అలా వదిలేస్తే మనిషి పుట్టుకకు అర్థం ఏమిటి సార్..

టైమ్‌ చూసుకుని అలసటగా సీట్లోంచి లేచాను. ప్రభుత్వ రంగంలో ఒక పెద్ద బాధ్యతగల పదవిలో ఉన్నాను. రేపు ఉదయం జరిగే సీఎం గారి మీటింగ్‌లో కొన్ని విషయాల గురించి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వాల్సి ఉంది.

Updated : 07 Apr 2024 08:50 IST

- పాగోలు చంద్రిక శేఖర్‌

టైమ్‌ చూసుకుని అలసటగా సీట్లోంచి లేచాను. ప్రభుత్వ రంగంలో ఒక పెద్ద బాధ్యతగల పదవిలో ఉన్నాను. రేపు ఉదయం జరిగే సీఎం గారి మీటింగ్‌లో కొన్ని విషయాల గురించి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వాల్సి ఉంది. ఉదయం నుండీ అదే పనిగా కూర్చుని వివరాలు అన్నీ పెన్‌ డ్రైవ్‌లో కాపీ చేశాను. వాటి తాలూకు ఫైలు నా పీఏ దగ్గర ఉంది. అతను తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని అర్జెంట్‌గా ఊరు వెళ్ళాడు. రేపు ఉదయాన్నే డైరెక్ట్‌గా మీటింగ్‌కి వచ్చేస్తానన్నాడు. అందుకే ఈ రోజు పని మొత్తం నామీదే పడింది. పని హడావుడిలోపడి టైమ్‌ చూసుకోలేదు, 8 గంటలు దాటింది. నా క్యాబిన్‌లోంచి బయటకి వచ్చాను. అందరూ వెళ్ళిపోయారు. ఆఫీస్‌ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. గేటు దగ్గర వాచ్‌మేన్‌ నన్ను చూసి నమస్కారం చేశాడు, తలూపి కారు దగ్గరకి నడిచాను. బాగా మబ్బులు ముసిరి, చల్లగాలి వీస్తోంది.

ఎంతసేపు ప్రయత్నించినా కారు స్టార్ట్‌ అవ్వలేదు. విసుగొచ్చి లాక్‌ చేసి, విషయం వాచ్‌మేన్‌కి చెప్పి గేటు బయటికి నడిచాను. క్యాబ్‌ బుక్‌ చేద్దామని ప్రయత్నిస్తుంటే దగ్గరలో ఏవీ లేనట్లు చూపిస్తోంది. పావుగంట గడిచింది, బాగా అలసటగా అనిపిస్తోంది. ఆటో ఏదన్నా వస్తే ఎక్కాలి కానీ ఒక్క నిమిషం సంశయించాను. నా భార్య శ్రీవల్లి ఏదో పెళ్ళి నిమిత్తం నగలన్నీ మెరుగు పెట్టించడానికి షాప్‌లో ఇచ్చింది. ఆ సేఠ్‌ అవన్నీ ఉదయం తెచ్చి ఆఫీసులో ఇచ్చాడు. అవన్నీ నా ల్యాప్‌టాప్‌ బ్యాగులోనే ఉన్నాయి. ‘ఇంత విలువైన వస్తువులు తీసుకుని ఆటోలో వెళ్ళాలా... వెళ్ళాలి తప్పదు కదా’ అనుకున్నాను.

ఇంతలోనే ఒక ఆటో వచ్చి నా ముందు ఆగింది. అతను తల బైటపెట్టి ‘‘ఆటో కావాలా సార్‌’’ అని అడిగాడు. మాసిన గుడ్డలూ పెరిగిన గడ్డమూ... చూడ్డానికి రౌడీలా అనిపించాడు కానీ గత్యంతరం లేదు. ఇంకా పొద్దుపోతే ఇటువైపు అసలు ఆటోలు రావు. మా ఇంటి ఏరియా చెప్పి ‘‘వస్తావా’’ అని అడిగాను.

‘‘వస్తాను సార్‌, వాన వచ్చేలా ఉంది. ఇక కిరాయిలు ఏమీ ఉండవు అని ఇంటికి పోతున్నాను. మా బస్తీకి కూడా మీ ఏరియా దాటి పైకి పోవాలి. మిమ్మల్ని దింపి నేను ఇంటికి వెళతాను’’ చెప్పాడు అతను. ఆటో ఎక్కి కూర్చోగానే చాలా రిలాక్స్‌డ్‌గా అనిపించింది.

సన్నగా తుంపర కూడా మొదలయ్యింది. చల్లగాలి ఒంటికి తగులుతుంటే చాలా హాయిగా ఉంది. కళ్ళు మూతలు పడుతున్నాయి... కానీ అమ్మో, పడుకుంటే ఇతను ఎటైనా తీసుకుపోతే! బ్యాగ్‌ బరువుగా అనిపించి సీటుకి వెనకవైపు పెట్టాను. నిద్ర రాకుండా ఉండాలి అంటే ఇతనితో మాటలు కలపాలి అనుకున్నాను. ఇక్కడ నా గురించి కూడా కొంత మీకు తెలియాలి. చిన్నతనం నుంచీ నేను చాలా తెలివిగలవాడిననీ అందరికన్నా ప్రత్యేకమైన వ్యక్తిననీ నా అభిప్రాయం. ఆ ధీమా నాకు ఇచ్చింది కూడా నా చదువే. ఎప్పుడూ చదువులో నాకు మొదటి ర్యాంకే వచ్చేది. ఇదే పరంపర పీజీ వరకూ కొనసాగింది.

నా ర్యాంకులూ మార్కులూ చూసి ఊరివాళ్ళూ బంధువులూ అంతా పొగిడితే... నాన్నా, అన్నయ్యా పొంగిపోయేవారు. అమ్మ చిన్నతనంలోనే దూరమయ్యింది మరి. అయితే, మాకు ఉన్న ఆస్తి నాలుగెకరాల పొలం, ఒక పెంకుటిల్లు మాత్రమే. ఇద్దరినీ చదివించలేనని నాన్న నిస్సహాయత వ్యక్తం చేశాడు. చదువు అంటే పెద్దగా ఆసక్తి లేని అన్నయ్య నన్ను చదివించమని చెప్పి తాను నాన్నకి పొలం పనుల్లో సహాయం చేస్తూ పల్లెలో స్థిరపడిపోయాడు. నేను సిటీకి వచ్చి హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకి కోచింగ్‌ తీసుకుని రాత్రింబవళ్ళూ కష్టపడి చదివి, ఉద్యోగం సంపాదించాను.

అక్కడి నుండి అంచెలంచెలుగా మంచి స్థాయికి చేరాను. ప్రతి పనికీ ఒక రేటు ఉంది నాకు. ఆ రేటు ప్రకారం ఇస్తేనే ఆ పని జరిగేది. డబ్బు దగ్గర చాలా కఠినంగా ఉంటానని పేరు ఉంది నాకు. ఎంత పేదవారు అయినా నా దగ్గర పని జరగాలంటే ఆ డబ్బు చెల్లించాల్సిందే. లంచాలు తీసుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడను. ఇంత కష్టపడి- మా నాన్న ఎకరం పొలం కూడా అమ్మి- చదివిస్తే అలా సంపాదించుకోవడం నా హక్కు అనుకునేవాడిని. నా సహోద్యోగులు కొందరు నన్ను చూసి అసూయపడతారనీ లంచాలు ఇచ్చేవారు నన్ను తిట్టుకుంటూ ఇస్తారనీ నాకు తెలుసు. అయినా నేను అవేమీ పట్టించుకోలేదు. ఇవన్నీ చూచాయగా తెలిసి నాన్న కూడా నన్ను ఒకసారి హెచ్చరించారు. తలూపి ఊరుకున్నాను అంతే! ఆత్మీయులూ బంధువులతో కూడా కలిసేవాడిని కాను. ఎందుకంటే- వారంతా నా హోదా డబ్బూ చూసి నాకు దగ్గరవ్వాలి అనుకుంటున్నారు- అని నా నమ్మకం. ఎవరు ఏ శుభకార్యాలకి పిలిచినా వెళ్ళేవాడిని కాను. మా అన్నయ్యకి సైతం ఎప్పుడూ ఫోన్‌ చెయ్యను, తనంత తాను చేస్తే ఏవో రెండు పొడిమాటలు అంతే!
నాన్న పదేళ్ళక్రితమే కాలం చేశారు. అన్నయ్య ఆ ఊరిలోని అమ్మాయినే పెళ్ళి చేసుకుని ఇద్దరు ఆడపిల్లలూ ఒక మగ పిల్లవాడికి తండ్రి అయ్యాడు. పొలం మీద వచ్చే ఆదాయమే అన్నయ్యకి ఆధారం.

ఆ మూడెకరాలలోనూ ఇద్దరికీ సగం సగం అన్నారు నాన్న. ఆ ప్రకారంగానే పంట డబ్బులు పంపేవాడు అన్నయ్య. నేను కూడా నా హక్కుగా తీసుకునేవాడిని.

‘నా వాటానేగా నేను తీసుకుంటున్నాను... ఇంకా ఇంటిలో వాటా అడగలేదు, అది పూర్తిగా వాళ్ళకే వదిలేశాను కదా... అది నా ఉదారత’- అనిపించేది నాకు. కోచింగ్‌ సెంటర్‌లో పరిచయం అయ్యింది శ్రీవల్లి. ఆమె వ్యక్తిత్వమూ అందమూ చూసి ప్రేమించాను. అనాథ అని తెలిసీ ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాను. కానీ ఎవరూ లేక అనాథాశ్రమంలో పెరిగిన ఆమెకి బంధువులు అంటే చాలా మక్కువ. అందరినీ కలుపుకోవాలనీ అందరితో కలిసిపోవాలనీ చాలా ఆరాటపడేది. పెళ్ళి అయిన కొత్తలో నేను గట్టిగా హెచ్చరించడంతో ఆమె కూడా అందరికీ దూరంగానే ఉండిపోయింది. అన్నయ్యా, వదినలతో మాత్రం తరచూ కాల్‌ చేసి మాట్లాడేది. నేను అంతగా పట్టించుకోలేదు. నిన్ననే శ్రీవల్లి చెప్పింది- అన్నయ్య ఫోన్‌ చేశాడని. పెద్దపిల్లకి మంచి సంబంధం వచ్చిందనీ కట్న కానుకలు ఎక్కువ అడుగుతున్నారని వెనకాడుతున్నామనీ చెప్పాడట వల్లీతో. నేను మౌనంగా విని ఊరుకున్నాను. కానీ, ఏ స్పందనా లేని నన్ను చూసిన శ్రీవల్లి ముఖంలోని భావం నాకు పదేపదే గుర్తు వచ్చింది. ఆటో వేగంగా వెళ్తోంది. ‘‘నీ పేరేమిటోయ్‌’’ పలుకరించాను.

‘‘దాసు సార్‌’’ వినయంగా చెప్పాడు అతను.

‘‘ఎక్కడ ఉంటావు?’’

ఏదో బస్తీ పేరు చెప్పాడతను. ఊరి చివర ఉండే చాలా పెద్ద బస్తీ అది.

‘‘ఎందరు పిల్లలు?’’ అడిగాను.

‘‘నలుగురు పిల్లలు సార్‌’’ చెప్పాడతను.

‘‘నలుగురా... అన్నానని కాదుగానీ నీకొచ్చే సంపాదనతో వీళ్ళని పోషించగలవా?’’ అతిశయంగా అడిగాను.

‘‘వాళ్ళే కాదు సార్‌, మా ఇంట్లో మొత్తం పదిమందిమి ఉంటాం’’ దాసు చెప్పాడు.

‘‘పదిమందా?’’ విస్మయంగా అడిగాను.

‘‘అవును సార్‌, నేనూ నా భార్యా నా ఇద్దరు పిల్లలూ, అన్నయ్యా వదినా వాళ్ళ ఇద్దరు పిల్లలూ, మా అమ్మా నాన్నా- అందరం కలిసే ఉంటాము’’ చెప్పాడు దాసు.

‘‘వీళ్ళంతా నీతోనే ఉంటారా’’ ఆశ్చర్యంగా అడిగాను.

‘‘అవును సార్‌, అందరూ నా మీదే ఆధారపడ్డారు’’ అన్నాడు దాసు.

‘నాన్సెన్స్‌’ మనసులోనే అనుకున్నాను.

‘‘మా అమ్మా నాన్నా పెద్దవాళ్ళు సార్‌, ఏమీ చెయ్యలేరు. అన్నయ్య ఇదివరకు లారీ మీద వెళ్ళేవాడు. యాక్సిడెంట్‌లో కాలు పోగొట్టుకుని ఇప్పుడు ఇంటిముందే చిన్న బడ్డీకొట్టు పెట్టుకున్నాడు. అన్నయ్య సంపాదించినప్పుడు వారు బాగానే ఉండేవారు వేరేచోట. అన్నయ్యకి కాలు పోయాక వారిని కూడా తెచ్చి నా దగ్గరే పెట్టుకున్నాను. పిల్లలు నలుగురూ గవర్నమెంట్‌ స్కూల్లో చదువుతున్నారు. మా వదినా నా భార్యా ఇంట్లో మిషను కుడతారు, ఏదో అలా జరిగిపోతోంది’’ చెప్పాడు దాసు.

‘‘అమ్మా నాన్నా సరే, అన్నయ్యా వదినా ఏదో పని చేసుకుని బతుకుతారు కదా.

ఈ రోజుల్లో ఎవరి కుటుంబాన్ని వారే పోషించడం కష్టం, అలాంటిది ఇంతమంది బాధ్యత అంటే మాటలా? నీ పిల్లల గురించి ఆలోచించావా?’’ విసుగ్గా అన్నాను.

‘‘తోడబుట్టిన వాడిని కష్టంలో ఎలా వదిలేస్తాం సార్‌. కొంచెం ఇబ్బందిగానే ఉన్నా అందరం సంతోషంగానే ఉన్నాం. నా పిల్లలతోపాటే నా అన్న పిల్లలూ. తోడబుట్టిన వాడిని అలా వాడి ఖర్మానికి వదిలేస్తే ఇక మనిషి పుట్టుకకు అర్థం ఏమిటి సార్‌’’ అన్నాడు దాసు.

ఎవరో చెంప మీద ఛెళ్ళున చరచినట్లు అనిపించింది. ‘ఛీ, ఏంటీ ఈ మనుషులు... అన్నీ పనికిమాలిన థియరీలు చెప్తున్నాడు. ఇవన్నీ వాట్సాప్‌లో గుడ్‌ మార్నింగ్‌లకీ కొటేషన్లు పెట్టుకోవడానికీ తప్ప, ఇక దేనికీ పనికిరావు. మా అన్నయ్య కూడా ఇంతే, మగపిల్లాడి కోసం ఇద్దరు ఆడపిల్లల్ని కని, ఇప్పుడు పెళ్ళి చెయ్యలేక తిప్పలు పడుతున్నాడు. నేను చాలా ప్లాన్డ్‌గా ఒక అమ్మాయినే కని, తనకి డిగ్రీ అవుతూనే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసి అమెరికా పంపేశాను. ఇంత సెంటిమెంటల్‌గా ఎలా ఉంటారో ఈ జనాలు... షిట్‌’ చిరాగ్గా మనసులోనే అనుకున్నాను. మా ఏరియాకి రాగానే నేను చెప్తుంటే ఆ గుర్తుల ప్రకారం ఇల్లు చేర్చాడు దాసు. ఆటో దిగి, డబ్బులు ఇచ్చి వెళ్తుంటే ‘‘ఉంటాను సార్‌, నమస్తే’’ అని వెళ్ళిపోయాడు దాసు.

లోపలికి వచ్చి అలసటగా సోఫాలో కూలబడ్డాను. లోపల మాత్రం ఏదో అంతర్మథనం... దాసు మాట్లాడినవి ఏవీ కూడా నాకు మింగుడు పడటం లేదు. బైట వర్షం బాగా పెరిగింది. ఈదురు గాలులతో వాతావరణం భయానకంగా ఉంది. అలికిడికి లోపలున్న శ్రీవల్లి వచ్చింది. ‘‘వచ్చారా, ఈ వానలో ఎలా వస్తారో అనుకుంటున్నా. ఫ్రెష్‌ అయ్యి రండి, డిన్నర్‌ చేద్దాం. అవునూ నగలు మీకు అప్పచెప్పాను అన్నాడు సేఠ్‌ కాల్‌ చేస్తే. ఆ బ్యాగ్‌ ఇటు ఇవ్వండి, లోపల పెడతా’’ చెప్పింది శ్రీవల్లి.

అప్పుడు స్పృహలోకి వచ్చి పక్కన చూశాను. బ్యాగ్‌... అవునూ నా బ్యాగ్‌ ఏదీ... ఏదో ఆలోచనలో పడి సీటు వెనక పెట్టిన బ్యాగ్‌ని తీసుకోవడం మర్చిపోయాను. ఎంత పని జరిగింది, అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు దాసు. కచ్చితంగా ఆ బ్యాగ్‌ తీసేసి ఉంటాడు. అంత సొమ్ము ఎవరైనా వదులుతారా- అసలు ఈలోపు ఇంకెవరన్నా ఎక్కి ఉంటే!? ఇదంతా ఒకెత్తు అయితే రేపు సీఎం మీటింగ్‌లో ఇవ్వాల్సిన ప్రజంటేషన్‌ వివరాలు మొత్తం కాపీ చేసిన పెన్‌ డ్రైవ్‌ కూడా అందులోనే ఉంది. వృత్తిపరంగా నాకు ఇది చాలా ఇబ్బందే. కచ్చితంగా పైఅధికారులకు నేను సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అవసరమైతే నాకు మెమో కూడా ఇస్తారు. చాలా సమస్యలు వస్తాయి. కాసేపు మైండ్‌ అంతా బ్లాంక్‌ అయిపోయింది.

‘‘బ్యాగ్‌ ఏదండీ, కారులో ఉందా..?’’ అడుగుతోంది శ్రీవల్లి. విషయమంతా తనకి చెప్పాను. తను కూడా చాలా దిగాలుపడింది. ‘ఓలా’లో బుక్‌ చేసుంటే కనీసం అతని నంబర్‌ అయినా దొరికేది... ఇప్పుడు ఆ అవకాశమూ లేదు. అరగంటకి నా బుర్ర కాస్త పని చెయ్యడం మొదలుపెట్టింది. నాకు తెలిసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌కి కాల్‌ చేశాను. విషయం వివరంగా చెప్పాను.

అంతా విని అతను ‘‘సార్‌, ఆ డ్రైవర్‌ పేరూ ఆ బస్తీ పేరూ తెలిస్తే చాలదు సార్‌, అది చాలా పెద్ద బస్తీ. ఈ రాత్రిలో, ఇంత గాలీవానలో అక్కడుండే ఆటో డ్రైవర్స్‌ని గేదర్‌ చెయ్యడం కష్టం. ఏదయినా రేపు ఉదయమే. ఆ ఏరియా ఊరికి 20 కిలో మీటర్ల దూరంలో ఉంది. నేను ఆ ఏరియా స్టేషన్‌కి ఇన్ఫామ్‌ చేస్తాను. అతను ఇప్పటికే అవి చూసుకుని ఎస్కేప్‌ అయితే మాత్రం కష్టమే’’ చెప్పాడతను. ఫోన్‌ పెట్టేసి నిస్సత్తువగా సోఫాలో కూర్చున్నాను. శ్రీవల్లి కూడా నా పక్కనే, నా చెయ్యి పట్టుకుని కూర్చుంది.

‘నీకు వచ్చేదాంతోనే సంతృప్తిగా గడుపు, అక్రమంగా వచ్చేదాని కోసం ఆశపడకు. పరాయి సొమ్ము పాము వంటిదిరా శివా’ నాన్న గొంతు వినపడుతోంది.

‘ఒరేయ్‌ శివరామ్‌, ఈ ముగ్గురు పిల్లలనూ ఒక దారి చెయ్యాలిరా’ ఆశగా నన్ను అర్థించిన అన్నయ్య మాటలు చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి.

నేను డబ్బు సంపాదనలోపడి నా వాళ్ళని నిర్లక్ష్యం చేశానా... అదే నాకు శాపంగా మారిందా? ఆఖరి రోజుల్లో నాన్నని పట్టించుకోలేదు. ‘అన్నయ్య ముగ్గురు పిల్లలతో ఎలా నెట్టుకొస్తున్నాడో’ అని ఏ రోజూ నేను ఆలోచించలేదు. ఈరోజు నాకు కష్టం రాగానే అహం తగ్గి, అయినవాళ్ళు అందరూ గుర్తుకు వస్తున్నారా. మెదడంతా మొద్దుబారిపోయింది. అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు. కాలింగ్‌ బెల్‌ మోగింది, రాత్రి 11 గంటలు దాటింది.

‘ఈ సమయంలో ఎవరు’ అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను. వరండాలోని లైటు వెలుగులో తడిసి ముద్దయి నిల్చుని ఉన్నాడు దాసు.

‘‘నమస్తే సార్‌, మీ బ్యాగ్‌ ఆటోలో మర్చిపోయారు. నేను ఇంటికి వెళ్ళి ఆటో పార్క్‌ చేస్తూ చూశాను. ‘అందులో విలువైనవి ఏమన్నా ఉంటే మీరు కంగారుపడతారు కదా’ అని మళ్ళీ వెంటనే వచ్చేశా’’ అని పాత టవల్‌లో భద్రంగా చుట్టిన బ్యాగ్‌ని నాకు అందించాడు. నేను నమ్మలేనట్లు చూశాను. ఇది నాకు ఇంకో దెబ్బ. ఏమీలేని దాసు కూడా అందిన వాటికి ఆశపడలేదా, మరి అన్నీ ఉన్న నేనెందుకు అక్రమంగా వచ్చేదానికి కక్కుర్తి పడుతున్నాను. దాసు ముందు నాకు నేనే ఒక పిపీలికంలాగా కనిపిస్తున్నాను.

శ్రీవల్లి ముందుకు వచ్చి ‘‘చాలా సంతోషం బాబూ, ఈ బ్యాగ్‌ వేరెవరి చేతికి అన్నా చిక్కితే మా సొమ్ము మాకు దక్కేది కాదు. నువ్వు చాలా మంచివాడివి’’ అని చేతులు జోడించింది.

‘‘అయ్యో, అంత మాట అనకండి అమ్మా. మనం కష్టపడి సంపాదించిందే మనకు శాశ్వతం. పరాయి సొమ్ముకి ఎప్పుడూ ఆశపడకూడదు, వెళ్ళొస్తాను అమ్మా. అన్నీ ఉన్నాయో లేదా చెక్‌ చేసుకోండి సార్‌’’ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు దాసు.

లోపలికి వచ్చి బ్యాగ్‌ తీసి చూసుకున్నాను. అన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇద్దరం ఏదో తిన్నామనిపించి పడుకున్నాం. శ్రీవల్లి నిశ్చింతగా నిద్రపోయింది. నాకు మాత్రం నిద్ర పట్టలేదు. దాసుకన్నా నేను ఏ విధంగా ఎక్కువ... నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. నా దగ్గర డబ్బు మాత్రమే ఉంది, దాసు దగ్గర అది తప్ప అన్నీ ఉన్నాయి. అయిన వాళ్ళతో సంతోషంగా కలిసున్న అతనెక్కడా, అహంతో అందరికీ దూరంగా ఉండే నేనెక్కడా! ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపట్టింది నాకు.

*    *   *

ఉదయమే లేచి అన్నయ్యకు కాల్‌ చేశాను. నా గొంతు వింటూనే అన్నయ్య ఆశ్చర్యపోయాడు. నాకు నేనుగా ఎప్పుడూ చేసి మాట్లాడనుగా మరి!

‘‘ఏరా శివా, అంతా బాగానే ఉంది కదా, ఏమిటీ... ఇంత ఉదయాన్నే ఫోన్‌ చేశావు’’ అడిగాడు అన్నయ్య కంగారుగా.

పక్కనే ఉన్న శ్రీవల్లి నావైపు ప్రశ్నార్థకంగా చూస్తోంది, ఆమె ముఖంలో ఆశ్చర్యం కూడా కనిపిస్తోంది.

‘‘అంతా బాగుంది అన్నయ్యా, వదినా పిల్లలూ ఎలా ఉన్నారు? మరి పెద్దదానికి ఏదో సంబంధం వచ్చిందని చెప్పావట. మంచి సంబంధం అయితే డబ్బుకి ఆలోచించకు అన్నయ్యా, ఖాయం చేసి ముహూర్తం పెట్టించేయి. కట్నం డబ్బు మొత్తం నేనే ఇస్తాను, మన ఊళ్ళోనే పెళ్ళి బాగా చేద్దాం, పెళ్ళి ఖర్చు కూడా నాదే, సరేనా. నేను కూడా వీలు చూసుకుని ఒకసారి ఊరికి వస్తా, ఉంటాను’’ అని చెప్పేసి కాల్‌ కట్‌ చేశాను.

అటుపక్క ఈ మాటలు విని అన్నయ్య కుటుంబం ఎంత ఆనందపడతారో తెలిసిన నాకు సంతృప్తి గుండెలనిండా నిండిపోయింది. ఇది నాకు మునుపెన్నడూ ఎరుగని స్థితి. శ్రీవల్లి కూడా నావైపు అలానే అబ్బురంగా చూస్తోంది. ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో నేను ఎప్పుడూ చూడని భావం ఇప్పుడు ఆమె కళ్ళల్లో నాకు కనిపిస్తోంది.

నెల తర్వాత మా ఊరిలో, మా ఇంటి ముందున్న కొబ్బరాకుల పందిరిలో అన్నయ్య కూతురి పెళ్ళి జరుగుతోంది. అన్నయ్యా వదినా పీటల మీద కూర్చుని ఉంటే- నేనూ శ్రీవల్లీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నేను చూపించే ఆప్యాయతకి మా వాళ్ళందరూ పొంగిపోతున్నారు.

అనుబంధాల విలువ తెలుసుకున్న నా రక్తం కొత్త ఉరకలు వేస్తోంది. అన్నయ్య మిగిలిన ఇద్దరు పిల్లల్నీ సిటీలో ఉంచి చదివించే బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. వారు నన్ను దేవుడిలా చూస్తున్నారు. ఇక శ్రీవల్లి అయితే చెప్పక్కర్లేదు, ఆమె కళ్ళల్లో నాపట్ల కనిపిస్తున్న ప్రేమా ఆరాధనా ఎన్ని కోట్లు సంపాదించినా నాకు దొరకలేదు.

అహానికి అవతల ఒక అడుగు వేసి చూస్తే ఇంత సంతృప్తి దొరుకుతుందా..? ముహూర్తం సమయం కావడంతో మంగళవాయిద్యాలు జోరుగా మోగుతున్నాయి- పందిట్లోనే కాదు, నా మదిలో కూడా!

అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించడానికి శ్రీవల్లి చెయ్యి పట్టుకుని పందిట్లోకి నడిచాను శివరామ్‌ అనబడే నేను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..