నగల మేళా!

అమ్మతనపు మాధుర్యాన్ని పదికాలాల పాటు పదిలంగా దాచుకోవాలా... ఒకే నగ అటు మామూలు రోజుల్లోనూ ఇటు ప్రత్యేక సందర్భాల్లోనూ పెట్టుకునేలా ఉండాలా... రంగుల మట్టి గాజులకు బంగారు మెరుపులు తీసుకురావాలా... అయితే మార్కెట్లో కనిపిస్తున్న ఈ కొత్త నగల మీద ఓ లుక్కేసి చూడండి!

Published : 30 Mar 2024 23:45 IST

అమ్మతనపు మాధుర్యాన్ని పదికాలాల పాటు పదిలంగా దాచుకోవాలా... ఒకే నగ అటు మామూలు రోజుల్లోనూ ఇటు ప్రత్యేక సందర్భాల్లోనూ పెట్టుకునేలా ఉండాలా... రంగుల మట్టి గాజులకు బంగారు మెరుపులు తీసుకురావాలా... అయితే మార్కెట్లో కనిపిస్తున్న ఈ కొత్త నగల మీద ఓ లుక్కేసి చూడండి!


బంగారు గాజుల్లోనే రంగుల గాజులు!

మ్యాచింగ్‌ మేనియా ఉన్నవాళ్లు డ్రెసింగ్‌కి సరిపోయే యాక్సెసరీలే వేసుకోవాలనుకుంటారు. అలాగని ఎప్పుడూ ఫంకీ జ్యువెలరీ, ఇతర మెటల్‌ ఆభరణాలు ఎందుకంటూ బంగారు నగల్నీ కోరుకుంటారు. ఇదిగో అలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే బంగారపు చమక్కులూ, రంగుల తళుక్కులూ కలగలుపుతూ డిటాచబుల్‌ కలర్‌ ఛేంజింగ్‌ బ్యాంగిల్స్‌ వచ్చాయి. కాస్త వెడల్పాటి గాజుల్లోనే దొరికే వీటిల్లో ఇప్పుడు సన్నని గాజులకు సరిపోయేలా కస్టమైజ్డ్‌ డిటాచబుల్‌ గోల్డ్‌ బ్యాంగిల్స్‌ వచ్చాయి. రంగుల మట్టి గాజులంటే ఇష్టమున్న అమ్మాయిలకెవరికైనా ఇవి బాగా నచ్చుతాయి.

సన్నని ఈ బంగారు గాజుల్లో రంగుల గాజుల్ని పెట్టుకోవచ్చు. అవి బయటకు రాకుండా చిన్న లాక్‌సిస్టమ్‌లాంటిది ఉంటుంది. కావాలంటే మన నగలకు తగ్గట్టుగానో కొత్త డిజైన్లతోనో సొంతంగా చేయించుకోవచ్చు. వేసుకున్న దుస్తులకు తగ్గట్టు ఆయా రంగుల గాజుల్ని వాటిల్లో అమర్చుకుంటూ మార్చుకోవచ్చు. ఎంతైనా బంగారం- రంగుల మేళవింపు అతివల చేతికి ఎంతో అందాన్ని తెచ్చిపెడుతుంది కదూ!


అమ్మపాలే ముత్యాల్లా మారాయి!

పాపాయిల జ్ఞాపకాల్ని భద్రపరుచుకోవడానికి పొట్టలోని బుజ్జాయిల స్కానింగుల్ని ఫ్రేము కట్టించడం దగ్గర్నుంచీ చిట్టి పాదాల ముద్రల ఫొటోల వరకూ బోలెడన్ని వచ్చాయి. అమ్మప్రేమ అంతటితో ఆగకుండా ఇంకో అడుగు ముందుకేసింది. పసిపిల్లలకు అమృతంగా చెప్పే అమ్మపాలతోనే చాలామంది తల్లులు బంగారు నగలు చేయించుకుంటున్నారు. నిజానికి విదేశాల్లో మొదలైన ఈ ట్రెండ్‌ ఇప్పుడు మన దగ్గరికీ చేరింది. అందుకే మార్కెట్లో ఈ నగల తయారీ వెబ్‌సైట్లూ చాలానే వచ్చాయి. అమ్మపాలను ప్రత్యేకమైన పద్ధతిలో ఫ్రీజ్‌ చేస్తూ కావాలనుకున్న నగల్ని అందిస్తున్నారు. ఉంగరం, లాకెట్‌, బ్రేస్‌లెట్‌, గాజులు... ఇలా ఎన్నెన్నో బ్రెస్ట్‌ మిల్క్‌ జ్యువెలరీలో వస్తున్నాయి. పాలు, బంగారు మెరుపులతో రూపుదిద్దుకుంటున్న ఈ నగలు చూడ్డానికి ముత్యాల ఆభరణాల్లా ఎంతో అందంగా ఉంటాయి. పైగా పిల్లలు పెద్దయినా ఆ అమ్మతనపు గుర్తులు మాత్రం శాశ్వతంగా ఉండిపోతాయి. మిగతా వాళ్ల సంగతేమో కానీ... పొత్తిళ్లల్లో పాపాయిని పెంచుకున్న అమ్మకు మాత్రం ఎంతో ప్రత్యేకమైన నగలు ఇవి!


ఒకే చెవిపోగు రెండు రకాలుగా!

డవాళ్లకు బంగారమంటే ఎంత ఇష్టమో ఎవరూ చెప్పనక్కర్లేదు. ఇంట్లో ఎన్నిరకాల నగలున్నా సరే కొత్తగా వచ్చే మోడళ్ల మీద ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు. బాగా నచ్చితే కచ్చితంగా ట్రై చేస్తుంటారు కూడా. అలాంటి అమ్మాయిల మనసు దోచుకోవడానికే డిజైనర్లు సరికొత్త జ్యువెలరీనీ తీసుకొస్తుంటారు. ఇక్కడున్న టూ ఇన్‌ వన్‌ ఇయర్‌రింగ్స్‌ కూడా అలా వచ్చినవే. ఒకవైపు ఎరుపు, మరోవైపు ఆకుపచ్చ... ఒకవైపు దేవుళ్లు, మరోవైపు పూలడిజైన్లతో ఉండే ఆభరణాల్లాంటివి ఇదివరకే వచ్చాయి. కానీ ఈ చెవిపోగుల ప్రత్యేకత ఏమిటంటే... సింపుల్‌గా తయారవ్వాలను కున్నప్పుడు చిన్న డిజైన్‌ స్టోన్‌ కమ్మల్ని పెట్టుకోవచ్చు. కాస్త గ్రాండ్‌ లుక్కుతో కనిపించాలనుకున్నప్పుడు దానికి జతగా చుట్టూ మరో డిజైన్‌ కనిపించేలా అదనపు దుద్దును పెట్టుకోవచ్చు. ఆలోచన అదిరిపోయింది కదూ... మరెందుకాలస్యం, ఇష్టమైన డిజైన్లతో కోరుకున్న టూ ఇన్‌ వన్‌ చెవిపోగుల్ని ఆర్డర్‌ ఇచ్చేయండి. ఒకే దుద్దు రెండు రకాలుగా ఉంటూనే... మీ వినూత్నమైన ఆలోచన మీద స్నేహితులతో ప్రశంసల వర్షం కురిపిస్తుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..