YS Jagan: లంచం ఇవ్వడానికే జగన్‌ను కలిశానని అదానీ చెప్పారా?

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 29 Nov 2024 10:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

అభియోగపత్రంలో నా పేరున్నట్లు ఎఫ్‌బీఐ, యూఎస్‌సీఈసీ మీకు ఫోన్‌ చేసి చెప్పాయా? 
నేనిక్కడ ఓ కేసులో సీఐడీతో బైడెన్‌ పేరు రాయిస్తే అయిపోతుందా? 
అదానీ నన్ను చాలాసార్లు కలిశారు.. దానికి సెకి ఒప్పందానికి సంబంధమేంటి? 
విలేకర్లకు మాజీ సీఎం జగన్‌ అడ్డగోలు ప్రశ్నలు
ఈనాడు, అమరావతి 

నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, నాకూ సీఐడీ ఉంది, ఒకవేళ ఇక్కడేదో అమెరికన్‌ కంపెనీ ఉంటే దానిపై కేసులో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పేరు కూడా రాయమని సీఐడీకి చెబితే అయిపోతుందా?


రేపు ఒక అమెరికన్‌ కంపెనీ ఇక్కడ ఒక రాష్ట్రంలో వ్యాపారం చేస్తుంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం భూమిని రాయితీ ధరలతో ఇస్తే, జీఎస్టీ రద్దు, ఇతర ప్రోత్సాహకాలు కల్పిస్తే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రభావం వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలిచ్చిందని ఎవరైనా మాట్లాడితే అందులో అర్థం ఉంటుందా? 


ఎఫ్‌బీఐ నివేదికలో నా పేరు ఎక్కడా లేదు. నా పేరు ఉందని చెప్పేది తెలివితక్కువ వారే.


వాళ్ల వద్ద ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో నాకు తెలియదు. వాళ్లు ఏం దర్యాప్తు చేస్తున్నారో తెలియదు.

‘సెకి’తో ఒప్పందంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ (YS Jagan)కు అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చారని ఎఫ్‌బీఐ, యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ అమెరికాలో కోర్టుకు నివేదిక సమర్పించాయి కదా అని విలేకర్లు అడిగిన ప్రశ్నలకు జగన్‌ పై విధంగా పొంతన లేని సమాధానాలిచ్చారు. అదానీ (Gautam Adani) నన్ను చాలాసార్లు కలిశారు, దానికీ ఈ ఒప్పందానికి సంబంధమేంటని ఎదురు ప్రశ్నించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. తన హయాంలో సెకితో ఒప్పందం గురించి సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ‘సెకి, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్యనే ఒప్పందం జరిగింది. ఇందులో మూడో పార్టీ లేదు. అలాంటప్పుడు లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం అనేది ఎక్కడుంది? ఎవరో ఏదో తెలివితక్కువతనంతో మూర్ఖంగా, అర్థం లేకుండా మాట్లాడితే దానికి ఎవరూ ఏమీ చేయలేరు’ అని అన్నారు. విలేకర్ల ప్రశ్నలు, జగన్‌ సమాధానాలివీ..

ఎఫ్‌బీఐ చెప్పినట్లు అదానీ మిమ్మల్ని కలవలేదా?

అదానీ నాకు ఇన్సెంటివ్‌ ఆఫర్‌ చేసేందుకు కలిశారని ఆ నివేదికలో రాయలేదు. నాకు ఎవరూ ఇన్సెంటివ్‌ ఆఫర్‌ చేయలేరు. వ్యాపారవేత్తలు ముఖ్యమంత్రిని కలవడమనేది అసాధారణమేమీ కాదు. నా ఐదేళ్ల పాలనలో సెకితో ఒప్పందానికి ముందు, తర్వాత కూడా ఆయన (అదానీ) అనేకసార్లు నన్ను కలిశారు. దాంతో దీనికి ఏం సంబంధం? ఆయనకు రాష్ట్రంలో ప్రాజెక్టులున్నాయి, ఆయనతో చర్చలన్నీ రాష్ట్రంలోని వాటికే పరిమితమవుతాయి. అంతే తప్ప రాష్ట్ర పరిధిలో లేని దాని గురించి ఎందుకు మాట్లాడతారు? 

నివేదికలో లంచం వ్యవహారాన్ని పొందుపరిచారు కదా? 

యూఎస్‌ సీఈసీ మీకు కాల్‌ చేసి అదానీ ఈ వ్యవహారంపైనే జగన్‌ను కలిశారని చెప్పిందా? లేదా అదానీ కాల్‌ చేసి నేను ఇందుకే జగన్‌ను కలిశానని చెప్పారా? ఊరికే మాట్లాడేయడం కాదు, నేను మీ ముందు కూర్చున్నా అని అడగడం కాదు, బుర్రపెట్టి ఆలోచించండి. 

ఈ వివాదం నేపథ్యంలో.. చంద్రబాబు సెకితో ఒప్పందాన్ని రద్దు చేస్తే? ఎవరూ తెలివితక్కువగా అలాంటి పని చేయరు. ఈ ఒప్పందంతో 25 ఏళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా ఆదా అవుతుంది.

ఆ పత్రికలపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా

‘సెకితో ఒప్పందం వ్యవహారమై అమెరికా కోర్టులో ఎఫ్‌బీఐ సమర్పించిన నివేదికను ఉటంకిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో నాపై వార్తలు రాస్తున్నారు. క్షమాపణ చెప్పేందుకు వారికి 48 గంటల సమయమిస్తా. చెప్పకపోతే ఆ రెండు పత్రికలపైనా రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తా’ అని జగన్‌ అన్నారు. 


నాకు శాలువా కప్పి పొగడాల్సింది పోయి విమర్శలా?

‘యూనిట్‌ రూ.2.49 చొప్పున రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత తక్కువ ధరకే విద్యుత్‌ను సరఫరా చేసేందుకు సెకితో మేం చేసుకున్న ఒప్పందం చరిత్రాత్మకం. అందుకు నాకు శాలువా కప్పి, గొప్పగా పొగడాల్సింది పోయి, నాపై ఏవేవో మాట్లాడడమేంటి?’

విలేకర్లతో మాజీ సీఎం జగన్‌

Tags :
Published : 29 Nov 2024 03:12 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు