ఆరోగ్యం మన చేతుల్లోనే..!

మంచి ఆహారపుటలవాట్లు, జీవనశైలి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. కాబట్టే  దొరికిన సమయంలోనే ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టి... పోషకాహారానికి ప్రాధాన్యమిస్తున్నారు ఈ ప్రముఖులు.

Updated : 07 Apr 2024 08:54 IST

మంచి ఆహారపుటలవాట్లు, జీవనశైలి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. కాబట్టే  దొరికిన సమయంలోనే ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టి... పోషకాహారానికి ప్రాధాన్యమిస్తున్నారు ఈ ప్రముఖులు. మరి వాళ్లు పాటించే ఆ నియమాలు ఏంటో ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందామా!


చేపలు ఉండాల్సిందే

- కమల్‌హాసన్‌

నేను ఇష్టమైనవన్నీ తినేసి... వ్యాయామం చేసి ఆ కెలొరీలన్నీ కరిగిస్తా. ఒకప్పుడు నాలుగు గంటలకు లేచి పద్నాలుగు కిలోమీటర్లు పరుగెత్తేవాడిని. ఓసారి రోడ్డు ప్రమాదం జరగడం వల్ల పరుగు తగ్గించి జిమ్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌, క్రంచెస్‌ చేస్తున్నా. వ్యాయామం అయ్యాక ఓట్స్‌, పండ్లు మాత్రమే తీసుకుంటా. భోజనం విషయానికొస్తే మాంసాహారం లేనిది ముద్ద దిగదు. మధ్యాహ్నం చేప వంటకాలు ఉండాల్సిందే. ప్రత్యేకంగా షెఫ్‌ని పెట్టుకుని ఎక్కడికి వెళ్తే అక్కడ చేప వంటలు వండించుకోవడం అలవాటు. రాత్రిపూట చాలా తక్కువ తింటా. ఒక్కోరోజు చికెన్‌ గ్రేవీ లేదా కొబ్బరి చట్నీతో దోశ తింటా. కొన్నిసార్లు సూప్‌, కాఫీతో సరిపెట్టుకుంటా. సాధ్యమైనంత త్వరగా నిద్రపోతా.


సోమవారం ఉపవాసం

-డీవై చంద్రచూడ్‌

పాతికేళ్లుగా తెల్లవారుజామున మూడుగంటలకు నిద్రలేచి యోగా చేయడం అలవాటు. ఆహారం విషయానికొస్తే నేను శాకాహారిని.అన్నానికి బదులుగా తోటకూర గింజల్ని ఉడికించి తీసుకుంటా. నూనె పదార్థాల జోలికి వెళ్లను. ప్రతి సోమవారం ఉపవాసం ఉండి... సాయంత్రం సగ్గుబియ్యం కిచిడీ తింటా. ఆహారం మెదడు మీదా, వ్యాయామం శరీరం మీదా ప్రభావం చూపుతాయి కాబట్టి ఆ విషయాల్లో నిర్లక్ష్యం చేయను. అందుకే చిన్నప్పట్నుంచీ ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను కూడా తినడం లేదు.


సమయాలు పాటిస్తా

-రోహిత్‌ శర్మ

నిద్రకీ, ఆహారానికీ కచ్చితమైన సమయాలు పాటిస్తా. ప్రతి రెండు గంటలకోసారి ఏదో ఒకటి తీసుకుంటా. డ్రైఫ్రూట్స్‌, నట్స్‌ ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకుంటా. ఉదయం వ్యాయామం పూర్తయ్యాక గుడ్లూ, కూరగాయల రసం తీసుకుంటా. మధ్యాహ్నం నాన్‌వెజ్‌ కూరతో మిల్లెట్స్‌ రోటీ, కప్పు బ్రౌన్‌ రైస్‌ తింటా. రాత్రిపూట గ్రిల్డ్‌ చికెన్‌ లేదా కూరగాయల సలాడ్‌ తీసుకుంటా. మ్యాచ్‌లు లేనప్పుడు పదిగంటలకు నిద్రపోయి ఉదయం ఐదింటికి లేచి వ్యాయామం చేస్తా. శారీరకంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మానసిక ఆనందం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..