కుర్తా డిజైను వెనక్కీ చేరింది 

అందమైన పెండెంట్లు చేతిపైన చేరిపోతే... ప్రత్యేక సందర్భాలకు ఎంచుకునే కుర్తాలు ఇంకాస్త వైవిధ్యంగా వచ్చేస్తే... మెళ్లో వేసుకునే గొలుసు జుట్టుకు సింగారమైతే... నలుగురిలో మనమే ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోతాం కదూ.

Updated : 19 May 2024 06:34 IST

నయా ట్రెండ్‌

అందమైన పెండెంట్లు చేతిపైన చేరిపోతే... ప్రత్యేక సందర్భాలకు ఎంచుకునే కుర్తాలు ఇంకాస్త వైవిధ్యంగా వచ్చేస్తే... మెళ్లో వేసుకునే గొలుసు జుట్టుకు సింగారమైతే... నలుగురిలో మనమే ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోతాం కదూ... ఆ గుర్తింపును తెచ్చేందుకే ఫ్యాషన్‌ మాంత్రికులు కొన్ని ప్రయోగాలు చేస్తున్నారిప్పుడు.


 

బ్లవుజుల్ని కుట్టించుకుంటున్నప్పుడు చేతులకు ఫలానా డిజైను ఉండాలనీ.. వీపుభాగంలో టాజిల్స్‌ పెట్టాలనీ, డోరీ కావాలనీ.. ఎంబ్రాయిడరీవర్క్‌ చేయాలనీ.. రకరకాలుగా చెప్పేస్తుంటాం కదూ. ఇప్పుడు అదే వర్క్‌ను కుర్తాల వీపు భాగానికీ చేయించుకుంటున్నారు ఫ్యాషన్‌ ప్రియులు. అంటే - ప్రత్యేక సందర్భాల్లో ఎంచుకునే కుర్తాలకు ముందువైపు ఎంత వర్క్‌ చేసినా... వెనుకవైపు దాదాపు సాదాగానే వదిలేస్తుంటారు డిజైనర్లు. అలా వదిలేయకుండా ఏదో ఒక వర్క్‌ చేస్తే... లుక్‌ అదిరిపోతుందనే ఉద్దేశంతో కుర్తా వీపుభాగంపైన ఇలా ఎంబ్రాయిడరీ వర్క్‌ చేయించుకుంటున్నారు. అక్కడితోనే ఆగిపోకుండా డోరీలకు బదులుగా రకరకాల టాజిల్స్‌నూ పెట్టించేసుకుంటున్నారు. ఈ కుర్తాలన్నీ అలా డిజైను చేసినవే.


పెండెంట్‌ టాటూలు నచ్చాయా...

చిన్నగా ఉండి, రంగురంగుల్లో మెరిసే పెండెంట్లు సాదా చెయిన్లకు మంచి కాంబినేషన్‌ అవుతాయి కదూ. అలాంటి రంగురంగుల పెండెంట్లే ఇప్పుడు చేతులపైనా చేరిపోతున్నాయి. అదెలాగంటారా... టాటూల్లో కొత్తగా వచ్చేస్తున్న ట్రెండ్‌లో భాగంగా రంగురాళ్లను పోలిన టాటూలను పెండెంట్‌ రూపంలో శరీరంపైన వేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది ఈతరం.

‘జ్యువెలరీ పెండెంట్‌ టాటూ’ల పేరుతో పిలుస్తున్న వీటిని చూసినప్పుడు అచ్చంగా రంగురంగుల రాళ్ల పెండెంట్లను శరీరంపైన అలా ఎలా పడిపోకుండా అతికించుకున్నారబ్బా అనేంత సహజంగా కనిపిస్తాయివి. ఆ లుక్‌ను తీసుకొచ్చేందుకు టాటూ ఆర్టిస్టులు కూడా అలాంటి రంగుల్ని ఎంచుకుంటూ వాటికి బంగారు నగిషీలను అద్దుతూ త్రీడీలుక్‌ తెచ్చేందుకు రెడీ అయిపోతున్నారు.


తలకీ ఉన్నాయి చెయిన్లు...

పిల్లల జుట్టుకు పెట్టేందుకు హెయిర్‌బ్యాండ్లు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు కేవలం రంగురంగుల్లోనే వచ్చిన ఆ హెయిర్‌బ్యాండ్లు సైతం ఈతరం మెచ్చేలా మెత్తని వస్త్రంతో, బొమ్మలతో, పూసలతో, చీకట్లో వెలిగే విధంగా.. ఇలా బోలెడన్ని మోడళ్లలో రావడమూ తెలిసిందే. ఇప్పుడు ఆ హెయిర్‌బ్యాండ్‌లనే ఇంకాస్త మార్చి.. ఇదిగో ఇలా పెద్దవాళ్లకోసం తయారుచేస్తున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు. ‘హెడ్‌చెయిన్స్‌’ పేరుతో వస్తున్న వీటికి ఎలాస్టిక్‌ లేదా హుక్స్‌ ఉంటాయి. దాంతో ఇవి చూడ్డానికి బ్రేస్‌లెట్‌లా చిన్నసైజు నెక్లెస్‌ల మాదిరిగా కనిపిస్తాయి. వీటిని తలపైన హెయిర్‌బ్యాండ్‌ తరహాలో పెట్టుకుని హుక్కుల్ని జుట్టుకు తగిలించుకుంటే సరిపోతుంది. ఈ హెడ్‌చెయిన్లలో సాదా డిజైనుతోపాటు.. కుందన్లూ రంగురంగుల రాళ్లూ ముత్యాలూ పొదిగినవీ.. వంటివెన్నో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..