ప్రయాణాలంటే ఎందుకు ఇష్టమంటే!

షూటింగ్‌ల నుంచి ఏ మాత్రం విరామం దొరికినా... వెకేషన్‌ పేరుతో కొత్త ప్రాంతాలను చుట్టొచ్చేందుకు ఆసక్తి చూపించే హీరోయిన్లలో వీళ్లు ముందుంటారు. ఎందుకో తెలుసుకుందామా!

Updated : 05 Nov 2023 14:58 IST

షూటింగ్‌ల నుంచి ఏ మాత్రం విరామం దొరికినా... వెకేషన్‌ పేరుతో కొత్త ప్రాంతాలను చుట్టొచ్చేందుకు ఆసక్తి చూపించే హీరోయిన్లలో వీళ్లు ముందుంటారు. ఎందుకో తెలుసుకుందామా!


నాతో నేను గడిపేస్తుంటా

సమంత  

కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు నాతో నేను గడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే... ఎప్పటికప్పుడు నేను చూడాలనుకున్న ప్రదేశాల జాబితా రాసి పెట్టుకుని కుదిరినప్పుడల్లా ఒక్కోచోటుకి వెళ్లొస్తుంటా. అలా బాలీ, క్యాలిఫోర్నియా, ఆస్ట్రియా... వంటి ఎన్నో ప్రాంతాలకు వెళ్లొచ్చా. అక్కడి అడవుల్లో ఒంటరిగా నడవడం, సైకిలు తొక్కడం, మనసుకు నచ్చిన పనులు చేయడం ద్వారా శారీరకంగా మానసికంగా రీఛార్జ్‌ అవుతుంటా. ఆ సమయాల్లో నేను దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి, అభిమానులతో పంచుకోవడం నాకో సరదా.  


ఆత్మవిశ్వాసం పెరుగుతుంది!

 త్రిష

నాకు తీరిక దొరికినప్పుడల్లా అమ్మతో లేదా స్నేహితులతో కలిసి కొత్త ప్రాంతాలకు వెళ్లిపోతుంటా. అలా వెళ్లినప్పుడు... అక్కడి ప్రకృతినీ, కొత్త వంటకాలను ఆస్వాదిస్తూ జాలీగా గడిపి వచ్చేయడం కాకుండా స్కైడైవింగ్‌, స్కూబా డైవింగ్‌, బంగీ జంప్‌ వంటి సాహసాలు చేసేందుకూ రెడీ అయిపోతుంటా. అవి చేయడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం ఇంకాస్త పెరుగుతుందని నా అభిప్రాయం. అలాగే చెన్నై తరువాత నేను ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం న్యూయార్క్‌. అక్కడి వీధుల్లో నడుచుకుంటూ వెళ్లడం, సైకిలు తొక్కడం, షాపింగ్‌ చేయడం నాకు భలే ఇష్టం.


ప్రయాణాలే నాకు రీఛార్జ్‌

 శ్రుతీహాసన్‌

నేను నా రొటీన్‌ నుంచి బ్రేక్‌ తీసుకుని ఏదయినా కొత్త ప్రాంతానికి వెళ్లొస్తే.. శారీరకంగా, మానసికంగా ఉన్న అలసట దూరమై ఆ తరువాత మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతా. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించడం వల్ల మనమేంటనేది తెలుస్తుందని నమ్ముతా.  ఇతరులపైన ఆధారపడకుండా మన పనుల్ని ఎంత బాగా చేసుకోగలుగుతున్నామనేది అర్థమవుతుంది. ఒంటరిగా ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, కొత్తవాళ్లతో మాట్లాడుతూ, పుస్తకాలు చదువుతూ, సరదాగా షాపింగ్‌ చేయడం వల్ల మనలో ధైర్యమూ పెరుగుతుందని అనుకుంటా. అందుకే నేను వీలైనంతవరకూ ఒంటరిగా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటా.


ఒంటరిగానే వెళ్తుంటా

రశ్మిక మందన్న

నేను  హీరోయిన్‌ అయ్యాక షూటింగ్‌లలో భాగంగా కొత్తకొత్త ప్రదేశాలను చూడగలుగుతున్నా కానీ ఒకప్పుడు అమ్మానాన్నలు నన్ను ఎక్కడికీ ఒంటరిగా పంపించేవారు కాదు. అందుకే ఒకప్పుడు నేను చూడాలనుకున్న ప్రదేశాలన్నింటినీ ఇప్పుడు చుట్టొచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నా. షూటింగులూ, పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకుని నాకోసం నేను కొంత సమయం పెట్టుకునేందుకు ప్రయాణాన్ని మించింది లేదని అనుకుంటా. అందుకే అప్పుడప్పుడూ ఒంటరిగానే వెళ్లొచ్చేస్తుంటా. కొత్త ప్రదేశంలో అనామకురాలిగా తిరుగుతూ, నచ్చినట్లుగా ఎంజాయ్‌ చేయడంలో వచ్చే ఆనందం ఎప్పటికీ ఓ మధుర జ్ఞాపకమే. నాకు కూర్గ్‌లోని మా ఇల్లు, హైదరాబాద్‌ తరువాత పారిస్‌ అంటే చెప్పలేనంత ఇష్టం.


ఎన్నో తెలుసుకోవచ్చు

మృణాళ్‌ ఠాకూర్‌

నేనే కాదు... ప్రతిఒక్కరూ అవకాశం ఉన్నప్పుడల్లా కొత్త ప్రాంతాలను చూడటం, అక్కడివారితో మాట్లాడటం వల్ల విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు తెలియడంతోపాటూ... ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఒకే పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా చేసే విధానాలూ, పాటించే సంప్రదాయాలూ అలా తెలుసుకున్నవే. అలాగే నేను ఎక్కడికి వెళ్లినా కొత్తవాళ్లతో మాటలు కలుపుతూ నేను చూసొచ్చిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలనూ చర్చిస్తా. దీనివల్ల వారి నుంచి ఇంకొన్ని కొత్త విషయాలను తెలుసుకోగలుగుతా. ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుని రావడం ఓ అలవాటుగా పెట్టుకున్నా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..