లింకు పైన నొక్కకు!

‘‘అబ్బ మీ ఇంటికి వస్తే హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మా’’ వస్తూనే దీవాన్‌ మీద వాలిపోయి అంది మోహన. వెనకే వచ్చిన వాళ్ళ ఆయన వెంకట్‌ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు.

Updated : 28 Apr 2024 00:14 IST

 సింగరాజు రమాదేవి

‘‘అబ్బ మీ ఇంటికి వస్తే హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మా’’ వస్తూనే దీవాన్‌ మీద వాలిపోయి అంది మోహన. వెనకే వచ్చిన వాళ్ళ ఆయన వెంకట్‌ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. 

‘‘ఏంటి వెంకట్‌, ఆఫీస్‌ విశేషాలు?’’

అని పలకరిస్తూ ‘‘కాఫీనా, టీనా...

ఏం తాగుతారు?’’ అడిగాను.

‘‘కాఫీ’’ అన్నాడు వెంకట్‌.

‘‘నాకు టీ’’ ఠక్కున అంది మోహన.

మళ్ళీ, ‘‘నువ్వు కూర్చో పెద్దమ్మా, నేను కలుపుతా’’ అంది.

‘‘ఏం పర్లేదు, కాఫీ కలపటం ఎంతసేపు’’ అంటూ వంటింట్లోకి నడిచాను.

నా వెనకే వచ్చిన మోహన ‘‘అబ్బ,

నీ వంటింటి గట్టు ఎప్పుడూ ఇంత శుభ్రంగా ఎలా ఉంటుంది?’’ అంది.

ప్రతిగా చిరునవ్వు నవ్వుతూ... ఒక బర్నర్‌ మీద టీ కోసం పాలూ నీళ్ళూ పెట్టి ఇంకొక దానిమీద చిన్న గిన్నెలో వేడిపాలలో డికాక్షన్‌, పంచదార వేసి, వేడి కావటానికి పెట్టాను. ‘‘ఈ గాస్‌ పొయ్యి నా చిన్నప్పుడు ఉన్నదే కదా’’ అంది మోనా.

‘‘ఊ... అప్పటిదే’’ అంటూ ‘‘ఆ గూట్లో కప్పులు ఉన్నాయి తియ్యమ్మా’’ చెప్పాను.

అద్దాల షెల్ఫ్‌లో ట్రేలో పెట్టి ఉన్న కప్పులు తీస్తూ... ‘‘షెల్ఫ్‌ కూడా ఎంత నీటుగా సర్దావో’’ అంది.

‘‘ఏమిటే ...ఇవాళ మా ఇంటికి కొత్తగా వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎప్పటిలాగే ఉందిగా’’ అన్నాను.

‘‘ఏమో పెద్దమ్మా, ఇదివరకు అంత పట్టించుకోలేదు అనుకుంటా’’ అంది.

‘‘సర్లే, రెండు చిన్న ప్లేట్స్‌ తియ్యి’’ అని డబ్బాలో ఉన్న కారప్పూస తీసి, వాటిలో పెట్టి

‘‘ఇది టేబుల్‌ మీద పెట్టు. నేను కాఫీ తీసుకుని వస్తాను’’ అన్నాను. నాకూ మోహనకి టీ, వెంకట్‌కి కాఫీ కప్పుల్లో పోసి, ‘‘ఇటు డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుందాం రండి’’ అని పిల్చాను.

వెంకట్‌ వచ్చి డైనింగ్‌ ఛెయిర్‌ లాక్కుని కూర్చుంటూ ‘‘ఓ... టేబుల్‌ ఖాళీగా ఉందే’’ అన్నాడు. మోహన అతని వంక ఒక్క చూపు చూసింది. ‘‘అదే మా టేబుల్‌ అయితే ఏవేవో గిన్నెలూ సీసాలూ డబ్బాలతో నిండిపోయి ఉంటుంది. అది ఖాళీ చెయ్యలేక మేమక్కడ కూర్చోవటమే మానేశాం’’ అన్నాడు. కాఫీ తాగుతూ హాల్‌ వైపు చూసి ‘‘అలాంటి కేన్‌ సెట్‌ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది’’ అన్నాడు- మా హాల్లో వేసి ఉన్న కేన్‌ సోఫా సెట్‌ని చూస్తూ.

‘‘అదా... ఒక ముప్ఫై ఏళ్ళు అయి ఉంటుంది కొని. బాగానే ఉంది కదా అని మార్చలేదు, మధ్య మధ్యలో పాలిష్‌ చేయిస్తూ ఉంటాం అంతే’’ అంటూ,

‘‘మా ఇంట్లో అన్నీ పురాతనమైనవే ఉంటాయి’’ నవ్వుతూ అన్నాను.

బహుశా టాపిక్‌ మార్చటానికి అనుకుంటా, ‘‘కారప్పూస బాగుంది పెద్దమ్మా’’

అంది మోహన.

‘‘కాఫీ కూడా బాగుంది అత్తయ్యా. ఫిల్టర్‌ కాఫీ కదా... మా ఇంట్లో ఇలా ఉండదు’’ అన్నాడు వెంకట్‌.

మళ్ళీ వెంకట్‌ వంక ఒక చూపు చూసి... ‘‘నాకు ఫిల్టర్‌ వెయ్యటానికి బద్ధకం వేసి,

ఇన్‌స్టెంట్‌ కాఫీ కలుపుతాను పెద్దమ్మా... అదీ ఆయన గారి కంప్లైంట్‌’’ బుంగమూతి పెట్టి అంది మోహన. నేనూ, వెంకట్‌ ఇద్దరం నవ్వేశాం.

మొత్తానికి వాళ్ల మాటల్లో ఏదో అసంతృప్తి కనపడింది నాకు. ఇటువైపు ఏదో పని ఉండి వచ్చారట వాళ్ళు. ‘పెదనాన్న వచ్చే టైమ్‌ అయింది ఉండండి’ అంటే, ‘పాపాయి స్కూల్‌ నుంచి వచ్చేస్తుంది’ అని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను కాసేపు.

రాత్రి చెల్లెలు సుధ ఫోన్‌ చేసి, ‘‘మోహనా వాళ్ళు వచ్చారట కదా’’ అంది.

‘‘అవును, ఇటువైపు ఏదో పని ఉందన్నారు’’ అన్నాను.

‘‘ఆఁ అదే, ఏదో విల్లాలు కట్టి అమ్ముతున్నారంటే, చూద్దామని వచ్చారట’’ అంది.

‘‘అవునా, మొన్నే కదా కొత్త ఫ్లాట్‌ కొన్నది’’ అన్నాను.

‘‘రెండేళ్ళు అయిందిలే... ఏమిటో వాళ్ళ ప్లాన్‌. టాక్స్‌ ఎక్కువ పడుతోంది... అని ఏదో అంటున్నారు. ఉన్న ఇల్లు సరిపోవట్లేదు అట.’’

‘‘సరిపోవట్లేదా? టూ బెడ్‌రూమే కదా... పెద్దదే కదా...’’ అని ఇంకేమనాలో తెలీక ఆగిపోయాను.

‘‘నేనూ అదే అన్నాను. ఊరికెనే చూస్తున్నాం అంటారు. ఏమిటో వాళ్ళ గోల... పోన్లే’’ అని ఇంకా వేరే విషయాలు ఏవో మాట్లాడి పెట్టేసింది సుధ.

రాత్రి ఆయన వచ్చాక ఆ కబుర్లే చెప్పాను. ‘‘ఏమిటీ, మన వెంకట్‌ బాగా సంపాదిస్తున్నట్టు ఉంది’’ అంటూ హాస్యమాడారు ఆయన.

ఆ తర్వాత వారం రోజులకి అనుకుంటా ‘చిన్నదానికి జ్వరం అట’ అని సుధ

మనవరాలిని చూడటానికి వెళుతుంటే నేనూ వెళ్ళాను. మేము వెళ్ళి బెల్‌ కొడితే వచ్చి తలుపు తీసింది మోహన, వెనకే చిక్కి పోయిన ముఖంతో చిన్నది సుహానా.

‘‘అమ్మమ్మా!’’ సుధని చూడగానే దాని దగ్గరికి దూకింది సుహా.

‘‘రా పెద్దమ్మా’’ అంటూ లోపలికి తీసుకు వెళ్ళింది మోహన. హాల్లో ఉన్న పెద్ద సోఫా సెట్లో పడి ఉన్న న్యూస్‌పేపర్లూ సుహా బొమ్మలూ కాస్త పక్కకి తోసి ‘‘కూర్చోండి అమ్మా, వస్తున్నా’’ అని లోపలికి వెళ్ళింది.

హాలంతా ఒకసారి కలియచూశాను. గృహ ప్రవేశానికి వచ్చినప్పుడు విశాలంగా పెద్దగా ఉన్న గుర్తు. ఇప్పుడు ఏమిటో ఇరుకుగా, కొంత చిందరవందరగా అనిపిస్తోంది.

సుధ పాపాయిని చూస్తూ ‘‘రెండు రోజుల జ్వరానికే ముఖం అంతా పీక్కుపోయింది’’ అంటూ బాధపడిపోయింది.

మోహన లోపలి నుంచి దానికి పెరుగన్నం కలిపి తెచ్చింది. ‘‘ఏమీ తినట్లేదు. కాస్త ఇదైనా తింటుందేమో చూడాలి’’ అంటూ, ‘‘దాని ఫీడింగ్‌ ఛెయిర్‌ తెస్తా ఆగు’’ అని వెళ్ళబోతుంటే, ‘‘ఏమక్కర లేదు, నేను తినిపిస్తాలే’’ అని సుధ సుహాని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెపుతూ తినిపించసాగింది.

‘‘పెద్దమ్మమ్మా... నా కోసం ఏం తెచ్చావు?’’ తింటూనే అడిగింది చిన్నది. దానికి నేను చేసి పంపించే పల్లీ పాకం, సున్నుండలు లాంటివి బాగా ఇష్టం.

‘‘సారీరా తల్లీ, ఈసారి చెయ్యలేదు.

మళ్ళీ చేసినప్పుడు పంపిస్తా’’ అంటూ దాన్ని బుజ్జగించాను.

‘‘మా ఇల్లు చూసి దడుచుకున్నావా పెద్దమ్మా?’’ అడిగింది మోహన.

‘‘అబ్బే చిన్న పిల్లతో ఎంతకని సర్దుకుంటావు. అలాగే ఉంటుందిలే!’’ అన్నాను.

‘‘మొన్న మీ ఇంటి నుంచి వచ్చాక వెంకట్‌ కూడా మీ ఇల్లు ఎంత పొందికగా, విశాలంగా అనిపించిందో అన్నాడు. మన ఇల్లు కూడా అలా పెట్టచ్చు కదా అన్నాడు’’ చెప్పింది. నవ్వుతూ అన్నా కూడా మోహన ముఖంలో కాస్త దిగులు ఏదో కనిపించింది.

సుధ అందుకుని ‘‘ఆ... అబ్బాయికి కాస్త శుభ్రత ఎక్కువ. అన్నీ ఎక్కడివక్కడ ఉండాలి అంటాడు- హోటల్‌ రూమ్‌లాగా. ఇల్లు అలా ఎలా ఉంటుంది? చిన్నపిల్ల ఉన్న ఇల్లు, పైగా దానికి ఉద్యోగమూ, తీరుబడి ఎక్కడా? ఏదో సర్దుకుపోవాలి కానీ’’ అంది.

మోనా వాళ్ళు ఆ ఫ్లాట్‌కి వచ్చి రెండేళ్ళు అవుతోంది. అంతకుముందు అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. నాకు బాగా గుర్తు. పాప మొదటి పుట్టినరోజూ గృహప్రవేశమూ రెండు ఫంక్షన్లూ కలిపి చేశారు. చిన్న వయసులోనే ఇల్లు సమకూర్చుకున్నందుకు మోనా వాళ్ళను మేమంతా అభినందించాం.

అవన్నీ గుర్తు చేసుకుంటుంటే, మోనా చెప్పింది- ‘‘మొన్న మీ ఇంటివైపు వచ్చాం కదా... అక్కడ ఏవో విల్లాలు కడుతున్నారు అంటే చూడటానికి వచ్చాం’’ అని.

ఆ విషయం సుధ ముందే చెప్పింది కనుక ‘ఉహూఁ’ అని ఊరుకున్నాను. ‘‘250 గజాల్లో డ్యూప్లెక్స్‌ ఇల్లు అట. ముందు లాన్‌,

సిట్‌ అవుట్‌ ఉంటాయి. గేటెడ్‌ కమ్యూనిటీ... లోపలే ఒక సూపర్‌ బజార్‌, చిన్నపాటి ఫంక్షన్లు చేసుకునేందుకు హాల్‌, జిమ్‌, స్విమ్మింగ్‌పూల్‌ ఇలా... అన్ని అధునాతన సౌకర్యాలూ ఉంటాయట.’’

అన్ని వివరాలు చెప్తున్నా... మోనా గొంతులో పెద్ద ఉత్సాహం లేకపోవటం గమనించాను. ‘‘ఈ ఇల్లు కొత్తదే కదా... మళ్ళీ ఇంకొకటి తీసుకోవటం...’’ అని అర్ధోక్తిగా ఆపేశాను.

‘‘నాకు పెద్ద ఇంట్రస్ట్‌ లేదు పెద్దమ్మా, తనకే ఈ ఇల్లు నీట్‌గా ఉండట్లేదనీ ఎవరైనా వస్తే సరిపోదనీ ఏదో అంటాడు. ఆ కొత్త విల్లా పెద్దది అయినా చాలా దూరం, పాప స్కూల్‌కి దూరం, ముఖ్యంగా అమ్మ, అత్తయ్య అందరి ఇళ్ళూ దూరమే అవుతాయి అక్కడ నుండి. తనకి చెపితే కొట్టి పడేస్తున్నాడు. అది మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ అంటాడు.’’

మోనా చెప్పింది విని కాసేపు ఆగి ‘‘ఇల్లు నీట్‌గా లేదా,  సరిపోవట్లేదా?’’ అని అడిగాను. మోనా సంశయంగా నా ముఖంలోకి చూస్తూ ఆగిపోయింది.

‘ఫ్లాట్‌ మరీ చిన్నదేం కాదు. నీట్‌గా లేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి’ అని మనసులో అనుకుంటూ, ‘‘పద, ఒకసారి మీ ఇల్లు చూద్దాం అన్నాను.’’

పాపాయిని బెడ్‌ రూములో పడుకోబెట్టి కథ చెప్పి నిద్ర పుచ్చుతూ, తనూ నిద్రలోకి ఒరిగింది సుధ. నేనూ, మోనా ఇల్లంతా కలియతిరిగి చూశాం. పొడుగాటి హాలులో ఒకవైపు లివింగ్‌, ఒక వైపు డైనింగ్‌ ఏరియా విడిగా ఉన్నాయి. రెండు పెద్ద బెడ్‌ రూములూ ఒక దానికి అటాచ్డ్‌ బాత్‌రూమూ ఒకటి కామన్‌ బాత్‌రూమ్‌. వంటిల్లు కూడా మరీ చిన్నదేమీ కాదు. విడిగా గిన్నెలు కడగటానికీ బట్టలు ఉతకటానికీ యుటిలిటీ. అన్ని రూముల్లో వార్డ్‌రోబ్‌లూ షెల్ఫులూ అంతా సౌకర్యంగానే ఉంది.

ఒక బెడ్‌రూమ్‌లో చాలా అట్టపెట్టెలూ సామానులూ కనిపించాయి. ‘‘ఏమిటి అవన్నీ?’’ అడిగాను. ‘‘అవన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఆర్గనైజర్‌లు. చెప్పానుగా, ఈయన కంప్లైంట్‌... ‘ఇల్లు నీట్‌గా లేదని ఎప్పుడూ ఒకటే గోల.’ అందుకే ఒక వీకెండ్‌గానీ, అహ... అసలు ఒక రెండు రోజులు సెలవుపెట్టి అయినా మొత్తం సర్దేద్దామని అవన్నీ తెప్పించాను’’ అంది. ప్లాస్టిక్‌ టబ్బులూ బుట్టలూ చిన్న షెల్ఫులూ హేంగర్లూ గోడకి అతికించే హుక్సూ... ఇలా రకరకాల వస్తువులు అవన్నీ. రూమ్‌ సగం వాటితోనే నిండిపోయింది.

‘‘నెక్స్ట్‌ వీక్‌ వెంకట్‌- మా మావగారి వైపు బంధువుల ఫంక్షన్‌కి మా అత్తగారు వాళ్ళని తీసుకుని వెళుతున్నాడు. రెండు రోజులు ఉండడు. పాపాయిని అమ్మ దగ్గరికి పంపించేసి, ఆ టైమ్‌లో అంతా సర్దేసి వెంకట్‌ని సర్‌ప్రైజ్‌ చేద్దామని అనుకుంటున్నా’’ అంది.

‘‘మంచి ఐడియా! నన్ను కూడా అప్పుడు పిలువు. నేను ఏమైనా హెల్ప్‌ చెయ్యగలనేమో’’ అన్నాను.

‘‘అబ్బ, థ్యాంక్స్‌ పెద్దమ్మా, నేనూ అదే అడుగుదాం అనుకుంటున్నాను. నీకేం ప్రాబ్లమ్‌ లేదుగా?’’ అంది.

‘‘ఉహూఁ... నో ప్రాబ్లం’’ అన్నాను. ఇంకో గంటకి బయల్దేరి ఇంటికి వచ్చేశాను. సుధ వాళ్ళింటికి వెళ్ళిపోయింది.

వారం తర్వాత మోనా ఇంటికి వెళ్ళిన నాతో ‘‘పెద్దమ్మా, ముందు ఈ ఆర్గనైజర్స్‌ అన్నీ విప్పి ఫిట్‌ చేద్దాం. ఆ తర్వాత సర్దటం మొదలుపెడదాం’’ అంది.

‘‘ఉహూఁ... సమస్య సర్దటం ఒకటే కాదు, ఏవి సర్దాలి అన్నది’’ అన్నాను.

‘‘అంటే..?’’ అంది.

‘‘ముందు మీ వస్తువులూ బట్టలూ అన్నీ తీసి బయటపెడదాం. వాటిలో పాతగా అయిపోయినవీ వాడనివీ పనికిరానివీ... ఇలా వేరుచేసి, కొత్తగా ఉన్నవీ మీరు వాడుతున్నవీ మాత్రం సర్దుదాం. తర్వాత మిగిలినవి ఏం చెయ్యాలనేది చూద్దాం’’ అన్నాను.

వంటింటి అరల్లో ఉన్నవి ముందు తీశాం. హాట్‌ప్యాక్‌లు అయిదారూ, పెనాలు నాలుగైదూ, ప్రెషర్‌ కుక్కర్లు చిన్నవీ పెద్దవీ స్టీలువీ నాన్‌స్టిక్‌వీ ఇలా నానా రకాలు. చాకు రోజూ వాడేదికాక, కత్తుల సెట్‌ పెద్దదీ, చెక్కు తీసే పీలర్లు మూడూ, అట్లకాడలో స్టీల్‌ది ఒకటీ చెక్కది ఒకటీ, సిలికాన్‌ అట అదొకటీ... ఇలా ఏ వస్తువు చూసినా అయిదారు రకాలకి తక్కువ లేవు. కప్పులూ గాజుగ్లాసులూ డిన్నర్‌ సెట్లూ తీస్తున్నకొద్దీ వస్తున్నాయి. కొన్ని ఫంక్షన్లకి బహుమతిగా వచ్చినవీ కొన్ని వీళ్ళు కొనుక్కున్నవీ అవన్నీ బయట తీసి పెట్టేసరికి డైనింగ్‌ హాల్‌ నిండిపోయింది.

మోనా అసలు కొన్ని ఉన్నట్టు మర్చిపోయింది. సామాన్లు ఎక్కువ అయిపోయి షెల్ఫుల్లో తోసేసి, ఉన్నవి కనపడక కొత్తవి కొన్నట్టున్నారు. ‘అరే, ఇవి ఇక్కడ ఉన్నాయా?’ అంటూ ఆశ్చర్యపోయింది. అలాగే బెడ్‌రూమ్‌లో బట్టల అలమరలో కుక్కి కుక్కి పెట్టి ఉన్న వందల కొద్దీ బట్టల జతలు- పార్టీవేర్‌ అనీ క్యాజువల్‌వేర్‌ అనీ ఆఫీస్‌వేర్‌ అనీ ముచ్చటైన పేర్లు. ఇక దుప్పట్లూ రగ్గులూ దిండు గలేబులూ కుషన్‌ కవర్లూ ఎక్స్‌ట్రా సెట్లు కుప్పలు కుప్పలు. కొన్ని అసలు కొన్న కవరు కూడా విప్పకుండా లోపల పెట్టేసి మర్చిపోయినవి బయటపడ్డాయి.

డ్రెస్సింగ్‌ టేబుల్‌ తెరిస్తే అందులో మేకప్‌ సామగ్రి గురించి చెప్పక్కర్లేదు. సుహానా డ్రెస్సులూ బొమ్మలూ కూడా అంతే, ఎక్కడ చూసినా అవే. ‘పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వలేక దాన్ని బొమ్మలతో బహుమతులతో భర్తీ చేసే ఆలోచనా’ అనిపించింది.

వెంకట్‌ కూడా తక్కువ ఏం తినలేదు. ఆరు నెలలకి ఒకసారి సెల్‌ఫోన్లూ ఐపాడ్‌లూ లాంటివి మార్చటంతో పాత చార్జర్లూ వైర్లూ ఇయర్‌ ఫోన్లూ... గాడ్జెట్స్‌ చెత్త చాలానే ఉంది. హాల్లోని షూ ర్యాక్‌లో ఒక్కొక్కళ్ళకీ పదిహేను జతల చొప్పున బూట్లూ చెప్పులూ.

అవన్నీ తీసి బయటపెట్టాక చూసిన మోనా ముఖం కాస్త కళ తప్పింది. ‘‘ఎక్కువ కొనేసినట్టున్నాం పెద్దమ్మా’’ అంది.

మోనాకి ఆన్‌లైన్‌ షాపింగ్‌ బాగా అలవాటు. ‘‘ఇది క్యూట్‌గా ఉంది కదా, ఇది చాలా యూజ్‌ఫుల్‌ కదా’’ అంటూ అనుకున్నవీ కనపడ్డవీ ఆర్డర్‌ పెట్టేస్తూ ఉంటుంది. ఇక ఏ ఎగ్జిబిషన్‌కో వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొనేస్తూ ఉంటుంది. ఆ సామాన్లు పెట్టడానికి ఎక్కువ షెల్ఫులు చేయించటం, ఆ షెల్ఫుల్లో ‘ఎక్కువ సామాన్లు ఎలా అమర్చాలీ’ అని ఇలాంటి వీడియోలు చూస్తూ... వాళ్ళు ‘డిస్క్రిప్షన్‌ బాక్స్‌లో లింక్‌ ఉంది, క్లిక్‌ చెయ్యండి... కొనండి’ అనగానే ఆ లింక్‌పైన నొక్కేసి మళ్ళీ ఇలాంటి ఎక్స్‌ట్రా ఆర్గనైజర్లూ సామాన్లూ కొంటూ ఉండటం.

బ్యాంకులో డబ్బులూ చేతిలో సెల్‌ఫోనూ ఉన్నాయి. ఉన్న వస్తువులు, వెతికి తీసి ఆర్డర్‌లో పెట్టి వాడేకన్నా, ఆన్‌లైన్‌లో కొత్తవి ఆర్డర్‌ పెట్టటం తేలిక అయిపోయింది. కనీసం ఆ వస్తువులతోపాటు వచ్చిన అట్టపెట్టెలు కూడా పడెయ్యలేదు. అవి కూడా పనికి వస్తాయి కదా అని అటక మీద పడేసి ఉంచింది.

అవన్నీ తీసేసరికి సగం రోజు అయిపోయి నీరసం వచ్చేసింది. ‘‘పద, మంచి టీ తాగి అప్పుడు మళ్ళీ మొదలు పెడదాం’’ అన్నాను.

‘‘పెద్దమ్మా, గ్రీన్‌ టీనా మసాల టీనా ఫ్రూట్‌ ఫ్లేవరా?’’ టీ బ్యాగ్స్‌ తీస్తూ అడిగింది. నా ముఖం చూసి భయంగా ‘‘మామూలు టీ పెడతాను’’ అని వెళ్ళింది.

అంతకుముందు మేము వచ్చిన రోజు మోనా సెల్‌లో ప్లే అవుతున్న వీడియో ఒకటి నా కంటపడింది. హోమ్‌ డెకరేషన్‌ వీడియో అది... అలాంటి వీడియోల సంగతి తెలుసు నాకు. రకరకాల కొత్త వస్తువులు చూపించి, వాటితో మన జీవితం మారిపోతుందన్న
భ్రమ కలిగిస్తారు. అవి కొనటానికి వీడియో కిందే లింకులు ఇచ్చి కొనమంటారు. మార్కెట్‌లోకి వారం వారం కొత్త ప్రొడక్ట్స్‌ వస్తూనే ఉంటాయి. కొన్ని ఉపయోగకరమే అయినా ఆ లింకులు అన్నీ క్లిక్‌ చేసి అవన్నీ కొంటూపోతే మనకి ఉపయోగం సంగతేమో కానీ, ఇల్లంతా గోడౌన్‌లా మారిపోతుంది. మోనా ఇంట్లో జరిగింది అదే. ఆ విషయం మోనాకి ‘సమయమూ సందర్భమూ చూసుకుని చెప్పే రీతిలో చెప్పాలి’ అని ఆ రోజే అనుకున్నాను. ఆ సందర్భం ఇప్పుడు కలిసొచ్చింది.

ఇల్లంతా నిండిపోయిన ఆ సామాన్ల మధ్య కూర్చుని టీ తాగుతూ యుద్ధభూమిలో అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుడిలాగా మోనాకి అరగంట క్లాస్‌ పీకాను. అప్పటికే మోనాకి కూడా సమస్యకి మూలం కాస్త అర్థం అయింది. కాబట్టి శ్రద్ధగా నేను చెప్పేదంతా వింది. గీత విన్న అర్జునుడికి వ్యామోహం పోయి కర్తవ్యం బోధపడ్డట్టు, మోనాకి వస్తు వ్యామోహం కాస్త అయినా తగ్గి కర్తవ్యం తెలిసి ఉంటుంది అనిపించింది.

టీ తాగి, ఉన్న వస్తువులు అన్నీ మూడు కుప్పలుగా విభజించాం. రోజూ వాడుకునేవి ఒకటీ అప్పుడప్పుడూ వాడేవి రెండోది.

అసలు వాడనివీ ఎక్స్‌ట్రా ఉన్నవీ మూడో కుప్ప. మూడో కుప్పలోనే ఎక్కువ వస్తువులు చేరాయి. ‘అవన్నీ అవసరమున్న వాళ్ళకి ఇచ్చేద్దాం’ అంటే ముందు కొంచెం దీనంగా ముఖం పెట్టినా, ఇక తప్పదు అనుకుని పక్కన పెట్టేసింది. మొదటి రెండు కుప్పల్లో వస్తువులు అరల్లో సర్దేశాం. సామాన్లు తగ్గిపోయాయి కాబట్టి నీటుగా సరిపోయాయి. మోనా ఆర్డర్‌ చేసిన ఆర్గనైజర్ల అవసరం పెద్దగా పడలేదు. కాస్త విరామం ఇచ్చి భోజనాలు చేశాం.

తిన్నాక... హాలు వంక చూశాను. హాలు సైజును దృష్టిలో పెట్టుకోకుండా, నచ్చిందని చాలా పెద్ద లెదర్‌ సోఫాసెట్‌, ఇంకా పెద్ద టీపాయ్‌ కొనేసి వేశారు. పైగా అది షోరూమ్‌లోలాగా హాలు మధ్యలో వేశారు.

‘‘ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏమిటో తెలుసా?’’ అంటూ, హాల్లో మధ్యలో సోఫాసెట్‌ని మోనా సాయంతో గోడకి జరిపేసి, వాటి మధ్యలో ఉన్న పెద్ద కార్పెట్‌, దానిపై సగం మంచం అంత సైజులో ఉన్న టీపాయ్‌ని తీసేసి, బాల్కనీలో ఉన్న ఖాళీ ప్లేస్‌కి తరలించాం. దానితో హాలు విశాలంగా అయినట్టు అనిపించింది. ‘‘టీపాయ్‌ చిన్నది కావాలంటే వేసుకోవచ్చు’’ అన్నాను.

ఇక డైనింగ్‌ టేబుల్‌ కూడా, మధ్యలో ఉన్న దాన్ని గోడకి జరిపేసి, ‘‘ఎవరైనా గెస్ట్‌ వచ్చినప్పుడు మధ్యలోకి జరపచ్చులే’’ అని చెప్పాను. సోఫా, డైనింగ్‌ టేబుల్‌ అలా గోడ దగ్గరికి జరిపెయ్యటంతో హాలు మధ్యలో చాలా ఖాళీ ఏర్పడి, అక్కడ వేసిన మార్బుల్‌ ఫ్లోర్‌ డిజైన్‌ బయటపడి అందంగా కనపడింది. ‘‘మా హాలు ఇంత పెద్దదా?’’ ఆశ్చర్యపోయింది మోనా! ఇక డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కేబినెట్‌లో అదనంగా ఉన్న కప్పు సెట్లూ హాట్‌ప్యాక్‌లూ అన్నీ ఖాళీ కావటంతో డైనింగ్‌ టేబుల్‌ పైన ఉన్న పచ్చడి సీసాలూ సాస్‌ బాటిల్సూ స్నాక్స్‌ ఉన్న బాక్సులూ ఆ కేబినెట్‌లో సరిగా సరిపోయాయి. ఖాళీ అయిన టేబుల్‌ శుభ్రంగా తుడిచి చక్కటి క్లాత్‌ వేసి ఒక బుల్లి ఫ్లవర్‌వేజు పెట్టేసరికి ముచ్చటగా తయారయింది.

ఆ మర్నాడు కూడా మిగతా రూములు అదే సూత్రం అనుసరిస్తూ సర్దేశాం. పనిలో పనిగా మోనాకి ఇంకో సూత్రం చెప్పాను. ‘‘ఇల్లు నీటుగా ఉండాలంటే తక్కువ వస్తువులు ఉండాలి. ‘లెస్‌ లగేజ్‌, మోర్‌ కంఫర్ట్‌’ అన్న సామెత తెలుసుగా. పైగా నీట్‌గా ఉంచాలని నువ్వు ఒక్కదానివే హైరానా పడితే సరిపోదు. ఇంట్లో ఉన్న అందరూ ఆ స్పృహతో ఎక్కడివక్కడ పెడుతూ, శుభ్రత పాటిస్తేనే అది సాధ్యం. లేకపోతే నువ్వు చూసే వీడియోల్లో ఆడవాళ్ళలాగా, నువ్వు ఇరవై నాలుగు గంటలూ డస్టింగ్‌ క్లాత్‌ పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి’’ అన్నాను.

‘‘నిజమే పెద్దమ్మా, మీ ఇంట్లో పెదనాన్న, అన్నయ్య వాళ్ళు కూడా అన్నీ నీటుగా పెడతారు కదా. ముందు వెంకట్‌కీ పాపకీ ఆ విషయం చెప్తాను’’ అంది.

ఆ సాయంత్రం మోనా, మూడో కుప్పలోని వస్తువులలో కొన్ని తమ ఇంట్లో పనివాళ్ళకి ఇచ్చేసింది. మిగిలినవి దగ్గరలోని అనాథ శరణాలయంలో పంచటానికి మోనా, సుహా, సుధ, నేనూ అందరం వెళ్ళాం. అలా ఇవ్వటంలో కలిగే ఆనందం మోనాకి కూడా
అనుభవంలోకి వచ్చినట్టుంది. శరణాలయంలో వాళ్ళకి ఒక పూట భోజనానికి కూడా డబ్బులు కట్టి వచ్చింది. అక్కడ ఉన్న పిల్లల్ని చూసి, ‘‘మమ్మీ, నా బొమ్మలు కూడా కొన్ని ఇస్తానమ్మా’’ సుహా ముద్దుగా చెప్తుంటే అందరం ముచ్చటపడి, వచ్చే వారం తప్పకుండా మళ్ళీ వద్దాం అనుకున్నాం.

తిరిగివచ్చి వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతుంటే, ఒక వారం ముందు ఉన్న ఇంటికీ ఇప్పటికీ ఎంతో తేడా. ఇల్లంతా విశాలంగా పొందికగా, ఆహ్లాదంగా ఉంది.

‘‘అబ్బ, హాయిగా ఉందే’’ ఇంట్లోకి రాగానే అంది సుధ. విప్పిన చెప్పులు జాగ్రత్తగా షూ ర్యాక్‌లో పెట్టి, చేతులూ కాళ్ళూ కడుక్కుని వచ్చిన మోనా, ‘‘పెద్దమ్మా, టీ పెట్టనా... ‘ఏం టీ’ అని అడగనులే. ఇప్పుడు ఒకటే బ్రాండ్‌’’ అంది నవ్వుతూ. నేను కూడా నవ్వేశాను.

రెండు రోజుల తర్వాత సుధ ఫోన్‌ చేసి అంది... ‘‘ఏం మంత్రం వేశావు అక్కయ్యా, అల్లుడు మొత్తానికి కొత్త ఇంటిప్లాన్‌ వదిలిపెట్టేశాడు. ఈ ఇల్లు బాగానే ఉంది అంటున్నాడట’’ చెప్తోంది సుధ నవ్వుతూ.

‘‘అవును... మంత్రమే. అందరూ అనునిత్యం పాటించాల్సిన మంత్రం’’ అన్నాను సుధ నవ్వులో శ్రుతి కలుపుతూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..