ఆలూ... అదిరిపోయేలా!

పిల్లలు ఇష్టపడే కూరగాయల్లో మొదట చెప్పుకునేది ఆలూ ఫ్రైనే. మరి వాళ్లు ఇంట్లో ఉండే ఈ సమయంలో పప్పు, చారు, సాంబారుకు కాంబినేషన్‌గా బంగాళాదుంపల్ని ఎప్పటిలా వేయించే బదులు ఇలా మార్చిమార్చి ట్రై చేస్తే సరి. అన్నంతోనే కాకుండా నేరుగానూ తినేస్తారంటే నమ్మండి.

Published : 12 May 2024 00:15 IST

పిల్లలు ఇష్టపడే కూరగాయల్లో మొదట చెప్పుకునేది ఆలూ ఫ్రైనే. మరి వాళ్లు ఇంట్లో ఉండే ఈ సమయంలో పప్పు, చారు, సాంబారుకు కాంబినేషన్‌గా బంగాళాదుంపల్ని ఎప్పటిలా వేయించే బదులు ఇలా మార్చిమార్చి ట్రై చేస్తే సరి. అన్నంతోనే కాకుండా నేరుగానూ తినేస్తారంటే నమ్మండి.


మసాలా ఫ్రై

కావలసినవి: బంగాళాదుంపలు: అరకేజీ (ఉడికించి కాస్త పెద్ద ముక్కల్లా కోయాలి), నూనె: పావుకప్పు, పసుపు: పావుచెంచా, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉప్పు: తగినంత. మసాలాపొడి కోసం: దనియాలు: రెండు చెంచాలు, సెనగపప్పు: టేబుల్‌స్పూను, మినప్పప్పు: చెంచా, సోంపు: చెంచా, దాల్చినచెక్క: చిన్నముక్క, లవంగాలు: అయిదు, ఎండుమిర్చి: ఆరు.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి... మసాలా దినుసుల్ని వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి. వాటి వేడి చల్లారాక మిక్సీలో తీసుకుని సరిపడా ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద మళ్లీ కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయించుకుని కరివేపాకు వేయాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు, పసుపు వేసి వేయించాలి. రెండు నిమిషాలయ్యాక చేసిపెట్టుకున్న పొడి వేయాలి. ఆలూ ముక్కలకు మసాలా పట్టిందనుకున్నాక దింపేయాలి. 


జీరా ఆలూ

కావలసినవి: బంగాళాదుంపలు: నాలుగు, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం తరుగు: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: రెండు, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, కసూరీమేథీ: చెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు, జీలకర్ర: ఒకటింబావు చెంచా, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, జీలకర్రపొడి: చెంచా, దనియాలపొడి: టేబుల్‌స్పూను.

తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపల్ని కుక్కర్‌లో వేసుకుని మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని ఆ తరువాత చెక్కుతీసి పెద్ద ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె, నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం తరుగు, సన్నగా కోసిన పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, కారం, జీలకర్రపొడి, దనియాలపొడి, తగినంత ఉప్పు, కసూరీమేథీ వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక బంగాళాదుంపలు వేసి మరోసారి కలపాలి. ఆలూ ముక్కలు వేగాయనుకున్నాక కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ని కట్టేయాలి.


బేబీ పొటాటో కర్రీ

కావలసినవి: ఉడికించి చెక్కుతీసిన బేబీ పొటాటోలు: అరకేజీ, నూనె: పావుకప్పు, ఆవాలు: చెంచా, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు: చెంచా, టొమాటోలు: మూడు (పేస్టు చేసుకోవాలి), పసుపు: పావుచెంచా, కారం: చెంచా, దనియాలపొడి: అరచెంచా, జీలకర్రపొడి: చెంచా, గరంమసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, తరవాత ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి వేగుతున్నప్పుడు అల్లంవెల్లుల్లి పేస్టు వేయాలి. ఇందులో పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, తగినంత ఉప్పు, టొమటో పేస్టు వేసి అన్నింటినీ కలపాలి. ఈ మసాలా బాగా వేగాక ఉడికించిన బేబీ పొటాటోలు వేసి.. వాటికి ఈ మసాలా పట్టేవరకూ కలిపి దింపేముందు కొత్తిమీర చల్లాలి.


క్రిస్పీ పొటాటో ఫింగర్స్‌

కావలసినవి: మందంగా ఉండే అటుకులు: కప్పు, ఉడికించిన ఆలూ పెద్దవి: రెండు, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: మూడు, ఎండుమిర్చి గింజలు: అరచెంచా, మిరియాలపొడి: అరచెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు, ఉప్పు: తగినంత, మైదా: పావుకప్పు, మొక్కజొన్నపిండి: చెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ముందుగా అటుకుల్ని మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి.  ఇందులో చెక్కుతీసిన బంగాళాదుంపలు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగుతోపాటు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకు చెంచా నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని కాస్త పొడుగ్గా ఫింగర్స్‌ మాదిరి చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకుని నాలుగైదు చొప్పున కాగుతున్న నూనెలో వేస్తూ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..