‘ఒకమ్మాయిని ప్రేమించా..’ అన్న కొడుకు మాటలకు కన్నతల్లి నిర్ణయం ‘ఈ పెళ్లి జరగనివ్వకు’! ఎందుకంటే?

‘అమ్మా, నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఆమెనే పెళ్ళి చేసుకుందామనుకుంటున్నా.’

Updated : 19 Mar 2023 09:01 IST

‘ఒకమ్మాయిని ప్రేమించా..’ అన్న కొడుకు మాటలకు కన్నతల్లి నిర్ణయం ‘ఈ పెళ్లి జరగనివ్వకు’! ఎందుకంటే?

- సౌమ్య నిట్టల

‘అమ్మా, నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఆమెనే పెళ్ళి చేసుకుందామనుకుంటున్నా.’

కొడుకు కార్తీక్‌ ఆ మాట అన్నప్పటి నుంచి భృకుటి విడట్లేదు రాజేశ్వరికి. మనసంతా చికాగ్గా అయిపోయింది.

కార్తీక్‌ ఇది గమనించి నవ్వుకున్నాడు.

టిపికల్‌గా రియాక్ట్‌ అవుతోంది అమ్మ.

ఏ అత్తకి కోడలంటే ఇష్టం ఉంటుంది?

‘అమ్మాయి బాగుంటుంది చూడటానికి’ అని ఫోన్‌లో హరిత ఫొటో చూపించాడు కార్తీక్‌. మోకాళ్ళ దాకా ఉన్న ఫార్మల్‌ స్కర్ట్‌, దాని మీద టాప్‌. జుట్టు విరబోసుకుని ఉంది.

రాజేశ్వరి చూసింది. ఆమె మనసు ఇంకా కలత చెందటం మొదలుపెట్టింది.

‘‘మా ఆఫీస్‌లో ఆమె అంటే చాలా క్రేజ్‌. చాలామంది ఆమె కోసం ట్రై చేశారు కానీ నేనే గెలిచాను చివరికి. సంవత్సరం పట్టింది ఆమెని కన్విన్స్‌ చెయ్యడానికి. మొత్తానికి ఒప్పుకుంది. నీ కొడుకు ఎంతైనా గ్రేట్‌ కదమ్మా’’ అన్నాడు.

రాజేశ్వరి ఏం మాట్లాడలేదు.

‘‘మంచి ఫ్యామిలీ. తనని మాట్లాడమని చెప్పా. వాళ్ళింట్లో ఓకే.’’

రాజేశ్వరి ముఖంలో ఏ మార్పూ లేదు.

ఇంత ప్లాన్డ్‌గా ఉన్నా తల్లి తనని చూసి గర్వంగా ఫీలవ్వట్లేదు. అమ్మాయిని కన్విన్స్‌ చేయడం అయింది. ఇప్పుడు అమ్మని ఒప్పించాలా..? ఈ ఆడవాళ్ళతో నాట్‌ ఈజీ బాబోయ్‌.

* * * * *

కార్తీక్‌, హరిత ఇద్దరూ ఎంబీఏ ఫైనాన్స్‌ చేసి ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నారు.

హరితతో తల్లి రియాక్షన్‌ గురించి మాట్లాడాలని పొద్దుటనుంచి ప్రయత్నిస్తున్నాడు కార్తీక్‌. కానీ ఆఫీస్‌లో హరిత మరీ సిన్సియర్‌. ఒకసారి పనిలో మునిగితే ఇంక ఏం పట్టించుకోదు. ఇదే తనలో నచ్చదు కార్తీక్‌కి. పెళ్ళయ్యాక ఆడవాళ్ళ ప్రాధాన్యాలు ఎలాగూ మారతాయి కదా. కొంచెం ఓపిక పట్టాలి అంతే.

మొత్తానికి సాయంత్రం పని వేళలు ముగిసే టైమ్‌కి హరిత బైటికి వచ్చి తన కోసం ఎదురుచూస్తున్న కార్తీక్‌ని చూసి నవ్వింది.

‘‘ఈ నవ్వుకే మేం సమ్మోహితులమైపోయి ఎంతసేపైనా ఎదురు చూసేస్తాం... పిచ్చి మగాళ్ళం! సరే కానీ... పద కాఫీ షాప్‌కి’’ అన్నాడు బైక్‌ స్టార్ట్‌ చేస్తూ.

‘‘లేదు. నేను బుక్‌షాప్‌కి వెళ్ళాలి. నా రీసెర్చ్‌కి సంబంధించి కొన్ని బుక్స్‌ ఆర్డర్‌ చేశాను కదా మొన్న- అవి తెచ్చుకోవాలి.’’

‘‘అబ్బా, నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని పొద్దున్నే చెప్పా కదా. ఆఫీస్‌లో మాట్లాడదామంటే తమరే అక్కడ స్టార్‌ ఎంప్లాయీ మరి. బయట మాట్లాడదామంటే పీహెచ్‌డీ అనీ, రీసెర్చ్‌ అనీ గంటలు గంటలు పుస్తకాల షాపుల్లో కూర్చుంటావు. నేనొక్కణ్ణే మనిద్దరి ఫ్యూచర్‌ గురించి వర్రీ అవుతున్నట్లుంది. వెంటపడితే ఇలాగే అలుసైపోతాం’’ చిరాగ్గా అన్నాడు కార్తీక్‌.

చివరిమాట బాగా తగిలింది హరితకి.

‘‘అలా మాట్లాడకు కార్తీక్‌. నాకు చాలా బాధేస్తుంది.

ఐ యామ్‌ సారీ. పద కాఫీ షాప్‌కే వెళ్దాం’’ బైక్‌ ఎక్కి కూర్చుంది హరిత.

* * * * *

రాజేశ్వరికి ఇంటర్‌ చదువుతుండగానే పెళ్ళయిపోయింది. మంచి సంపాదన ఉన్న అబ్బాయిని చూసి పెళ్ళి చేసేశారు తల్లిదండ్రులు. రాజేశ్వరికి ఒక్కగానొక్క సంతానం కార్తీక్‌.

ఐదేళ్ళక్రితం కార్తీక్‌ ఇంకా చదువుకుంటుండగా గుండెపోటుతో భర్త చనిపోయాడు. రాజేశ్వరి డబ్బుకి లోటు చెయ్యకపోవడంతో కార్తీక్‌ చదువుకి ఆటంకం రాలేదు.

చూస్తుండగానే చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు కార్తీక్‌.

కొడుకు పెళ్ళి బాధ్యత రాజేశ్వరికి లేక కాదు కానీ, మనస్ఫూర్తిగా కార్తీక్‌కి పెళ్ళి సంబంధాలు చూడలేకపోయింది రాజేశ్వరి. ఏవో ఆలోచనలు ఆమెని వెనక్కి లాగేసేవి. తను ఆలోచిస్తోంది నిజమా, సబబా? తెలియదు.

ఇంతలో కార్తీక్‌ ‘ఒక అమ్మాయిని ప్రేమించా’ అని చెప్పడంతో రాజేశ్వరిలో కలకలం రేగింది. ఆ అమ్మాయి ఫొటో చూసి తనలో ఆలోచనల చిరుజల్లు తుపానుగా మారడం ప్రారంభించింది.

ఆ తుపాను హోరులో తనకి వినిపించిన ఒకే మాట ‘ఈ పెళ్ళి జరగనివ్వకు’.

* * * * *

‘‘ఆడవాళ్ళు ‘ఫెమినిజం ఫెమినిజం’ అని ఎంత నినాదాలు చేసినా అత్త అత్తే కదా అనిపించింది నిన్న అమ్మ వైఖరి చూస్తే’’ తను ఆర్డర్‌ చేసుకున్న ‘మోకా’ సిప్‌ చేస్తూ అన్నాడు కార్తీక్‌.

కార్తీక్‌ తల్లికి తాను ఎందుకు నచ్చలేదో ఆలోచిస్తోంది హరిత. అందంలోనూ సంపాదనలోనూ కార్తీక్‌కి సరిజోడి అనే కాన్ఫిడెన్స్‌ ఉంది తనకి. కానీ ఆ ఆత్మవిశ్వాసానికి ఇప్పుడు దెబ్బ తగిలినట్టు అనిపిస్తోంది. ఇంతలో హరిత ఆర్డర్‌ చేసిన ఎస్ప్రెస్సో వచ్చింది.

‘‘అబ్బా, ఆ ఎస్ప్రెస్సో ఎలా తాగుతావు అసలు... చేదుగా ఉండదూ? నువ్వు కూడా మోకాకి వచ్చేయ్‌ అని ఎన్నిసార్లు చెప్పాను? ఒక్కసారి ఊహించు... పెళ్ళయ్యాక నేను పొద్దున్నే ఆఫీస్‌కి తయారయ్యి ఇద్దరం మోకా తాగుతూ ఉంటే ఆ సీన్‌ ఎంత బాగుంటుంది. ఒకళ్ళు మోకా, ఇంకొకళ్ళు ఎస్ప్రెస్సో తాగితే మ్యాచ్‌ అవ్వదు హరితా!’’

‘‘నాకు డార్క్‌ కాఫీ టేస్ట్‌ ఇష్టం కార్తీక్‌. అయినా నువ్వొక్కడివే ఎందుకు తయారవుతావు ఆఫీస్‌కి? అదీగాక భార్యాభర్తలంటే ప్రతి ఒక్కటీ మ్యాచ్‌ అవ్వక్కర్లేదనుకుంటా.’’

కార్తీక్‌కి ఆ మాట నచ్చలేదు.

‘‘ఇంతకీ నా ఫొటో చూపిస్తే ఆంటీ ఏమీ మాట్లాడలేదా? నా గురించి ఏమీ అడగలేదా? ఆంటీకి ఏం ఫొటో చూపించావు?’’

కార్తీక్‌ స్క్రీన్‌ అన్‌లాక్‌ చేసి రాజేశ్వరికి చూపించిన ఫొటో చూపించాడు.

‘‘బాగానే ఉన్నానే ఇందులో.’’

కార్తీక్‌కి ఏదో తట్టింది. ‘‘మోడర్న్‌ డ్రెస్‌లో ఫొటో చూపించకుండా ఉండాల్సిందేమో హరితా... పొరపాటు చేశాను. చీరలోనో చుడీదార్‌లోనో ఉన్న ఫొటో చూపించాల్సింది.’’

‘‘మీ అమ్మగారు పాత పద్ధతుల మనిషా?’’

‘‘ఎవరికి తెలుసు ఆవిడ ఏ టైపో? నేను గెస్‌ చేస్తున్నా అంతే. అసలు ఎక్కువ మాట్లాడితే నాకు ఆవిడ పర్మిషన్‌ ఏమీ అక్కర్లేదు. ఇద్దరం ఇష్టపడ్డాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం. భవిష్యత్తు మనది. ఏదో నాన్న కూడా లేరు అని గౌరవం ఇచ్చి చెప్పాను కానీ ఆవిడ అభిప్రాయానికి అంత విలువేమీ ఇవ్వక్కర్లేదు.’’

హరితకి ఇది కరెక్ట్‌ అనిపించలేదు.

‘‘నా పేరెంట్స్‌కి నచ్చకుండా నేను ఏది చేసినా నాకు తృప్తిగా ఉండదు కార్తీక్‌.

పెళ్ళయ్యాక ఆంటీ కూడా నాకు పేరెంట్‌ కదా. అలాంటిది ఆవిడకి నచ్చకుండా ఎలా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలం చెప్పు?’’

కార్తీక్‌కి హరిత మాటలు చికాగ్గా అనిపించాయి. ఆవిడ ఒప్పుకోదు, ఈవిడ వదలదు. ఈ ఆడవాళ్ళతో ఈజీ కాదు... మళ్ళీ అనిపించింది కార్తీక్‌కి.

‘‘నేను చెప్పాల్సింది చెప్పాను. నీకు ఆవిడంటే అంత గౌరవం ఉంటే నువ్వే నీ పీహెచ్‌డీ తెలివితేటలు ఉపయోగించి ఆవిణ్ణి ఒప్పించుకో. అయినా రేపు కలిసుండాల్సింది మీ ఇద్దరే కదా.’’

హరితకి సవాళ్ళను ఎదుర్కోవడం అలవాటే. ఏం చెయ్యాలో ప్లాన్‌ చేసుకోవడం మొదలుపెట్టింది.

* * * * *

తయారవడం పూర్తయ్యాక ఒకసారి అద్దంలో చూసుకుంది హరిత.

ఆంటీకి ఇష్టమైన రంగు అడిగితే తెలీదన్నాడు. తన దగ్గర ఉన్న మంచి చీరల్లో ఒకటి ఎంచుకుంది. డీప్‌ నెక్‌/బ్రాడ్‌ నెక్‌ కాకుండా సంసారపక్షంగా ఉండే బోట్‌ నెక్‌ బ్లౌజ్‌. జుట్టు విరబోసుకోకుండా జడేసుకుంది. మెడ, చేతులు బోసిగా ఉండకుండా గొలుసు, గాజులు, చెవికి జూకాలు... అన్నీ బంగారంవి పెట్టుకుంది.

ఉట్టి చేతులతో వెళితే బాగోదు అని స్వీట్లు తీసుకుంది. ఆంటీకి ఏ స్వీట్‌ ఇష్టమో చెప్పలేకపోయాడు కార్తీక్‌. తెలిస్తే బాగుండేది.

ఉద్యోగంలో చాలా మీటింగ్స్‌లో పాల్గొన్నా ఇది తన వ్యక్తిగతమైన జీవితానికి ఎంతో ముఖ్యమైన సమావేశం. ‘బాగా జరగాలి దేవుడా’ అనుకుంది.

కార్తీక్‌ ఎవరో తనకి ఒక సంవత్సరంక్రితం తెలీదు. తనే వచ్చి పరిచయం చేసుకున్నాడు ఒక రోజు. తన ఉద్దేశం ఏంటో మొదటి వారం రోజుల్లోనే చెప్పేశాడు. తనే వెంటనే కన్విన్స్‌ అవ్వలేకపోయింది. కారణం అతను సరిగ్గా తెలీకపోవడమే అన్నాడు కార్తీక్‌. ఆమెతో టైమ్‌ స్పెండ్‌ చెయ్యడానికి రకరకాల వంకలు వెతికేవాడు. అతను ఆమెకి ఇచ్చే అటెన్షన్‌ నచ్చడం మొదలయ్యింది హరితకి. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ‘నువ్వు లక్కీనే... నీ వెంట పడేవాడు దొరికాడు’ అంటూ ఉండేవారు. ఆఫీస్‌లో అందరికీ తెలుసు కార్తీక్‌కి తనంటే ఇష్టం అని. చూస్తూఉండగానే తను కూడా ఇష్టపడటం మొదలుపెట్టింది. అతను రానిరోజు మిస్‌ అవుతూ ఉండేది. అదే ప్రేమ అన్నాడు కార్తీక్‌.

అతని కళ్ళలో ఆనందం చూసి అదే ప్రేమ అనిపించింది హరితకి కూడా.

హరిత తన తల్లిదండ్రులకి కార్తీక్‌ గురించి చెప్పింది. యాదృచ్ఛికంగా తన తండ్రికి కార్తీక్‌ తండ్రితో పరిచయం ఉండేదని తెలిసింది. మంచి కుటుంబం, సంపన్న కుటుంబం. ఇంక చెప్పటానికి అభ్యంతరాలేముంటాయి.

తన పేరెంట్స్‌ ఏమంటారోనన్న టెన్షన్‌తో ఆ రోజు వీధి చివర ఉన్న కాఫీ షాప్‌లో కూర్చుని ఉన్నాడు కార్తీక్‌. ‘‘ఏమన్నాడు నా పాలిటి ప్రకాష్‌ రాజ్‌?’’ అని తన తండ్రి మీద జోకేశాడు కూడా. తను ఈ గుడ్‌ న్యూస్‌ ఇవ్వగానే ‘మా నాన్న నా హీరో, హరితా! నాకు ఆయనంటే చాలా అటాచ్‌మెంట్‌ ఎక్కువ. ఆయన లైఫ్‌ లీడ్‌ చేసిన తీరు నాకు ఆదర్శం. చూడు... చనిపోయాక కూడా ఎలా నాకు మేలు చేశారో!’ అని తన తండ్రి గురించి మాట్లాడుతూనే ఉన్నాడు ఓ గంటసేపు.

ఇంక తమ పెళ్ళికి ఏ అడ్డంకులూ కనిపించలేదు. తన తల్లికి ఓ మాట చెప్తే చాలు అన్నాడు కార్తీక్‌. అలాంటిది ఆవిడ నుంచి వ్యతిరేకత వస్తుందని ఇద్దరూ ఊహించలేదు. ఎందుకు అని తరచి తరచి అడిగితే ‘నీకు కారణం చెప్పవలసి రావడమే కారణం’ అని నర్మగర్భంగా నవ్వారట.

కార్తీక్‌ చెప్పిన దాన్నిబట్టి ఆంటీకి పెద్దగా అభిప్రాయాలు కానీ ‘ఇది’ అని ఇష్టాయిష్టాలు కానీ లేవు. పెద్దగా చదువుకోలేదు కూడా అనుకుంటా. తన మోడర్న్‌ ఫొటో చూసో, ఇంకేదో కారణంతోనో తనని అపార్థం చేసుకుని ఉండవచ్చు. అలాంటివి ముఖాముఖీ క్లియర్‌ చేసుకుందామనే ఈ మీటింగ్‌ అడిగింది హరిత.

మొదట భయపడింది. ‘తనని ఇష్టపడని ఆంటీ కలవడానికి మాత్రం ఒప్పుకుంటారా...’ అని. కానీ ఆవిడ వెంటనే ఒప్పుకున్నారట.

ఇంట్లో చెప్పలేదు ఈ విషయం ఇంకా. తెలిస్తే ఆంటీతో మాట్లాడటానికి వెళ్ళనిస్తారా, వాళ్ళే ఇన్వాల్వ్‌ అవుతారా? అనవసరంగా చిన్న విషయం పెద్దదవుతుందేమో అని ప్రస్తుతానికి దాస్తోంది ఇంటి వాళ్ళనుంచి. అసలు ఇలా దాచాల్సి రావడం తనకి అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఏం చెయ్యాలి? కార్తీక్‌ అంటే ఇష్టం ఉంది కదా తనకి?

ఓసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని బ్యాగ్‌ తీసుకుని బయల్దేరింది హరిత పుస్తకాల షాపుకి. ఆంటీ అక్కడే కలుస్తా అన్నారట.

* * * * *

కాటన్‌ చీర కట్టుకుని, హుందాగా ఓ నవల పేజీలు తిరగేస్తున్న యాభయ్యేళ్ళ రాజేశ్వరిని చూసి ‘కార్తీక్‌ చెప్పినట్టు లేరే’ అనుకుంది హరిత. చూడగానే తత్తరపడిపోతా అనుకుంది కానీ ఆవిడ చూపు ఎంత సరళంగా ఉందంటే తనకి హాయిగా అనిపించింది ఆవిడ సమక్షంలో.

ఆ బుక్‌షాప్‌లో కూర్చుని చదువుకోడానికి కుషన్‌ ఉన్న కుర్చీలు వేసి ఉన్నాయి. ‘కూర్చుందామా’ అని దారి తీసింది రాజేశ్వరి. హరిత ఆమెని అనుసరించింది. వర్కింగ్‌ డే అవ్వడం వల్ల బుక్‌ షాప్‌లో ఎక్కువమంది లేరు.

హరిత స్వీట్‌ బాక్స్‌ ఇచ్చి ‘‘మీకు ఏ స్వీట్‌ ఇష్టమో తెలియదు... అందుకే అసార్టెడ్‌ బాక్స్‌ తీసుకున్నాను’’ అని నసిగింది.

రాజేశ్వరి డబ్బా తెరిచింది. ‘‘ఏది ట్రై చేయమంటావు?’’ అంది.

‘‘పిస్తా రోల్‌ బాగుంటుంది.’’

రాజేశ్వరి పిస్తా రోల్‌ రెండు ముక్కలు చేసి, ఒకటి హరితకిచ్చి రెండోది నోట్లో వేసుకుంది.

రాజేశ్వరి ‘‘మంచి ఛాయిస్‌. నీ టేస్ట్‌ బాగుంది.’’

హరితకి రిలీఫ్‌ అనిపించింది.

‘‘స్వీట్స్‌లో ఇంత బాగున్న నీ టేస్ట్‌ జీవిత భాగస్వామి విషయంలో బాలేదే మరి?’’ కూల్‌గా అడిగింది రాజేశ్వరి.

హరిత అస్సలు ఊహించని ప్రశ్న ఇది.

‘‘చదువుకున్నావు. సంపాదించుకుంటున్నావు. పీహెచ్‌డీ చెయ్యాలన్న ఉన్నతమైన ఆశయాలున్నాయి. పెద్దవాళ్ళ అంగీకారంతోనే అడుగు ముందుకు వేయాలనే విలువలు ఉన్నాయి. ప్రేమ కోసం సవాళ్ళని ఎదుర్కొనే ధైర్యం ఉంది. ఇంత మంచి పర్సనాలిటీ ఉన్నదానివి నీకు తగిన అబ్బాయిని ఎంచుకున్నాననే అనుకుంటున్నావా?’’

హరిత కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తోంది. ‘నేను కార్తీక్‌కి సరిజోడీనే’ అని వాదించడానికి సిద్ధమయి వచ్చింది.

అసలు కార్తీక్‌ తనకి తగునా అనే ఆలోచనే రాలేదు హరితకి. ఎందుకు?

‘పెంపకాలు’

హరిత మనసులో ప్రశ్నకి బైటికే సమాధానం ఇచ్చింది రాజేశ్వరి.

‘‘అమ్మాయిలని ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాలతో... అబ్బాయిలని స్త్రీల పట్ల అవగాహనతో పెంచకపోవడం మా తరం చేస్తున్న తప్పు హరితా. మా వాడు నీలో అందాన్ని మించి గుణగణాలని చూడలేడు. ఎందుకంటే అతని పెంపకం ఎలా సాగిందో ఓ తల్లిగా నాకే తెలుసు. కార్తీక్‌ తండ్రికి నేనంటే ఏ మాత్రం గౌరవమూ ప్రేమా ఉండేవి కావు.

ఆడవారిపట్ల చులకన, అగౌరవం ఉన్నవాతావరణంలో పెరిగాడు కార్తీక్‌. తండ్రి నన్ను ఈసడించుకోవడం చూసిన కార్తీక్‌ తను కూడా అలాగే చేసేవాడు. అతని మాటల్లో ఇప్పటికీ ప్రతీ రెండో మాటా అలాగే వస్తుంది గమనించావా?’’

రాజేశ్వరి చెప్తున్న మాటలకి రుజువులు వెంటనే తట్టాయి హరితకి. తల్లికి ఏం ఇష్టమో తెలియనితనమూ, ఇంత వివేకం ఉన్న స్త్రీని ఏ అభిప్రాయం లేని వ్యక్తిగా చిత్రీకరించిన తీరూ, అత్తాకోడళ్ళ గొడవల పేరుతో ఫెమినిజాన్ని కించపరుస్తూ మాట్లాడటమూ, తన తండ్రి మీద జోకులు... ఇవన్నీ మనసులో మెదులుతున్నాయి హరితకి.

‘‘కార్తీక్‌ శాడిస్టు... సైకో కాదు. కానీ ఓ ఆరోగ్యకరమైన దాంపత్యాన్ని నెరవేర్చటానికి కావాల్సిన లక్షణాలు లేవు. దాంపత్యం అంటే- భార్యాభర్తా ఓ సమస్య వస్తే కలిసి పరిష్కరించుకోవడం, ఒక టీమ్‌గా ఉండటం. మావాడికి ఇది చేతనవును అని చెప్పగలవా?’’

హరితకి చాలాసార్లు వివేకం నోరు నొక్కేసింది. అలా లేకపోతే కార్తీక్‌తో అన్యోన్యంగా ఉండలేం అని. ఆ వివేకం ఇప్పుడు రాజేశ్వరి మాటలకి స్పందిస్తోంది. అతనే వెంటపడ్డాడు. అయినా తన తల్లిదండ్రులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు అతను లేడు. అతని తల్లి సమస్యని కూడా తన సమస్యే చేశాడు తప్ప కలిసి మాట్లాడుకుందాం అనలేదు.

‘‘ఒక ఆరోగ్యకరమైన దాంపత్యం కావాలంటే ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉండాలి. ఎవరి వ్యక్తిత్వం వారికుండాలి. వాటికి నీ భాగస్వామి స్పేస్‌ ఇవ్వాలి. కార్తీక్‌ నీ అభిరుచులూ ఆశయాలూ అలవాట్లనీ గౌరవిస్తాడు అని నమ్మకంగా చెప్పగలవా?’’

హరిత మనసుకి జవాబు తెలుసు. ఏ రోజూ తన రీసెర్చ్‌ ‘ఏ విషయంలో’ అని తెలుసుకోవాలనుకోలేదు- అదే రంగంలో ఉంటూ కూడా. ‘పీహెచ్‌డీ తెలివితేటలు’ అంటూ తన ప్రజ్ఞని అవమానించడం ఎన్నిసార్లు భరించలేదు తను? చివరికి తనకిష్టమైన కాఫీ తాగినప్పుడు గిల్టీ ఫీలయ్యేది. తను ఫీలయ్యేదా... అతను ఫీలయ్యేలా చేసేవాడా..?

‘‘సంవత్సరం వెంటపడి అతను నీకు ఇచ్చిన అటెన్షన్‌ని ప్రేమ అనుకుంటున్నావు నువ్వు. ఆఫీస్‌లో అందరూ కోరుకున్న అమ్మాయిని తాను దక్కించుకోవడమే ప్రేమ అనుకుంటున్నాడు కార్తీక్‌. ఇది ప్రేమేనా..? మీ ఇద్దరి భవిష్యత్తు నిలబెట్టడానికి ఈ పునాది సరిపోతుందా..?’’

తన ప్రేమ సినిమాల్లో చూపించిన ప్రేమలాగే ఉందని థ్రిల్‌గా ఫీలయింది కానీ అది నిజమైన ప్రేమేనా అని ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు హరిత. ఎందుకో తన ‘ప్రేమ’ కోసం ఆవిడతో వాదించాలి అనిపించట్లేదు హరితకి. తనలో తానే చెప్పుకోలేని సంకోచాలనీ సంశయాలనీ రాజేశ్వరి బయట పెడుతోంది అని మాత్రం తెలుస్తోంది.

‘‘నీ సహనానికీ అతని అవగాహన లోపానికీ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మీకు పుట్టబోయే పిల్లలకి కూడా ఈ వాతావరణం సరికాదు. ఈతరం అమ్మాయిగా నువ్వు ఈ బంధానికి స్వస్తి చెప్పి విడాకులు తీసుకోవచ్చు లేదా నాలాగా భరిస్తూ ఉండిపోవచ్చు. ఏదైనా ఇద్దరూ ఆనందంగా ఉండలేరు.

అలా కాకూడదనే నా తాపత్రయం. మీరు నడుస్తున్న బాట ఏ తీరానికి చేరుస్తుందో తెలిసీ చెప్పకపోతే తప్పు నాదవుతుంది.

నాకు మగపిల్లవాడు పుట్టాడు అని తెలియగానే నేను ఎన్నో కలలు కన్నాను. వాణ్ణి ఆదర్శవంతుడైన పురుషుడిగా తీర్చిదిద్దాలనీ, నాకొచ్చే కోడలు నాలాగా కష్టపడకూడదని. ఇంట్లో పరిస్థితులవల్ల కుదర్లేదు. నేనే ధైర్యంగా నిలబడలేదేమో. ఆయన పోయాక కార్తీక్‌కి ఎంతో దగ్గరవుదాం అని ప్రయత్నించాను. ఏ పుస్తకాలు చదివితే అతని భావాలు మెరుగవుతాయో, వ్యక్తిత్వం వికసిస్తుందో అలాంటివి చదివించాలి అని చూశాను. దానివల్ల మా దూరాలు పెరిగాయే కానీ తగ్గలేదు. కార్తీక్‌ స్వయంగా అనుకోనిదే మారడు. ఇలాగే పెళ్ళి చేసుకుంటే ఓ భర్తగా ఫెయిల్‌ అవుతాడు. అందుకే ఈ పెళ్ళి జరగనివ్వకూడదు అనుకున్నాను. జీవితంలో నేను దృఢంగా తీసుకున్న, తీసుకోగలిగిన నిర్ణయం ఇదొక్కటే అంటే నమ్ముతావా?’’

ఇంక రాజేశ్వరి చెప్పడానికి ఏమీ మిగల్లేదు. హరిత ఆలోచించుకోవడానికే చాలా ఉంది. ఇద్దరూ ఆ మౌనంలో అలాగే కూర్చుండిపోయారు.

వీరికి కొద్దిదూరంలో కూర్చుని ఈ సంభాషణని ఆసాంతం విన్న కార్తీక్‌కి మొదటిసారి అద్దం మీద దుమ్ము తుడిచి తన ప్రతిబింబం చూపించినట్టయింది.

నిజానికి తనకి తల్లి మీద కోపం రావాలి. కానీ అమ్మ చెప్పిన విషయాలు అన్నీ నిజాలు. అది తన అంతరాత్మకి తెలుసు. హరిత మీద అంతరాంతరాల్లో ఉన్న ప్రొఫెషనల్‌ జెలసీని జోకుల రూపంలో తీర్చుకున్నాడు తను. హరిత స్ట్రాంగ్‌ ఉమన్‌ అని తెలిసి తన వంతు బాధ్యతల్ని కూడా ఆమె మీద వేసేశాడు. ప్రేమించిన పాపానికి ఆమె పల్లెత్తుమాట అనలేదు తనని. అమ్మ మాత్రం తక్కువా... ఇన్నేళ్ళూ మౌనంగానే భరించలా..?

తన లోపాలని ఒప్పుకోకుండా ఇలాగే ఉంటే అమ్మ చెప్పినట్టే హరిత తనని వదిలి వెళ్ళిపోతుంది. నాన్నలాగే అమ్మని బాధ పెట్టినవాడవుతాడు కూడా. ‘నేను మారతాను’ అని వట్టి ప్రమాణాలు చెయ్యడం కూడా వృథా. అమ్మ అన్న ఓ మాట గుర్తొచ్చింది... ‘పెంపకాలు’.

తనని ప్రేమించే ఆ ఇద్దరు స్త్రీమూర్తుల వైపు నడిచాడు కార్తీక్‌. ఇద్దరూ కార్తీక్‌ని చూసి ఆశ్చర్యపోయారు. కార్తీక్‌ ఎలా స్పందిస్తాడో ఇద్దరూ ఊహించలేకపోతున్నారు.

కార్తీక్‌ తన తల్లి ముందు కూర్చుని ఆమె చేతులు అందుకున్నాడు. అతని కళ్ళలో ప్రేమ, గౌరవం, అపరాధ భావన అన్నీ కనిపించాయి రాజేశ్వరికి. ఆమె కళ్ళు చెమర్చాయి. ‘‘అమ్మా, నన్ను ఈసారి నీ ఆశయాలతో పెంచుతావా?’’ కొడుకుని మొదటిసారి ఎత్తుకున్నప్పుడు కలిగిన భావన కలిగింది మళ్ళీ రాజేశ్వరికి.

ఎన్నో ఏళ్ళ రాజేశ్వరి ఆవేదననీ, కార్తీక్‌తో భవిష్యత్తు ఏంటో అన్న హరిత ఆందోళననీ ఈ ఒక్క ప్రశ్నతో తీసేశాడు కార్తీక్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..