మీరూ కావొచ్చు... లక్షల్లో ఒకరు!

మామూలుగా మనం రక్తదానం ఎందుకు చేస్తాం? అవసరం ఉన్నవాళ్ళెవరినో ఆదుకోవాలనే కదా! కేవలం ఆదుకోవడం కాదు... మీరు ఏకంగా ఓ ప్రాణాన్నే రక్షించేలా చూస్తాయి ఈ సంస్థలు.  

Updated : 25 Feb 2024 03:52 IST

మామూలుగా మనం రక్తదానం ఎందుకు చేస్తాం? అవసరం ఉన్నవాళ్ళెవరినో ఆదుకోవాలనే కదా! కేవలం ఆదుకోవడం కాదు... మీరు ఏకంగా ఓ ప్రాణాన్నే రక్షించేలా చూస్తాయి ఈ సంస్థలు.  వీటిల్లో రిజిస్టర్‌ చేసుకుంటే బ్లడ్‌క్యాన్సర్‌, మేజర్‌ థలసీమియా, అప్లాస్టిక్‌ అనీమియా వంటి అతితీవ్ర రక్తసమస్య ఉన్నవాళ్ళని ఆదుకోవచ్చు. నిజం, చెప్పాలంటే లక్షమందిలో మీరు మాత్రమే ఆ సాయం చేయగలరు. ఆ సంతృప్తిని జీవితాంతం అనుభవించగలరు. అందుకేం చేయాలో చూద్దామా?

 ‘ఆఫీసులో ఈ రోజేదో స్పెషల్‌ ప్రోగ్రామట’ అని చెబుతుంటే ఏమిటా అనుకున్నాడు చైతన్య. వెళితే- దాత్రి అనే ఎన్జీఓ వాళ్ళు రక్తదానం గురించి చెప్పారు. మామూలు రక్తదానం కాదు- మూలకణాల్ని (స్టెమ్‌ సెల్స్‌) అందించే దానమన్నారు. అదేంటో అర్థం కాకపోయినా ఆ దానానికి తన పేరుని నమోదుచేశాడు చైతన్య. తర్వాత ఆ విషయం మరిచిపోయాడు కానీ- నాలుగేళ్ళు గడిచాక ఆ ఎన్జీఓ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ‘ఏడేళ్ళ చిన్నారికి మీ మూలకణాలు అవసరమవుతున్నాయి. అతని ప్రాణాన్ని మనదేశంలో మీరు మాత్రమే రక్షించగలరు! వస్తారా?’ అని అడిగారు. వెంటనే వెళ్ళాడతను. ఏడాది తర్వాత చైతన్యని సన్మానిస్తూ విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది ఆ ఎన్జీఓ. నాటి ఆరోగ్యశాఖమంత్రి ముఖ్యఅతిథిగా వచ్చారు. అంతకన్నా- తన దానంతో ప్రాణాలు నిలుపుకున్న ఆ పిల్లాడు దగ్గరకొచ్చి ‘థ్యాంక్స్‌ అన్నయ్యా!’ అంటూ తన చేతులు పట్టుకోవడాన్ని జీవితంలో మరిచిపోలేనంటాడు చైతన్య!

*    *    *

షీజది కేరళ. కువైట్‌లో నర్స్‌గా పనిచేస్తోంది. ఏడేళ్ళబాబున్నాడు. నాలుగేళ్ళకిందట ఆమెకు బ్లడ్‌క్యాన్సర్‌ ఉన్నట్టు తేలితే... ఆ కుటుంబం కుదేలైపోయింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో వైద్యులు ఆమెకి ఓ ఆశారేఖని చూపించారు. ఎవరైనా మూలకణాలు దానంచేస్తే బతికే అవకాశం ఉందన్నారు. ఆలస్యమయ్యే ప్రతి క్షణమూ అపాయంగా మారుతున్న వేళ- మూలకణాలు ఇచ్చేవాళ్ళ కోసం వెతుకులాట మొదలుపెట్టింది డీకేఎస్‌-బీఎస్‌ఐటీ అనే సంస్థ. ప్రపంచమంతా వెతికితే బెంగళూరులోనే ఉన్న సునీల్‌ నారాయణ్‌ దొరికాడు! ఆయన ఇచ్చిన మూలకణాలతో క్యాన్సర్‌ని జయించింది షీజ. మొన్ననే సకుటుంబసమేతంగా సునీల్‌ని కలిసి కన్నీళ్ళతో కృతజ్ఞతలు చెప్పుకుంది!

*    *    *

మన శరీరంలోని రక్తం ఎముకల మజ్జ నుంచి ఏర్పడుతుంది. అలా ఏర్పడే క్రమంలో కొన్ని సమస్యలు తలెత్తి బ్లడ్‌క్యాన్సర్‌, థలసీమియా, అప్లాస్టిక్‌ అనీమియా వంటి ప్రాణాంతక రుగ్మతలుగా మారుతున్నాయి! కానీ, బయట నుంచి కొత్త మూలకణాలని అందిస్తే వీళ్ళలో 70 శాతం వరకూ ఈ సమస్యల నుంచి పూర్తిగా బయటపడొచ్చు. అంటే- రుగ్మతకి కారణమవుతున్న ఎముక మజ్జని బయటనుంచి వచ్చే ఈ మూలకణాలు సరిచేస్తాయన్నమాట. కానీ... వాటి దాతలు దొరకడమే కష్టమవుతోంది. తోబుట్టువులవి కూడా కేవలం 25 శాతం సందర్భాల్లోనే మ్యాచ్‌ అవుతాయి. అంటే- 75 శాతం మంది బయట వెతుక్కోవాల్సిందే నన్నమాట! అలాంటి మూలకణాల దాతల్ని వెతికిపెట్టే పనిని కొన్ని ఎన్జీఓలు చేస్తున్నాయి. వీటిని ‘స్టెమ్‌సెల్‌ రిజిస్ట్రీల’ని అంటున్నారు. ఇలాంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 80 దాకా ఉన్నాయి. వీటిలో సుమారు 40 కోట్లమంది దాతలు రిజిస్టర్‌ అయి ఉన్నారు. కానీ వీరిలో భారతీయుల సంఖ్య కనీసం ఆరేడు లక్షలు కూడా లేదు. అంటే... మొత్తంలో మన సంఖ్య 0.04 శాతమేనట! దానివల్ల- మన భారతీయుల్లో బ్లడ్‌క్యాన్సర్‌, థలసీమియా వంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ప్రాణాలతో పోరాడుతున్నారు. ‘భారతీయులు ఇవ్వకపోతేనేం. బయటివాళ్ళు ఇవ్వొచ్చు కదా!’ అన్న ప్రశ్న రావొచ్చు. అక్కడే వస్తోంది చిక్కు...

వాళ్ళే ఇవ్వాలి...

సాధారణంగా రక్త రుగ్మతల బాధితులకి- వాళ్ళ ఇంట్లోవాళ్ళది మ్యాచ్‌ కాకుంటే ఒకే తెగ(ఎత్నిక్‌ గ్రూప్‌)కి చెందినవాళ్ళది సరిపోతుంది... దానర్థం ఒకే కులంవాళ్ళని కాదు జన్యుపరంగా ఎక్కువ సామ్యం ఉన్నవాళ్ళని. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ తెగల సంఖ్య వేలల్లో ఉంటుంది. కాబట్టి- ఒక తెగది ఇంకొకరికి సరిపోదు. పదిలక్షల్లో ఒకరిదే ఇలా మ్యాచ్‌ అవుతుంది.
కువైట్‌లో ఉన్న షీజకి బెంగళూరులో ఉన్న సునీల్‌ నారాయణ మూలకణాలు మాత్రమే సెట్‌ కావడానికి అదే కారణం. కనీసం ప్రతి తెగకి సంబంధించిన దాతల సంఖ్యా వేలల్లో ఉన్నా చాలు... ఎంతోమంది ప్రాణాలని కాపాడొచ్చు. ఆ లక్ష్యంతోనే మనదేశంలో దాత్రి, డీకేఎంఎస్‌-బీఎస్‌ఐటీ, జీవన్‌ స్టెమ్‌సెల్‌ రిజిస్ట్రీ, మ్యారో డోనర్‌ రిజిస్ట్రీ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. 18-50 ఏళ్ళ మధ్య ఆరోగ్యవంతుల్ని నమోదుచేసుకోవడానికి రారమ్మంటున్నాయి!

సన్మానాలు చేస్తాయి!

మనవల్ల ఇంకొకరి ప్రాణం నిలవాలనుకునేవాళ్ళు- ఈ సంస్థల సైట్‌లోకి వెళ్ళి నమోదుచేసుకోవచ్చు. చేసుకున్నాక సంస్థ ప్రతినిధులు ఇంటికే వచ్చి మీ నోటి నుంచి దూదితో స్వాబ్స్‌ తీసుకుంటారు. అందులో నుంచి శరీరంలోని హ్యూమన్‌ లుకొసైట్‌ యాంటిజెన్‌ (హెచ్‌ఏఎల్‌) కణాన్ని కనిపెట్టి రిజిస్టర్‌ చేసుకుంటారు. మీ హెచ్‌ఏఎల్‌- బాధితుల హెచ్‌ఏఎల్‌తో సరిపోయినప్పుడు మాత్రమే పిలుస్తారు. మీరు ఎక్కడున్నా- ఎంతదూరమైనా ఖర్చు వాళ్ళే భరించి రప్పిస్తారు. మీవల్ల ఒకరిప్రాణం దక్కితే- రెండేళ్ళ తర్వాత వాళ్ళనీ మిమ్మల్నీ కలుపుతారు. దాన్నో పెద్ద ఉత్సవంగా నిర్వహిస్తారు! నమ్మండి... ఆ ఉత్సవం మీరు జీవితంలో మరిచిపోలేనిదవుతుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..