెళ్లి అక్కడ పనిచేస్తూనే మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో చదువూ కొనసాగించాడు. తనకొచ్చిన సందేహాల్ని తీర్చుకోవడానికి యూట్యూబ్‌ను వాడుకునేవాడు. అలా టెక్నాలజీపైన పట్టుసాధించి 2015లో సొంతంగా ఛానల్‌ పెట్టాడు. దాదాపు రెండున్నర కోట్ల చందాదారుల్ని పొందిన గౌరవ్‌ ఇప్పటివరకు రూ.350 కోట్లకుపైనే సంపాదించి దేశంలోని రిచెస్ట్‌ యూట్యూబర్లలో ఒకడయ్యాడు.

ఆ నవ్వులకే... కోట్లు!

కామెడీ వీడియోలతో ముప్ఫైఏళ్ల అమిత్‌ భడానా దాదాపు రెండున్నరకోట్ల మందికి నవ్వులు పంచుతున్నాడు. దిల్లీకి చెందిన అమిత్‌- తమాషా డబ్బింగ్‌ వీడియోలతో 2017లో సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. ‘ఎగ్జామ్‌ బీ లైక్‌’ అంటూ ఫన్నీగా చేసిన వీడియో బాగా వైరల్‌ అయ్యి లక్షల్లో వ్యూస్‌ తెచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూడకుండా హ్యూమర్‌తో పాటు పేరడీ పాటలు కడుతూ వీడియోలు చేస్తున్నాడు. యూట్యూబ్‌ ద్వారా అమిత్‌కి వచ్చిన ఆదాయం రూ.50 కోట్లకుపైనే.

అరవై నాలుగేళ్ల షెఫ్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిశామధులికది కుకింగ్‌ వీడియోల యూట్యూబ్‌ ఛానల్‌. ‘వంటావార్పులో ప్రావీణ్యమున్నవాళ్లు చాలామందే ఇలాంటివి చేస్తున్నారు కదా విశేషమేముందీ’ అంటే... నిశా వయసు 64! కోటిన్నర చందాదారులతోనూ 43 కోట్ల రూపాయల ఆదాయంతోనూ టాప్‌ యూట్యూబర్ల జాబితాలో చేరారామె. మొదట్లో నిశా రకరకాల శాకాహార వంటల గురించి బ్లాగులో రాసేవారు. వాటికి మంచి పేరు రావడంతో 2009లో కుకింగ్‌ ఛానల్‌ పెట్టి కొనసాగిస్తున్నారు. యూట్యూబ్‌ కుకింగ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ అవార్డులూ అందుకున్నారు. 

ఈ వరసలో ఇంకా చాలామందే ఉన్నారు. ఆలోచింపచేసే మాటలు, సరదా పాటలు, స్ఫూర్తినిచ్చే పాఠాలు, కమ్మని వంటలు, రాజకీయ విశ్లేషణలు, సామాజిక విషయాలు, నయా ఫ్యాషన్లు... ఇలా ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని తమదైన స్టైల్‌తో  అటు పేరూ ఇటు డబ్బూ సంపాదించేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..