భారతీయులం కాబట్టే...
తండ్రి ఐఏఎస్ అధికారి. ఆయన ఉద్యోగరీత్యా శ్రీకాకుళం, తిరుపతి, ముస్సోరి, దిల్లీ, హైదరాబాద్‌లలో చదువుకున్నారు.
భారతీయులం కాబట్టే...
మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎమ్... భారతీయులు సీఈఓలుగా ఉన్న బహుళజాతి సంస్థలు. ఆ జాబితాలో మరో 20-30 సంస్థలున్నాయి. 25 మంది భారతీయ మూలాలున్న వ్యక్తులు నాయకత్వం వహించే కంపెనీల విలువ సుమారు నాలుగు వందల లక్షల కోట్ల రూపాయలని అంచనా. ఈ మొత్తం ఇండియా జీడీపీ కన్నా ఎక్కువ. మరి ఆయా సంస్థలు భారతీయులకే ఎందుకు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తున్నాయీ అంటే... మిగతావారిలో లేని, మనవాళ్లలో ఉన్న నైపుణ్యాలకు భారతీయ నేపథ్యమే ప్రధాన కారణమని చెబుతున్నారీ సీఈఓలు...
క్రికెట్... జీవిత పాఠాలు నేర్పింది!
తండ్రి ఐఏఎస్ అధికారి. ఆయన ఉద్యోగరీత్యా శ్రీకాకుళం, తిరుపతి, ముస్సోరి, దిల్లీ, హైదరాబాద్‌లలో చదువుకున్నారు. దీనివల్ల కొత్త పరిస్థితులకు త్వరగా అలవాటు పడటం నేర్చుకున్నానంటారు సత్య నాదెళ్ల. ఒకసారి కార్ల్‌మార్క్స్ పోస్టర్‌ని సత్యా గదిలో తండ్రి అతికిస్తే, సంస్కృతం టీచర్ అయిన తల్లి.. లక్ష్మీదేవి పోస్టర్‌ని పెట్టారు. ‘నాన్న నాలో మేధావిని చూడాలనుకుంటే, అమ్మ దేన్నీ మూర్ఖంగా పట్టుకోకుండా సంతోషంగా ఉండమని చెప్పేది. వారి భిన్నమైన ఆలోచనా ధోరణులు నన్ను ప్రభావితం చేశాయి’ అని చెబుతారు సత్య. ఇంటర్ తర్వాత హైదరాబాద్‌లోనే డిగ్రీ చేసి బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడాలనుకునేవారు. ఆయన తండ్రి మాత్రం ‘కొత్త ప్రాంతానికి వెళ్లి చదువుకో’ అని సూచించడంతో మణిపాల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేశారు. క్రికెటర్ అవ్వాలనుకునేవారు సత్య. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో క్రికెట్ ఆడారు. ‘క్రికెట్ ఆశ తీరకపోయినా ఆ అనుభవాలు మాత్రం జీవిత పాఠాల్నీ, నాయకత్వ లక్షణాల్నీ నేర్పాయి. పోటీదారుని గౌరవించాలి, కానీ భయపడకూడదు, టీమ్‌కి ప్రాధాన్యమివ్వాలి, ప్రతి ఒక్కరి ప్రతిభనీ బయటకు తియ్యాలి’ లాంటి విషయాల్ని క్రికెట్ నుంచి నేర్చుకున్నా’ అని చెబుతారు సత్య. అంతే కాదు, ‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వేర్వేరు రాష్ట్రాల విద్యార్థులు ఉండేవారు. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లతో గిరిజన పిల్లలూ అక్కడ చదివేవారు. అంతటి భిన్నత్వం మరోచోట ఉండదు. అది చాలా మంచి అనుభవం’ అంటారు సత్య.
సత్య నాదెళ్ల, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈఓ మైక్రోసాఫ్ట్
ఆ తపనే...నిలుపుతోంది!
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి... తల్లి ఇంగ్లిష్ టీచర్, తండ్రి ప్లాస్టిక్ తయారీ ఫ్యాక్టరీ నడిపేవారు. శంతను... స్కూల్ రోజుల్లో ఆల్‌రౌండర్. స్నేహితులతో కబుర్లూ, క్రీడలూ, ప్రత్యేక కార్యక్రమాలు... వీటి తర్వాతే చదువుకి సమయం కేటాయించేవాణ్నని చెప్పే శంతను... డిబేట్‌లలోనూ ఎక్కువగా పాల్గొనేవారు. జాతీయ స్థాయి సెయిలింగ్ క్రీడాకారుడు.
జర్నలిజం అంటే ఆసక్తి. కానీ తల్లిదండ్రుల సూచనతో ఇంజినీరింగ్ చేశారు. ‘అప్పట్లో అమెరికా వెళ్లడం అంటే తల్లిదండ్రుల కలల్ని నిజం చేయడం, అన్నయ్యల అడుగుజాడల్లో నడవడం. మా అన్నయ్య అప్పటికే అమెరికాలో ఉన్నాడు. దాంతో నేనూ అతడి దారిలో వెళ్లా’ అని చెబుతారు శంతను. ‘భారతీయులు ఎప్పుడూ కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగాలని చూస్తారు. అందుకోసం ఎంతైనా శ్రమిస్తారు. భారత్‌లో మంచి విద్యా సంస్థల్లో చదువుకోవడం, ఇంగ్లిష్ నైపుణ్యాలు లాంటివీ మనవారి విజయాలకు కారణం. టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలూ మన సొంతం’ అని చెప్పే శంతను.. తన కెరియర్‌కు అసలైన పునాది ఉస్మానియా యూనివర్సిటీలో పడిందంటారు. అందుకే తనని తాను ఎప్పటికీ ఉస్మానియన్‌గానే చెబుతారు. ఈయన తండ్రి కూడా ఉస్మానియాలో ఇంజినీరింగ్ చేశారు. ‘ఇప్పట్లా హైదరాబాద్‌లో అప్పుడు అవకాశాలు లేవు, ఉండుంటే ఇక్కడే ఉండిపోయేవాణ్ని’ అంటారు శంతను.
శంతను నారాయణ్, ఛైర్మన్, సీఈఓ అడోబీ సిస్టమ్స్
మనం చాలా గ్లోకల్!
ఓ క్రికెటర్ చివరి బంతికి షాట్ కొడితే డ్యాన్స్ చేస్తూ స్టాండ్స్ నుంచి గ్రౌండ్‌వైపు దూసుకొస్తుందో అమ్మాయి... ‘క్యాడ్‌బరీస్’ ప్రకటన తెలుసుగా! దాన్ని మార్చి అమ్మాయి క్రికెట్ ఆడుతున్నట్టు కొత్త ప్రకటన వచ్చింది... చూశారా! ఆ ఐడియా దేవికాది! డవ్, పాండ్స్, హమామ్... ఇలా అతిపెద్ద బ్రాండ్‌లకి ప్రకటనలు రూపొందించే నంబర్‌వన్ యాడ్ ఏజెన్సీ ‘ఒగిల్వీ’కి సీఈఓ తను. అమృత్‌సర్‌లో పుట్టిన దేవిక ముంబయిలో డిగ్రీ చేసి శాన్‌ఫ్రాన్సిస్కోలో పీజీ చేసి ప్రకటనల రంగంలో ప్రవేశించింది. అమెరికాలోని మెక్‌క్యాన్ యాడ్ ఏజెన్సీలో పాతికేళ్లు వివిధ విభాగాలని నడిపింది. గతేడాదే ఒగిల్వీ తమ కంపెనీ సారథ్యాన్ని దేవికకి అప్పగించింది. ‘ఒకప్పుడు సృజన, ఆవిష్కరణలన్నవి పాశ్చాత్య ప్రపంచం నుంచే భారత్ వైపు వచ్చేవి. ఇప్పుడు కథ మారుతోంది. ఆ మధ్య యాడ్ ఏజెన్సీల కోసం జరిగిన లండన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో ఎక్కువ భాగం మనకే వచ్చాయి. అదీ మార్పు అంటే. మూలాలని వదలుకోకుండా లోకల్‌గానే ఉంటూ... గ్లోబల్‌గా ఆలోచించడం భారతీయులకి బాగా వచ్చు. ఆ గ్లోకల్ గుణమే... నా విజయానికీ కారణం అని భావిస్తున్నాను’ అంటోంది దేవిక.
దేవికా బుల్‌చందానీ, సీఈఓ ఒగిల్వీ
టెక్నాలజీతో మార్పు చూశా!
సుందర్ నాన్న ఎలక్ట్రికల్ ఇంజినీర్, అమ్మ స్టెనోగ్రాఫర్. తన ఎదుగుదలకు మధ్యతరగతి కుటుంబ నేపథ్యం ప్రధాన కారణమంటారు సుందర్. ‘చదువు, జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యమిచ్చే కుటుంబం మాది. మా చదువుల కోసం అమ్మానాన్నలు ఎన్నో త్యాగాలు చేశారు. చెన్నైలో డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో ఉండేవాళ్లం. చుట్టాలు వస్తే తమ్ముడూ, నేనూ హాల్లో నేలపైనే నిద్రపోయేవాళ్లం. ఎక్కడికైనా నలుగురం ఒకే స్కూటర్‌మీద వెళ్తుండేవాళ్ళం. క్రికెట్, చదువు... ఇవే జీవితం. అయినా ఏ లోటూ కనిపించలేదు. అప్పట్లో ఇంట్లో ఫ్రిజ్ ఉండటం చాలా గొప్ప విషయం. అది కొన్నాక అమ్మకు వంటగదిలో పని తగ్గి మాతో ఎక్కువ సమయం గడిపేది. అమ్మకు ఆరోగ్యం బాలేక రక్త పరీక్షలు చేయించాల్సి వచ్చేది. బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ తేవడానికి గంటన్నర సేపు ప్రయాణించి హాస్పిటల్‌కి వెళ్లేవాణ్ని. అంత దూరం వెళ్లినా కొన్నిసార్లు వేచి ఉండమనేవారు. నాకు పన్నెండేళ్లప్పుడు ఇంటికి ఫోన్ వచ్చింది. అప్పుడు హాస్పిటల్‌కి వెళ్లకుండానే ఫోన్‌చేసి రిపోర్టులు సిద్ధంగా ఉన్నాయో లేదో కనుక్కునేవాణ్ని. దాంతో ఎంతో సమయం ఆదా, శ్రమ కూడా ఉండేది కాదు. ఇవన్నీ చూశాక సాంకేతిక రంగంపైన ఆసక్తి కలిగింది. ఈరోజు గూగుల్ తెచ్చే ఉత్పత్తులతోనూ ఇలాంటి మార్పు రావాలనుకుంటాను. ఆలోచనల్లోనే కాదు, అలవాట్లలోనూ భారత్ నాలో అంతర్భాగం. మా ఇంట్లో అందరూ న్యూస్‌పేపర్ చదివేవాళ్లు.
ఇప్పటికీ నేను వాల్‌స్ట్రీట్ జర్నల్ తెప్పించుకుని టీ తాగుతూ చదువుతా. నేను ఎప్పుడు ఇండియా వచ్చినా పెద్ద ఎత్తున స్పందన, మద్దతు ఉంటాయి. ఏదో ఒక రోజు ఇండియాకి తిరిగి వచ్చి దేశం రుణం తీర్చుకుంటా.
సుందర్ పిచాయ్, సీఈఓ ఆల్ఫాబెట్
దేశమంటే... మా అమ్మే!
‘భారతదేశాన్నీ... మా అమ్మ విశాలనీ వేరుచేసి చూడలేను నేను. ఇంట్లో మేం ఐదుగురం ఆడపిల్లలం. నా చివరి చెల్లి పుట్టాక నాన్న ఎ.ఎన్.స్వామి ఓ ప్రమాదంలో చనిపోయారు. అప్పుడు అమ్మకి 30 ఏళ్ళు కూడా లేవు! తన జీవితంలో అంత పెద్ద విషాదమున్నా... పేదరికం వెన్నాడుతున్నా అమ్మ ఎంతో పోరాటంతో మా అందరికీ ఉన్నత చదువు చెప్పించింది. తనలోని సానుకూల దృక్పథంతోనే ఇదంతా సాధ్యమైందని అంటాన్నేను. ఔను... మిన్ను విరిగి మీదపడ్డా ‘మనకి మంచే జరుగుతుంది... ఏమీ కాదు’ అని దృఢంగా నమ్ముతుందామె! ఆ సానుకూల దృక్పథమే నేను అమ్మ నుంచీ, ఇంకా చెప్పాలంటే భారతదేశం నుంచీ నేర్చుకున్న పెద్ద పాఠమని నమ్ముతాను. ఒట్టి మెట్టవేదాంతమని కొట్టిపారేస్తారు కానీ... ‘అంతా మన మంచికే’ అనుకునే మన భారతీయ భావనలో ఎంత నిశ్చింత ఉందో! సగటు భారతీయుడికున్న గొప్ప పాజిటివ్ లక్షణం అది. అదే నన్ను విజయతీరాలకి చేర్చిందని నమ్ముతాను...’ అంటుంది రేవతీ అద్వైతి. ఎలక్ట్రానిక్ వస్తువుల ‘కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్’ రంగంలో అగ్రగామి సంస్థ ‘ఫ్లెక్స్’కి సీఈఓ ఆమె. రేవతి సారథ్యంలోనే ఈ కంపెనీ కరోనా కాలంలో వైద్యులకి అవసరమయ్యే ‘పీపీఈ కిట్’లని భారీస్థాయిలో ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసింది. 2018 నుంచి ఈ ఏడాది దాకా ఫార్చూన్ మోస్ట్ పవర్‌ఫుల్ విమన్ జాబితాలో ఉంటూ వస్తోంది రేవతి!
రేవతీ అద్వైతి, సీఈఓ ఫ్లెక్స్
భిన్న సంస్కృతుల చలవే!
ఒకప్పుడు మామూలు వీడియో షేరింగ్ సంస్థగా ఉన్న వీమియో సంస్థని నేడో గ్లోబల్ కంపెనీగా మార్చింది అంజలి. ఆ సంస్థలో 2015లో మార్కెటింగ్ విభాగంలో చేరిన రెండేళ్లలో సీఈఓ స్థానానికి ఎదిగింది. ఏడాది తిరక్కుండానే ఫార్చూన్ ‘40 అండర్ 40’ జాబితాలోనూ, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘యంగ్ గ్లోబల్ లీడర్’గానూ నిలిచి తనేమిటో నిరూపించుకుంది. వీమియో... మొదట్లో యూట్యూబ్‌కి పోటీగానే మొదలైంది కానీ ఆ తర్వాత తన పంథా మార్చుకుంది. భారీ కార్పొరేట్ సంస్థలు తమదైన ప్రకటనలు రూపొందించుకోవడం మనకు తెలుసు. అవేకాకుండా చిరువ్యాపార సంస్థలూ తమదైన ప్రకటనల్ని చక్కటి వీడియోల రూపంలో రూపొందించడానికి వీమియో ఉపయోగపడుతుంది. అంజలీ సీఈఓగా ఈ వీమియోని చక్కటి వీడియో కమ్యూనిటీగానూ మార్చింది. ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్లు, డైరెక్టర్లు తమ సృజనని ఇందులోనే పంచుకుంటూ ఉంటారు. 20 కోట్ల వినియోగదారులతో వీమియోని పరుగెత్తిస్తున్న అంజలి... తల్లిదండ్రులు వారసత్వంగా అందించిన భారతీయతే తన విజయానికి మూలమని చెబుతుంది. ‘అమ్మానాన్నలది పంజాబ్. నేను పుట్టకముందే అమెరికాలోని డెట్రాయిట్‌లో స్థిరపడ్డారు. నాన్న ఫిజీషియన్. చిన్నప్పటి నుంచీ బంధువుల మధ్యే పెరిగాను. బాలవిహార్‌లో శాస్త్రీయ నాట్యం నేర్చుకుంటూ ఫక్తు భారతీయురాలిలాగానే పెరిగాను. అదే సమయంలో అమెరికన్ స్వేచ్ఛనీ ఆస్వాదించాను. ఒకేసారి రెండు సంస్కృతుల మధ్య ఎదగడం వల్ల... విభిన్న మనస్తత్వాలని అర్థంచేసుకుని అందర్నీ కలుపుకుని పోవడం అలవాటైంది. సీఈఓగా నా విజయంలో ఇదే కీలకపాత్ర పోషించింది...’ అంటుంది అంజలి.
అంజలీ సూద్, సీఈఓ వీమియో
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!
-
Crime News
Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?