Pattiseema: ఒక దశాబ్దపు విజయగాథ పట్టిసీమ

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 22 Sep 2025 03:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఖర్చు రూ.2,722 కోట్లు
పంట ఉత్పత్తి రూ.18 వేల కోట్ల పైమాటే
లక్షల మందికి తాగునీరు అదనం
కృష్ణాలో వరద ఉన్నా ఆదుకున్న పథకం

పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు వెళ్తున్న జలాలు  

ఈనాడు, అమరావతి: పట్టిసీమ ఎత్తిపోతల మాట వినని సామాన్యుడు లేడు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అప్పట్లో అదో పెద్ద వివాదం. ఆ పథకంపై రాజకీయాలు ఏ స్థాయిలో ముసురుకున్నాయో తెలియంది కాదు- ఎలా వివాదం సృష్టించారో కూడా మరిచిపోలేదు. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించి సరిగ్గా పదేళ్లు పూర్తయింది. విమర్శలు ఎదుర్కొన్న పథకమే విజయవంతమై.. డెల్టా రైతులకు వరంలా మారింది. పట్టిసీమ నుంచి దశాబ్ద కాలంలో 439 టీఎంసీల జలాలు కృష్ణా డెల్టాకు సరఫరా చేశారు. ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలు వరి సాగు చేయొచ్చు. ఈ లెక్కన 43.90 లక్షల ఎకరాల్లో వరి సాగు సాధ్యమైంది. ఎకరానికి సగటున 30 బస్తాల దిగుబడి తీసుకున్నా.. సగటు ధర ప్రకారం వచ్చిన ఫలం రూ.18 వేల కోట్లపైనే.

నాటి విమర్శలు

  • గోదావరి నుంచి 80 టీఎంసీల వరద జలాలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజిలో ఎక్కడ నిల్వ చేస్తారు? బ్యారేజి సామర్థ్యం 3.071 టీఎంసీలే. 
  • కృష్ణా, గోదావరి నదులకు నైరుతి రుతుపవనాల కాలంలోనే ఒకేసారి వరదలు వస్తాయి. గోదావరిలో వరద ఉన్నప్పుడే పట్టిసీమ నుంచి నీళ్లు ఎత్తిపోయగలరు. అప్పుడు కృష్ణాలోనూ వరద ఉంటుంది. నీళ్లు ఎలా తీసుకువస్తారు?
  • గోదావరిలో జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 90 రోజులే వరద వస్తుంది. కృష్ణాలో అవే నెలల్లో వరద వస్తుంది. పట్టిసీమ నుంచి 80 టీఎంసీలు తీసుకురావాలంటే  109 రోజుల వరద రావాలి. తప్పుడు మాటలు ఎందుకు చెబుతారు? 
  • ఇవన్నీ నాడు జగన్‌ చెప్పిన మాటలు

10 ఏళ్లలో ఏం జరిగింది?

2016 నాటికి పూర్తి స్థాయిలో ఈ ఎత్తిపోతలను వినియోగంలోకి తీసుకొచ్చారు. రోజుకు 8,500 క్యూసెక్కుల గోదావరి వరద జలాలు మళ్లించేలా నిర్మాణం పూర్తయింది. 2015లో పాక్షికంగా నిర్మాణం పూర్తి చేసి ఇచ్చిన 4.20 టీఎంసీలతో పాటు ఆ తర్వాత 10 ఏళ్లలో కృష్ణా డెల్టాకు తాగు, సాగునీటి అవసరాల కోసం పట్టిసీమ 439.534 టీఎంసీలు అందించింది.


అదనుకు ఆదుకున్న పట్టిసీమ 

డిచిన 10 ఏళ్లలో కృష్ణాలో ప్రకాశం బ్యారేజి నుంచి ఎంత నీరు సముద్రంలోకి పోయింది? ఆ ఏడాది పట్టిసీమ నుంచి ఎంత నీరు తరలించి కృష్ణా డెల్టాలో వినియోగించారో పరిశీలిస్తే ఈ విషయం అర్థం చేసుకోవచ్చు. కృష్ణాలో వృథా జలాలు ఉన్నా కొన్ని సార్లు 120 రోజుల పంట కాలంలో అవి అదనుకు రావు. అందుకే పట్టిసీమ నుంచి తెచ్చిన నీరు పంటలను కాపాడేందుకు పనికొచ్చేది. 

  • నీటి సంవత్సరం అంటే ఆ ఏడాది జూన్‌ నుంచి మరుసటి ఏడాది మే నెలాఖరు వరకు
  • పట్టిసీమ వినియోగించేది ఒక ఏడాది జూన్‌ నుంచి అదే ఏడాది నవంబరు వరకు.. అంటే గోదావరిలో వరద ఉన్నప్పుడు మాత్రమే.

ఈ పథకానికి ఎంత ఖర్చయింది?

  • ఈ ఎత్తిపోతల నిర్మాణానికి సవరించిన అంచనా సుమారు రూ.1,900 కోట్లు
  • పదేళ్లలో నిర్వహణ వ్యయం రూ.48.95 కోట్లు
  • విద్యుత్తు ఛార్జీలు రూ.773.15 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు