రమణి మెడలో రామకథ!

బాల రాముడు అయోధ్యలో కొలువుదీరిన వేళ- దేశమంతా రామ జపమే చేసింది. అది ఎంతలా అంటే... పూజలతో పాటుగా రకరకాల కళలూ ఫ్యాషన్లలోనూ రాముడినే కొలిచింది.

Published : 18 Feb 2024 00:14 IST

బాల రాముడు అయోధ్యలో కొలువుదీరిన వేళ- దేశమంతా రామ జపమే చేసింది. అది ఎంతలా అంటే... పూజలతో పాటుగా రకరకాల కళలూ ఫ్యాషన్లలోనూ రాముడినే కొలిచింది. అన్నింటినీ దాటుతూ ఆ భక్తి పారవశ్యం ఆఖరికి బంగారు ఆభరణాల్లోకీ చేరింది. శ్రీరాముడి చరితంలోని అద్భుతమైన ఘట్టాలూ కనువిందు చేసే రామపరివారం చిత్రాలూ ఇప్పుడు పసిడి నగలకు డిజైన్లుగా మారాయి!

క్కువ మందికి నచ్చింది కచ్చితంగా ట్రెండ్‌ అవుతుంది. అందరి మనసుకూ దగ్గరైంది దాదాపు ఫ్యాషన్‌గా మారుతుంది. అందుకే మరి, దేశాన్ని ఒకే తాటి మీదకి తీసుకొచ్చిన అయోధ్య రామమందిరం విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు చేసిన దగ్గర్నుంచి ఇప్పటివరకూ రాముడి చుట్టూ బోలెడన్ని ఫ్యాషన్లు నడిచాయి. అందులో భాగంగానే రామభద్రుడి సరికొత్త జ్యువెలరీ మార్కెట్లో పెద్ద ఎత్తున మెరిసింది.

నిజానికి రాముడి విగ్రహ రూపంతో ఉన్న రామపరివార హారం ఇది వరకే ఉంది. లక్ష్మి, గణపతి, వేంకటేశ్వరస్వామి... ఇలా ఎన్నో దేవతల రూపాలతో మెరిసే టెంపుల్‌ జ్యువెలరీ ఎప్పటి నుంచో వస్తున్నదే. కానీ వాటన్నింటికీ చాలా భిన్నంగా ఈ రాముడి ఆభరణాల్ని రామాయణంలోని సన్నివేశాలతో చూడచక్కని దృశ్య కావ్యంగా మలుస్తున్నారు. దశరథునితో తనయులు ఆడుకోవడం, బాల రాముడు విలువిద్యలు నేర్చుకోవడం, సీతాపరిణయం, రాముడి అరణ్యవాసం, రావణుడు సీతను అపహరించడం, రాముడు ఆంజనేయుడిని కలవడం, రావణసంహారం, శ్రీరామ పట్టాభిషేకం... ఇలా రామచరితంలోని రకరకాల సన్నివేశాల్ని చూపిస్తూ అద్భుతమైన నగల్ని తయారుచేస్తున్నారు. ఇంకా, ఎన్నో ఏళ్ల కల సాకారమై గుడిగా దర్శనమిచ్చిన సమయాన... ఆ ఆలయ ఆకారంతో బోలెడన్ని పెండెంట్లూ వచ్చాయి.

అంతేకాదు, కొన్ని జ్యువెలరీ సంస్థలు ప్రత్యేకంగా సీతారాముల కల్యాణాన్ని చూపిస్తూ ఉంగరం దగ్గర్నుంచి వడ్డాణం వరకూ ఎన్నెన్నో
ఆభరణాల్ని తీసుకొచ్చాయి. పలువురు స్వర్ణకారులు... జగదభిరాముడి రూపాల్ని పసిడిపైకి చేర్చి తీరొక్క నగలు చేస్తున్నారు. నగకు తగ్గట్టు పచ్చలూ కెంపులూ ముత్యాలూ రత్నాలూ జత చేస్తూ మగువ మెడకు ముచ్చటైన అలంకారంగా మార్చేస్తున్నారు. రాముడి కథను చూపిస్తూ కనువిందు చేసే ఈ నగల్ని నేటితరానికి చెందిన ఏ రామ చక్కని సీతో వేసుకుందంటే... ఎవరైనా కళ్లార్పకుండా చూస్తుండి పోతారనడం అతిశయోక్తి కాదు. ఒకవైపు బంగారు మెరుపులు... మరో వైపు ఆరాధించే దేవుడి అద్భుత దృశ్యాలు... ఇవి చాలవూ అతివల మనసు దోచుకోవడానికి!?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..