అలా... అలా... అలా... అనంతంగా

‘‘కదలకుండా కూర్చోలేవూ?  బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడెలా వేస్తాను?’’ గట్టిగా కసిరింది సుందరి తన ఆరేళ్ళ కూతురు ఉషను. ‘‘నీకింత విసుగేమిటోయ్‌? పిల్లల్ని అలా కసురుకుంటే ‘‘కదలకుండా కూర్చోలేవూ?  బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడెలా వేస్తాను?’’ గట్టిగా కసిరింది సుందరి తన ఆరేళ్ళ కూతురు ఉషను.

Updated : 25 Feb 2024 04:11 IST

- తాడిమేటి శ్రీదేవి

‘‘కదలకుండా కూర్చోలేవూ?  బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడెలా వేస్తాను?’’ గట్టిగా కసిరింది సుందరి తన ఆరేళ్ళ కూతురు ఉషను.
‘‘నీకింత విసుగేమిటోయ్‌? పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా... నెమ్మదిగా చెప్పేలా చెప్పాలిగానీ’’ అక్కడే పేపర్‌ తిరగేస్తున్న సుందరం అన్నాడు.
‘‘ఓ యబ్బో! చెప్పేలా చెప్తే వినే పిల్లలేనా వీళ్ళు. పోనీ మీకంత ఓపిక ఉంటే మీరు చెప్పొచ్చు కదా. అక్కడికి మీరేమో వాళ్ళకి పరమ శాంతస్వరూపులు, నేనేమో రాకాసిని అనేనా మీ ఉద్దేశ్యం. హోంవర్క్‌ చేయించడమూ చదివించడమూ అన్నీ నేనే చూసుకోవాలి. అసలే సిలబస్‌ ఎక్కువగా ఉంటోంది. మధ్యమధ్యలో పరీక్షలొకటి. అవి వాళ్ళకో నాకో అర్థం అయి చావడం లేదు. ప్రాజెక్టులూ డ్రాయింగులంటూ దుంప తెంపుతున్నారు. వాటికోసం బజార్లమ్మట తిరిగి తిరిగి నా తలప్రాణం తోకకి వస్తోంది’’
విసురుగా అంది సుందరి.
‘‘అందుకే కదుటోయ్‌, నిన్ను ఉద్యోగం చెయ్యొద్దని చెప్పాను- రెండుచోట్ల కష్టపడలేవని.’’
‘‘ఆఁ ఈ చాకిరీ పది ఉద్యోగాల పెట్టు. ఓ మెప్పూ మెహర్బానీ ఏమన్నా ఉన్నాయి కనుకనా? గానుగెద్దు బతుకయి రోత పుడుతోంది’’ మూతి మూడు వంకర్లు తిప్పింది.
‘‘కదలొద్దన్నానా? చెప్తే వినవు...
మొండితనంలో మేనత్తను మించిపోయావు’’ పిల్ల బుగ్గ సుందరి చేతిలో రెండంగుళాలు సాగింది. దాంతో పిల్ల ఘొల్లుమనడం... సుందరం ఖయ్యిమనడం ఒక్కసారే
జరిగాయి.
‘‘మధ్యలో మా చెల్లెలి మాట ఎత్తుతావెందుకు? తిట్టుకుంటే నీ పిల్లను నువ్వు తిట్టుకో’’ ఎగిరాడు సుందరం.
‘‘అవును నా పిల్లే, కానీ బుద్ధులు మీ చెల్లెలివే. అత్తయ్యగారు చెప్పిన మాట ఒక్కటైనా చెవిని ఎక్కించుకునేదీ... ఆవిణ్ణి ఏడిపించుకు తినేది కాదూ, నిజం చెప్పండి’’ ఛాలెంజ్‌ చేస్తున్నట్లు అంది.
‘‘అబ్బో అత్తయ్య...గారు... ఆవిడ ప్రతిమాటా నీకు విసుగ్గానే ఉండేది. పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదయిపోయిందా?’’ కౌంటర్‌ ఇచ్చాడు.
‘‘అనండనండి. ఎంత బాగా చూసినా నేను పరాయింటి నుంచి వచ్చిన దాన్నేగా? మీరూ మీరూ ఒకటి’’ ముక్కు చీదేసింది.
‘‘చాల్లే నెత్తిమీద నీళ్ళకుండ ఉంటుంది ఎప్పుడూ. ఆ రవిగాడు ఇంకా బాత్‌రూమ్‌ నుంచి వచ్చినట్లు లేడు. స్కూల్‌కి టైమ్‌ అవుతోందని ఏమైనా జ్ఞానం ఉందా వాడికి? ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా నుంచుంటాడు. నానిముచ్చు వెధవ! చురుకు లేకుండా మన్ను తిన్న పాములా ఉండటం... ఎవరి పోలిక వచ్చిందో?’’ వ్యంగ్యంగా అన్నాడు.
‘‘మీరు డైరెక్టుగా అనకపోయినా మా అన్నయ్యనే అంటున్నారని తెలుసు. ధైర్యం ఉంటే నాలా మొహం మీద అనాలి. ఇలా మెలిక మాటలు మా ఇంటా వంటా లేవు’’ దులిపేసింది సుందరి.
‘‘అవును పాపం! మిమ్మల్ని చెప్పే ఎవర్నైనా చెప్పాలి. ఎదుటివాళ్ళని దులిపెయ్యడమే నిజాయతీ అనుకుంటారు. ఎక్కడికి పోతుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి.’’ ‘‘అవును పుడకలతోగానీ పోదు. నిండింట్లో ఇలాంటి మాటలనడం మీకే చెల్లింది’’ విసురుగా జడ వెయ్యడం ముగించి పిల్లను ముందుకు తోసింది.
అద్దంలో చూసుకున్న ఉష ‘‘ఇవాళ బుధవారం స్పోర్ట్స్‌డే కదా... వైట్‌ రిబ్బన్లు వెయ్యలేదేమిటి?’’ అంటూ రాగం తీసింది.
‘‘కావాల్సిన రిబ్బన్లు ముందే తెచ్చి పెట్టుకోలేవూ? అంతా అయ్యాక మొదలెడతావ్‌... నేనేదో ఖాళీగా ఉన్నట్లు. పొద్దుట్నించీ ఒంటి చేత్తో చేసుకొస్తున్నాను. ఇంకా క్యారియర్లు సర్దాలి. కాసిని కాఫీనీళ్ళు గొంతులో పోసుకోవడమే కష్టం అయిపోతోంది’’ జీరగా ధ్వనించింది సుందరి గొంతు.
‘‘ఏదో బండలెత్తినట్లు ఆపసోపాలు పడతావెప్పుడు చూసినా. ఎవరి ఇంట్లో పని వారు చేసుకోవడం కూడా బ్రహ్మాండమే?’’ భర్త మాటల్లోని వెటకారానికి సుందరికి ఒళ్ళంతా కారం రాసినట్లయింది.
‘‘అదే మరి, నేను మొత్తుకునేదీను. మీరు ఆఫీస్‌కి వెళ్ళేలోగా ఒక చెయ్యి వేస్తే నాకూ పని తెములుతుంది. మా అన్నయ్య చక్కగా సాయం చేస్తాడు. మా వదిన అదృష్టవంతురాలులెండి’’ నిట్టూర్చింది.
‘‘అలా ఆడంగి పనులు చెయ్యడం మా ఇంటా వంటా లేదు’’ ఈసడించాడు సుందరం. మా ఆఫీసులో పనిచేసే మాధవిగారు ఇంటా బయటా ఎంత బాగా
సమర్థించుకొస్తుందో... ఎప్పుడు చూసినా నవ్వుమొహంతోనే ఉంటుంది.’’
‘‘పనుల్లో ఆడా మగా తేడాలు చూపించడంలోనే మీ సంస్కారం బయటపడుతోంది. మీరు తెగ పొగిడేస్తున్నారే... ఆ మాధవి గారిని... దానికి కారణం ఆవిడ భర్త
కృష్ణమూర్తి గారు. ఆడపనీ మగపనీ అని తేడాలు లేకుండా ఇద్దరం అన్నీ కలిసి చేసుకుంటామని ఆవిడే చెప్పారు. ఆ విషయం మాత్రం తమరికి ఎక్కదు. సర్లెండి, మనిద్దరికీ ఇది ఎప్పుడూ ఉండేదేగానీ నేనివాళ బజారుకి పోలేను. మీరే ఏవో రెండు కూరలు తెచ్చి పడెయ్యండి’’ అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది సుందరి.
‘‘ఏమిటలా అయిపోతున్నావ్‌... జ్వరంగానీ వచ్చిందా ఏమిటి?’’ సుందరి మెడ మీద చెయ్యి వేస్తూ ఆదుర్దాగా అడిగాడు. ‘‘డాక్టర్‌ దగ్గరకి తీసుకువెళ్ళనా?’’ అని భర్త ఆదరంగా అడిగిన తీరుకి ఆమె కళ్ళలోకి నీరు చేరింది. ‘‘ఛా! ఏమిటిది చిన్నపిల్లలా?’’ అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని కళ్ళొత్తాడు.
‘‘మరేం లేదు. నేను బానే ఉన్నాను’’ అని సుందరి చెప్తున్నా వినకుండా ఆఫీసుకు ఫోన్‌ చేసి సెలవు చెప్పేశాడు. కూరగాయలు తెచ్చాడు, వంటలో సాయం చేశాడు. ఆ రోజంతా ఒకరికి ఒకరు అన్నట్లు గడిపారు. చీటికిమాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని నిర్ణయం చేసుకున్నారు.
‘‘మా అమ్మమ్మ చెప్పేదండీ...
భార్యాభర్తల తగవులు అద్దం మీద ఆవగింజల్లాంటివీ, ఎంతోసేపు నిలవవూ అని’’ అంది సుందరి. ‘‘అలాగా, నేను ఇంకోటేదో విన్నానే’’ చిలిపిగా అన్నాడు సుందరం.
‘‘ఏం విన్నారేమిటి?’’ అంది సుందరి నవ్వు దాచుకుంటూ.
‘‘మొగుడూ పెళ్ళాల గొడవలన్నీ పడకగదిలో పరిష్కారం అయిపోతాయట’’ గొప్ప రహస్యం చెప్తున్నట్లు చెప్తున్న భర్తని చూసి కిలకిలా నవ్వింది. అరమరికలు లేని ఆనందంతో ఇద్దరూ ఆదమరిచారు ఆ రోజు.

*           *             * 

మర్నాడు... సుందరం బాత్‌రూమ్‌ నుంచి అరుస్తున్నాడు ‘‘ఎన్నిసార్లు చెప్పాలి సోప్‌ అవ్వగానే కొత్తది పెట్టమని. ఇంత బద్ధకం ఏమిటసలు నీకు?’’ అంటూ.
‘‘సోప్‌ ఉందో లేదో చూసుకోకుండా బాత్‌రూమ్‌లో దూరి కూర్చుంటారు. వంట పనీ పిల్లల పనీ చూడనా... మీకన్నీ అందిస్తూ కూర్చోనా? పైగా బద్ధకం అనడం ఒకటి. మిమ్మల్నిలా పెంచి నాకు కట్టబెట్టిన ఆ మహాతల్లిననాలి అసలు.’’
‘‘మాటలు జాగ్రత్తగా రానియ్‌. మధ్యలో మా అమ్మ ఏం చేసింది. ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటావ్‌. ఇప్పుడసలు ఆవిడ ఊసెందుకు?’’
‘‘ఆవిడ ఊసెందుకు అంటారేమిటి? మావాడంత మంచివాడూ బుద్ధిమంతుడూ ఇంకొకరు ఉండరని మా వాళ్ళని బుట్టలో వేసింది ఆవిడే కనక.’’
‘‘మా అమ్మాయికి నోట్లో నాలుక లేదు, అమాయకురాలు అని మీ నాన్నా చెప్పాడుగా?’’
‘‘అంటే ఏమిటిప్పుడు, నేను గయ్యాళినా?’’ నడుం మీద చేతులు వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది.
‘‘నేననడం దేనికి, స్పష్టంగా కనబడుతుంటే. ఇంతకీ సబ్బు తెచ్చావా లేదా?’’
‘‘తేక చస్తానా? ఇదిగో జలకాలాడి తొందరగా తెమిలి రండి. మళ్ళీ టిఫిన్‌ చల్లారిపోయిందంటూ అదో గొడవ.’’
‘‘అవును పాపం, నావల్ల నీకెన్ని ఇబ్బందులో మరి.’’
‘‘ఉన్నమాటంటే ఉలుకెక్కువని ఊరికే అన్నారా? మన పెళ్ళిలో మీవాళ్ళు ‘టిఫిన్‌ చల్లారింది’ అంటూ ఎంత రాద్ధాంతం చేశారు... మర్చిపోయే సంగతా?’’
‘‘అబ్బో, అక్కడికి మీవాళ్ళు మా అడుగులకు మడుగులొత్తినట్లు మాట్లాడుతున్నావ్‌. మీకసలు మర్యాదా మన్నూ తెలిసి ఛస్తేగా?’’
‘‘ఆగండక్కడ. మావాళ్ళ మర్యాదలకే వంకలు పెడుతున్నారు. కాశీ ప్రయాణమప్పుడు గడ్డం కింద బెల్లంముక్క పెట్టిన మా అన్నయ్యకి కాస్త మంచి ప్యాంటూ షర్టూ పెట్టడానికే మొహం చూసుకున్నారు మీవాళ్ళు.’’
‘‘మీరు మావాళ్ళకి పెట్టిన బట్టల మాటేమిటి? మంచివాళ్ళు కాబట్టి అల్లరి చెయ్యలేదు.’’
‘‘ఆఁ మీరూ మీ మంచితనాలూ’’ సుందరి మూతి ముప్ఫై వంకర్లు తిరిగింది. ‘‘చాల్లే, ఎక్కువగా తిప్పకు చూడలేక చస్తున్నా.’’
‘‘అవును, ఎందుకు చూడగలుగుతారు? పెళ్ళైన కొత్తలో- ఇదే మూతి తెగ
ముద్దొచ్చేది. అంతేలెండి, మగవాళ్ళ మనసులు శ్రావణ మేఘాల్లాంటివి అని ఊరికే అనలేదు’’ ముక్కు ఎగబీల్చింది సుందరి.
‘‘శ్రావణ మేఘంలా నువ్వు వర్షిస్తూ నన్నంటావేం?’’ వెక్కిరింపుగా అన్నాడు సుందరం.
‘‘శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో మానతాయో చెప్పలేనట్లు మగాళ్ళ ప్రేమలు కూడా మారిపోతాయట. ఎటొచ్చీ మా ఆడాళ్ళమే వెర్రిమొహాలం’’ ముక్కు చీదేసింది.
‘‘అయ్యబాబోయ్‌, ఇప్పుడు కుళాయి విప్పకు. నాకు ఆఫీస్‌ టైమ్‌ అయిపోయింది’’ అంటూ గబగబా టిఫిన్‌ నోట్లో కుక్కుకోవడం మొదలెట్టాడు.
‘‘నెమ్మదిగా తినండి పొలమారగలదు’’ కంగారుగా అంటూ మంచినీళ్ళ గ్లాసు తెచ్చి టపీమని ప్లేటు పక్కన పెట్టింది. గడగడా మంచినీళ్ళు తాగి లేచాడు.
‘‘హెల్మెట్‌ సోఫాలో పెట్టాను.
మర్చిపోకండి. జాగ్రత్తగా వెళ్ళి రండి.’’
‘‘నువ్వు కదులు మరి... త్వరగా ఎదురురా. నువ్వు ఎదురొస్తే నా పనులన్నీ ఝాం ఝామ్మని అయిపోతాయి. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. పిల్లల స్లిప్‌ టెస్టులు అయిపోయాయన్నావు కదా. పార్కుకి వెళదాం. బీ రెడీ’’ హుషారుగా గడప దాటాడు సుందరం.
‘నేను ఎదురు రాకపోతే ఈయనకు మనసు మనసులో ఉండదు’ మురిపెంగా అనుకుంటూ నవ్వుకుంది.
సాయంత్రం పిల్లలూ సుందరీ రెడీ అయి ఎదురుచూపులు మొదలెట్టారు. త్వరగా వస్తానన్నవాడు మామూలు టైమ్‌కి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసూరుమంటూ టీవీ ముందు కూర్చున్నారు.
‘ఏదో అర్జెంట్‌ పని తగిలి ఉంటుంది. ఇంకోసారి తప్పకుండా వెళ్దాం’ అని వాళ్ళని బుజ్జగించి సమాధానపరిచింది. ఫోన్‌ చేస్తుంటే ఎంగేజ్‌ వచ్చింది. వంట చేసి
పిల్లలకి పెట్టేసింది. ఆమె మనసు కుతకుతలాడుతోంది. తనంతట తాను పెందరాళే వస్తానన్న మనిషి ఇంటి ధ్యాసే పట్టకుండా ఉన్నాడు. పోనీ అంతగా పని ఉంటే ఫోన్‌ చేసి ఒక్క ముక్క చెప్పొచ్చుగా. పెళ్ళామే కదా అని లోకువ.
ముందంతా కచ్చగా ఆలోచించిన ఆమెకు... ఎంతసేపటికీ భర్త ఫోన్‌ ఎత్తకపొయ్యేసరికి కంగారు మొదలయ్యింది. పిల్లలు నిద్దర్లకు పడ్డారు. ‘అసలే ఎన్నో యాక్సిడెంట్‌ల గురించి వింటున్నాం. ఏమీ అవ్వలేదు కదా’ అనే ఆలోచనకే ఆమె మనసు సుడిగాలిలో దీపంలా రెపరెపలాడింది. పది దాటాక ఇల్లు చేరాడు సుందరం. విసురుగా ఏదో అనబోయి అతని వాలకం చూసి తమాయించుకుంది. కుర్చీలో కూలబడి
తల వెనక్కి వాల్చి కళ్ళ మీద చెయ్యి పెట్టుకున్న అతన్ని చూస్తే ఆమె గుండె గుబగుబ లాడింది. పరుగున వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి, ‘‘ఏమయ్యిందండీ?’’ అంది భుజం మీద చేయి వేస్తూ. ‘‘మా ఆఫీస్‌లో స్వీపర్‌ శాంతమ్మ
చాలా మంచిదనీ భర్త పోయాక ఆ జాబ్‌ చేస్తూ పిల్లల్నిద్దరినీ కష్టపడి చదివిస్తోందనీ చెప్పాను కదా?’’
‘‘అవును. ఇద్దరు ఆడపిల్లలూ తల్లికి సాయంగా ఉంటూ కష్టపడి చదువుకుంటున్నారు అని చెప్పారు కూడాను’’ అంది, ‘అయితే?’ అన్నట్లు చూస్తూ.
‘‘శాంతమ్మ ఇవాళ ఉన్నట్లుండి పడిపోయింది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. ఆమెకి లంగ్‌ క్యాన్సర్‌ బాగా ముదిరిపోయిందిట. చాన్నాళ్ళుగా దగ్గు వస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్లుంది. పిల్లల్నే తప్ప తన ఆరోగ్యం పట్టించుకోలేదు. పిల్లలు టెన్త్‌, ఇంటర్‌ చదువుతున్నారు.
ఆమెకేమైనా అయితే ఆ పిల్లలు ఏమైపోతారో పాపం’’ బాధపడ్డాడు.
భర్త సున్నిత మనస్తత్వం తెలిసిన సుందరికి అంతా అర్థం అయింది. ‘‘బాధపడకండి. మరీ చిన్నపిల్లలు కాదు కదా... కష్టం, సుఖం తెలిసినవాళ్ళు. ఆఫీస్‌లో అందరూ తలా కొంత సాయం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. దిగులుపడితే లాభం ఏమిటి? ముందు జరగాల్సింది చూడాలి. మా రంగనాథం మావయ్య పేద విద్యార్థులకు సాయం చేస్తూ ఉంటాడు. ఎవరైనా కష్టపడి చదువుకునే పేదపిల్లలు ఉంటే చెప్పమనీ ఫీజులు కడతాననీ చాలాసార్లు చెప్పాడు. ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదించుకుంటున్నారు. తన పెన్షన్‌తో మంచిపనులు చెయ్యాలని ఆయన తపన. వీళ్ళ గురించి ఆయనకు చెబుదాం.
పెట్టలేకపోయినా పెట్టే చెయ్యి చూపించాలంటారు. ఇంక ఆలోచనలు వదిలి లేవండి. ఫ్రెష్‌ అయ్యి వస్తే అన్నం వడ్డిస్తాను’’చెయ్యి పట్టి లేవదీసింది.
‘‘నువ్వు చాలా తెలివీ సమర్థతా ఉన్నదానివి సుందూ. ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చేస్తావు. నీ మాటలతో నా మనసు తేలికపడింది’’ మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం.
‘‘నన్ను తర్వాత పొగడొచ్చుగానీ ముందు మీరన్నిటికీ ఇలా కదిలిపోవడం మానుకోవాలి. అయినా కష్టాలనేవి మనుషులకికాక మానులకి వస్తాయా?’’ చిరునవ్వుతో అంటున్న భార్య వైపు ప్రేమగా చూశాడు. నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది సుందరి.

*          *              *   

‘‘బావగారు స్పాట్‌ వాల్యుయేషన్‌కి వెళ్తున్నారుట. చెల్లాయి పిల్లల్ని తీసుకుని వస్తానని ఫోన్‌ చేసింది. పది రోజులు ఉంటుందిట’’ నెమ్మదిగా అన్నాడు సుందరం.
‘‘ఆహాఁ అన్నలుంగారికి చెల్లెలుంగారి నుంచి ఫోన్‌ వచ్చిందన్న మాట. ఎప్పుడైనా, ఒక్కసారైనా ‘‘ఇలా రావాలనుకుంటున్నాను, నీకు పుట్టింటికి వెళ్ళే ప్లాన్‌ ఏమైనా ఉందా? అని మాటవరసకైనా అడిగిన పాపాన పోదు’’ ఈసడింపుగా అంది సుందరి.
‘‘ఎవరికి చేస్తే ఏమిటి?’’ తేలిగ్గా తీసెయ్యబోయాడు.
‘‘అవునవును, ఇలాంటి వాటికి మీకేమీ పట్టింపులు ఉండవు. అదే మావాళ్ళు ఎవరైనా ఏ ఊరో వెళ్తూ దారే కదాని ఒక్కపూట దిగినా ముందు చెప్పి రాలేదని తెగ గుంజుకుంటారు.’’
‘‘సర్లేవోయ్‌, దానికి మాత్రం ఎవరున్నారు? ఎక్కడికి వెళ్తుంది? కావాలంటే అది వచ్చి వెళ్ళాక నువ్వు పుట్టింటికి వెళ్ళి నాలుగు రోజులో, పది రోజులో ఉండిరా’’
నచ్చచెప్తున్నట్లు అన్నాడు.
‘‘మీరంతగా సోప్‌ వెయ్యక్కర్లేదు లెండి. ఆడపడుచు ఇంటికి వస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు. కాకపోతే నాకివ్వాల్సిన గౌరవం నాకివ్వడం లేదనే నా బాధ.’’
‘‘ఏదోలెద్దూ. చిన్నపిల్ల. దానికిలాంటివేవీ తెలియవు’’.
‘‘ఏమిటీ, చిన్నపిల్లా... నాకంటే ఆవిడగారు ఆరునెలలు చిన్న అంతే. నేను మీకు నాపసానిలా కనబడడం, ఆవిడ చిన్నబొట్టిలా కనబడటం మామూలయిపోయింది’’ ధ్వజం ఎత్తింది.
‘‘ఇంతకీ ఏమంటావ్‌?’’ విసుగు ధ్వనించింది అతని గొంతులో.
‘‘ఏమంటాను? ఏమీ అనను. ఏమైనా అనడానికి నా మాట ఎప్పుడు చెల్లిందని? వదినా మరదళ్ళన్నాక చీరలు సింగారించుకుని పెళ్ళిళ్ళకీ పేరంటాలకీ తిరగడమే కాదు, ఒకరికొకరు సాయమూ చేసుకోవాలి.
మా పుట్టింటికి వెళ్తే నేనూ మా వదినా సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే అన్ని పనులూ చక్కబెట్టుకుంటాం. మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు పుల్ల అటు పెట్టదు. ఎంతసేపూ ఆ ఫోన్‌ పట్టుకుని కూర్చుంటుంది. పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఇక పనమ్మాయి- చుట్టాలొచ్చారంటే సరి... ముందే నాగాలు పెడుతుంది. అన్ని పనులూ చెయ్యలేక నా నడుం పడిపోతుంది’’ సుందరి మాటల్లో నిస్సహాయత కనబడింది.
ఆమె మాటల్లోని నిజం సుందరం మనసుకు తాకింది. ‘‘ఈసారి నేను కూడా కొంత సాయం చేస్తాను, సరేనా?’’ ఓదార్పుగా అన్నాడు.
‘‘సర్లెండి, ఏదో నా బాధ చెప్పాను అంతే! రానివ్వండి. ఆడపడుచు అంటే అర్ధ మొగుడు అంటారుగా. ఈ మొగుడుగారికీ ఆ అర్ధ మొగుడుగారికీ సేవలు చేసి తరిస్తాను’’ విసురుగా అంది.
‘‘అలా అంటుంటావుగానీ నీ మనసులో ఏమీ ఉండదని నాకు తెలుసు సుందూ’’ నవ్వడానికి ప్రయత్నం చేశాడు.
‘‘గిల్లి, జోల పాడటం మీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు?’’
‘‘ఏంటోయ్‌, నన్ను మరీ అలా లెక్కేస్తున్నావ్‌?’’
‘‘మరే, ఎందుకంటే మీరందరూ లెక్కల్లో మనుషులు కదా?’’
‘‘బాబోయ్‌, ఇక్కడి నుంచి పారిపోవడం నయం. అవునూ, ఎప్పటినుంచో నాకో డౌట్‌... అసలు మన జాతకాలు కలిశాయని సిద్ధాంతి గారు ఎలా చెప్పారంటావ్‌... ఎప్పుడూ ఏదో ఒక పొట్లాట?’’ క్వశ్చన్‌ మార్కు మొహం పెట్టిన సుందరంతో...‘అదేనయ్యా సుందరం, సంసారంలో సరిగమలంటే’’ బోధ చేస్తున్నట్లుగా అరచెయ్యి పైకెత్తి చూపించి నవ్వేసింది సుందరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు