గాడిదపాలూ తాగేస్తున్నారు!

పశువుల, కోళ్ల ఫారాలూ పెట్టుకుని సంపాదించినవాళ్లూ ఉన్నారు. నష్టపోయినవాళ్లూ ఉండొచ్చు. కానీ గాడిదల ఫారం పెట్టుకుంటే మాత్రం కచ్చితంగా లాభాలే వస్తాయి అంటున్నారు కొందరు యువకులు. అనడమే కాదు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్ని వదులుకుని మరీ గాడిదల్ని పెంచుతున్నారు.

Updated : 03 Mar 2024 08:34 IST

పశువుల, కోళ్ల ఫారాలూ పెట్టుకుని సంపాదించినవాళ్లూ ఉన్నారు. నష్టపోయినవాళ్లూ ఉండొచ్చు. కానీ గాడిదల ఫారం పెట్టుకుంటే మాత్రం కచ్చితంగా లాభాలే వస్తాయి అంటున్నారు కొందరు యువకులు. అనడమే కాదు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్ని వదులుకుని మరీ గాడిదల్ని పెంచుతున్నారు. ఉన్నట్టుండి గాడిదల మీద ఇంత ప్రేమ ఎందుకొచ్చిందంటే...

‘గంగిగోవుపాలు గరిటెడైనను చాలు... కడివెడైననేమి ఖరము పాలు’ అన్న వేమన మాటని మార్చి చెప్పుకోవాలంటోంది నేటి యువత. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలానికి చెందిన మల్లంపూడిలో అక్షయ పేరుతో పెద్ద గాడిదల ఫామ్‌ను ప్రారంభించాడు ఎన్‌.కిరణ్‌ కుమార్‌. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటోన్న కిరణ్‌కి ఈ ఆలోచన ఎందుకొచ్చిందంటే- వైద్యుల సూచన మేరకు పిల్లవాడికి గాడిద పాలకోసం వెతికినప్పుడు 200మి.లీ.లీటర్ల పాలు వెయ్యిరూపాయలు చెప్పారట. దాంతో ఇదేదో బాగుందనుకుని ఉద్యోగం వదిలి, ఐఐటీ విద్యార్థి నవ్య గంపాలతో కలిసి 120 గాడిదలతో ఫామ్‌ పెట్టాడు. వాటి పాలను ఎక్కువగా ఫార్మా, కాస్మెటిక్‌ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయనీ ప్రత్యేకంగా నిల్వచేసి ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తున్నామనీ అంటున్నాడు కిరణ్‌. లీటరు పాలు రూ.7000 పలుకుతుండగా, మూత్రాన్ని లీటరు రూ.400లకు ఆయుర్వేద ఫార్మసీలకీ, పేడను కిలో రూ.250 చొప్పున అగరుబత్తుల కంపెనీలకీ అమ్ముతున్నారట.

ఇన్ఫెక్షన్లూ, కోరింత దగ్గు, వైరల్‌ జ్వరాలకీ ఆస్తమాకీ గాడిదపాలను మందుగా వాడుతుంటారు. ఈ పాలల్లో ఎ, బి, బి1, బి12, సి, డి, ఇ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. కొవ్వు తక్కువ. నిద్రలేమి, ఎసిడిటీలతోపాటు ఎగ్జిమా, సిఫిలిస్‌, స్కాబిస్‌, దురద, తామర... వంటి ఇన్ఫెక్షన్లకి గాడిద పాలు మంచి ఔషధమని చెబుతారు.

మన దేశంలో తొలిసారి కేరళకు చెందిన అబి బేబీ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి 30 గాడిదలతో ఫామ్‌ని ఏర్పాటుచేశాడు. ఆ పాలతో ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌, షాంపూ, లిప్‌బామ్‌, బాడీవాష్‌... వంటి కాస్మెటిక్స్‌ తయారుచేస్తున్నాడు. మంగళూరుకి చెందిన శ్రీనివాస గౌడ గాడిదల్ని పెంచి, పాల పాకెట్లను మాల్స్‌లో విక్రయిస్తున్నాడు. తెలంగాణలో షాబాద్‌ దగ్గర ఉన్న ఓ ఫామ్‌ ఏకంగా డాంకీ మిల్క్‌ బాత్‌ సౌకర్యాన్నీ అందిస్తోంది. కాబట్టి ఏ పనీ చేయనివాళ్లను ‘ఏం చేస్తున్నావ్‌... గాడిదల్ని కాస్తున్నావా...’ అని గాడిదని చులకన చేయకండి... అదిప్పుడు ఆవులూ గేదెలకన్నా ఖరీదైనది మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..