పరిష్కారం

‘టప్‌... టప్‌’ నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నళిని ఉలిక్కిపడి లేచి హాల్లోకి పరిగెత్తింది.

Published : 08 Jun 2024 23:36 IST

- ముచ్చి ధనలక్ష్మి

‘టప్‌... టప్‌’ నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నళిని ఉలిక్కిపడి లేచి హాల్లోకి పరిగెత్తింది.

చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుడి బొమ్మ. ‘ఇలా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుండి వెతుకుతున్నానో! దీన్నిగానీ మా హాస్టల్‌కి తీసుకెళ్తే మూడు ముక్కలవుతుంది, డౌట్‌ లేదు’ అని మరీమరీ చెప్పి ఆ షెల్ఫ్‌లో పెట్టింది. ఇప్పుడు మూడు కాదు ముప్ఫై ముక్కలైంది. ఇది చెల్లికి తెలిస్తే ఇక మూడో ప్రపంచ యుద్దమే!

పగిలిన ముక్కలకి ఒకవైపు అనిల్‌, మరోవైపు రాజ్‌ నిలబడ్డారు. ‘‘నేను కాదు పిన్నీ... వీడే’’ నళినిని చూడగానే చెప్పాడు అనిల్‌.

‘‘నేను కాదు’’ రాజ్‌ కూడా వచ్చీ రాని మాటల్తో అరిచాడు.

‘‘అరెరే ఏంటా శబ్దం?’’ తీరిగ్గా వంటింట్లో నుండి వస్తున్న సుజాతని చూసి మరింత ఆశ్చర్యపోయింది.

‘‘పంచదార కోసం వచ్చాను, నువ్వేమో ఇంట్రెస్ట్‌గా ఏదో చదువుతున్నావు. ఎందుకులే డిస్ట్రబ్‌ చేయటం అని...’’ ఆగి నళిని వైపు చూసింది.

నళిని కళ్ళల్లో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

‘‘ఈలోపే ఇంత చేశారా? అదిగో మీ పిన్నికి ఎంత కోపమొచ్చిందో చూడండి. చెప్తే వినరు కదా’’ ఇద్దర్నీ చెరో చేత్తో పట్టుకుని వెళ్ళిపోయింది.

కనీసం సారీ కూడా చెప్పలేదు. ఒక్క మాటా అనలేదు పిల్లల్ని. ఏడుపు మొహంతో అదంతా శుభ్రం చేసే పనిలో పడింది నళిని.

ఇంత క్లోజ్‌గా ఇంట్లో తిరిగే సుజాత- నళినికి సొంత అక్క కాదు సరికదా, కనీసం కజిన్‌ కూడా కాదు. కేవలం నైబర్‌. అది కూడా సంవత్సరాలు కాదు, వాళ్ళు పక్క ఇంట్లో దిగి రెండు నెలలైంది. నళినికేమో మొహమాటం ఎక్కువ, వాళ్ళకేమో కలుపుగోలుతనం ఎక్కువ. అంతే, రెండు నెలల్లో నళిని ఇంట్లోకే కాదు, కిచెన్‌లోకీ వచ్చేంత చనువు వచ్చేసింది సుజాతకి.

అసలంత ఛాన్స్‌ ఎలా ఇచ్చిందో ఎప్పుడిచ్చిందో అర్థమవ్వటం లేదు నళినికి.

‘‘నళినీ...’’ కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత. ‘‘ఇదిగో ఈ కాఫీ తాగు’’ ఇచ్చింది నళినికి.

దాదాపు అరకేజీ చక్కెర తీసుకెళ్ళి అరచేతిలో సగం కూడా లేని కప్పులో కాస్త కాఫీ పడేసింది జాలి తలచి.

‘‘ఇంతకీ ఆ బొమ్మెంత?’’ ఏం జరగనట్టు మామూలుగా అడిగింది. ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు.'

లోపలి నుండి పొంగుతూ బయటికొస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ ‘‘మూడు వేలు’’ అంది.

‘‘ఏంటీ..?’’ నోరంతా తెరిచింది.

‘‘ఆ చిన్న బొమ్మ మూడువేలా? అసలు నువ్వు బేరమాడావా? రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి చూడు... అదే మా ఊళ్ళో అయితే...’’ తెలివిగా సంభాషణ మరోవైపు మళ్ళించిన ఆమె అతి తెలివికి పిచ్చెక్కింది నళినికి. తల దేనికేసి కొట్టుకోవాలో తెలియలేదు. తల్లి వెనకాలే పిల్లుల్లా లోపలికొచ్చారు అనిల్‌, రాజ్‌.

‘‘జస్ట్‌ ఇప్పుడే తాగాను’’ ముక్తసరిగా చెప్పింది.

‘‘మీ పిన్నికింకా కోపం తగ్గినట్టు లేదురా, పదండి.’’

అదేదో జోక్‌లా నవ్వుకుంటూ వెళ్తున్న సుజాత వంక చూస్తూ దబ్బున తలుపు వేసింది కోపమంతా చూపిస్తూ. మళ్ళీ పడుకునేలోపు రాకుంటే చాలు- విసుగ్గా ఆ కాఫీ సింక్‌లో పడేసింది.

ఏ ముహూర్తాన వాళ్ళు పక్క ఫ్లాట్‌లో దిగారో కానీ ఆ రోజు నుండీ ప్రశాంతత పోయింది నళినికి.

జాబ్‌ వల్ల ఇంటికీ ఇంట్లో వాళ్ళకీ దూరమైనా మంచి కుటుంబం తోడుందని ఆనందపడింది... వాళ్ళు దిగి, పరిచయం చేసుకున్న మొదటి రోజు.

ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు.

సుజాత, గిరి ఇద్దరూ ఇద్దరే. సరైన జోడీ. వచ్చిన రెండోరోజే పంచదార అడగడంతో మొదలైంది. అక్కడి నుండి ప్రతి రోజూ ఏదో ఒకటి- బియ్యం, పప్పు, గుడ్లు... అన్నీ.

అదేం పెద్ద ఇబ్బందనిపించలేదు నళినికి. కానీ ఆ ఇద్దరు పిల్లల అల్లరి మాత్రం భరించడం తనవల్ల అవ్వడం లేదు. అలమరల లోనివన్నీ బయటికి తీయడం, విసిరేయడం, అరుపులు, వద్దంటే గట్టిగా కేకలు.

పిల్లలంటే తనకి కోపం లేదు. పిల్లలు తెల్ల కాగితాల్లాంటివాళ్ళు. మనమేం రాస్తే అదే కనిపిస్తుందని తనకీ తెలుసు. తప్పు చేసినపుడు అలా చేయకూడదని చెప్తే కదా వాళ్ళకి అర్థమయ్యేదీ... మరోసారి చేస్తున్నపుడు తల్లి హెచ్చరికలు గుర్తొచ్చి ఆగేదీ.

కానీ, ఇక్కడ అదేం లేదు. వాళ్ళేం చేసినా, ఎంత అరిచినా ఏం అనరు. పక్కింటి వాళ్ళెవరైనా పొరపాటున ‘ఏంటమ్మా, ఆ గొడవ’ అంటే, ‘మా ఇల్లు మా ఇష్టం, ఏమైనా చేసుకుంటామంటుంది’ మొహమాటం లేకుండా.

‘నిజం చెప్పవే వాళ్ళింట్లో నువ్వుంటున్నావా... నీ ఇంట్లో వాళ్ళుంటున్నారా? లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా?’ స్నేహితురాలు మైథిలి ఊరికే ఏడిపిస్తుంటుంది ఇంటికి వచ్చిన ప్రతిసారీ. తను ఒంటరిగా ఉంటుందని- సెలవు రోజుల్లో ల్యాప్‌టాప్‌ తీసుకుని అక్కడికే వచ్చేసేది మైథిలి. ఇద్దరూ కలిసి వర్క్‌ చేసుకునేవారు.

ఇప్పుడదీ రావటం లేదు. హాలిడేస్‌ అయితే పిల్లల్ని పూర్తిగా నళిని దగ్గరకే పంపిస్తోంది సుజాత. మార్కెట్‌కి వెళ్తున్నామనో షాపింగ్‌ అనో తెలిసినవాళ్ళకి ఒంట్లో బాలేదనో ఫంక్షన్‌ అనో... ఏదో ఒక వంక.

ఉదయం తొమ్మిదయ్యేసరికి పిల్లలిద్దర్నీ అప్పచెప్పి సాయంత్రం ఏడు దాటాక దిగుతారు.

దాదాపు పది గంటల పైనే భరించాలి.

ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి, అక్కడి నుండీ మొదలవుతుంది. షెల్ఫ్‌లో ఉన్నవన్నీ తీస్తుంటారు. వద్దంటే ఏడుపు.

ఆ రూమ్‌ నుండి ఈ రూమ్‌కి ఒకటే పరుగులు. గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తానని బెదిరింపులు. కాసేపు బుక్స్‌ తీస్తే పక్కింటి, ఎదురింటివాళ్ళ కాలింగ్‌బెల్‌ కొట్టి వచ్చేస్తుంటారు.

‘సెలవురోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా?’ అని క్లాస్‌ పీకి వెళ్తుంటారు కొన్నిసార్లు ఎదురింటివాళ్ళు.

వాటన్నింటితో తల వాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయమేస్తోంది నళినికి.

రెండు మూడుసార్లు ఇదంతా చూసిన మైథిలి- నళిని మొహమాటానికి ఓ దండం పెట్టి, రావడం మానేసింది.

ఇక ఇదంతా చాలదన్నట్టు ‘ఓ గంటసేపు ట్యూషన్‌ చెప్పు, నీకూ కాస్త టైమ్‌పాస్‌’ అంటూ స్కూల్‌ నుండి రాగానే పుస్తకాలిచ్చి పంపిస్తుంది.

జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే అసహ్యమేసింది. ప్రతిరోజూ సుజాత కనిపించగానే చెప్పేద్దామనుకుంటుంది పిల్లల్ని పంపించొద్దని.

కానీ ఆవిడ వాగ్ధాటి, వాక్‌ చాతుర్యం ముందు నిలబడలేకపోతోంది.

‘నిజంగా నీలాంటి చెల్లెలు లేకపోవడం దురదృష్టం’ రోజుకొకసారైనా అంటుంది. అంతేనా, అపార్ట్‌మెంట్‌లో అందరి దగ్గరా ‘దూరపు చుట్టరికం... వరసకి చెల్లె’లవుతుందని ప్రచారం మొదలుపెట్టింది.

‘అలా చెప్తున్నది నీ కోసమే. ఒంటరిగా ఓ అమ్మాయి ఉందంటే ప్రతీ ఒక్కరి కళ్ళూ నీమీదే ఉంటాయి. ఇలా కొండంత అండగా మేమున్నాం కాబట్టే ఎవరూ నీ దగ్గరకొచ్చే సాహసం చేయట్లేదు. నిన్నూ అలానే చెప్పమన్నారు మీ బావగారు.’ ఈ మాటతో నళిని నోరు మూతబడింది.

* * * * *

వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవపడింది బొమ్మ కోసం.

‘‘నీ మొహమాటం జబ్బుకి ఇంకెంత ఖర్చవుతుందో? అసలు ఎప్పటికి మారతావు నువ్వు?’’ తిడుతుండగానే కాలింగ్‌బెల్‌ మోగింది.

‘‘అదిగో తొమ్మిదైంది కదా, ఆహ్వానించని అతిథుల వేళయింది. ఈ రోజేం చెప్తారో? ఆదివారం రావటం పాపం... నువ్విక్కడే ఉండు, బయటికొస్తే బాగుండదు’’ అని వెళ్ళి తలుపు తీసింది.

ఆకుపచ్చ రంగు గద్వాల్‌ చీరలో సుజాత, నీలం రంగు సూట్‌లో గిరి మెరిసిపోతూ దర్శనమిచ్చారు.

కళ్ళు కాస్త దించింది. దానికి పూర్తి వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా, నిన్నటి స్కూల్‌ డ్రెస్‌ల్లోనే కనిపించారు పిల్లలు. తలుపు తెరిచిన బిందుని చూసి వాళ్ళూ షాకయ్యారు.

బిందు తత్వం సుజాతకి బాగా అర్థమైంది. ఈ రెండు నెలల్లో నళిని దగ్గర ప్రదర్శించిన టెక్నిక్స్‌ ఏవీ పనిచేయలేదు. ‘ఏదో మేం పక్కనున్నాం కాబట్టి మీ అక్కనింత జాగ్రత్తగా చూసుకుంటున్నాం. లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో!’ ఆఖరి అస్త్రం వదిలిందొకసారి బిందు దగ్గర.

‘మా అక్క ఇక్కడికొచ్చి రెండు సంవత్సరాలు దాటింది. అప్పటి నుండీ దాని జాగ్రత్త అదే చూసుకుంటోంది- చుట్టుపక్కల వాళ్ళతో ఒక్క మాటా రాకుండా’ ఒత్తి పలికింది కావాలనే.

 అందుకే బిందు వచ్చిన రెండు మూడు రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత.

‘‘ఎప్పుడొచ్చావమ్మా, బాగున్నావా?’’ తీయగా పలకరించింది.

‘‘ఉదయమే వచ్చాను. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు.’’

‘‘ఆఁ... అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం. ఇదిగో వీళ్ళిద్దర్నీ రమ్మంటే పిన్నితోనే ఉంటామని ఒకటే గొడవ’’ మురిపెంగా పిల్లల్ని చూస్తూ చెప్పింది.

‘అవసరం తనది, అయినా రిక్వెస్టింగ్‌గా అడగటం లేదు సరికదా... మీ కోసమే త్యాగం చేస్తున్నాం’ అన్నట్టు చెప్తున్న ఆవిడ తెలివికి భగ్గుమంది బిందు మనసు.

‘‘అరెరె, మరెలా? మేం కూడా ఈ రోజు బయటికెళ్తున్నాం’’ అంది కూల్‌గా.

ఇద్దరి మొహాల్లో నవ్వు ఎగిరిపోయింది.

‘‘పోనీ మధ్యాహ్నం వరకూ చూసుకోండి.’’

‘‘లేదండీ, పది నిమిషాల్లో కిందకెళ్ళాలి, క్యాబ్‌ కూడా బుక్‌ చేశాం’’ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు పిల్లల్ని లాక్కుని.

* * * * *

సాయంత్రం ఫంక్షన్‌ నుండి రాగానే వాచ్‌మన్‌ని ఎంక్వైరీ చేసింది సుజాత.

‘‘లేదమ్మా, వాళ్ళిద్దరూ కిందకే రాలేదు.’’

‘‘ఒక్కరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది?’’ కోపంగా పైకెళ్ళింది.

తలుపు తెరిచే ఉండటంతో లోపలికెళ్ళి ఆవేశంగా ఏదో అనబోయిన సుజాతని ‘హుష్‌’ అని వారించింది ల్యాప్‌టాప్‌ ముందు కూర్చున్న బిందు.

‘మీటింగ్‌’ పెదాలు కదిల్చింది. బెడ్‌రూమ్‌ వైపు చూసింది నళిని కోసం. ‘పడుకుంది’ అన్నట్టు సైగ చేసింది. చేసేదేంలేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులేస్తూ.

ఆ రోజు నుండీ సుజాతనీ పిల్లల్నీ అంతగా రానివ్వలేదు బిందు. మీటింగ్‌ ఉందనీ వర్క్‌ ఉందనీ ఏదో ఒకటి చెప్పేది.

పైకి బట్టలు ఆరేయటానికి వెళ్ళినపుడు మాత్రం నళినిని పట్టుకుంది సుజాత.

‘‘అదేంటి నళినీ మీ చెల్లి... ఎవరితోనూ కలవదు. కనీసం పిల్లల్ని కూడా దగ్గరకి రానివ్వదు. ఎంత చదువున్నా ఉద్యోగమున్నా రేపు పెళ్ళి చేసుకోదా ఏం? అప్పుడేం చేస్తుంది. అత్తమామల్ని దూరంగా ఉంచితే ఊరుకుంటారా?’’ ఆగ్రహం పట్టలేక అనేసింది.

తన చెల్లి గురించి తనకే చెప్పడమా? నళినికి మామూలు కోపం రాలేదు. బిందు నిర్ణయమే కరెక్ట్‌ అనుకుంటూ కిందికెళ్ళింది.

పదిహేను రోజుల తర్వాత బిందు వెళ్ళిపోతుండటం చూసి హాయిగా ఊపిరి పీల్చుకుని ముందురోజు చేసిన పాయసం తీసుకుని వెళ్ళింది.

‘‘నళినీ...’’ తలుపు తోసుకుని అడుగు పెట్టిందో లేదో ‘భౌ, భౌ’మని భీకర అరుపులు. హడలిపోయి పాయసం బౌల్‌ వదిలేసింది కిందకు. గోధుమ రంగులో ఉన్న కుక్కపిల్ల సోఫాలో నుండి దబ్బున గెంతింది సుజాతని చూస్తూనే.

‘‘హోళీ’’ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నళిని.

‘‘ఇదేంటి నళినీ, ఎవరిదీ కుక్క?’’ గుమ్మం బయటే నిలబడి అడిగింది.

‘‘మా మైథిలి వాళ్ళది. వాళ్ళు బెంగళూర్‌ వెళ్తూ నాకిచ్చారు.’’

‘‘అంటే నువ్వు పెంచుతావా? అంత భయంకరంగా అరుస్తోంది. నా గుండె ఆగిపోయిందనుకో.’’

తల్లి వెనుకే రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది. దెబ్బకి ఇద్దరూ ఇంట్లోకి పరిగెత్తారు.

‘‘అయ్యయ్యో! పిల్లలు చూడు ఎలా భయపడిపోయారో? ముందు దాన్ని కట్టేయ్‌.’’

‘‘అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది. అయినా చిన్నపిల్ల... అటూ ఇటూ తిరిగితేనే సరదా.’’

ఆ డైలాగ్‌ సుజాతదే, పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు ‘కూర్చోండిరా, వర్క్‌ ఉంది’ అంటే, ‘పిల్లలు కదా, అటూ ఇటూ తిరిగితేనే సరదా’ అంటుంది.

‘‘అయినా నీకెలా కుదురుతుంది?ఆఫీసుకెళ్తావ్‌ కదా?’’

‘‘వెళ్ళేటపుడు మైథిలి వాళ్ళ పెదనాన్నకిచ్చేసి వెళ్తాను. వాళ్ళు సెకండ్‌ ఫ్లోర్‌లోనే ఉన్నారు కదా?’’ హోళీని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ అంది.

దాని వంక చూస్తూ మెల్లగా ఒకడుగు వేసింది ముందుకి. ‘భౌ, భౌ’ ఇల్లదిరిపోయేలా అరుస్తూ సుజాత మీదకొచ్చింది.

‘‘హోళీ... క్వయిట్‌. ఇదింతే. నాకు బాగా అలవాటు కనుక నా దగ్గరకు వచ్చింది కానీ ఎవర్నీ ఒక పట్టాన నమ్మదు. ఎంత క్యూట్‌గా ఉంది కదూ.’’ ఎత్తుకుని ముద్దాడింది.

సుజాతని లోపలికి రమ్మని కూడా పిలవలేదు.

‘‘చాలా క్యూట్‌గా ఉంది- వచ్చిన వాళ్ళందరి మీదకి అరుస్తూ రావడం’’ ...రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.

గుండెల్లో భారమంతా దిగిపోయింది నళినికి. లేకుంటే పగలంతా ఆఫీసులో పనిచేసి సాయంత్రానికి ఇంటికొస్తే చాలు... ‘వాళ్ళలా వీళ్ళిలా’ అంటూ అందరి మీదా గాసిప్స్‌. వినీ వినీ పిచ్చెక్కిపోయింది.

ఏ రోజైతే బిందుని తనముందే తిట్టిందో ఆ క్షణమే సుజాత మీదున్న అభిమానం పూర్తిగా పోయింది.

* * * * *

నళినికి హోళీ మీదున్న ఇష్టాన్ని చెరిపేయటానికి ప్రయత్నించి విసిగిపోయిన సుజాత- దాన్ని మచ్చిక చేసుకోవటానికి గట్టిగానే ట్రై చేసింది కానీ కొత్తవాళ్ళని చూస్తేనే మీదకి దూకే హోళీ లొంగలేదు.

ఓసారి అనిల్‌ మెల్లగా బెడ్‌రూమ్‌లోకి దూరాడు హోళీకి కనిపించకుండా. అంతే హాల్లో నుండి కిచెన్‌లోకి, అక్కడి నుండి బయటికి వెంటపడి పరిగెత్తించింది. వాడు కిందపడి దెబ్బ తగిలించుకున్నాడు.

నళినికి బాధనిపించినా, తనచుట్టూ చుట్టూ తిరుగుతున్న హోళీని కొట్టలేకపోయింది.

‘‘పదండ్రా! ‘పిన్నీ, పిన్నీ’ అని మీరే వెంటపడుతున్నారు. ఆవిడకి మనకన్నా ఆ కుక్కే ఎక్కువ’’ పిల్లలిద్దరి వీపులపైన నళిని చూస్తుండగానే రెండు దెబ్బలేసి, లోపలికి తీసుకెళ్ళిపోయింది.

రెండు నెలల స్నేహం రెండు నిమిషాల్లో చెరిగిపోయింది.

‘పోన్లే... ఇక నుండీ పంచదార, పప్పు, ఎగ్స్‌... ఏవీ ఎక్కువ తేవక్కర్లేదు. ఎవరి మీదా గాసిప్స్‌ విని మైండంతా పాడు చేసుకోనక్కర్లేదు’ నవ్వుకుంటూ వెళ్తున్న నళిని వెనుక- బంతిలా ఎగురుకుంటూ ముచ్చటగా పరుగులు తీస్తోంది హోళీ.

‘అలా చెప్తున్నది నీ కోసమే. ఒంటరిగా ఓ అమ్మాయి ఉందంటే ప్రతీ ఒక్కరి కళ్ళూ నీమీదే ఉంటాయి. ఇలా కొండంత అండగా మేమున్నాం కాబట్టే ఎవరూ నీ దగ్గరకొచ్చే సాహసం చేయట్లేదు. నిన్నూ అలానే చెప్పమన్నారు మీ బావగారు.’ ఈ మాటతో నళిని నోరు మూతబడింది.

‘‘అదేంటి నళినీ మీ చెల్లి... ఎవరితోనూ కలవదు. కనీసం పిల్లల్ని కూడా దగ్గరకి రానివ్వదు. ఎంత చదువున్నా ఉద్యోగమున్నా రేపు పెళ్ళి చేసుకోదా ఏం? అప్పుడేం చేస్తుంది. అత్తమామల్ని దూరంగా ఉంచితే ఊరుకుంటారా?’’ ఆగ్రహం పట్టలేక అనేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..