నా కంఠ శోష విన్నాకా ఆమె గురించి తెలుసుకోవాలని అనిపించలేదా?

ఆఫీసు అయ్యాక, దేవాన్షి స్కూటర్‌ స్టార్ట్‌ చేస్తుంటే సాకేత్‌ గబగబా ఆమె దగ్గరికి వచ్చాడు. తల మీది హెల్మెట్‌ తీసి పట్టుకుని ఏమిటన్నట్టు చూసింది. ‘‘మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి. ఎక్కడైనా కూర్చుందామా, ప్లీజ్‌...’’ అర్థించాడు.

Updated : 10 Mar 2024 08:04 IST

సింహప్రసాద్‌

ఫీసు అయ్యాక, దేవాన్షి స్కూటర్‌ స్టార్ట్‌ చేస్తుంటే సాకేత్‌ గబగబా ఆమె దగ్గరికి వచ్చాడు. తల మీది హెల్మెట్‌ తీసి పట్టుకుని ఏమిటన్నట్టు చూసింది.

‘‘మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి. ఎక్కడైనా కూర్చుందామా, ప్లీజ్‌...’’ అర్థించాడు.

‘‘ఆఫీస్‌ పనా!’’

‘‘కాదు, పర్సనల్‌...’’

‘‘దేని గురించో కొంచెం క్లారిటీ ఇస్తారా!’’

‘‘మీరూ మీ పద్దతీ మీ డాషింగ్‌ నేచర్‌ నాకు బాగా నచ్చాయి.

మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను.’’

‘‘మీరు నన్ను చేసుకుంటారు సరే, నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోనక్కర్లేదా!’’

‘‘అది కాదు, మనం పెళ్ళి చేసుకుందాం.’’

‘‘ఇప్పుడు రైట్‌ ట్రాక్‌లోకి వచ్చారు. పెళ్ళంటే మీ గురించి నేనూ నా గురించి మీరూ చాలా చాలా తెలుసుకోవాలి. అందుకు కనీసం గంటో అరగంటో స్పెండ్‌ చేయాలి. ఇప్పుడు పనుంది. రేపు ఈవెనింగ్‌- సే సిక్స్‌ పీఎం- ‘కాఫీ డే’లో కూర్చుందాం, బాయ్‌’’ హెల్మెట్‌ పెట్టుకుని వెళ్ళిపోయింది.

సాకేత్‌ చాలా ఆనందపడ్డాడు. ఆమె దాదాపు అంగీకరించినట్టేనని ఫీల్‌ అయ్యాడు. తనలాంటి అందగాడు, ఆమెకు సీనియర్‌... పెళ్ళి చేసుకుంటానంటే ఎందుకు ఎగిరి గంతెయ్యదు.

విజయహాసం అతని పెదాల మీద కదిలింది.

మర్నాడు అతడు, చక్కగా తయారై, కాఫీ డేకి 6.10కి వెళ్ళాడు. అప్పటికే ఆమె నిరీక్షిస్తోంది. చిన్నగా నొచ్చుకుంటూ, ‘‘సారీ కొంచెం లేట్‌ అయింది’’ అన్నాడు.

*        *       *

‘‘ఇట్స్‌ ఆల్‌ రైట్‌...’’ అని, వెయిటర్‌ని పిలిచి బిస్కెట్లూ టీ తీసుకు రమ్మంది.

‘‘మనం ఎలా ఉంటామో, ఏం ఉద్యోగమో జీతమెంతో తెలుసుగానీ మనస్సుని స్కాన్‌ చేయలేం కదా. ఫ్రెండ్స్‌ ఎవరో తెలిస్తే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుందంటారు. కానీ దాన్ని నేను ఒప్పుకోను. బయట ప్రవర్తించే మనం వేరు, ఇంట్లో మనం వేరు. మన అలవాట్లూ అభిరుచులూ హాబీలూ ఇష్టాయిష్టాలూ ఫ్రెండ్స్‌కి తెలియొచ్చు. అంతేతప్ప, ఇంట్లో మనం ఏమిటో, మన ప్రవర్తన ఎలా ఉంటుందో వారికి తెలిసే అవకాశం లేదు. ఏమంటారు’’ అడిగింది దేవాన్షి.

‘‘యాయా, ఐ టూ అగ్రీ విత్‌ యు.’’

‘‘ఆ విషయాలన్నీ తెలియాలంటే మన పాదుల గురించి- ఐ మీన్‌... కుటుంబాల గురించి తెలుసుకోవాలి. అంచేత వాటి గురించి మాట్లాడుకుందాం. నేను అమ్మానాన్నలతో కలిసి ఉంటున్నాను. నాకో తమ్ముడు ఉన్నాడు. ఐఐటి చెన్నైలో చదువుతున్నాడు. థర్డ్‌ ఇయర్‌. మా అమ్మ గృహిణి. నాన్న రిటైర్డ్‌ గెజిటెడ్‌ ఆఫీసర్‌. నేను అమ్మానాన్నలకు చెప్పకుండా ఏ పనీ చేయను. మీ ప్రపోజల్‌ గురించీ మన ఈ కలయిక గురించీ కూడా వాళ్ళకి చెప్పాను. అసలందుకనే ఒకరోజు టైమ్‌ తీసుకున్నాను.’’

సాకేత్‌ కలవరపడ్డాడు. ‘‘అప్పుడే మీ ఇంట్లో చెప్పేశారా!’’

‘‘దాపరికం ఎందుకు? మనం పెళ్ళి గురించి మాట్లాడుతున్నాం కానీ వేరే ఏం కాదుగా. అయినా మావాళ్ళు అర్థం చేసుకుంటారులెండి.’’

‘‘అభ్యుదయవాదులు అన్నమాట.’’

‘‘ఏ ట్యాగ్‌ అయినా తగిలించుకోండి. అదీ విషయం. మరి మీ కుటుంబం సంగతి?’’

‘‘నాకు డాడీ లేరు. అయిదారేళ్ళక్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. మమ్మీ ఉంది. నాకు బ్రదర్స్‌గానీ సిస్టర్స్‌గానీ లేరు. ఒక్కడినే. నో బ్యాగేజ్‌..!’’ చిన్నగా నవ్వాడు.

ఆమె నుదురు చిట్లించేసరికి అతడి నవ్వు మధ్యలోనే ఆగిపోయింది. కానీ, అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒంట్లోకి ఉత్సాహం ఉరికి వచ్చింది.

‘‘నేను మా మమ్మీకి చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చేసినా సరైనదే చేస్తానని ఆమె ప్రగాఢ విశ్వాసం’’ మందహాసం చేశాడు సాకేత్‌.

‘‘గుడ్‌. కుటుంబానికి ఆత్మ- అంటే న్యూక్లియస్‌- అంటే కేంద్ర బిందువు- ఎవరనుకుంటున్నారు?’’

‘‘తండ్రి. దురదృష్టవశాత్తూ నాకాయన గైడెన్స్‌ పూర్తిగా దక్కలేదు. నా అన్ని విషయాలూ మా మమ్మీ చూసుకుంది.’’

‘‘గ్రేట్‌. నిజానికి తండ్రి ఇంటి పెద్ద. సంపాదించేవాడు గనుక ఇంటి యజమాని కూడా. ఇప్పుడా పరిస్థితి కాస్త మారుతోందనుకోండీ. కానీ అప్పుడూ ఇప్పుడూ మారనిది ఒకటే- కేంద్ర బిందువు!’’

నుదురు ముడివేసి చూశాడు.

*        *       *

‘‘కుటుంబానికి కేంద్ర బిందువు అమ్మ. ఇంటిల్లిపాదికీ తలలో నాలుకలా, మనిషికి గుండెకాయలా ఉంటుంది. మన శారీరక మానసిక ఆర్థిక సమస్యలన్నిటికీ చక్కని పరిష్కారం ఆమె దగ్గర ఉంటుంది. కుటుంబ శ్రేయస్సుకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న ఏకైక ప్రాణి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పడవకు చుక్కాని లాంటిది. ఆ సంగతి నాకన్నా మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది.’’

‘‘కరెక్ట్‌. మా డాడీ పాత్ర కూడా మమ్మీయే పోషించింది. నన్నింత వాడిని చేసింది.’’

‘‘అందుకే, చెడ్డ పిల్లలు ఉండొచ్చుగానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదన్నారు పెద్దలు. పిల్లలు ఎలాంటి వాళ్ళు అయినా వాళ్ళని అక్కున చేర్చుకుంటుంది. అండగా నిలబడుతుంది. స్నేహితురాలిగా సలహాలిస్తుంది. ఆత్మబంధువుగా సహకరిస్తుంది. సంతానాన్ని ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఎదిగిన పిల్లల్ని చూసి మనసునిండా ఆనందిస్తుంది.’’

చప్పట్లు కొట్టాడు. ‘‘మీరు మా మమ్మీని దృష్టిలో పెట్టుకునే చెప్పినట్టుగా ఉంది.’’

‘‘మీ అమ్మగారు మీతోనే ఉంటున్నారేమో!’’

కంగారుపడ్డాడు. ‘‘లేదు లేదు. నరసాపురంలో మాకు ఇల్లు ఉంది. దాని మంచీ చెడూ చూసుకోవడానికి అక్కడే ఉంటోంది. నేను ఒక్కడినీ ఇక్కడ రూమ్‌ తీసుకుని ఉంటున్నాను.’’

‘‘ఏం? ఇక్కడికి తీసుకొచ్చేస్తే మీకు అండగా ఉండేవారు, మీరు ఆవిడకు తోడుగా ఒక బలంగా ఒక ధైర్యంగా ఉండేవారుగా..!’’

‘‘అహఁ అది మా సొంత ఇల్లు. దాన్ని చూడటానికి అయినవాళ్ళు ఎవరూ అక్కడ లేరు. ఎవరూ శ్రద్ధ చేయకపోతే ఇల్లు పాడైపోతుంది. అందుకని...’’

‘‘అంతేనా లేక కాకి ఎత్తుకుపోతుందనా!’’ నవ్వి అంది... ‘‘అద్దెకివ్వొచ్చుగా. ఇతర ఊళ్ళల్లో ఇళ్ళు ఉన్న వారంతా చేస్తున్నది అదేగా!’’

‘‘పాయింటే. నేనూ అదే చెప్పాను కానీ మమ్మీ వినలేదు. ‘దగ్గరుండి ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టాం, అది ఏ మాత్రం పాడైనా భరించలేను’ అనేసింది.’’

‘‘పోనీ పెళ్ళయ్యాక తీసుకొస్తారా!’’

‘‘మీకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా తీసుకొస్తాను.’’

‘‘అభ్యంతరం ఉంటే తీసుకురారన్నమాట!’’

‘‘ఎస్‌. మీకు అత్త పోరు తెచ్చి పెట్టానని మీరు ఫీలవకూడదు కదా!’’

‘‘రేపెప్పుడో నేను ఫీల్‌ అవ్వకూడదని మీరు ఇవాళే ఫీలవుతున్నారన్నమాట. బావుంది. నా గురించి ఆమెకి చెప్పారా?’’

‘‘ఇంకా లేదు. మీ అభిప్రాయం తెలియకుండా ఎలా చెబుతాను?’’

‘‘నేను మా ఇంట్లో చెప్పానుగా.’’

‘‘మా మమ్మీ, మీవాళ్ళంత ఫార్వర్డ్‌ కాదు. పూర్వకాలపు మనిషి. అందుకే సెలక్షన్‌ అంతా నాకే వదిలి పెట్టేసింది. నేను ఏ బొమ్మని చూపిస్తే ఆ బొమ్మతోనే నా పెళ్ళి జరిపించి అక్షింతలు వేస్తుంది. ఎలాంటి డౌటూ అవసరం లేదు.’’

‘‘అంత నమ్మకం ఉన్నప్పుడు ముందే చెప్పొచ్చుగా!’’

‘‘చెప్పొచ్చుగానీ అవసరం అనిపించలేదు.’’

కళ్ళెత్తి చిత్రంగా చూసి, విచిత్రంగా నవ్వింది దేవాన్షి. ‘‘ఆమె మీ కన్నతల్లి.

*        *       *

మీ కుటుంబానికి కేంద్ర బిందువు. మీరావిడ ఏకైక సంతానం. అయినా ఆవిడకి చెప్పలేదు. ఆమె అభిప్రాయం అడగలేదు. ఇది మీ అతి విశ్వాసమా లేక ఆమె అంటే చులకన భావనా!’’

‘‘ఛ ఛ. మమ్మీ నాకు దేవతతో సమానం.’’

‘‘మరి ఎందుకు మీ అభిప్రాయం ఆవిడతో పంచుకోలేదు? నేను ఇలా అడుగుతానని అనుకోలేదేమో కదా.’’

అవును కాదు అన్నట్టు తలాడించాడు. ‘‘ఆమెకు పెద్దగా నాలెడ్జి లేదు. నా అభిప్రాయాన్ని పూర్తిగా బలపరుస్తుంది. ఈ మాత్రానికి ఇబ్బందిపెట్టడం ఎందుకని...’’

‘‘అర్ధరాత్రి ఆకలేసి ఏడ్చినా, పక్క తడిపినా, పీడకల వచ్చి లేచి ఇల్లు అదిరేలా గుక్కపెట్టి ఏడ్చినా మీ అమ్మగారు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా, ఇబ్బంది అనుకున్నారా!’’

‘‘మీరు మరీ సెంటిమెంటల్‌గా మాట్లాడుతున్నారు. మనకు ఊహ తెలియని టైములో అన్నిటికీ తల్లి మీదే ఆధారపడతాం. నేనే కాదు ఎవరైనా అంతే.’’

‘‘ఇప్పుడు మీరు పెద్దవారయ్యారు కనుక అమ్మ అవసరం లేదంటారు. అక్కడెక్కడో సొంత ఇల్లు ఉంది గనుక ఇప్పుడు అక్కడ ఉంచారు. రేపు ఏ గేటెడ్‌ కమ్యూనిటీలోనో ఫ్లాట్‌ కొనుక్కున్నప్పుడు డబ్బు అవసరమైతే దాన్ని అమ్మేస్తారు. అప్పుడు ఆమెని వృద్ధాశ్రమానికి పంపించేస్తారు. అంతేనా?’’

‘‘నో నో. చచ్చినా అలా చేయను. ఇంకో సంగతి. తనేం నా మీద డిపెండెంట్‌ కాదు. ఫ్యామిలీ పెన్షన్‌ వస్తోంది తెలుసా?’’

‘‘బాగుందయితే. నూటికి తొంభై మంది కొడుకులు అలాగే చేస్తున్నారు గనుక అడిగాను, ఏమీ అనుకోకండి. ఇంకొక్క సంగతి చెప్పండి... మీ అమ్మగారే లోకంగా పెరిగారు గనుక ఆవిడ గురించి మీకు అన్ని విషయాలూ తెలిసే ఉంటాయి. అవునా?’’

‘‘చిత్రంగా మాట్లాడుతున్నారు. మమ్మీ గురించి నాకు తెలియనివి లేనే లేవు. మామధ్య దాపరికాలు ఉండవు. రహస్యాలు లేవు. మమ్మీకి ఆకాశ నీలం, లేత ఆకుపచ్చ రంగుల చీరలు ఇష్టం. బాగా పొంగిన పూరీలు ఇష్టం. బందరు లడ్డూలూ ఇష్టమే. మటన్‌ కర్రీ చాలా చాలా ఇష్టం. ఇప్పటికీ నాగేశ్వరరావు సినిమాలు టీవీలో చూస్తుంటుంది. ఇంకా...’’

‘‘అబ్బో, చాలా తెలుసే. ఆమె అభిరుచులూ ఆకాంక్షలూ కలలూ కోరికలూ ఆశలూ నిరాశలూ... అన్నీ తెలుసన్నమాట.’’

*        *       *

మందహాసం చేశాడు. ‘‘అవన్నీ నా చుట్టూతే తిరుగుతాయి. ప్రత్యేకంగా తెలుసుకోవలసిన అవసరం లేదు. నేను తప్ప ఆవిడకి వేరే లోకం లేదు. నా బాగు తప్ప ఆమెకి ఇంకేమీ అక్కర్లేదు. నేను గొప్పవాణ్ణి అయితే చాలు ఇంకేమీ కోరుకోదు. రోజూ దేవుణ్ణి ప్రార్ధించేది
తన గురించి కాదు, నా గురించే, నేను చల్లగా వర్ధిల్లాలనే!’’

చప్పట్లు కొట్టింది దేవాన్షి ‘‘మీ అమ్మగారు తన జీవితాన్ని మీకు పూర్తిగా అంకితం చేసేశారన్నమాట. తనకంటూ వేరే కలలూ కోరికలూ ప్రత్యేక ఆస్తిత్వమూ లేవంటారు?’’

‘‘యా. డ్యామ్‌ ష్యూర్‌’’

‘‘అంత ఖచ్చితంగా చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా అడిగారా?’’

‘‘అడగకుండానే కొన్ని తెలుస్తాయి.’’

‘‘పొరబడుతున్నారేమో. పోనీ ఇప్పుడు ఫోన్‌ చేసి అడగకూడదూ.’’

ఎంబరాసింగ్‌గా చూశాడు. ‘‘మనం ఒకరిని గురించి మరొకరం తెలుసుకోవడం మానేసి, పక్కదారుల్లో తిరుగుతున్నాం. అవన్నీ ఇప్పుడు అవసరమా?’’

‘‘అవసరమనే నా అభిప్రాయం. చాలామంది పిల్లలు మీలాగే అనుకుంటారు, ఆలోచిస్తారు. అమ్మ మనసు లోతుల్లో ఏ ఆశ ఏ అసంతృప్తి ఏ భావన ఏ కల ఏ కోరిక ఉందో... భర్తే కాదు పిల్లలూ పట్టించుకోరు. మీకు మీ అమ్మగారితో అటాచ్‌మెంట్‌ ఎక్కువ గనుక, మీరు మినహాయింపు అవుతారేమో అనుకున్నాను. కానీ ఘోరంగా పొరబడ్డాను. మీకు మీ స్వార్థమే తప్ప ఆవిడ లోలోపలి విషయాలు అనవసరం, అంతేనా!’’

‘‘మామూలు గృహిణికి కుటుంబంకన్నా, పిల్లల సుఖసంతోషాలకన్నా వేరే కలలూ కోరికలూ ఉండే అవకాశం లేదు.  మా మమ్మీకి అసలే ఉండవు.’’

‘‘ఉండవా ఉండకూడదా!’’

‘‘ఉండవు’’

‘‘ఉన్నాయేమో కనుక్కుంటే?’’

‘‘కనుక్కోవచ్చు. దానికేం భాగ్యం!’’

‘‘భాగ్యమేనని స్వానుభవంతో తెలుసుకున్నాను గనుక. మా అమ్మానాన్నల మనసుల్ని తవ్వి చూశాను గనుక’’ ఆగింది.

ముందుకు వంగి కుతూహలంగా చూశాడు సాకేత్‌.

‘‘అమ్మకు చిన్నప్పటినుంచీ చక్కగా గొంతెత్తి పాడటం ఇష్టం. కమ్మగా పాడేది. కానీ ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించలేదు సరి కదా, కూటికీ గుడ్డకూ రావంటూ నిరుత్సాహపరిచారు. బాత్‌రూమ్‌లో- అదైనా లోగొంతుకతో- తప్ప మరెక్కడా పాడటానికి వీలుండేది కాదు. ఆ సంగతి తెలిసి
నేనేం చేశానో తెలుసా... ఆమె చేత ఆమె నేర్చుకున్న స్త్రీల పాటలన్నీ పాడించి యూట్యూబ్‌లో పెట్టాను. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. మా అమ్మ ఆనందానికి అవధులు లేకపోయాయి.

అతి త్వరలో ఎవరైనా సంగీత దర్శకుడి ఆధ్వర్యంలో అమ్మ చేత జానపద గీతాలు పాడించి రికార్డుగా రిలీజ్‌ చేద్దామనుకుంటున్నాను...’’ ఊపిరి తీసుకోవడానికి అన్నట్టు ఆగిందామె.

ముఖం ముడుచుకుని, నీళ్ళు నములుతూ చూస్తూ ఉండిపోయాడు సాకేత్‌.

*        *       *

‘‘ఇంకోటి కూడా చెప్పాలి. మా నాన్న పుస్తకాల పురుగు. టీవీలో ఇండియా పాకిస్తాన్‌ క్రికెట్‌ వస్తున్నా సరే ఒక పుస్తకం పట్టుకుని బాల్కనీలో కూర్చుని అందులో మునిగిపోతారు. రిటైర్‌ అయ్యాక కథలు రాయమని ప్రోత్సహించానుగానీ ఆయన వినలేదు. ‘పెద్ద పెద్ద వాళ్ళెందరో రాస్తుంటే నా పిచ్చి రాతలు ఎవరు చదువుతారు’ అనేవారు. ఆ మాటల వెనుక అపజయ భయం ఉందనిపించింది.

అందుకే రూటు మార్చి ఆయన ఆత్మకథ రాయమన్నాను. ఆయన బాల్యాన్నీ నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్నీ తర్వాత ఎదురైన ఆటుపోట్లనీ వైవాహిక కుటుంబ జీవితాల్లోని ఒడిదుడుకుల్నీ ఉద్యోగ పర్వంలోని సాధక బాధకాల్నీ భావితరాల కోసం రికార్డు చేయమన్నాను. ఆయనకి ఇంగ్లీషు మీద మంచి కమాండ్‌ ఉండటంతో ఆ భాషలో ఒక నవలలా రాశారు. అది ఒక ఆన్‌లైన్‌ మ్యాగజైన్లో సీరియల్‌గా వచ్చింది. ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు అలవోకగా కథలు రాసేస్తున్నారు.’’

చప్పట్లు కొట్టడానికి చేతులు కలిసి రాకపోయేసరికి, అభినందన పూర్వకంగా చూశాడు సాకేత్‌. ‘‘మీరు మంచి కెటలిస్ట్‌.’’

‘‘అడగందే అమ్మ అయినా పెట్టదు అంటారు. అమ్మ పెట్టడానికి మనం అడగక్కర్లేదు. మనం నోరు తెరవకుండానే మన ఆకలి అమ్మకు తెలిసిపోతుంది. మనం ఆకలితో ఏడుస్తున్నామో అనారోగ్యంతో ఏడుస్తున్నామో అసౌకర్యంగా ఉండి ఏడుస్తున్నామో మన చిన్నప్పుడు పసిగట్టలేదూ! అది అమ్మకు వెన్నతో పెట్టిన విద్య. కానీ అమ్మ అయినా సరే అడగందే తన లోపలి భావాలు మనతో పంచుకోదు. అవి మొలకెత్తకుండానే లోలోపలే కుళ్ళి నశించి పోతాయి. వాటిని వెలికి తీసి ఎదగనివ్వడం, వికసింపజేయడంకన్నా మనం తిరిగి ఆమెపట్ల ప్రకటించే గౌరవం, కృతజ్ఞత ఏముంటాయి?’’

‘‘ఫెంటాస్టిక్‌ ఎనాలసిస్‌. ఈసారి వెళ్ళినప్పుడు మమ్మీని అడిగి తెలుసుకుంటాను.’’

‘‘ఇప్పుడేమైనా దుర్ముహూర్తం ఉందా?’’

‘‘అలా అని కాదు. మీ టైమ్‌... ఐ మీన్‌ మన టైమ్‌ వేస్ట్‌ చేయడం ఎందుకని...’’

‘‘అలా ఎందుకు అనుకుంటున్నారు. ఈ ఎనాలసిస్‌ మీరేమిటో తెలుసుకోడానికేగా!’’

భుజాలు ష్రగ్‌ చేశాడు. ‘‘అది ఇప్పుడే అర్జెంటుగా తెలుసుకోవాలంటారా, అయితే ఫోన్‌ చేస్తాను.’’

‘‘నా సంగతి వదిలేయండి. ఇంతసేపూ నా కంఠ శోష విన్నాక కూడా- మీకు అమ్మ గురించి వెంటనే అడిగి తెలుసుకోవాలని అనిపించలేదా?’’

‘‘దానివల్ల ప్రయోజనం ఏముంటుందనిపిస్తోంది.’’

చటుక్కున లేచి నిలబడి హ్యాండ్‌బ్యాగ్‌ తీసుకుంది దేవాన్షి. అప్రతిభుడై చూశాడు సాకేత్‌.

‘‘సారీ మిస్టర్‌ సాకేత్‌. మీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు. మీరూ మీలాంటివారూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే... కని పెంచింది కాబట్టి తల్లిని ప్రేమించేవాడు కాదు, ఆమె మనస్సు తెలుసుకున్నవాడూ ఆమె అస్తిత్వాన్ని గుర్తించినవాడూ మాత్రమే భార్యను ఆజన్మ స్నేహితురాలిగా భావించగలడు. జీవితాన్ని సంపూర్ణంగా పంచుకోగలడు. అతడే సరైన కొడుకు కాగలడు. సరైన కొడుకు మాత్రమే సరైన భర్త కాగలడు. మీరు నా అంచనాకి చాలా దిగువన ఉన్నారు. గుడ్‌బై.’’

ఆమె విసవిసా వెళ్ళిపోతుంటే తల పట్టుకున్నాడు సాకేత్‌.

*        *       *


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..