బిల్‌గేట్స్‌ అంటే అసూయ ఉండేది!

ఆనంద్‌ మహీంద్రా... పరిచయం అక్కర్లేని పారిశ్రామికవేత్త. సామాజిక మాధ్యమమైన ఎక్స్‌లో నిరంతరం చురుగ్గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటారు. ఈమధ్యే సోషల్‌మీడియాలో కోటి మందికిపైగా అభిమానుల్ని సంపాదించుకున్న ఈ వ్యాపార దిగ్గజం...

Updated : 25 Feb 2024 09:10 IST

ఆనంద్‌ మహీంద్రా... పరిచయం అక్కర్లేని పారిశ్రామికవేత్త. సామాజిక మాధ్యమమైన ఎక్స్‌లో నిరంతరం చురుగ్గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటారు. ఈమధ్యే సోషల్‌మీడియాలో కోటి మందికిపైగా అభిమానుల్ని సంపాదించుకున్న ఈ వ్యాపార దిగ్గజం... తనకు సంబంధించిన కొన్ని విషయాలను పంచు కుంటున్నారిలా... 


అమ్మ చూపిన బాటలోనే...

నేనీ రోజున నా వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నానంటే దాని వెనక మా అమ్మ ఇందిర నేర్పించిన పాఠాలెన్నో ఉన్నాయి. మా అమ్మ టీచర్‌. నా చిన్నతనం నుంచీ వ్యాపారానికి సంబంధించి బోలెడు విషయాలు వివరించేది. ఓసారి తన వెంట షేర్‌హోల్డర్స్‌ మీటింగ్‌కు తీసుకెళ్లి అక్కడేం జరుగుతోందో ఓ పాఠంలా చెప్పింది. అంతేనా... గోరుముద్దలు పెడుతూ పళ్లెంలో వడ్డించినవన్నీ తినేస్తే హనుమంతుడిలా బలంగా తయారవుతాననేది. ఆ కబుర్లు వింటూ నేనూ ఏ పేచీ లేకుండా తినేసేవాడిని. పెద్దయ్యాక జిమ్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఆంజనేయుడి ఫొటోలు ఉండేవి. వాటిని చూసినప్పుడు మా అమ్మ చెప్పింది నిజమేనని అనిపించేది. హనుమంతుడి ధైర్యం, భక్తి, క్రమశిక్షణ ఆయనకున్న బలాల్లో కొన్ని అని అర్థంచేసుకున్నా.


కలిసి చదువుకున్నాం

సారి మా అమ్మాయి మాటల సందర్భంలో.. హార్వర్డ్‌లో నాతో కలిసి చదువుకున్నవారిలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారా అని అడిగింది. నేను వెంటనే బిల్‌గేట్స్‌ పేరు చెప్పా. అవును.. మేమిద్దరం క్లాస్‌మేట్స్‌ మరి. అది విన్న వెంటనే మా అమ్మాయి... ‘డాడ్‌ నువ్వు పెద్ద లూజర్‌వి’ అనేసి వెళ్లిపోయింది. బిల్‌గేట్స్‌ స్థాయికి నేను చేరలేకపోయినందుకూ, మా అమ్మాయి దృష్టిలో లూజర్‌గా మారినందుకూ కొన్ని రోజులపాటు బిల్‌గేట్స్‌పైన అసూయ ఉండేది. ఓసారి తనని కలిసినప్పుడు ఈ విషయాన్ని చెప్పాను కూడా.


ఆ రోజులు ఇంకా గుర్తే...

నాకు చిన్నప్పటినుంచీ ఫిలింమేకింగ్‌ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఫిలింమేకింగ్‌వైపు వెళ్లా. అందులో భాగంగా కుంభమేళాను నా దగ్గర ఉన్న 16ఎంఎం కెమెరాతో చిత్రీకరించాను. ఇందౌర్‌లోని ఓ చిన్న గ్రామంలో డాక్యుమెంటరీని షూట్‌ చేయడం నాకు ఇంకా గుర్తుంది. బిజినెస్‌లోకి వచ్చాక ఫొటోగ్రఫీ నా హాబీగా మిగిలింది.


స్నేహితుల సంఖ్య కోటికి పైనే

నాకు గుర్తున్నంతవరకూ నేను 2009లో ఎక్స్‌ (ట్విటర్‌)లో అకౌంట్‌ ప్రారంభించా. రోజులు గడిచేకొద్దీ చురుగ్గా పోస్ట్‌లు పెడుతున్నా కూడా నా ఫాలోవర్ల సంఖ్య కోటీ పది లక్షలకు చేరడానికి దాదాపు పద్నాలుగేళ్లు పట్టింది. ఈ మధ్యే ఒకరోజు పొద్దున్నే నా ఫాలోవర్లు పదకొండు మిలియన్లు దాటారని చూశాక ఈ భూమ్మీద నాకూ అంతమంది స్నేహితులున్నారని తెలిసి ఎంత ఆనందించానో.


ఆదివారం అంటే ఇష్టం...

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఉద్యోగుల్లా నేనూ ఆదివారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటా. ఆ రోజున నేను పారిశ్రామికవేత్తననే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి... నాకోసం నేను కొంత సమయం కేటాయించుకుంటా. నాకు నచ్చిన పనులు చేస్తుంటా.


వంట వచ్చు...

ప్పుడైనా తీరిక దొరికినప్పుడు వంట చేసేందుకు ప్రయత్నిస్తుంటా. అలాగని నేను చేయితిరిగిన షెఫ్‌ని కాదు. బ్రేక్‌ఫాస్ట్‌ వరకూ చేయగలనంతే.


పిల్లలకు ఆ స్వేచ్ఛనిచ్చాం

మా నాన్న నా కెరీర్‌ ఎంపికలో నాకు ఇచ్చిన స్వేచ్ఛనే మా పిల్లల విషయంలో నేనూ కొనసాగించా. నా చిన్నతనంలో ఫిలింమేకింగ్‌ నేర్చుకుంటానన్నా... కొన్నాళ్లకు బిజినెస్‌ వైపు వస్తానన్నా అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు నేనూ అదే చేశా. మా అమ్మాయి దివ్య విజువల్‌ కమ్యూనికేషన్‌, డిజైనింగ్‌ చేసి... మా ఆవిడ అనూరాధ ప్రారంభించిన వెర్వ్‌ అనే మ్యాగజైన్‌లో చేరింది. ఆలికా కూడా మా ఆవిడ నడుపుతున్న మరో మ్యాగజైన్‌లో చేరాలనుకున్నప్పుడు ప్రోత్సహించాం. భవిష్యత్తులో వాళ్లు నావైపు వస్తానంటే వద్దనీ చెప్పను.


అద్దంలో చూసుకుంటా...

ప్రతిరోజూ పొద్దున్నే ఆఫీసుకు తయారవుతూ అద్దంలో చూసుకోవడమనేది ఎవరైనా చేసేదే కదా. నేను మాత్రం ఆ రోజున చేయాల్సిన పనులు, నాలోని లోపాలు, ప్రత్యేకతలు.. ఇలా ప్రతిదీ అద్దం ముందు నిల్చునే గుర్తుచేసుకుంటా. దానివల్ల నన్ను నేను చాలా మార్చుకో గలిగాను మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..