ఆస్కార్‌... విశేషాలెన్నో!

విశ్వతారాగణమంతా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూసే వేడుక...  భాషాభేదాలకు అతీతంగా ప్రేక్షకులందరినీ కట్టిపడేసే సినీలోక సందడి..

Updated : 12 Mar 2023 18:37 IST

ఆస్కార్‌... విశేషాలెన్నో!

విశ్వతారాగణమంతా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూసే వేడుక...  భాషాభేదాలకు అతీతంగా ప్రేక్షకులందరినీ కట్టిపడేసే సినీలోక సందడి.. ప్రపంచ ప్రసిద్ధ నటీనటులందరూ తమ జీవితంలో ఒక్కసారైనా సాధించాలనుకుని కలలు కనే పురస్కారం... అదే అద్వితీయ ఆస్కార్‌ సంబరం. 95వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆ బహుమతి ప్రదానోత్సవ విశేషాలివి..

హాలీవుడ్‌ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులతో కూడిన ఐదు విభాగాలతో 1927లో ఏర్పాటైంది ‘ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ సంస్థ. రెండేళ్ల తరవాత ఆ సంస్థే సినీ రంగంలో ప్రతిభావంతులకు ‘అకాడమీ అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ పేరున పురస్కారాలు ఇవ్వడం మొదలుపెట్టింది. క్రమంగా ఆ అవార్డులకు ఆస్కార్‌ అనే పేరు వచ్చింది.

* తొలిసారి ఈ పురస్కార ప్రతిమను చూసిన అకాడమీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మార్గరెట్‌ హెర్రిక్‌... అందులోని యోధుడు అచ్చం తన అంకుల్‌ ఆస్కార్‌లా ఉన్నాడని అందట. ఆ తరవాత హాలీవుడ్‌ కాలమిస్ట్‌ సిడ్నీ స్కోల్‌స్కీ తన వ్యాసంలో వీటిని ఆస్కార్‌ పురస్కారాలని ప్రస్తావించాడట. ఆస్కార్‌ అన్న పదం అలా వాడుకలోకి వచ్చిందని ఓ ప్రచారం ఉంది.  

* పసిడి రంగులో మెరిసిపోయే ఆస్కార్‌ ప్రతిమ సృష్టికర్త ఎంజీఎం స్టూడియో ఆర్ట్‌ డైరెక్టర్‌ కెడ్రిక్‌ గిబ్బన్స్‌. రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టిన యోధుడు ఫిల్మ్‌ రీలుపై ఠీవిగా నిల్చున్నట్టు కనిపిస్తుంది. యోధుడి కాళ్ల కింద ఉన్న రీలు చుట్టలోని ఐదు చువ్వలు- అకాడమీలోని ఐదు విభాగాలకు సూచికలు.  

* ఆస్కార్‌ ప్రతిమలోని యోధుడి రూపం నగ్నంగా ఉంటుంది. ఎమిలో ఫెర్నాండెజ్‌ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి అతడి ఆకారం నుంచి స్ఫూర్తి పొంది ఈ ప్రతిమ నమూనా చిత్రాన్ని గిబ్బన్స్‌ రూపొందించాడట. తరవాత దానికనుగుణంగా త్రీడీ ప్రతిమను తయారుచేసే పనిని లాస్‌ ఏంజెలెస్‌కు చెందిన శిల్పి జార్జ్‌ స్టాన్లీ భుజానికెత్తుకున్నాడు. 13.5 అంగుళాల ఎత్తు, సుమారు నాలుగు కేజీల బరువు ఉండే ఆస్కార్‌ ప్రతిమను రూపుదిద్దిన స్టాన్లీ... దాన్ని కాంస్యంతో తయారు చేసి, 24 క్యారెట్ల బంగారం పూత పూశాడు.

* 2000 సంవత్సరంలో ప్రదానోత్సవానికి తరలిస్తున్న 55 ప్రతిమలు చోరీ అయ్యాయి. తీవ్ర గాలింపు అనంతరం తొమ్మిది రోజులకు వాటిలో 52 దొరికాయి. మిగతా మూడు ప్రతిమల్ని అప్పటికప్పుడు అత్యవసరంగా తయారు చేయించారు.

* ఆస్కార్‌కు వెళ్లిన సినిమాలను ముందుగా సుమారు 80 దేశాలకు చెందిన అకాడమీ సభ్యులు ఓటు వేసి నామినేట్‌ చేస్తారు. మనదేశం నుంచి ఏఆర్‌ రెహమాన్‌తోపాటు మరికొందరు సినీప్రముఖులు అకాడమీ సభ్యులుగా ఓటింగ్‌లో పాల్గొంటారు.

* కేవలం 270 మంది హాజరైన తొలి ఆస్కార్‌ అవార్డుల వేడుక పదిహేను నిమిషాల పాటు జరిగిందట.

* లిజా మే మినెల్లి అనే గాయని కుటుంబమంతా ఆస్కార్‌ అందుకుని చరిత్ర సృష్టించింది. గాయకులుగా లిజా, ఆమె తల్లి- దర్శకత్వ విభాగంలో ఆమె తండ్రి విన్సెంట్‌ మినెల్లీ ఆస్కార్‌ను గెలుచుకున్నారు.

* నోబెల్‌, ఆస్కార్‌... రెండూ అందుకున్న ఇద్దరిలో ఒకరు జార్జ్‌ బెర్నార్డ్‌ షా, మరొకరు బాబ్‌ డిలెన్‌.


ఆస్కార్‌ వేడుకలో రెడ్‌ కార్పెట్‌ ఎంతో ప్రత్యేకమైంది. దానిపైన నడవడం ఎందరో తారల కల. గతేడాది టాలీవుడ్‌ నుంచి పూజా హెగ్డే ఆహ్వానం అందుకుంది రెడ్‌ కార్పెట్‌పైన నడవడానికి. వేదిక వద్ద దాన్ని ఏర్పాటు చేయడానికి దాదాపు 900 గంటలు కష్టపడతారట కార్మికులు. ఈ వేేడుక నిర్వహణకు అయ్యే ఖర్చు దాదాపు రూ.350 కోట్లకు పైమాటేనట.


* మనదేశం నుంచి ఆస్కార్‌ అందుకున్న మొదటి వ్యక్తి భాను అథియా. 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ విభాగంలో 1983లో ఆమె ఈ అవార్డును పొందారు.

* 2021 వరకూ, మనదేశం నుంచి పలు సినిమాలు రకరకాల విభాగాల్లో నామినేట్‌ అయితే... వచ్చిన ఆస్కార్‌ అవార్డులు మాత్రం ఎనిమిది.  ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’లోని ‘జయహో...’ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోరు, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో రెండు అవార్డ్డులను ఏఆర్‌ రెహమాన్‌ ఒకేసారి అందుకున్నారు.


ఎక్కువ ఆస్కార్‌ అవార్డులను అందుకున్న రికార్డ్‌ మాత్రం అమెరికన్‌ రచయిత, నిర్మాత, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, వ్యాపారవేత్త అయిన వాల్ట్‌ డిస్నీది. 20కి పైగా ఆస్కార్‌ అవార్డులు అందుకున్న ఆయన ఒకేసారి ఆరు అవార్డులను చేజిక్కించుకుని రికార్డుల్లోకి ఎక్కాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..