Rahul Sipligunj : పాడింది నేను... పేరు అతనిది!

చిన్నతనంలో నలుగురి ముందు పాడాలంటే బెరుకు... ఇంట్లో పాడితే నాన్న వింటాడేమోనని భయం... అందుకే ఎవరూ చూడకుండా, వినకుండా గోడలపై, చెక్క బల్లలపై దరువేస్తూ పాడుకునేవాడు.

Updated : 12 Mar 2023 18:44 IST

Rahul Sipligunj : పాడింది నేను... పేరు అతనిది!

చిన్నతనంలో నలుగురి ముందు పాడాలంటే బెరుకు... ఇంట్లో పాడితే నాన్న వింటాడేమోనని భయం... అందుకే ఎవరూ చూడకుండా, వినకుండా గోడలపై, చెక్క బల్లలపై దరువేస్తూ పాడుకునేవాడు. ఇప్పుడా కుర్రాడే ఆస్కార్‌(oscars) వేదికపై ప్రత్యక్షమయ్యాడు. తెెలుగువాడి సత్తాను ‘నాటు నాటు రూపం’(Naatu Naatu)లో ఆలపించిన ఆ యువకుడే రాహుల్‌ సిప్లిగంజ్‌(Rahul Sipligunj). భాగ్యనగర వీధుల నుంచి గోల్డెన్‌గ్లోబ్‌(Golden Globe Awards) మీదుగా ఆస్కార్‌(oscars) వేదికపై అడుగు పెట్టే వరకూ... రాహుల్‌ ప్రయాణమెలా సాగిందో తన మాటల్లోనే....

  రోజు నాకు ఇంకా గుర్తే... ఏడో తరగతి పరీక్షా ఫలితాలు వచ్చాయి. నేను తప్పానని తెలిసింది. అప్పుడే మా ఇంటికి వచ్చిన ఒకతనికి ఆ విషయం తెలిసింది. ‘మీ నాన్న అమెరికా కల కంటుంటే...  నువ్వేమో ఏడులోనే డింకీ కొట్టి ఇక్కడే ఆగిపోయావు...’అని వెటకారంగా మాట్లాడాడు. ఎందుకో ఆ రోజు చాలా బాధేసింది. ఏడుపు తన్నుకొచ్చింది. ఆ వయసులోనే ఎంతో అవమానంగానూ అనిపించింది. ఆ ఉద్వేగంలోంచి ఇంకెప్పుడూ నాన్నని బాధపెట్టకుండా, ఆయనకు మంచి పేరు తీసుకురావాలనే ఆలోచన మనసులో నాటుకుపోయింది. అదే నేడు నాన్న కలను సాకారం చేస్తూ ఆయనకెంతో ఇష్టమైన అమెరికాకు తీసుకెళ్లింది. యావత్‌ సినీ ప్రపంచానికి అపురూపమైన ఆస్కార్‌(oscars) వేడుకలో పాట పాడటానికి కారణమైంది. అదే ఆస్కార్‌ అందుకున్నంత గొప్ప నాకు. నా జీవితంలో నేను సాధించిన విజయాలు తక్కువే కావచ్చు. కానీ అవేమీ అంత సులభంగా నాకు దక్కలేదు. ఆస్కార్‌ వేదికపై పాడటం- యూట్యూబ్‌ వీడియోలు, సినిమా పాటలు, బిగ్‌బాస్‌ విజయం, గోల్డెన్‌ గ్లోబ్‌(Golden Globe Awards) అందుకున్న ‘నాటు నాటు...’(Naatu Naatu) నేను పాడటం... ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినవి కావు. వాటి వెనక ఎన్నో నిద్రలేని రాత్రులూ, ఎదురు చూపులూ, ఆర్థిక సమస్యలూ, అమ్మానాన్నల ఆరాటం, పోరాటం వంటివెన్నో ఉన్నాయి.

చాటుగా పాడా...

నేను పుట్టి పెరిగింది ధూల్‌పేట్‌ దగ్గరలోని మంగళ్‌హాట్‌. పక్కా మాస్‌ ఏరియా. నాన్న రాజ్‌కుమార్‌ వృత్తిరీత్యా బార్బర్‌. సెలూన్‌ నడిపేవాడు. అమ్మ సుధారాణి గృహిణి. నాకో చెల్లీ, తమ్ముడు. మమ్మల్ని బాగా చదివించి- మంచి ఉద్యోగాల్లో స్థిరపడితే చూడాలని అందరి నాన్నల్లానే మా నాన్నా కోరుకున్నాడు. నాకు మాత్రం పాటలు పాడటం, గల్లీలో కబడ్డీ ఆడటం చాలా ఇష్టం. గణేశ్‌ ఉత్సవాలు, ఇతర సంబరాల్లో ముందు ఉండే నేను- చదువు దగ్గరకొచ్చేసరికి వెనక వరసలో ఉండేవాడిని. అంతేకాదు, సమయం దొరికితే ఎవరూ వినకుండా గోడలు, చెక్కల మీద దరువేస్తూ పాటలు పాడేవాణ్ని. అది తెలిస్తే నాన్న ఏమంటాడోననే భయం ఆయనకు ఆ విషయం చెప్పకుండా గొంతు నొక్కేసింది. అందుకే దొంగ చాటుగా పాడుకునేవాణ్ని. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా... ఒకరోజు ఇంట్లో నాన్న లేడనుకుని గట్టిగా పాడా. అప్పుడు ఇంట్లోనే ఉన్న నాన్న చెవిలో ఆ పాట పడింది. ‘వీడు భలే పాడుతున్నాడు. గొంతు కూడా బాగుంది...’ అనుకున్న నాన్న- ఆ క్షణంలోనే నేను గాయకుణ్ని అవుతానని నమ్మి ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. సంగీత శిక్షణకే పరిమితం చేయకుండా... ‘చదువుకుంటూనే మన కులవృత్తి నేర్చుకో. కుదిరినప్పుడు సెలూన్‌లో నాతోపాటు పనిచెయ్‌. ఎందుకంటే రేపు నువ్వు ఎక్కడా స్థిరపడకపోతే బార్బర్‌గా పనిచేయొచ్చు..’ అని చెప్పేవాడు. అంతేకాదు, నా బెరుకు పోగొట్టడానికి బంధువుల ఇళ్లలో శుభకార్యాలప్పుడు, దశదిన కర్మలకు వెళ్లినప్పుడు పెద్ద వంటపాత్రను బోర్లించి దరువేయిస్తూ పాట పాడించేవాడు. నాకు సిగ్గుగా అనిపించినా నాన్న చెప్పినందుకు పాడేవాడిని. క్రమంగా గణేశ్‌ చతుర్థి, గల్లీ వేడుకల్లోనూ పాడుతూ తెలియకుండానే బెరుకు పోగొట్టుకున్నా(Rahul Sipligunj Interview).

అప్పు చేసి వీడియోలు

మరోవైపు నాన్న ఓ విద్వాంసుడి వద్ద గజల్స్‌లో శిక్షణకు చేర్పించారు. దాదాపు ఆరేళ్లపాటు ఆ సాధన చేస్తూనే చదువుకున్నా. మా కులవృత్తీ నేర్చుకుని నాన్న వద్ద పనిచేస్తుండేవాడిని. ఆ తరవాత ఏడాదిపాటు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా. ఇంటర్‌ చదివేటప్పుడు ఫిల్మ్‌నగర్‌ చుట్టూ చక్కర్లు కొట్టేవాణ్ని. కేబీఆర్‌ పార్కు, ఆ చుట్టూ ఉన్న బిల్డింగులు, జూబ్లీహిల్స్‌ ప్రాంతం... చూస్తే ఓ కొత్త దేశంలా అనిపించేది. అలా తిరిగే క్రమంలోనే సినిమాల్లో పాటలు పాడాలన్న కోరిక మరింత పెరిగింది. శిక్షణ పూర్తి చేసి పాడగలననే నమ్మకం వచ్చాక- అవకాశాల కోసం నాన్నే తన బండి మీద స్టూడియోల చుట్టూ తిప్పేవాడు. ఒకవైపు కుటుంబం కోసం కష్టపడుతూనే నన్ను అలా తిప్పుతుంటే బాధనిపించేది. చివరికి అలా తిరగడం వల్ల ఫలితం లేదని అర్థమైంది. క్రమంగా సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ వాళ్ల డబ్బింగ్‌ సినిమాలకు తెలుగులో పాడేవాడిని. సంగీత దర్శకుల వద్ద కోరస్‌, బ్యాక్‌గ్రౌండ్‌లో పాటలు పాడేవాడిని. కానీ ఈ ప్రయత్నాలేవీ మనలోని ప్రతిభను బయటకు తీసుకురాలేవని అర్థమైంది. సినిమాల్లో పాడే అవకాశం వచ్చినా 2013 నుంచి వీడియో ఆల్బమ్‌లు చేయడం మొదలుపెట్టా. ఒక్కో వీడియోకి మూడు లక్షల ఖర్చు అయ్యేది. స్పాన్సర్లు దొరికేవారు కాదు. దాంతో నాన్న అప్పు చేసీ, అమ్మ నగలు తాకట్టు పెట్టీ డబ్బు ఇచ్చేవారు. అంతగా నమ్మిన అమ్మానాన్నల కష్టం వృథా కాకూడదని పగలూ రాత్రీ కష్టపడి పనిచేసేవాణ్ని. పాటలు రాస్తూ, తీస్తూ, ఎడిటింగ్‌ చేస్తూ.. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలుసు. నేను తీసిన పదిహేను పాటలు పక్కా తెలంగాణ వాడుక భాషలో ఉండటం వల్ల జనాల్లోకి బాగా వెళ్లాయి. ఒకసారి హోటల్‌కెళ్లినప్పుడు అక్కడ పని చేసేవారు హిజ్రాలతో అమర్యాదగా మాట్లాడటం చూసి బాధనిపించింది. హిజ్రాలకు మద్దతుగా నేనే ఆ పాత్రలో కనిపిస్తూ ఓ వీడియో చేశా. అది వాళ్లకు ఎంతగానో నచ్చింది. ఓ యాభై మంది హిజ్రాలు బోనం ఎత్తుకుని నాకోసం వచ్చారు. దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.
నా తొలివీడియో ఆల్బమ్‌ ‘మగజాతి...’ అనే పాట ఆండ్రాయిడ్‌ ఫోన్లేవీ సరిగా లేని సమయంలో వచ్చింది. రోజుకి ముప్ఫై వేల వ్యూస్‌ వచ్చేవి. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా విద్యార్థులు వాళ్ల కాలేజీ ఈవెంట్లలో ఈ పాటను ప్రదర్శించేంతగా హిట్‌ అయ్యింది(Rahul Sipligunj Interview).

ఒకే పాట 4 భాషల్లో

మరోవైపు ‘జోష్‌’లో కాలేజీ బుల్లోడా పాటతో సినిమాల్లోనూ పాడటం మొదలుపెట్టా. ‘దమ్ము’లో వాస్తు బాగుందే, టైటిల్‌ సాంగ్‌, ‘ఈగ’లో ఈగ ఈగ ఈగ..., ‘రచ్చ’లో సింగరేణి ఉంది... బొగ్గే పండింది,  ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’లో బళ్లారి బావ, ‘షిర్డీ సాయి’లో వస్తున్నా బాబా, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా, ‘ఛల్‌ మోహన రంగా’లో పెద్ద పులి, ‘నా పేరు సూర్య...’ ఇరగ ఇరగ, ‘పడి పడి లేచే మనసు’లో ఉరికే చెలి చిలకా, ‘మహర్షి’లో పాల పిట్టా, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో బోనాలు, ‘కౌసల్యాకృష్ణమూర్తి’లో రాకాసి గడుసు పిల్లా, ‘అల వైకుంఠపురములో’లో ఓమైగాడ్‌ డాడీ వంటివి బాగా పేరు తెచ్చాయి. చాలా కాలం నా గొంతు ఎవరికీ తెలిసేది కాదు. నేనే పాడానని చెప్పుకునేవాడిని. యూట్యూబ్‌ వీడియోలు, బిగ్‌బాస్‌ వల్ల రాహుల్‌ సిప్లిగంజ్‌గా నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మరోవైపు కీరవాణిగారు కూడా ఎంతగానో ప్రోత్సహించారు. ఒకరోజు ‘నాటు నాటు..’ రికార్డింగ్‌ కోసం నన్ను పిలిపించారు. అక్కడికి వెళ్లేసరికి ఇద్దరు ప్రధాన డ్యాన్సర్ల మీద పాట అనుకుంటున్నారు. ఎవరో వాళ్లు అనుకున్నాగానీ అది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) సినిమా కోసమనీ, నటులు చరణ్‌- ఎన్టీఆర్‌(Ram Charan-NTR) అనీ నాకు తెలియదు. కీరవాణిగారేమో ‘ఇప్పుడు నువ్వు పాడబోయే పాట ఫైనల్‌ కాదు... నచ్చితే అప్పుడు సినిమాలో పాడిస్తాం’ అన్నారు. అది నాకు పరీక్షలా అనిపించింది. కాస్త భయపడ్డా కూడా. ఎలాగైనా సత్తా చూపించాలనుకున్నా. చరణాలు చదివి, ట్యూన్‌ విన్నాక తెలియకుండానే నాలో ఉత్సాహం వచ్చింది. ఆ ఊపులో పాడేశా. కొన్నిరోజులకు మళ్లీ పిలిపించి తమిళం, కన్నడ, హిందీలోనూ పాడించారు. కానీ ఏ సినిమా కోసమో చెప్పలేదు. పైగా ఆ పాట సినిమాలో ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అయితే నేను ట్రాక్‌గా పాడిన ఆ పాటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)లో నాటు నాటు(Naatu Naatu)... కాలభైరవ ఎన్టీఆర్‌కి, నేను చరణ్‌కి పాడాం. ఆ పాట విడుదలైన కొన్ని రోజులకే యూట్యూబ్‌లో దుమ్ము రేపింది. పైగా తమిళం, కన్నడ, హిందీలోనూ నా ట్రాకే వాడారు. ప్రపంచ
వ్యాప్తంగా జనాలు భాషతో సంబంధం లేకుండా రీల్స్‌ చేశారు. అలా అది అందరి పాట అయిపోయింది. గోల్డెన్‌ గ్లోబ్‌(Golden Globe Awards) ప్రకటించినప్పుడు నేను జిమ్‌లో ఉన్నా. విషయం తెలిసి మైండ్‌ బ్లాంక్‌ అయింది. కాసేపటికి తేరుకుని ఇంటికొచ్చి టీవీలో చూశా. ఆ వేదిక మీద కీరవాణి(Keeravani) గారు నా పేరు పలకడం ఎంతో గొప్పగా అనిపించింది. అలాంటిది ఆస్కార్‌ నుంచి పాడటానికి వచ్చిన ఆహ్వానం- అవార్డు వచ్చినంత ఆనందాన్ని తెచ్చిపెట్టింది.


సెలూన్‌లో పనిచేస్తా

మా వృత్తి గురించి గొప్పగా చెప్పుకుంటా. కులవృత్తిని మర్చిపోయే వాడు మనిషే కాదు. అందుకే నేను టైమ్‌ దొరికితే మా సెలూన్‌లో పనిచేస్తా. నాకోసం ఎంతో కష్టపడ్డ నాన్నకి ఈ మధ్యనే బెంజ్‌ కారు కొని బహుమతిగా ఇచ్చా. మాకోసమే బతికిన అమ్మకి ఇంటిని బహుమతిగా ఇచ్చా. తన ఇష్టాయిష్టాలను గోడ మీద రాసి పెద్ద పెద్ద ఫొటోలు పెట్టి ఒక గదిని తనకోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేయించా. మొదటిసారి ఆ గదిని చూసిన అమ్మ ముఖాన్ని ఎప్పటికీ మర్చిపోలేను(Rahul Sipligunj Interview).


పేరు పెట్టారు

న్నాళ్లూ తెరవెనకే ఉన్న నేను కృష్ణవంశీగారి ‘రంగమార్తాండ’తో తెరమీదకొస్తున్నా. బ్రహ్మానందంగారు ఎమోషనల్‌గా నటించిన ఈ సినిమాలో సీనియర్‌ నటులతో నటిస్తుంటే ఎంతో భయమేసింది.  

* ‘రచ్చ’లో సింగరేణి ఉంది... అన్న పాటకు సీడీపైన సుఖ్‌విందర్‌ సింగ్‌ అని ఉంటుంది. ఆడియో రిలీజ్‌కు వారం ముందే సీడీపై పేర్లు ప్రింట్‌ అయ్యేవి. అయితే ఆడియో రిలీజ్‌కు ముందు రోజు సుఖ్‌విందర్‌ పాటను పక్కన పెట్టి నాచేత పాడించారు. కానీ, సీడీపై పేరు మార్చడం సాధ్యం కాలేదు.

* కీరవాణిగారి దగ్గర ఎన్నో నేర్చుకున్నా. నన్ను నేను చాలా మార్చుకున్నా. మొదట్లో ఎక్కడైనా రాహుల్‌ అని మాత్రమే పెట్టుకునేవాడిని. కీరవాణిగారు మా ఇంటిపేరు సిప్లిగంజ్‌ అని తెలుసుకుని ‘దమ్ము’ సీడీపైన నేను పాడిన పాటల దగ్గర- రాహుల్‌ సిప్లిగంజ్‌ అని రాయించి, ఒక సీడీని బహూకరించారు. నా పేరును మార్చి, దానికింకా ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఆయనే నా గాడ్‌ఫాదర్‌.

* మణిశర్మగారితో మంచి అనుబంధం ఉంది.   ‘లై’లో బంభాట్‌ పాట తెలంగాణ యాసలో ఉంటుంది. మణిశర్మగారితో పోలిస్తే ఆ యాస నాకే బాగా వచ్చు. పాడుతుంటే ఏవో కరెక్షన్లు చెప్పేవారు. దాంతో ‘సర్‌.. మీరు కిందకు వెళ్లండి. నేను పాడి పెడతా’ అన్నా. ‘నన్ను వెళ్లిపోమ్మంటావా’ అనుకుంటూ కోపంతో బయటకు వెళ్లారు. పాడాక పిలిస్తే గుర్రుగా వచ్చారు. పాట విన్నాక ‘అదరగొట్టావురా..’ అన్నారు.

* ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో ‘రాములో...’ పాట నేనే పాడాల్సి ఉంది. బిగ్‌బాస్‌లో ఉండటం వల్ల పాడలేకపోయా. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో ‘ఇరగ ఇరగ’ పాటను బన్నీగారు కోరి నాతో పాడించుకున్నారు. ‘రాములో’ పాటను నాతో పాడించాలని ఆయనే పట్టుబట్టారని తర్వాత తెలిసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు