కూర... కాస్త కొత్తగా!

కొన్ని కూరగాయలు... ముఖ్యంగా బీరకాయ, దోసకాయ లాంటివాటిని ఎప్పుడూ ఒకేరుచిలో వండుకోవడంలో ప్రత్యేకత ఏముంటుంది చెప్పండీ.. అందుకే వాటిని కూడా మార్చిమార్చి ఇలాంటి రుచుల్లో ట్రై చేస్తే... అన్నం, రోటీ... దేనికైనా బాగుంటాయి.

Updated : 21 Apr 2024 00:12 IST

కొన్ని కూరగాయలు... ముఖ్యంగా బీరకాయ, దోసకాయ లాంటివాటిని ఎప్పుడూ ఒకేరుచిలో వండుకోవడంలో ప్రత్యేకత ఏముంటుంది చెప్పండీ.. అందుకే వాటిని కూడా మార్చిమార్చి ఇలాంటి రుచుల్లో ట్రై చేస్తే... అన్నం, రోటీ... దేనికైనా బాగుంటాయి.


దోసకాయ మసాలా

కావలసినవి: దోసకాయ: ఒకటి, టొమాటోలు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కొబ్బరిముక్కలు: పావుకప్పు, వేయించిన నువ్వులు: టేబుల్‌స్పూను, గరంమసాలా: అరచెంచా, దనియాలపొడి: చెంచా, కారం: చెంచా, పసుపు: పావుచెంచా, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు రెబ్బలు: రెండు, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, అల్లంవెల్లుల్లి పేస్టు: చెంచా, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయించుకుని ఉల్లిపాయముక్కలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి మూత పెట్టాలి. అయిదు నిమిషాలయ్యాక అల్లంవెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కలు వేసి మరోసారి కలిపి దనియాలపొడి, గరంమసాలా, కారం, పసుపు, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేయాలి. ఈ ముక్కలు మెత్తగా అయ్యాక కొబ్బరి, నువ్వులు, పావుకప్పు నీళ్లు కలిపి పేస్టులా చేసి కూరలో వేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. మధ్యమధ్య కలుపుతూ ఉండి కూర దగ్గరకు అయ్యాక దింపేయాలి.


బీరకాయ అలసందల కూర

కావలసినవి: బీరకాయలు: రెండు పెద్దవి, పచ్చిమిర్చి: ఆరు, బొబ్బర్లు: కప్పు, నూనె: పావుకప్పు, జీలకర్ర: చెంచా, ఆవాలు: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, కరివేపాకు రెబ్బలు: రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు: చెంచా, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, దనియాలపొడి: చెంచా, కారం: అరచెంచా.  

తయారీ విధానం: బొబ్బర్లను ముందురోజు నానబెట్టుకుని మర్నాడు కుక్కర్‌లో మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకోవాలి. బీరకాయల చెక్కు తీసి చిన్న ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి జీలకర్ర, ఆవాలు వేయించుకోవాలి. తరవాత అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరోసారి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాక ఉడికించుకున్న బొబ్బర్లు, బీరకాయ ముక్కలు, పసుపు వేసి కలిపి మూత పెట్టాలి. బీరకాయ ముక్కలు మెత్తబడ్డాక తగినంత ఉప్పు, దనియాలపొడి, కారం వేసి కలిపి కూర దగ్గరకు అయ్యాక స్టవ్‌ని కట్టేయాలి.


సొరకాయ ఆవ కూర

కావలసినవి: సొరకాయ: ఒకటి చిన్నది, మినప్పప్పు: చెంచా, సెనగపప్పు: చెంచా, నూనె: పావుకప్పు, ఆవాలు: చెంచా, ఎండుమిర్చి: ఒకటి, పసుపు: పావుచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, బెల్లం తరుగు: చెంచా, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: టేబుల్‌స్పూను. ఆవకోసం: ఆవాలు: చెంచా, రసంపొడి: చెంచా, కొబ్బరితురుము: అరకప్పు, కరివేపాకు రెబ్బలు: రెండు.  

తయారీ విధానం: సొరకాయ చెక్కు తీసి చిన్న ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి... మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేయించుకుని సొరకాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, తగినంత ఉప్పు, బెల్లం తరుగు వేసి మూత పెట్టాలి. సొరకాయ ముక్కలు మెత్తగా అయ్యాక ఆవాలు, రసంపొడి, కొబ్బరితురుము, కరివేపాకు కలిపి పొడిలా చేసుకుని కూరపైన వేసి కలపాలి. కూర పొడిపొడిగా అయ్యాక దింపేముందు కొత్తిమీర తరుగు వేస్తే చాలు.


పొట్లకాయ పెసరపప్పు కూర

కావలసినవి:  పొట్లకాయ: ఒకటి పెద్దది, పెసరపప్పు: పావుకప్పు (ముందుగా నానబెట్టుకోవాలి), ఉల్లిపాయ: ఒకటి, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: టేబుల్‌స్పూను, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఇంగువ: చిటికెడు, తాజా కొబ్బరితురుము: అరకప్పు, పచ్చిమిర్చి: ఒకటి, అల్లం: చిన్నముక్క.  

తయారీ విధానం: ముందుగా కొబ్బరితురుము, పచ్చిమిర్చి, అల్లంముక్కను మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక సన్నగా కోసిన పొట్లకాయముక్కలు, నీళ్లు వంపేసిన పెసరపప్పు వేసి కలిపి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. పొట్లకాయ ముక్కలు కాస్త మగ్గాక పసుపు, కారం, తగినంత ఉప్పు, చేసిపెట్టుకున్న కొబ్బరి పేస్టు, కొత్తిమీర తరుగు వేసి కలిపి.. అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..