ఆలిండియా టాపర్‌ని!

మానుషి ఛిల్లర్‌... హరియాణాలో పుట్టి పెరిగి ప్రపంచ సుందరిగా గుర్తింపు పొందిన ఈ సొగసరి... ఆ తరువాత బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిందనేది తెలిసిందే.

Updated : 18 Feb 2024 04:56 IST

మానుషి ఛిల్లర్‌... హరియాణాలో పుట్టి పెరిగి ప్రపంచ సుందరిగా గుర్తింపు పొందిన ఈ సొగసరి... ఆ తరువాత బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిందనేది తెలిసిందే. త్వరలో ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’తో తెలుగుతెరమీదా సందడి చేయబోతున్న సందర్భంగా తన గురించి చెప్పుకొస్తోందిలా...


సర్జన్‌ కావాలనుకున్నా

మా స్వస్థలం హరియాణా. నాన్న మిత్రా బసు, అమ్మ నీలమ్‌ ఛిల్లర్‌ ఇద్దరూ డాక్టర్లే. కుటుంబంలో మరికొంతమందీ డాక్టర్లు ఉన్నారు. దాంతో నేను కూడా భగత్‌పూల్‌సింగ్‌ మెడికల్‌ కాలేజీలో సీటు తెచ్చుకున్నా. ఎంబీబీఎస్‌ అయ్యాక కార్డియాక్‌ సర్జన్‌ కావాలనుకున్నా. అయితే అందాలపోటీలతో నా ప్రపంచమే మారిపోయింది.


స్కూల్లో ఫస్ట్‌

నేను ముందు నుంచీ కష్టపడి చదివేదాన్ని. పదో తరగతిలో స్కూల్‌ టాపర్‌గా నిలిచా. పన్నెండో తరగతిలో ఇంగ్లిష్‌లో ఆలిండియా టాపర్‌ని. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలోనూ చేరాను.


ఆ సినిమా చూశాకే

దో ఒక పోటీలో పాల్గొని నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని చిన్నప్పటి నుంచీ అనుకునేదాన్ని కానీ.. మిస్‌వరల్డ్‌ పోటీలకు వెళ్తానని మాత్రం కలలో కూడా ఊహించలేదు. ఒక విధంగా మా అమ్మే అందుకు కారణం. మా అమ్మకు ఐశ్వర్యారాయ్‌ అంటే చాలా ఇష్టం. ఓసారి టీవీలో ‘దేవదాస్‌’ సినిమా వస్తుంటే అందులో ఐశ్వర్యారాయ్‌ని చూపించి తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ మాటలు విన్నాక... నేనూ ఏదో ఒక రోజు మిస్‌ వరల్డ్‌ అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నా. 


అందుకే వంట నేర్చుకున్నా

కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మెస్‌లో భోజనం చేసేదాన్ని. ఆ భోజనం వల్ల - అయితే విపరీతంగా బరువు పెరిగేదాన్ని లేదా తగ్గిపోయేదాన్ని. దాంతో హాస్టల్‌లోనే వండుకోవడం మొదలుపెట్టా. పప్పులూ, కూరలూ చేస్తున్నా సరే... పోషకాలు అందేలా వాటిలో ఇతర పదార్థాలూ వేసి ప్రయోగాలు చేసేదాన్ని. అందాల పోటీలకు సిద్ధం కావాలంటే ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం తప్పదుగా.


అవగాహన కల్పించా

అందాల పోటీల్లో పాల్గొంటున్నప్పుడు ‘ప్రాజెక్ట్‌ శక్తి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించా. నెలసరి సమయంలో మహిళలు పాటించాల్సిన పరిశుభ్రతపైన గ్రామాలకు వెళ్లి మహిళలతో, అమ్మాయిలతో మాట్లాడుతూ అవగాహన కల్పించేదాన్ని.


ఇష్టంగా చేసే పనులు

చిన్నప్పటినుంచి నాకు కవిత్వం రాయడం, డాన్స్‌ చేయడం, పాటలు పాడటం, బొమ్మలు వేయడం అంటే ఇష్టం. ఇక, రాధ-రాజారెడ్డిల దగ్గర కూచిపూడి నేర్చుకున్న నేను... తీరిక దొరికితే డాన్స్‌ ప్రాక్టీస్‌ కూడా చేస్తుంటా.


ఆ ఆలోచన లేదు

స్కూల్లో ఉన్నప్పుడు డ్రామాల్లో నటించాను కానీ ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన నాలో అస్సలు లేదు. ఎందుకంటే... అందాల పోటీలయ్యాక మెడిసిన్‌ను కొనసాగించాలనుకున్నా. కానీ ఆ తరువాత ‘సామ్రాట్‌ పృథ్విరాజ్‌’లో అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో వదులుకోవాలనిపించలేదు. అలా నా చదువును పక్కన పెట్టేసి.. సినిమాలవైపు వచ్చా. వరుణ్‌తేజ్‌తో కలిసి ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’లో నటించే ఛాన్స్‌ కూడా అలా వచ్చిందే.


ఆ అలవాటు పోలేదు

దువుకుంటున్నప్పటి నుంచీ పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగడం అలవాటు చేసుకున్నా. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నా.


అలా మొదలైంది

మెడికల్‌ కాలేజీలో చేరాక మొదటిసారి ‘మిస్‌ క్యాంపస్‌ ప్రిన్సెస్‌’ టైటిల్‌ను అందుకున్నా. ఆ ఆత్మవిశ్వాసంతో ‘ఫెమినా మిస్‌ ఇండియా’ పోటీల్లో గెలుపొంది చివరకు ప్రపంచ సుందరిగా గెలిచి... నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నా. అలాగే ‘మిస్‌ ఫొటోజెనిక్‌’గానూ గుర్తింపు పొందా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..