మహిళల కోసం ఒక మంచి దేశం... డెన్మార్క్‌!

ఒక మహిళగా జీవించడానికీ, తల్లిగా పిల్లల్ని పెంచడానికీ ‘మంచి దేశం’ ఏదీ అంటే- ‘డెన్మార్క్‌’ అంటోంది ప్రపంచం. సమానత్వానికీ సంతోషానికీ శాంతికీ భద్రతకీ చిరునామా ఈ దేశం అని కితాబిచ్చింది ఇటీవల వెలువడిన ‘విమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌’.

Updated : 03 Mar 2024 07:32 IST

ఒక మహిళగా జీవించడానికీ, తల్లిగా పిల్లల్ని పెంచడానికీ ‘మంచి దేశం’ ఏదీ అంటే- ‘డెన్మార్క్‌’ అంటోంది ప్రపంచం. సమానత్వానికీ సంతోషానికీ శాంతికీ భద్రతకీ చిరునామా
ఈ దేశం అని కితాబిచ్చింది ఇటీవల వెలువడిన ‘విమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌’. స్త్రీల ప్రగతికీ దేశాభివృద్ధికీ విడదీయరాని సంబంధం ఉందని సామాజికవేత్తలు సూచిస్తున్న నేపథ్యంలో... పలు విషయాల్లో ప్రగతి మార్గంలో పయనిస్తున్న డెన్మార్క్‌ రహస్యమేమిటో తెలుసుకోవడం ఆసక్తికరం.

దాదాపు 170 ఏళ్ల క్రితం సంగతి. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. తుపాకీలో తూటా పెట్టడంలో అతడు చేసిన ఆలస్యం అధికారులకు కోపం తెప్పించింది. ‘నువ్వు సైన్యానికి పనికి రావు పొమ్మ’న్నారు. అతడికి బాధనిపించింది. చేసేది లేక సొంతూరెళ్లి చిన్న పాఠశాల పెట్టుకున్నాడు. ఆరోజుల్లో ప్రభుత్వం చదువుకు ప్రాధాన్యమిస్తూ బడి నడిపేవాళ్లకు ఆర్థికసాయమూ అందించేది. అందుకని బడిపెట్టి అందరూ చెప్పే పాఠాలే తనూ చెప్పాడు. పిల్లలు ఏమాత్రం ఆసక్తి కనబరచకపోవడంతో కొత్త ప్రయోగాలు చేశాడు. చరిత్రలో వీరుల కథలను చదివి వినిపించేవాడు, పాటలు కట్టి పాడేవాడు. వాళ్లు ఉత్సాహంగా వినేవారు. నీతి కథలు చెబితే ఆచరించి చూపించేవారు. అది చూసిన అతడికి మొత్తంగా సిలబస్‌ మార్చేయాలన్న ఆలోచన వచ్చింది. పదిహేనుమంది కుర్రాళ్లను తీసుకెళ్లి పొలంలో గురుకులం పెట్టాడు. తాను రాసుకున్న సరికొత్త పాఠాలు చెప్పడం మొదలెట్టాడు. ఒకపక్క సాగులో మెలకువలు... మరోపక్క జీవన నైపుణ్యాలు. ఆ పిల్లలు దేశ చరిత్రతో మొదలెట్టి కళల వరకూ ఎన్నో నేర్చుకున్నారు. అక్కడినుంచి బయటకు వచ్చిన పిల్లల ఆలోచనా విధానంలోనూ అలవాట్లలోనూ పనిచేసే తీరులోనూ ఎంతో మార్పు కనిపించింది. అది చూసి తమ పిల్లల్నీ అతని బడికి పంపించడానికి పెద్దలు పోటీపడేవారు.  

ఒక బ్యాచ్‌ అబ్బాయిలు మరో బ్యాచ్‌ అమ్మాయిలు చొప్పున పాఠశాల కొనసాగింది. ఇక్కడ చదువుకుని వెళ్లిన వాళ్లు తమ తమ ప్రాంతాల్లో కొత్త పాఠశాలలు పెట్టారు. అలా చూస్తూ చూస్తూ ఉండగానే మొత్తంగా ఒక తరమంతా అతడి బోధనల ప్రభావానికి లోనయింది.

అతడి పేరు క్రిస్టెన్‌ కోల్డ్‌... ఆ పాఠశాలల్ని ఫోక్‌స్కూల్స్‌ అనేవారు. అతడు పాటించిన విధానాన్ని వాళ్ల భాషలో ‘బిల్డంగ్‌’ అనేవారు. దానికి కచ్చితంగా అర్థం చెప్పలేం కానీ ‘ట్రాన్స్‌ఫర్మేషన్‌’ లేదా ‘కీప్‌ గ్రోయింగ్‌’ అనుకోవచ్చంటారు నిపుణులు. దీనివల్ల వచ్చిన మార్పేమిటీ అంటే...

‘అక్కడ సంపద పోగవలేదు... అలాగని పేదరికమూ లేదు. అందరికీ తృప్తిగా బతకడానికి చాలినంత ఉంది.

ఎవరి దగ్గరా పట్టాలు లేవు కానీ అందరూ చదువుకున్నవాళ్లే! తమకు తెలిసింది నలుగురికీ చెబుతారు. ప్రతి పనిలోనూ తలో చెయ్యీ వేస్తారు... యూరప్‌లో మిగతా దేశాలకు భిన్నమైన పరిస్థితిని ఇక్కడ చూశాం’ అని రాశారు నాటి చరిత్రకారులు. అంటే సమష్టి తత్వం, సహకార జీవనం ప్రజాజీవనంలో భాగమయ్యాయి. అలా మొదట కిరాణా దుకాణాలు, తర్వాత పాడి పరిశ్రమ... ఒక్కటొక్కటిగా ఇలా అన్ని రంగాల్లోనూ సహకార విధానం వేళ్లూనుకుంది. ఆయా సంఘాల భవనాలన్నిట్లోనూ తప్పనిసరిగా గ్రంథాలయానికి ఒక గది ఉండేది! స్త్రీ పురుషులు దాన్ని ఉపయోగించుకునేవారు. కొత్తగా పెంపొందించుకున్న విలువలూ ప్రమాణాలనే ప్రగతి బండికి రెండు చక్రాలుగా చేసుకుని... ఒకనాటి నిరుపేద దేశం స్వావలంబన సాధించింది. మారిన సమాజం దేశాన్నే మార్చేసింది...

అంతా బాగానే ఉంది కానీ దీనికీ స్త్రీల సమానత్వానికీ ఏమిటీ సంబంధం అని కదూ సందేహం..? అదీ చూద్దాం.

గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌... అంటే ప్రపంచదేశాల్లో స్త్రీపురుషుల ప్రగతి మధ్య వ్యత్యాసం 68.4శాతం ఉందనీ, సమానత్వం సాధించాలంటే ఎంత లేదన్నా 131 ఏళ్లు పడుతుందనీ గతేడాది ప్రపంచ ఆర్థిక వేదిక పేర్కొంది. ఆ నేపథ్యంలోనే నూటికి నూరుశాతం సమానత్వానికి చేరువలో ఉన్న దేశాల ప్రస్తావన వచ్చింది. సమానత్వ పట్టికలో తొంభై శాతానికి పైగా మార్కులు కొట్టేసి పద్నాలుగేళ్లుగా ఐస్‌లాండ్‌ తొలి స్థానాన్ని నిలబెట్టుకుంటుండగా; నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌, డెన్మార్క్‌ లాంటి దేశాలూ కొద్దిపాటి తేడాతో దాని వెన్నంటే ఉంటున్నాయి. గతేడాదే వెలువడిన ‘విమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌’లో తొలిస్థానం సంపాదించిన డెన్మార్క్‌ని పలుకోణాల్లో విశ్లేషించిన సామాజికవేత్తలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నిజంగా సమాజం మారాలనుకుంటే వందల ఏళ్లు అక్కర్లేదనీ ఒక్క తరం- అంటే, పట్టుమని పాతికేళ్లు కృషిచేస్తే చాలనీ పేర్కొన్నారు. నమ్మకం, సమానత్వం, సంక్షేమం... అక్కడి సమాజపు ఈ మూడు ముఖ్య లక్షణాలకు మహిళల ఉద్యమాలు తోడు కాగా ప్రగతిబాట పట్టి, మహిళలు జీవించడానికి మంచిదేశంగా పేరు తెచ్చుకున్న డెన్మార్క్‌ మోడల్‌ని ఎవరైనా అనుకరించవచ్చంటారు నిపుణులు.

మొదటిది... నమ్మకం

మీరెప్పుడైనా డెన్మార్క్‌ వెళ్తే- అక్కడ ఏ పార్కులోనో, రెస్టరంట్‌ ఆవరణలోనో స్ట్రోలర్‌లో పసిబిడ్డ ఒంటరిగా కనబడితే కంగారు పడకండి. ఆ బిడ్డ తల్లికోసం వెతకకండి. నిద్రపోతున్న పిల్లల్ని ఆరుబయట వదిలి పెద్దలు తమ పనులు చేసుకోవడం అక్కడ మామూలే. ఒకవేళ ఈలోపల పాపాయి లేచి ఏడిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా కాసేపు ఆడిస్తారు. తల్లిదండ్రులు వచ్చాక అప్పగించి వెళ్తారు. అంతేకానీ ఆ అమ్మానాన్నలకు బాధ్యత లేదని ఆక్షేపించరు. తోటివారి మీద నమ్మకం, సమాజంలో ఉన్న సహకార స్వభావం తల్లిదండ్రులకు ఆ ధైర్యాన్నిస్తాయి. ఆరుబయట తాజా గాలిలో నిద్రపోవడం వల్ల పిల్లలకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని అక్కడివారు నమ్ముతారు. సుదీర్ఘ చలికాలం, అతి తక్కువ వేసవి ఉంటుంది కాబట్టి అది వారికి అవసరం కూడా. పిల్లల భద్రత విషయంలో వారికెలాంటి సందేహాలూ లేవు కనక తరతరాల ఈ అలవాటుని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

ఇదే కాదు, డెన్మార్క్‌లో పలుచోట్ల మనుషులు లేకుండానే నిత్యావసరాలూ కూరగాయలూ పండ్లూ- కాగితం మీద ధర రాసి అమ్మకానికి పెడతారు. వినియోగదారులు తమకు కావలసిన వస్తువులు తీసుకుని డబ్బు అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంటారు. డానిష్‌ సంస్కృతిలో నమ్మకం కీలక పాత్ర పోషిస్తుంది. అనుబంధాల్లో, వ్యాపారంలో, పాలనలో... ప్రతిచోటా ఇది కన్పిస్తుంది. బంధుమిత్రుల్నే కాదు, అపరిచితుల్ని కూడా నమ్ముతారు. అది వాళ్ల సామాజిక లక్షణం. అందువల్లే వ్యవస్థల్ని నడిపించే కీలక పదవుల్లో ఉన్నవారు ఆ విశ్వసనీయతని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా అక్కడ అవినీతి చాలా తక్కువ. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ వాళ్లు ఏటా వెలువరించే కరప్షన్‌ ఇండెక్స్‌లో అత్యంత తక్కువ అవినీతి ఉన్న దేశంగా తొలి స్థానం కోసం న్యూజిలాండ్‌, డెన్మార్క్‌ పోటీ పడుతుంటాయి.

ఈ నమ్మకమే స్త్రీ పురుష సంబంధాలనూ ప్రభావితం చేస్తోంది. అక్కడ బలవంతపు పెళ్లిళ్లు ఉండవు. ఎవరిని పెళ్లి చేసుకోవాలీ, ఎప్పుడు చేసుకోవాలీ, పిల్లల్ని ఎప్పుడు కనాలీ, ఎంతమందిని కనాలీ... అన్నది పూర్తిగా మహిళల ఇష్టమే. వాళ్లకి జీవితం మీద సాధికారతా తమకు నచ్చినట్లుగా జీవించగల స్వేచ్ఛా ఉన్నాయి. అందుకే వాళ్లు సంతృప్తిగా జీవితాన్ని గడుపుతారు. 1960వ దశకం నుంచే అక్కడ సహజీవనం, పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనడం చట్టబద్ధమయింది. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా పిల్లల బాధ్యత మాత్రం ఇద్దరూ సమానంగా పంచుకుంటారు. నమ్మించి మోసం చేశారన్న ప్రసక్తే అక్కడ ఉండదు. విడాకులు తీసుకున్నా సరే పిల్లల కస్టడీ హక్కు ఇద్దరికీ సమానమే.

రెండోది... సమానత్వం

డెన్మార్క్‌లో ‘లా ఆఫ్‌ జాంటె’ అని ఎక్కువగా చర్చించుకునే విషయం ఒకటుంది. అందులో స్త్రీ పురుషులను ఉద్దేశించి ‘నువ్వు అందరికన్నా ప్రత్యేకం అనుకోవద్దు’, ‘ఏ విషయంలోనూ నువ్వు మాకన్నా గొప్ప అనుకోకు’ లాంటి వాక్యాలుంటాయి. వీటిని చిన్నప్పటినుంచీ నూరిపోస్తారు కాబట్టి, సమానత్వం డానిష్‌ ప్రజల సంస్కృతిలో భాగమైపోయింది. ఆ శాఖకో మంత్రిని పెట్టుకున్న తొలి దేశాల్లో డెన్మార్క్‌ ఒకటి. అక్కడ స్త్రీ పురుషులకు ఉద్యోగాల్లో సమాన హక్కులూ సమానవేతనమూ ఉంటాయి. ప్రపంచంలో అధికశాతం(72) మహిళలు ఉద్యోగాలు చేస్తున్న దేశం ఇదే.

యూనివర్సిటీ డిగ్రీలు పొందుతున్నవారిలో మహిళల శాతమే ఎక్కువ. వ్యాపార పారిశ్రామిక రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తే ఇంటిపనులూ పిల్లల పెంపకంలో పురుషులు భాగస్వామ్యం వహిస్తారు. ప్రసూతి సెలవు విధానంతో మొదలెట్టి అన్నింటా ఆమెకు అండగా నిలుస్తాయి ప్రభుత్వమూ సమాజమూ.

మెటర్నిటీ లీవుని వాళ్లు పేరెంటల్‌ లీవ్‌ అంటారు. కాన్పుకు ముందు నాలుగు వారాలు, తర్వాత 14 వారాలు మహిళలకు సెలవిస్తారు. ఆ తర్వాత రెండు వారాలు పురుషులు తప్పనిసరిగా పిల్లల్ని చూసుకోవాలి. మరో 32 వారాల సెలవును ఇద్దరూ వంతులవారీగా పంచుకోవచ్చు. అంటే ఏడాది నిండేవరకూ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వేతనంతో కూడిన సెలవుతో బిడ్డను చూసుకోవచ్చు. తొమ్మిదో నెల నుంచి పిల్లల్ని డేకేర్‌ సెంటర్‌లో చేర్పించే వెసులుబాటూ ఉంది. ప్రభుత్వమే నామమాత్రపు రుసుముతో వీటిని 1960ల్లోనే ప్రారంభించింది. మూడేళ్లు వచ్చేసరికి పిల్లలంతా ప్రభుత్వ ప్రిప్రైమరీ పాఠశాలల్లో చేరి ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్ల పర్యవేక్షణలో ఆడుతూ పాడుతూ పెరుగుతారు. ఆరేళ్లు వచ్చాక విద్యాభ్యాసం మొదలవుతుంది. ట్యూషన్లతో పనిలేని నాణ్యమైన విద్యనందిస్తూ జీవననైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఇక్కడి స్కూళ్లలో పిల్లలకు ర్యాంకులు ఇవ్వరు. చదువు విషయంలో పిల్లలపై ఎలాంటి ఒత్తిడీ ఉండదు. అందుకే ఇక్కడి పిల్లలు సృజనాత్మక రంగాల్లో ఎక్కువగా రాణిస్తారు. ఏడెనిమిదేళ్ల వయసునుంచే వాళ్లు ఒంటరిగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ని ఉపయోగించుకుని బడికి వెళ్లిపోతుంటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చే డెన్మార్క్‌ నగరాల్లో ఆడామగా, పేదా గొప్పా తేడా లేకుండా 90శాతం సైకిళ్ల మీదే తిరుగుతారు. పిల్లల్ని స్కూలు నుంచి తీసుకురావడమూ రాత్రికి వంట చేయడమూ ఎక్కువగా పురుషుల బాధ్యతే. ఇతర దేశాలతో పోలిస్తే డెన్మార్క్‌లోనే పురుషులు ఎక్కువ సమయం(రోజుకు రెండున్నర గంటలు) ఇంటిపనుల్లో గడుపుతారట.

మూడోది... సంక్షేమం

నిజానికి డెన్మార్క్‌లో రాచరికం ఉంది. అక్కడి ప్రజలూ దాన్ని ఇష్టపడతారు. అలాగని ప్రజాస్వామ్య విధానాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు. ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. అక్కడి ప్రజలు తమ ఆదాయంలో దాదాపు సగాన్ని పన్నులుగా కడతారు. అందుకు వారు బాధపడరు. పిల్లల సంరక్షణతో మొదలుపెట్టి విద్య, వైద్యం, నిరుద్యోగ భృతి, వృద్ధులకు పెన్షన్‌... అన్నీ ఉచితంగా అందిస్తున్నప్పుడు పన్నులు కట్టడం తమ బాధ్యతగా భావిస్తారు. ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రజలేమాత్రం సందేహించరు. డెన్మార్క్‌ సంపదలో నాలుగోవంతుకి ఈ నమ్మకమే పునాది అంటారు అక్కడి సామాజికవేత్తలు.

డెన్మార్క్‌లో ఉద్యోగులు పంక్చువాలిటీనీ వర్క్‌లైఫ్‌ బ్యాలన్స్‌నీ కచ్చితంగా పాటిస్తారు. కష్టపడి పనిచేస్తారు కానీ సమయం అయిపోయాక ఒక్క క్షణం కూడా ఆఫీసులో ఉండరు. పనిగంటలు తక్కువ. అందులోనూ మళ్లీ పిల్లల్ని డాక్టర్‌కి చూపించాలి, స్కూలు నుంచి తీసుకురావాలి లాంటి పనులుంటే ముందే వెళ్లిపోవచ్చు. మహిళలు కెరీర్‌లో కొనసాగడానికి ఇలాంటివి బాగా తోడ్పడుతున్నాయి. ప్రతి ఉద్యోగికీ ఏడాదికి ఐదు వారాలు పెయిడ్‌ వెకేషన్‌ ఉంటుంది. కుటుంబంతో కలిసి సరదాగా గడిపి రావడానికి దీన్ని ఉపయోగించుకోవాలి. మిగతా దేశాల్లో ఉద్యోగులు తమ కోసం తాము(మి టైమ్‌) సమయం గడిపితే డెన్మార్క్‌లో వాళ్లు కుటుంబం కోసం సమయాన్ని(వి టైమ్‌) గడుపుతారు. పిల్లలకు ఎప్పుడే అవసరం వస్తుందోనని తమకు ఆరోగ్యం బాగోకపోయినా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం అక్కడి మహిళలకు లేదు. నిస్సంకోచంగా సెలవు పెట్టుకోవచ్చు. వ్యక్తిగతంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నవారికి ప్రభుత్వమే స్ట్రెస్‌ లీవ్‌ ఇస్తుంది.

రిటైర్‌మెంట్‌ విధానం కూడా చాలా ఉదారంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటున్న వృద్ధుల్ని ఆరోగ్య కార్యకర్తలు క్రమం తప్పకుండా ఇంటికి వచ్చి చూసి వెళ్తుంటారు.
ఇక్కడ అన్ని రంగాల్లోనూ స్వచ్ఛంద సేవ ఎక్కువ. వివాహితులు కుటుంబ బాధ్యతల్లో నిమగ్నులైతే ఒంటరి యువకులు క్రీడా సంఘాల్లో, స్వచ్ఛంద సేవలో సమయం గడుపుతారు. ఇతర దేశాలతో పోలిస్తే లింగ సమానత్వాన్ని పాటించడం వల్ల డెన్మార్క్‌లో స్త్రీలతో పాటు పురుషులూ లబ్ధిపొందుతున్నారంటున్నారు సామాజికవేత్తలు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలుగుతున్నారనీ సంతోషంగా ఉంటున్నారనీ ఇది వ్యక్తిగత, సామాజిక సంక్షేమానికి పరోక్షంగా దోహదం చేస్తోందనీ చెబుతున్నారు.

తోడుగా మహిళాచైతన్యం

ప్రభుత్వమూ సమాజమూ చేస్తున్న కృషికి డెన్మార్క్‌ మహిళల చైతన్యమూ తోడైంది. అక్కడ మహిళా ఉద్యమాలు రెండు దఫాలుగా జరిగాయి. 1870-1920 మధ్య ఒకసారి, 1970-1985 మధ్య రెండోసారి. రెండువందల ఏళ్ల క్రితం బాలబాలికలకు చదువుని తప్పనిసరి చేయడంతో లైంగిక సమానత్వానికి పునాది పడిందనవచ్చు. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవంతో మహిళలు కార్మిక రంగంలోకి ప్రవేశించారు. మొదటి దఫా మహిళా ఉద్యమం- రాజ్యాంగాన్ని మార్చి మహిళలకు రాజకీయ హక్కుల్ని సంపాదించిపెట్టింది. వారు ఎన్నికల్లో పోటీ చేయడం 1915లో మొదలవగా 1924లో ప్రపంచంలోనే తొలి మహిళా మంత్రిని నియమించిన ఘనత డెన్మార్క్‌ సాధించింది. ఆ తర్వాత కొంతకాలం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న
రాజకీయ పరిణామాలవల్ల పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోయింది. దాంతో రెండోసారి సమానహక్కులకోసం ఉద్యమించింది మహిళాలోకం. ఫలితంగా వచ్చిన కదలిక చట్టసభల్లో స్త్రీల సంఖ్యను పెంచింది. 2009లో వారి సంఖ్య అత్యధికంగా 48శాతానికి చేరింది. ఇప్పుడక్కడ పార్లమెంటులో 43శాతం మహిళలు ఉన్నారు. 35 శాతం మహిళా మంత్రులే. ఇద్దరు మహిళలు ప్రధానులుగా పనిచేశారు. సమానత్వం దిశగా పలు చట్టాలు కూడా ఈ దశలో చేసినవే. డెన్మార్క్‌ ప్రజలకు సమానత్వం అంటే కేవలం లింగ సమానత్వం కాదు, అన్నిరకాలుగానూ సమానత్వమే. మతప్రమేయం లేని ఈ దేశంలో హోదాని బట్టో, సంపదని చూసో కాకుండా అందరినీ సమానంగా గౌరవిస్తారు. మరే ఇతర వివక్షలూ లేవు కాబట్టే స్త్రీల పట్ల వివక్షని త్వరగా అధిగమించగలిగింది ఆ దేశం.

ఆ మధ్య ఒక సంస్థ ఏయే దేశాల్లో ఎంతమంది స్త్రీవాదులు ఉన్నారని సర్వే చేస్తే అతి తక్కువ మంది స్త్రీవాదులున్న దేశంగా డెన్మార్క్‌ తేలింది. ‘స్త్రీవాదం మా దగ్గర చెల్లని నాణెం. సమానావకాశాలతో దూసుకుపోతున్న మాకు ఇప్పుడిక దాంతో పని లేదు’ అని ఢంకా బజాయించి చెప్పేశారట అక్కడి మహిళలు.


ఏమిటీ ఇండెక్స్‌..?

వాషింగ్టన్‌ డీసీలోని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ, మరో స్వతంత్ర సంస్థ అయిన ఓస్లో పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌... కలిసి పలు మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని వడబోసి ఏటా ఈ విమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ సూచికను రూపొందిస్తున్నాయి. స్త్రీలకు సమాన భాగస్వామ్యం, న్యాయం, భద్రత ప్రధానాంశాలుగా తీసుకుని మొత్తం 13 విభాగాల్లో సమాచారాన్ని విశ్లేషిస్తారు. 2023లో 177 దేశాల్లో మొదటి స్థానం డెన్మార్క్‌ది కాగా స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, ఫిన్లాండ్‌, లగ్జెంబర్గ్‌... తర్వాత స్థానాల్లో ఉన్నాయి. నమీబియా, జింబాబ్వే, అంగోలా లాంటి దేశాల తర్వాత 128వ స్థానంలో మనదేశం ఉంది. మహిళల అభివృది్ధకీ దేశాభివృద్ధికీ ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని స్పష్టంచేస్తున్న ఈ సూచిక- విధాన నిర్ణయాలు చేసేవారికి ఎంతగానో
ఉపయోగపడుతుందని చెబుతున్నారు నివేదిక రూపకర్తలు. 177లో చివరి 20 దేశాలూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో యుద్ధప్రభావానికి లోనయ్యాయనీ దీనికితోడు పలుచోట్ల నిరంకుశ పాలన కూడా చేరి మహిళల ప్రగతిని వెనక్కి నెట్టేస్తున్నాయనీ ఈ నివేదిక చెబుతోంది.


డెన్మార్క్‌ చరిత్రలో మైలురాళ్లు

న్ని దేశాలూ ఇరవయ్యో శతాబ్దంలో సమానత్వం దిశగా కృషి మొదలుపెడితే డెన్మార్క్‌ ఓ వందేళ్లు ముందే మొదలెట్టింది. ఆ దిశగా దాటుకుంటూ వచ్చిన మైలురాళ్లు ఇవి.
1814- పిల్లలందరికీ ప్రాథమిక విద్యను తప్పనిసరి చేస్తూ చట్టం తెచ్చారు.
1871- స్త్రీ చైతన్యంలో కీలకపాత్ర
పోషించిన హక్కుల సంఘం ‘డానిష్‌ విమెన్స్‌ సొసైటీ’ ప్రారంభమైంది.
1875- కోపెన్‌హేగన్‌ విశ్వవిద్యాలయం మహిళలకు ప్రవేశం కల్పించింది.
1915- మహిళలకు ఓటు హక్కూ, ఎన్నికల్లో పోటీచేసే హక్కూ లభించాయి.
1917- గృహిణుల సంఘం ప్రారంభం.
1918- మొట్టమొదటిసారి 12మంది మహిళలు చట్టసభలకు ఎన్నికయ్యారు.
1921- సైన్యంలోనూ జడ్జిలుగానూ తప్ప అన్ని పదవుల్లోనూ మహిళలను నియమించవచ్చని చట్టం చేశారు.
1924- నీనాబాగ్‌ తొలి మహిళా మంత్రిగా నియమితులయ్యారు.
1936- జడ్జీలుగా మహిళల నియామకం.
1964- మహిళల సమస్యలపై పరిశోధనకు ప్రత్యేక కేంద్రం(కెవిఐఎన్‌ఎఫ్‌ఓ) ఏర్పాటైంది.
1976- స్త్రీ పురుషులకు సమానవేతన చట్టం.
1999- మంత్రివర్గంలో సమానత్వ శాఖ ప్రారంభం.
2011- తొలి మహిళా ప్రధాని ఎన్నిక.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు