‘ఈ ఫొటో నిజమని మీరు నమ్ముతున్నారా?’ తల్లిదండ్రులకి కూతురి సూటి ప్రశ్న

శ్రీధర్‌ పొద్దున లేచి యోగా చేసుకుని వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాడు.ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడూ పూర్తి శ్రద్ధ తీసుకుంటాడు. తను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం... ఇంకా పది సంవత్సరాల సర్వీసు ఉంది.

Updated : 18 Feb 2024 09:10 IST

- శ్రీను పెద్దుల

శ్రీధర్‌ పొద్దున లేచి యోగా చేసుకుని వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాడు.ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడూ పూర్తి శ్రద్ధ తీసుకుంటాడు. తను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం... ఇంకా పది సంవత్సరాల సర్వీసు ఉంది.

ఇంతలో వేడి వేడి కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది భార్య హేమ. ఇద్దరిదీ ముప్ఫై సంవత్సరాల అనుబంధం.

‘‘అమ్మాయి సౌందర్య పెళ్ళి విషయం ఏమైనా ఆలోచిస్తున్నారా?’’ అంది హేమ, తను కూడా కాఫీ తాగుతూ... సోఫాలో కూర్చుంటూ.

‘‘చిన్నపిల్ల... ఇప్పుడే పెళ్ళి ఏమిటి? వేడి వేడి కాఫీ ఆస్వాదిస్తూ అన్నాడు శ్రీధర్‌.

‘‘దానికి పద్ధెనిమిది ఏళ్ళు నిండాయి తెలుసా?’’

‘‘అయితే? రాత్రీ పగలూ ఎంతో కష్టపడి చదివి మొన్ననే ‘నీట్‌’ పరీక్ష రాసింది. తప్పకుండా ఎంబీబీఎస్‌లో సీట్‌ కొడుతుందని నాకు పూర్తి నమ్మకం. ముందు నీట్‌ రిజల్ట్‌ రానీ, ఒకవేళ నీట్‌లో ర్యాంకు రాకపోయినా ఏదో ఒక డిగ్రీ అయితే చేయాలి కదా’’ అన్నాడు.

‘‘ఇద్దరు కొడుకులు పుట్టిన తరవాత అమ్మాయి కావాలని, ఎంత మంది దేవుళ్ళకు మొక్కుకున్నాము... ఎంత మంది డాక్టర్లను కలిశాము... అబ్బాయిలు పుట్టిన ఆరు సంవత్సరాల తరవాత పుట్టిన బిడ్డ అని ఎంతో గారాబంచేసి పెంచారు... పెళ్ళి విషయంలో మాత్రం మీ గుడ్డి ప్రేమ చూపించకండి.’’

‘‘గుడ్డి ప్రేమ ఏంటి? అమ్మాయిలను ‘ఇది చెయ్యొద్దూ అది చెయ్యొద్దూ’ అని కట్టుబాట్లు పెట్టి, వారి ఎదుగుదలకు అడ్డు నిలిచే తండ్రిని కాను నేను... ఓకే.’’

‘‘చాల్లెండి సంబడం. మన అబ్బాయిలను చూడండి... చదువు పూర్తికాగానే, ఉద్యోగం సంపాదించారు. సరైన వయస్సులో పెళ్ళి చేసుకున్నారు. ఇప్పుడు చిన్నోడు నాగపూర్‌లో, పెద్దోడు అమెరికాలో స్థిరపడి, పిల్లా పాపలతో చల్లగా ఉన్నారు. దీన్ని కూడా ఒక అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది. ఏమైనా అర్థమవుతోందా తమరికి...’’ అంటూ శ్రీధర్‌ చేతిలో ఖాళీ అయిన కాఫీ కప్పు తీసుకుని వంటగది వైపు నడిచింది.

‘‘దీనికి ఎప్పటికీ బుద్ధి రాదు’’ అని మనస్సులో అనుకుంటూ పేపర్‌ అందుకున్నాడు శ్రీధర్‌.పెద్దగా ఆకర్షించే వార్తలు కనిపించలేదు.

ఇంతలో పక్కనే ఉన్న మొబైల్‌ ‘టింగ్‌... టింగ్‌’ అంటూ మెసేజ్‌ వచ్చిన చప్పుడు చేసింది. మొబైల్‌ తీసి చూశాడు. ఏదో కొత్త నంబరు నుండి మెసేజ్‌. ఓపెన్‌ చేసి చూశాడు. ఏదో ఫొటో. సరిగ్గా కనిపించలేదు.. పక్కనే ఉన్న కళ్ళద్దాలు పెట్టుకుని చూశాడు. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది. ఆ ఫొటోలో- తన కూతురూ ఇంకొకడూ అసభ్యకరమైన సన్నివేశంలో... నగ్నంగా ఉన్నారు. ఫొటో చూసినప్పటి నుండీ శ్రీధర్‌కి మెదడు మొద్దుబారిపోయింది. నోటమాట రావట్లేదు. ‘హేమా... హేమా’ అని అరవాలనుకున్నాడు. కానీ, గొంతు నుండి మాట రావట్లేదు. పట్టు తప్పిపోతోంది. విపరీతమైన చెమటలు... ఏం చెయ్యలేక అట్లాగే సోఫాలో పక్కకి ఒరిగిపోయాడు.ఇంతలో హేమ- భర్తతో మరోసారి మాట్లాడి ఎట్లాగైనా అమ్మాయి పెళ్ళికి ఒప్పించాలని హాల్లోకి వచ్చింది. భర్త పరిస్థితి చూసి, పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంది కిందపడకుండా.

‘‘ఏమైందండీ... ఏమైందండీ’’ అని అడుగుతూ ఉంది. కన్నీళ్ళు ఆగట్లేదు. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు.ఇంతలో భర్త ‘నీళ్ళు’ అన్నట్లు సైగ చేసేసరికి టీపాయ్‌ మీద బాటిల్‌లో ఉన్న నీళ్ళు గ్లాసులో పోసి మెల్లమెల్లగా తాగించింది. రెండు మూడు గుటకల నీళ్ళు తాగిన శ్రీధర్‌ మెల్లగా కోలుకున్నాడు. లేచి సోఫాలో కూర్చున్నాడు.

హేమకు కొంచెం ధైర్యం వచ్చింది. ‘‘ఏమైందండీ... ఇప్పుడు ఎలా ఉంది... లేవండి డాక్టర్‌ దగ్గరికి వెళ్దాం’’ అంది.

శ్రీధర్‌ ‘వద్దు’ అన్నట్టు చేతితో సైగ చేసి... సీలింగ్‌ వైపే చూస్తున్నాడు.‘‘అసలు ఏమైంది మీకు? ఇప్పటి వరకూ బాగానే ఉన్నారుగా... పదండి డాక్టర్‌ దగ్గరికి వెళ్దాం’’ అంది మళ్ళీ. శ్రీధర్‌ తన మొబైల్‌ తీసి హేమకు ఆ ఫొటో చూపించాడు.

ఫొటో చూసిన హేమ... కళ్ళు పెద్దవి చేసి... అలాగే చూస్తూ ఉండిపోయింది. మెల్లగా తేరుకుని... ‘‘ఎవడో పనికిమాలిన వెధవ మన అమ్మాయి గురించి పనికిమాలిన ఫొటో పెడితే మీరు అది నిజమో కాదో కనుక్కోకుండా ఇంతలా బాధపడతారా?’’ అంటూ భర్తకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, ఏ నంబర్‌ నుంచైతే ఆ ఫొటో వచ్చిందో ఆ నంబర్‌కి ఫోన్‌ కలిపి... స్పీకర్లో పెట్టింది.

చాలాసేపు మోగిన తరువాత... ఎవరో ఎత్తారు.

‘‘హలో’’ అంది హేమ.

‘‘హలో’’ మగ గొంతు... ‘‘చెప్పండి.’’

‘‘ఎవరు మీరు?’’

‘‘నేనెవరైతే మీకెందుకు..?’’

‘‘మా మొబైల్‌కి ఒక ఫొటో వచ్చింది... అది పెట్టింది నువ్వేనా? ఎవడ్రా నువ్వు... నీకెంత ధైర్యం?’’ అని కోపంగా అడిగింది.

‘‘అవును నేనే... నేనూ మీ అమ్మాయీ గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. పెళ్ళి చేసుకుందాం అంటే ఒప్పుకోవట్లేదు. కానీ, మా మధ్య అన్నీ జరిగిపోయాయి. ఎందుకు పెళ్ళికి ఒప్పుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీరైనా ఒప్పిస్తారని, ఆ ఫొటో పంపించా... ఓకేనా. మీ కూతురిని ఒప్పించండి లేదంటే తెలుసుగా... ఈ ఫొటోలన్నీ నెట్‌లో పెడతా. అప్పుడు మీ అమ్మాయి బతుకు ఏమవుతుందో ఒక్కసారి అలోచించండి... అత్తయ్యగారూ.’’

‘‘ఎవర్రా నీకు అత్తయ్య? అసలు మా అమ్మాయి నీతో ఇంత చనువుగా ఉందనీ ఈ ఫొటోలు నిజమనీ రుజువేంటి?’’ కొంచెం గట్టిగానే అడిగింది.

‘‘మీకు రుజువు కావాలంటే ఇదే మొబైల్‌కి రోజుకో ఫొటో పంపిస్తా. ఆ ఫొటోలే మీకు రుజువులు. అంతెందుకు, మీ కూతుర్నే అడుగు, అన్నీ వివరంగా చెప్తుంది’’ అని ఫోన్‌ పెట్టేశాడు.

మళ్ళీ మళ్ళీ ఆ నంబర్‌కి ఫోన్‌ చేసింది కానీ స్విచ్‌ ఆఫ్‌ అని వస్తోంది.

అన్నీ వింటున్న శ్రీధర్‌ బాధగా హేమ వైపు చూస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ చేతులు తలమీద పెట్టుకుని దిగాలుగా కూర్చున్నారు. ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు.

పొద్దున జాగింగ్‌కని వెళ్ళిన కూతురు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు.

శ్రీధర్‌ ఫోన్‌ తీసి కూతురికి కాల్‌ చేశాడు. రింగ్‌ అవుతోంది కానీ ఫోన్‌ తియ్యట్లేదు.

మళ్ళీ మళ్ళీ చేశాడు. ఎంతకీ కూతురు ఫోన్‌ తియ్యట్లేదు.

శ్రీధర్‌కి కూతురి మీద కోపం ఎక్కువవుతోంది. కూతుర్ని చిన్నప్పటి నుండీ ఇంటి మహాలక్ష్మిలా చూసుకున్నాడు. ఏది అడిగినా కాదనలేదు. తనని పెద్ద చదువులు చదివించాలనుకున్నాడు. అదృష్టం కొద్దీ తనూ బాగా చదువుతుంది. అన్నిట్లో ఫస్టే. మొన్ననే నీట్‌ పరీక్ష రాసింది రిజల్ట్‌ కోసం చూస్తున్నారు. ఇంతలో ఈ దౌర్భాగ్యపు వార్త. శ్రీధర్‌ తట్టుకోలేకపోతున్నాడు... తన నమ్మకాన్ని వమ్ముచేసిందే. అంతగా పెళ్ళి చేసుకోవాలనే కోరిక ఉంటే, ఒక్క మాట తనతో చెప్తే ఓ మంచి కుటుంబం నుండి అబ్బాయిని చూసి అంగరంగ వైభవంగా పెళ్ళి చేసేవాడు కదా. ఈ పిచ్చి తిరుగుళ్ళు ఎందుకు... మనసు పరిపరివిధాల ఆలోచిస్తోంది.

ఇంతలో జాగింగ్‌కి వెళ్ళిన కూతురు సౌందర్య ఇంట్లోకి అడుగుపెట్టింది.

తనని చూడగానే శ్రీధర్‌కీ హేమకీ ఎక్కడలేని కోపం వచ్చింది. అయినా ఇద్దరూ కోపాన్ని అణుచుకున్నారు. ఏమీ మాట్లాడకుండా సౌందర్యవైపే చూస్తూ ఉండిపోయారు.

సౌందర్యకు తల్లిదండ్రుల ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది.

‘‘ఏమైంది అట్లా ఉన్నారు’’ అని మెల్లగా అడిగింది.

‘‘నేను ఫోన్‌ చేస్తే ఎందుకు తియ్యలేదు’’ అడిగాడు శ్రీధర్‌.

‘‘నీ ఫోన్‌ వచ్చినప్పుడు నేను లిఫ్టులో ఉన్నాను... అందుకే తియ్యలేదు’’ అని చెప్పింది.

హేమ ఏదో అడగబోతుండగా.... శ్రీధర్‌ తనని ఒక చేత్తో ఆపి, కూతుర్ని కుర్చోమని చెప్పి తన మొబైల్‌లోని ఫొటో చూపించాడు.

ఫొటో చూసిన సౌందర్య ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. తేరుకుని మెల్లగా తల్లిదండ్రులవైపు చూసింది.

శ్రీధర్‌, హేమ ఇద్దరూ తనవైపు ఏదో అనుమానంతో చూస్తున్నారు. ‘అమ్మా నాన్నలు తనని అనుమానిస్తున్నారా... ఆ ఫొటో నిజమని అనుకుంటున్నారా...’ అనే ఆలోచన తనను కలచివేస్తోంది.

మెల్లగా తల ఎత్తి ‘‘ఇది... ఇది... నిజమని మీరు నమ్ముతున్నారా?’’ అంది సౌందర్య.‘‘కళ్ళముందు రుజువు కనపడుతుంటే ఎలా నమ్మకుండా ఉండాలి?’’ అన్నాడు శ్రీధర్‌.

‘‘నీకు అంతగా పెళ్ళి చేసుకోవాలని ఉంటే, ఒక్కమాట మాతో చెప్పొచ్చుగా... మేమే దగ్గరుండి పెళ్ళి చేసేవాళ్ళం’’ అంది తల్లి కూతుర్ని ఈసడింపుగా చూస్తూ.

‘‘నాకు ఒక్క అవకాశం ఇవ్వండి జరిగింది చెప్పడానికి. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మీరు నన్ను అనుమానిస్తున్నారంటే... నాకు ఇన్ని రోజులుగా మీమీద ఉన్న గౌరవం పోతోంది.’’

‘‘ఏమని చెప్తావ్‌... ఇది అబద్ధం... అసలు జరిగింది వేరే అని ఒక కట్టు కథ చెప్తావ్‌. అంతకంటే ఏముంటుంది నీ దగ్గర సమాధానం’’ గట్టిగా అరుస్తూ చెయ్యెత్తి కూతురి మీదకు వెళ్ళాడు శ్రీధర్‌.

హేమ భర్తను వారించింది...

ఈ హఠాత్పరిణామానికి భయపడిన సౌందర్య పరుగున తన గదిలోకి వెళ్ళిపోయింది.హేమ, శ్రీధర్‌ నిస్సత్తువగా సోఫాలో కూర్చుండిపోయారు.

* * * * *

రెండు రోజులు గడిచాయి. ఆ రోజు తరవాత ఇంకా కొన్ని రోజులు ఆ ఫొటోల పరంపర కొనసాగింది. రోజుకో ఫొటో... ఇంట్లో యుద్ధ వాతావరణం.

తల్లిదండ్రులు ఎంత వారించినా వినకుండా రోజూ పొద్దున్నే సౌందర్య ఎక్కడికో వెళ్తోంది. దీంతో ఇద్దరికీ కూతురి పైన కోపం ఇంకా పెరిగింది. సౌందర్యతో మాట్లాడటం మానేశారు. ఇద్దరు కొడుకులకూ ఫోన్‌ చేసి జరిగిన సంగతి మొత్తం పూస గుచ్చినట్టు వివరంగా చెప్పారు. రెండు రోజుల్లో చిన్నకొడుకు నాగపూర్‌ నుండి వస్తున్నాడు. సౌందర్యతో మాట్లాడడానికీ తన భవిష్యత్తు గురించి చర్చించడానికీ.

ఆ రోజు సాయంత్రం శ్రీధర్‌కి లోకల్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి ఫోన్‌... ‘అత్యవసరంగా రమ్మని’.

భార్యాభర్తలు భయపడుతూ, కూతురు విషయంలో ఇంకా ఏమేమి సంగతులు, ఎంతటి అసభ్యకరమైన విషయాలు వినాలో... అనుకుంటూ హుటాహుటిన పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళారు. అక్కడ ‘షీ టీమ్‌’ కోసమై వేరేగా ఏర్పాటు చేసిన గదిలోకి వారిని వెళ్ళమని పంపించారు.

ఆ గదిలో మహిళా ఆఫీసర్‌తో సౌందర్య ఏదో మాట్లాడుతూ ఉంది. శ్రీధర్‌నీ హేమనీ చూసిన ఆ ఆఫీసర్‌, వాళ్ళని కూర్చోమని... ‘‘మీరేనా సౌందర్య తల్లిదండ్రులు’’ అని అడిగింది.

‘‘అవును’’ అన్నాడు శ్రీధర్‌.

ఆమె శ్రీధర్‌నీ హేమనూ చూస్తూ ‘‘మీకు వచ్చిన ఫొటోల్లో మీ అమ్మాయితో ఉన్న అబ్బాయి అతనేనా’’ అంటూ పక్కనే కటకటాల్లో ఉన్న ఓ పాతికేళ్ళ అబ్బాయిని చూపించింది.భార్యాభర్తలు అటువైపు చూసి ‘‘అవును అతనే’’ అన్నారు.

‘‘గత ఆరునెలలుగా ‘నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు’ అంటూ మీ అమ్మాయి వెంటపడుతున్నాడు వాడు. మీ అమ్మాయి ఎంతకీ ఒప్పుకోక తన చదువుమీద ధ్యాస పెట్టింది. ఆ అబ్బాయి సంగతి చెప్తే ఎక్కడ మీరు కంగారుపడతారో అని మీకు చెప్పలేదు. వాడు మీ అమ్మాయిని ఎలాగైనా లోబర్చుకోవాలని మీ అమ్మాయి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి... అబద్ధపు ఫొటోలు సృష్టించి, మిమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చెయ్యడం మొదలుపెట్టాడు. మీ అమ్మాయినే కాదండీ... గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది అమ్మాయిలనూ వీడి మాటలు నమ్మిన తల్లిదండ్రులనూ వీడు బ్లాక్‌మెయిల్‌ చేస్తూ... అక్రమంగా డబ్బులు దోచుకుంటున్నాడు. వీణ్ణి పట్టుకోడానికి మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం. దొరికినట్టే దొరికి పారిపోతున్నాడు. వీడి గురించి చెప్తే ఎక్కడ తమ పేరు బయటకొస్తుందోనని వీడి దాష్టీకానికి బలైన అమ్మాయిలు కానీ వారి తల్లిదండ్రులు కానీ మాకు కంప్లైంట్‌ చెయ్యలేదు. దాంతో వీణ్ణి పట్టుకోవడం మాకు కష్టమైంది. వీడి ఆగడాలు ఎక్కువైపోయాయి. ఇన్నాళ్ళకు మీ కూతురు ధైర్యం చెయ్యడంతో వీడి ఆటలు అరికట్టకలిగాం, వీడు మాకు చిక్కాడు.

మీరు మీ కన్నబిడ్డని నమ్మకుండా వాడి ఉచ్చులో పడి ఆమెను అవమానించారు. మీ అమ్మాయి మా దగ్గరికి వచ్చింది కాబట్టి వాణ్ణి మేము తొందరగా అరెస్టు చేయగలిగాం. వాడి వేధింపులతోపాటు మీ అనుమానాలు భరించలేక మీ అమ్మాయి ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉంటే దానికి ఎవరు బాధ్యులు? మీ అమ్మాయి మీద మీకే నమ్మకం లేకపోతే, ఇంకెవ్వరు తనని నమ్ముతారు? కష్టమైనా నష్టమైనా మీ అమ్మాయి ఇంకెవ్వరితో చెప్పుకుంటుంది? పిల్లలకు అన్నీ ఇచ్చాము గారాబంగా చూసుకుంటున్నాము అనగానే మన బాధ్యత తీరిపోదు. ప్రతి కష్టంలో నష్టంలో వారికి అండగా తోడుగా ఉండాలి. అంతేకానీ, ఎవ్వడో కోన్‌కిస్కాగాడు మీ పిల్లల గురించి ఏదో వాగితే అదే నిజమని నమ్మి మీ పిల్లల మాటలకు విలువివ్వకపోతే ఎట్లా, మీరే చెప్పండి’’ అంది సీరియస్‌గా.

శ్రీధర్‌, హేమ దించిన తల ఎత్తకుండా నేల చూపులు చూస్తున్నారు.

తాము ఎంత పెద్ద తప్పు చేశారో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంటే వారి మీద వారికే అసహ్యం వేసింది. తమ కూతురిని తప్పుగా అర్థం చేసుకున్నామన్న భావన వారిని ఎంతో కుంగదీసింది.

తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకున్న సౌందర్య... ‘‘మా అమ్మా నాన్నలు చాలా మంచివారు మేడమ్‌. చిన్నప్పటి నుంచీ అన్ని విషయాల్లో అన్నయ్యలనూ నన్నూ ఒకేలా చూశారు. ఆడపిల్లనని ఏనాడూ నన్ను చిన్నచూపు చూడలేదు. అర్థంలేని ఆంక్షలు పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. నేను ఎక్కడ చెడు దారిలో నడుస్తానో అన్న భయంతోనే ఈ విషయంలో వాళ్ళు అలా ప్రవర్తించారు. నా మంచి కోసమే ఆలోచిస్తూ ఒత్తిడికి గురయ్యారు. అంతకుమించి ఇందులో వారి తప్పేంలేదు’’ అంటూ శ్రీధర్‌ వైపు తిరిగి... ‘‘నాన్నా, నేను నీ పెంపకంలో పెరిగిన బిడ్డను. మంచీ చెడూ తెలుసుకునే విజ్ఞత, సమర్థత మీరిద్దరూ చిన్నప్పటినుండీ నాకు అలవరిచారు. మీ కూతురు ఎప్పుడూ తప్పు చెయ్యదు. కానీ, ఒక్కటి మాత్రం నిజం... తెలిసో తెలియకో పిల్లలు ఏదైనా సమస్యలో చిక్కుకుంటే- అమ్మానాన్నలు వారిని వేలెత్తి చూపడం, వెలివెయ్యడం కాకుండా అర్థం చేసుకుని అండగా నిలవాలి. అప్పుడే వారు ధైర్యంగా ఈ సమాజాన్నీ జీవితంలో వచ్చే ఒడుదొడుకులనూ ఎదుర్కోగలుగుతారు’’ అంటూ ‘‘ఇక ఇంటికి వెళ్దామా’’ అని అడిగింది.

ఆ మాటలు విన్నాక- ప్రస్తుత యువతను తాము ఎంత చులకనగా... ఎంత బాధ్యత లేనిదిగా చూస్తున్నారో వారికి అర్థమైంది. ప్రేమగా కూతురి భుజం మీద చెయ్యి వేసి ముందుకు నడిచారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..