ఈ ఊళ్ల రూటే సపరేటు!

కొన్ని గ్రామాల పద్ధతులూ ఆచారాలూ వ్యవహారాల గురించి వింటే భలే చిత్రంగా అనిపిస్తుంది.ఈ గ్రామాలు కూడా ఆ కోవకు చెందినవే. వైవిధ్యమైన సంప్రదాయాలు పాటిస్తూ అందరిచేతా ఔరా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఊళ్లు ఎక్కడున్నాయంటే...

Updated : 03 Mar 2024 14:33 IST

కొన్ని గ్రామాల పద్ధతులూ ఆచారాలూ వ్యవహారాల గురించి వింటే భలే చిత్రంగా అనిపిస్తుంది.ఈ గ్రామాలు కూడా ఆ కోవకు చెందినవే. వైవిధ్యమైన సంప్రదాయాలు పాటిస్తూ
అందరిచేతా ఔరా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఊళ్లు ఎక్కడున్నాయంటే...


ఆ రెండింటికీ దూరం

ఇంట్లో పెద్దవాళ్లు ఎవరైనా నిద్రపోతుంటే వీలైనంత నిశ్శబ్దంగా ఉంటాం కదా.. కర్ణాటకలోని యాదగిరి జిల్లా మైలాపుర్‌ గ్రామస్థులు ఇదే పద్ధతిని తమ ఇష్టదైవం విషయంలోనూ అనుసరిస్తున్నారు. ‘మల్లయ్య’గా పిలుచుకునే మైలారి లింగయ్య ఆ ఊరి దేవుడు. మైలాపుర్‌ వాసులు శివుడి అవతారంగా భావించి కొలిచే మల్లయ్య రాత్రిపూట నిద్రపోతాడనీ, ఆ సమయంలో  నిద్రాభంగం కలిగిస్తే ఊరికి చెడు జరుగుతుందనీ గ్రామస్థులు నమ్ముతారు. తెలవారుతుండగా ఊరిని నిద్రలేపే కోళ్లను అందుకే పెంచరు. క్రమంగా వాటిని తినడం కూడా మానేశారు. అన్నట్టు, ఆ ఊళ్లోని వారెవరూ మంచాల మీద పడుకోరు. పిల్లలూ, వృద్ధులూ, గర్భిణులూ, బాలింతలతో సహా ఎవరైనా నేల మీదే పడుకుంటారు. ఎందుకంటే వాళ్ల మల్లయ్య స్వామి, తన భార్య తురంగా దేవితో కలిసి మంచం మీద కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తుంటాడట. అందుకని మైలాపుర్‌ వాసులు స్వామిని గౌరవిస్తూ కొన్ని శతాబ్దాలుగా ఊళ్లో మంచాలు ఉపయోగించట్లేదు.


ఇంటికో రాముడు!

ల్లెల్లో ఒకే పేరుతో ఐదారుగురు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా మగవారి పేర్లే ఎక్కువగా అలా ఉంటుంటాయి. అయితే పశ్చిమ్‌ బంగాలోని బకుండా జిల్లా పశ్చిమ్‌ సనాబంద్‌ గ్రామంలో ఉంటుంది రామపాద ప్రాంతం. గిరిజన ప్రజలు ఉండే ఆ ప్రాంతానికి వెళితే అక్కడ ప్రతి ఇంట్లోనూ రాముడు ఉంటాడు... అంటే పూజ గదిలో రాముడు అనే సందేహం రావొచ్చేమో. అక్కడ మగవారి పేరు రాము, రాముడు, రామ... అనీ, మరికొందరు చిన్న చిన్న మార్పులతో రమాకాంత్‌, రాంలాల్‌, రామకృష్ణ... అనీ ఇలా రాముడి పేరు పెట్టుకోవడం ఆనవాయితీ. దాదాపు 250 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్న రామపాద గ్రామస్థుల ఆరాధ్యదైవం రాముడు. వారు ప్రతి ఒక్కరిలో రాముడు ఉంటాడని విశ్వసిస్తుంటారు. అందుకే మగపిల్లాడు పుడితే తప్పకుండా ఆ రామయ్య పేరే పెట్టుకుంటారు.


చాప్లిన్‌కోసం ఒక ఊరు

సాధారణంగా ఎవరైనా పిల్లల పుట్టినరోజుల్ని ప్రత్యేకంగా భావిస్తారు. తమకున్నంతలో వైభవంగా జరిపించాలని అనుకుంటారు. అందుకోసం ముందు నుంచీ ఏర్పాట్లు చేసుకుంటారు. అదే గుజరాత్‌లోని ఆదిపూర్‌ గ్రామస్థులు మాత్రం కొత్త ఏడాది తొలినాళ్ల నుంచే ఓ వ్యక్తి పుట్టినరోజును ఘనంగా జరిపించడానికి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై కనిపిస్తుంటారు. ఇంతకీ ఆ పుట్టినరోజు ఎవరిదో తెలుసా... చార్లీచాప్లిన్‌ది. ఏప్రిల్‌ 16 చార్లీ చాప్లిన్‌ జయంతి సందర్భంగా ఊరంతా కలిసి పండుగలా జరుపుకుంటారు. అంతేకాదు, పిన్నల నుంచీ పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ చార్లీచాప్లిన్‌లా మారిపోతుంటారు, అందుకోసం ముందు నుంచే కాస్ట్యూమ్స్‌, మేకప్‌ సామగ్రి వంటివి తెచ్చుకోవడం, పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేయడం వంటివెన్నో చేస్తుంటారు. ఎందుకంటే ఆ రోజున గ్రామంలోని మగవారంతా తెల్ల షర్టు మీద నల్లకోటు, టోపీ, చిన్న మీసంతో.. మేకప్‌ ధరించి చార్లీచాప్లిన్‌ అవతారమెత్తేస్తారు. యాభై ఏళ్ల క్రితం ఆ గ్రామానికి చెందిన అశోక్‌ అశ్వాని చార్లీచాప్లిన్‌ సినిమా చూసి అభిమానిగా మారాడు. అతనిలా హాస్యనటుడు అవ్వాలనుకున్నాడు కానీ కుదరలేదు. చాప్లిన్‌మీద అభిమానంతో యాభై ఏళ్లుగా అతని పుట్టినరోజును ఘనంగా జరుపుతున్నాడు. క్రమంగా తోటి గ్రామస్థులు కూడా అభిమానులుగా మారి ఈ వేేడుకల్లో పాలు పంచుకుంటున్నారు. అశోక్‌ కుటుంబ సభ్యులు పదేళ్లుగా ఈ వేడుకను కార్నివాల్‌ స్థాయిలో పెద్ద ఎత్తున జరిపి సోషల్‌ మీడియాలో విశేషాల్ని పంచుకోవడంతో అమెరికా, కెనడా, ఇటలీ, స్విట్జర్లాండ్‌లోని చాప్లిన్‌ అభిమానులు ఫిదా అయ్యారు. ఏటా ఏప్రిల్‌లో జరిగే ఈ కార్నివాల్‌ కోసం ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ఆదిపూర్‌ గ్రామానికి రావడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..