CM Chandrababu: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 23 Apr 2025 06:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ త్వరగా ఏర్పాటు చేయండి
పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో వేగం పెంచండి
కేంద్ర మంత్రులు సీఆర్‌ పాటిల్, అర్జున్‌రామ్, పీయూష్‌ గోయల్‌లకు సీఎం చంద్రబాబు వినతులు
హోంమంత్రి అమిత్‌ షాతో రాజకీయ అంశాలపై చర్చ

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వేంకటేశ్వరుడి విగ్రహాన్ని బహూకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం దిల్లీలో నలుగురు కీలక కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రాజకీయ అంశాలపై వారితో చర్చించారు. విదేశీ పర్యటన ముగించుకొని మంగళవారం తెల్లవారుజామున దిల్లీ చేరుకున్న చంద్రబాబు ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్, హోంమంత్రి అమిత్‌ షాలతో సమావేశమయ్యారు. అమిత్‌ షాతో భేటీలో రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి వ్యవహారాలతో పాటు రాజకీయ అంశాలూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. తొలుత ఉదయం 10.30కి జల్‌శక్తి మంత్రి పాటిల్‌తో జరిగిన భేటీలో రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చేందుకు ప్రతిపాదించిన పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు గురించి చంద్రబాబు వివరించారు.

‘కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధాన లక్ష్యాన్ని ఈ ప్రాజెక్టు నెరవేరుస్తుంది. దీని ద్వారా గోదావరి-కృష్ణా-పెన్నా నదీ పరివాహక ప్రాంతాలను అనుసంధానించి రాష్ట్రంలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చవచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం చేయాల’ని విజ్ఞప్తిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కొళాయి నీరు అందించే జల్‌జీవన్‌ మిషన్‌ అమలు కాలాన్ని పొడిగించినందుకు పాటిల్‌కు ధన్యవాదాలు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిదిద్దడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన తాగునీటి వనరులను అనుసంధానించాలని, మిగిలిన గ్రామాలకు కూడా నీరందించేలా ఇప్పుడున్న ధరల ప్రకారం నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో అటల్‌ భూజల్‌ యోజన అమలుపైనా చర్చించారు. 

కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం చంద్రబాబు

చంద్రబాబు ముందుచూపునకు మేఘ్‌వాల్‌ కితాబు

న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ను సీఎం చంద్రబాబు ఆయన నివాసంలో కలిశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ప్రతిపాదనలు పంపినందున కేంద్ర ప్రభుత్వపరంగా అధికారిక కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా మేఘ్‌వాల్‌ తన మంత్రిత్వశాఖ అధికారులకు చంద్రబాబును పరిచయం చేస్తూ ‘ఆయన అన్నింటిలోనూ 25 ఏళ్ల ముందుచూపుతో ఆలోచిస్తారు. ఈనాటి ఆధునిక హైదరాబాద్‌ ఆయన ఆలోచనా రూపమే’నని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా అర్జున్‌రామ్‌ దంపతులు చంద్రబాబుకు వినాయకుడి ప్రతిమను బహూకరించారు. 

కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌కు వెంకటేశ్వరుడి చిత్రపటాన్ని అందజేస్తున్న సీఎం చంద్రబాబు

ఆక్వా రంగాన్ని ఆదుకోండి

అనంతరం ఇక్కడి వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యాలయం వాణిజ్య భవన్‌లో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. అమెరికా టారిఫ్‌ యుద్ధం ప్రకటించాక ఆక్వా రంగంలో నెలకొన్న అనిశ్చితిని వివరించారు. భారత్‌ నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 26% సుంకాలు విధించడం ఏపీలో మత్స్య రంగానికి తీరని నష్టం చేకూర్చేలా ఉన్నందున కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలను ప్రతిపాదించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపైనా చర్చించారు. వీటికి బడ్జెట్‌లో కేటాయించిన నిధులను వినియోగించి త్వరగా మౌలిక వసతుల కల్పనకు ఉపక్రమించాలని కోరారు. ప్రకాశం జిల్లాలో ఉప్పు భూములను రాష్ట్రానికి అప్పగించే అంశం వారి మధ్య చర్చకు వచ్చింది. 

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు.. చిత్రంలో ఎంపీ హరీష్‌ మాథుర్, తెదేపా నేతలు కంభంపాటి రామ్మోహన్‌రావు, కనకమేడల రవీంద్రకుమార్, ఎంపీ సానా సతీష్, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్‌నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణప్రసాద్‌


భేటీలపై మంత్రుల సంతృప్తి

చంద్రబాబుతో సమావేశం పట్ల కేంద్ర మంత్రులు సంతృప్తి వ్యక్తంచేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ‘ఈరోజు సీఎం చంద్రబాబుతో ముఖ్యమైన సమావేశం జరిగింది. జల్‌జీవన్, స్వచ్ఛభారత్‌ మిషన్లు, పీఎంకేఎస్‌వై- సీఏడీడబ్ల్యూఎం, నదుల అనుసంధానం పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించాం. ఏపీలో వాననీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్‌ చర్యల వేగవంతంపై మాట్లాడాం. సుస్థిర నీటి నిర్వహణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో ఏపీకి సాయం చేయడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని సీఆర్‌ పాటిల్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

న్యాయసేవల లభ్యత, కేంద్ర సంక్షేమ పథకాల అమలు, సమకాలీన అంశాలపై చంద్రబాబుతో చర్చించినట్లు న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ పేర్కొన్నారు. చంద్రబాబుతో అభివృద్ధి కార్యక్రమాల అమలు, వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఉన్న అవకాశాలు, పెట్టుబడులు, ఏపీలో పారిశ్రామికాభివృద్ధిపై చర్చించినట్లు పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇతర ఎంపీలు ఉన్నారు.

Tags :
Published : 23 Apr 2025 05:53 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు