మా అభిమాన తారలెవరంటే!

కోట్లాది మంది అభిమానులతో చప్పట్లు కొట్టించుకుంటారు క్రికెటర్లు. సోషల్‌ మీడియాలో వారి అప్‌డేట్ల కోసం ఎంతోమంది వారిని ఫాలో అవుతుంటారు.

Updated : 26 May 2024 16:48 IST

కోట్లాది మంది అభిమానులతో చప్పట్లు కొట్టించుకుంటారు క్రికెటర్లు. సోషల్‌ మీడియాలో వారి అప్‌డేట్ల కోసం ఎంతోమంది వారిని ఫాలో అవుతుంటారు. మరి అలాంటి  క్రికెటర్లు ఎవరికి వీరాభిమానులో తెలుసా, వాళ్లెవర్ని ఫాలో అవుతుంటారో చూశారా ఎప్పుడైనా...!

మంచి మనిషి 

 -విరాట్‌ కోహ్లీ

తెలుగు హీరోల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ నాకు మంచి స్నేహితుడు. నటుడిగానూ ఎంతగానో అభిమానిస్తా. కొన్నేళ్ల క్రితం ఓ ప్రకటనలో తనతో కలిసి నటించా. ఆ సమయంలో ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయ్యా. ఆప్యాయంగా మాట్లాడే అతని తీరు నాకు నచ్చుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌ నటనను వర్ణించడానికి మాటలు సరిపోవు అనిపించింది. ‘నాటు నాటు...’ డాన్స్‌ ఎంతగానో ఆకట్టుకుంది. అనుష్కతో కలిసి ఆ స్టెప్పులు వేస్తూ చాలా రీల్స్‌ కూడా చేశా. గతేడాది ఓ మ్యాచ్‌ ఆడుతుంటే ఆ సినిమాకి ఆస్కార్‌ వచ్చినట్టు తెలిసింది. వెంటనే మైదానంలో ‘నాటు నాటు...’ స్టెప్పులు వేసి నా సంతోషాన్ని వ్యక్తం చేశా.


ప్రేమలో పడ్డా

-ధోనీ

నటుడిగానే కాకుండా.. వ్యక్తిగతంగానూ రజినీకాంత్‌ సర్‌కి వీరాభిమానిని. ఆయన స్టైల్‌, మేనరిజం నన్నెంతగానో ఆకట్టుకుంటాయి. చిన్నతనంలో చాలాసార్లు ఆయన్ని కలవాలనుకునేవాడిని. క్రికెటర్ని అయ్యాక కూడా ప్రయత్నించాగానీ మ్యాచ్‌ల వల్ల కుదరలేదు. నా బయోగ్రఫీ విడుదలకు ముందు ప్రమోషన్‌లో భాగంగా రజినీ సర్‌ని కలిసే అవకాశం వచ్చింది. నేరుగా మాట్లాడాక ఆయనతో ప్రేమలో పడిపోయాననే చెప్పాలి. ‘దళపతి’, ‘బాషా’, ‘ముత్తు’ సినిమాలను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. మా పాపకి ‘రోబో’ చాలా ఇష్టం. రజినీ సర్‌ మీదున్న అభిమానాన్ని చాటుకోవడానికి గతేడాది ఐపీఎల్‌ సందర్భంగా ఆయన గెటప్‌ వేసుకుని ఓ యాడ్‌ చేశా. యూట్యూబ్‌లో ఆ వీడియోకి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు.


నటన ఇష్టం

-సూర్యకుమార్‌

ప్రయాణాల్లో నాకు నిద్ర పట్టదు. అందుకే దేశవిదేశాల్లో జరిగే మ్యాచ్‌లకు వెళ్లడానికి ముందు నా ట్యాబ్‌లో కొన్ని సినిమాలు డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకుంటా. ముఖ్యంగా పాత కామెడీ సినిమాలను చూడ్డానికి ఇష్టపడుతుంటా. అవి చూసి ఒత్తిడి పోగొట్టుకుని రీఛార్జ్‌ అవుతుంటా. అభిమాన హీరో విషయానికొస్తే... విజయ్‌ చాలా ఇష్టం. ఆయన యాక్షన్‌ సినిమాలు నాకు బాగా నచ్చుతాయి. కాలేజీ రోజుల్లో విజయ్‌ సినిమాలన్నీ థియేటర్‌లో చూసేవాడిని. ఇప్పుడు కుదరక ఓటీటీలోనే చూస్తున్నా. వంశీ పైడిపల్లి తీసిన ‘వారసుడు’ ఎంతగానో నచ్చింది. అమ్మ సెంటిమెంట్‌తో వచ్చిన ఆ సినిమాని ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంటుంది. ఒకసారి ఫ్లైట్‌లో ఆ సినిమా చూస్తూ కేరింతలు కొడుతుంటే ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టి వైరల్‌ చేశారు. అది చూసి ఎంతగానో నవ్వుకున్నా.


ఫాలో అవుతా

-శ్రేయస్‌ అయ్యర్‌

అభిమానుల్ని ‘డార్లింగ్‌’ అంటూ ఎంతో ప్రేమగా పిలిచే ప్రభాస్‌కి పెద్ద ఫ్యాన్‌ని నేను. ‘బాహుబలి’ సినిమా చూశాకే అభిమానిగా మారా. అప్పట్నుంచీ సోషల్‌మీడియాలో ఫాలో అవుతూ ప్రభాస్‌ గురించీ, ఆయన నటిస్తున్న సినిమాల విశేషాలనీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటా. కొవిడ్‌ సమయంలో డార్లింగ్‌ నటించిన సినిమాలు చూస్తూ ఎంజాయ్‌ చేశా. ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్‌ చాలా అందంగా ఉన్నాడు. ప్రస్తుతం లుంగీ లుక్‌లో రాబోతున్న ‘రాజాసాబ్‌’, అమితాబ్‌తో నటించిన ‘కల్కి’ సినిమాలను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆశపడుతున్నా. మ్యాచ్‌లు లేకపోతే విడుదలైన మొదటి రోజే ఆ సినిమా లను థియేటర్‌లో చూస్తా.  


గడ్డం పెంచా 

 - రవీంద్ర జడేజా

పాన్‌ ఇండియా సినిమా ‘పుష్ప’ చూశాక అల్లు అర్జున్‌ అభిమానుల జాబితాలో చేరిపోయా. ఆయన లుక్‌ని కూడా కాపీ కొట్టేశా. ఆ లుక్‌లోని కొన్ని ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తే అర్జున్‌ వాటికి రిప్లై ఇవ్వడం నాకు బాగా నచ్చింది. నేను హిందీలో ఆ సినిమా చూశాను కానీ తెలుగు డైలాగులే బాగా పాపులర్‌ అయ్యాయి. ఆ డైలాగులతో చాలా రీల్స్‌ చేశా. ఖాళీ దొరికినప్పుడు అల్లు అర్జున్‌ నటించిన సినిమాలన్నీ వరసపెట్టి చూశా. ఒక్కో సినిమాకి అతని ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూసి ఆశ్చర్యమేసింది. ప్రస్తుతం అందరి ప్రేక్షకుల్లానే నేనూ ‘పుష్ప2’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..