పుస్తకంలోని బొమ్మ... నిజమై వస్తే!

డైనోసార్ల గురించి చదువుకుంటాం. అవి నిజంగా ఎలా ఉంటాయో మహా అయితే సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ వాటి కాలానికి వెళ్లి ప్రత్యక్షంగా చూడాలంటే...? మనిషి శరీరం లోపలి భాగాల గురించి పిల్లలకు పాఠాలు ఉంటాయి.

Published : 21 Jan 2023 23:29 IST

పుస్తకంలోని బొమ్మ... నిజమై వస్తే!

డైనోసార్ల గురించి చదువుకుంటాం. అవి నిజంగా ఎలా ఉంటాయో మహా అయితే సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ వాటి కాలానికి వెళ్లి ప్రత్యక్షంగా చూడాలంటే...? మనిషి శరీరం లోపలి భాగాల గురించి పిల్లలకు పాఠాలు ఉంటాయి. గుండె, ఊపిరితిత్తులూ... అంటూ బొమ్మలు గీసి చెబుతారు టీచర్లు. అవి నిజంగా ఎలా ఉంటాయో నేరుగా చూడాలంటే...?

ర్చువల్‌ రియాలిటీ... దీని గురించి పూర్తిగా తెలియకపోయినా కనీసం ఈ పేరైనా వినుంటారుగా. దూరాన ఉన్న ప్రపంచాన్ని అచ్చంగా మన కళ్లముందుకు తీసుకొచ్చే సాంకేతికత. షాపింగ్‌ దగ్గర్నుంచి పర్యటకం వరకూ ప్రతి దాంట్లోనూ దూరిపోయిన ఈ టెక్నాలజీ... ఇప్పుడు పిల్లల దగ్గరికీ చేరిపోయింది. పుస్తకాల్లోని బొమ్మల్ని నిజంగా చూపిస్తూ కొత్త లోకంలోకి తీసుకెళ్తోంది. సాధారణంగా పిల్లలకు ఏదైనా నేర్పించేటప్పుడు విషయాన్ని మామూలుగా చెబితే అది అంతగా అర్థం అవదనే ఉద్దేశంతో బొమ్మలతోనో, ఉదాహరణలతోనో కొత్త విషయాలు నేర్పిస్తుంటారు టీచర్లైనా, ఇంట్లో పెద్దవాళ్లైనా. అయితే ఇప్పుడు ఆ విషయం చెప్పడమే కాదు, పూర్తిగా ఆ ప్రపంచాన్ని పిల్లల కళ్లముందుకు తీసుకు రావచ్చు కూడా. అంతరిక్షం నుంచి మానవ శరీర నిర్మాణం వరకూ ఎన్నెన్నో విషయాల్ని సులువుగా చెప్పడానికి వీలుగా పుస్తకాలతో వీఆర్‌ టెక్నాలజీ కలిసి వస్తోంది.

ఎలా పనిచేస్తుంది...

వర్చువల్‌ రియాలిటీ కిడ్స్‌ సైన్స్‌ ల్యాబ్‌, యూనివర్స్‌, హ్యూమన్‌బాడీ, అట్లాస్‌, డైనోసార్‌, మ్యాజిక్‌, స్పేస్‌ ల్యాబ్‌ అంటూ రకరకాల పేర్లతో ఈ వీఆర్‌ కిడ్స్‌ కిట్స్‌ దొరుకుతున్నాయి. వీటిల్లో ఆయా విషయాన్ని బట్టి పుస్తకాలూ, బొమ్మలూ... వాటితో పాటూ మనల్ని కొత్త ప్రపంచానికి తీసుకెళ్లడానికి వీఆర్‌ కళ్లజోడూ వస్తాయి. ముందు ఏదైనా ఫోన్‌లో ఆ కిట్‌కు సంబంధించిన ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తర్వాత ఫోన్‌ ద్వారా ఆ బొమ్మను స్కాన్‌ చేస్తే దాని సమాచారమంతా వీడియోగా మారి కనిపిస్తుంది. ఉదాహరణకు పుస్తకంలో అగ్నిపర్వతం ఉంటే దాన్ని స్కాన్‌ చేయగానే అగ్నిపర్వతం బద్దలవడమూ, లావా పొంగడమూ లాంటిదంతా వీడియో రూపంలో కనిపిస్తుంది. ఆ తర్వాత అదే ఫోన్‌ను వీఆర్‌ కళ్లజోడులో ఉంచి పెట్టుకున్నామంటే... నిజమైన అగ్నిపర్వతం ఎలా ఉంటుందో... మన కళ్ల ముందు ప్రత్యక్షమై మనముందే అగ్నిపర్వతం ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ కిట్‌లో వచ్చే పుస్తకంలోని ఒక కొత్త విషయం గురించి బొమ్మ చూడ్డమే కాకుండా, దాని వీడియో ద్వారా విషయాలు కళ్లారా తెలుసుకోవచ్చూ, ఆ తర్వాత అంతకుమించి వీఆర్‌ టెక్నాలజీతో నేరుగా చూసిన అనుభూతినీ పొందొచ్చన్నమాట.

ఇలా ఈ ప్రత్యేకమైన వీఆర్‌ కిడ్స్‌ కిట్‌లతో నిజంగానే మనం అంతరిక్షంలోకి దూసుకుపోయినట్టూ, గ్రహాల్నీ నేరుగా తాకినట్టూ... రాకాసిబల్లులు మన ముందే అటూఇటూ తిరుగాడుతున్నట్టూ... ఐఫిల్‌ టవర్‌ ఎదురుగా మనం నిలబడినట్టూ... బోలెడన్ని అనుభూతులు కలుగుతాయి. వీటితోపాటు ఇంట్లో ఉన్నా కూడా బయట ఆడుకునే ఆటల సీన్‌లోకి వెళ్లినట్టుగా, ఫోన్‌లో ఉండే గ్రాఫిక్‌ ఆటల్లోకి మనమే దూరిపోయి ఆడినట్టుగా చూపేవీ... ఇంకా థ్రిల్‌ కోసం రోలర్‌ కోస్టర్‌లాంటి రైడ్లలో తిరిగినట్టుగా, భయపెట్టే చీకటి గదిలోకి వెళ్లినట్టుగా అనుభూతినిచ్చేవీ... ఇలా రకరకాల వీఆర్‌ కిడ్స్‌ గేమింగ్‌ కిట్‌లు మార్కెట్లో ఉన్నాయి. మాయ చేసినట్టుగా- ఉత్తుత్తి బొమ్మల్ని మాత్రమే చూస్తూ నేర్చుకోకుండా అమాంతం నిజమైన లోకంలోకి పట్టుకెళ్లే ఈ వీఆర్‌ బొమ్మల సెట్లు భలే ఉన్నాయి కదూ. మామూలు ఆటబొమ్మలకు బదులు ఈసారెప్పుడైనా మీ పిల్లలకు వీటిని బహుమతిగా ఇవ్వండి... ఆనందంతో ఎగిరి గంతులేస్తారంటే నమ్మండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..