Polavaram: వరద ప్రవహిస్తున్నా డయాఫ్రం వాల్ నిర్మాణం
అందుకు తగ్గట్టుగా ప్రణాళిక... పనులు
22 మీటర్ల ఎత్తున ప్లాట్‌ఫాం
వరద సమయంలో నదికి చివర్లోనే పనులు 

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 డిసెంబరు నాటికి పూర్తిచేయాలంటే ప్రస్తుత వర్షాకాలాన్ని, వరదల సీజన్‌ను ఎదుర్కోవడమే అసలు సవాలుగా మారింది. అందువల్ల వరదల సమయంలోనూ అవాంతరాలు ఎదురుకాకుండా పనులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ ఏడాది చివరికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తిచేయడం.. నవంబరు నుంచి సమాంతరంగా ప్రధాన డ్యాం నిర్మాణ పనులను ప్రారంభించడం అన్నవి ఈ ప్రాజెక్టులో ఇప్పుడు కీలకాంశాలు. ఈ ఏడాది చివరికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తిచేయాలంటే వరదల్లోనూ పనులు కొనసాగాలి. డయాఫ్రం వాల్ నిర్మాణ పనుల ప్రణాళికను వరదలు, వానాకాలం కారణంగా ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొనే రూపొందించారు. గోదావరిలో ఏటా భారీ వరదలు సహజంగా సంభవిస్తాయి. 15 లక్షల క్యూసెక్కుల నుంచి 26 లక్షల క్యూసెక్కుల వరకు కూడా ఒకేరోజు వరద ప్రవహించిన సందర్భాలు ఉన్నాయి. జులై నుంచి దాదాపు నవంబరు మధ్య దాదాపు వంద రోజుల పాటు అత్యధికంగా వరద రోజులు ఉంటాయి. పైగా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నుంచి పెద్ద ఎత్తున సీపేజీ నీళ్లు వచ్చి ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతంలో చేరుతున్నాయి. దీంతో అక్కడ నీరు నిండి పనులకు అంతరాయం కలుగుతోంది. ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోయాల్సి వస్తోంది. కొంతవరకు నీటి స్థాయి నిర్వహిస్తూ పనులు చేసుకునేలా ప్రణాళిక రూపొందించారు.
ఇదీ డయాఫ్రం వాల్ ప్రణాళిక
పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణంలో అంతర్భాగంగా డయాఫ్రం వాల్‌ను కట్ ఆఫ్ వాల్ (ఊట నియంత్రణ గోడ)గా నిర్మిస్తున్నారు. గోదావరి గర్భంలో కొన్నిచోట్ల 90 మీటర్ల లోతు వరకు వెళ్లి అక్కడ రాయిలోకి ప్లాస్టిక్ కాంక్రీటు ప్యానళ్లు ఏర్పాటుచేసి ఈ వాల్ నిర్మిస్తున్నారు.
డయాఫ్రం వాల్ పొడవు: 89 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకు ఉంటుంది.
నది మధ్యలో వానలకు ముందే
వరదలు, వానలకు ముందు నిర్మాణం: 430 మీటర్ల నుంచి 890 మీటర్ల మధ్య
- మొత్తం 28,000 చదరపు మీటర్ల మేర ప్లాస్టిక్ కాంక్రీటు పనులు
 - ఈ భాగం నది మధ్యలో ఉంటుంది. వరద ప్రభావం ఎక్కువ. అందువల్ల జూన్ నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 - ప్రస్తుతం 13,000 చదరపు మీటర్ల పని పూర్తయింది.
 
వరదల్లో.. చివరల్లో
జులై నుంచి సెప్టెంబరు నెలాఖరు నాటికి ఆ చివర, ఈ చివర నిర్మించాలనేది ప్రణాళిక
- 89 మీటర్ల నుంచి 220 మీటర్ల వరకు 5,600 చదరపు మీటర్లు కట్టాలి
 - 1,070 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకు 12 వేల చదరపు మీటర్లు
 
వరదలు తగ్గిన తర్వాత...
220 మీటర్ల నుంచి 430 మీటర్లు, 900 మీటర్ల నుంచి 1,070 మీటర్ల వరకు నిర్మిస్తారు.
ప్లాట్ ఫాం నిర్మాణం
డయాఫ్రం వాల్ నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు వద్ద 1,400 మీటర్ల మేర ప్లాట్‌ఫాం నిర్మించారు. 20 మీటర్ల ఎత్తున ఈ ప్లాట్‌ఫాం ఉంటుంది. దానిపై యంత్రసామగ్రి ఉంచి ప్యానళ్లు దింపి ప్లాస్టిక్ కాంక్రీటు నింపి డయాఫ్రం వాల్ నిర్మాణపనులు కొనసాగిస్తున్నారు. వరదల సమయంలో ప్రధాన డ్యాం ప్రాంతంలో సీపేజీ నీటిని 19 మీటర్ల స్థాయికి నిర్వహించాలనేది ప్రణాళిక. వరదల కాలంలో ఎంతమేర పనులు చేస్తారో అంతవరకు ప్లాట్‌ఫాం ఎత్తును 22 మీటర్లకు పెంచారు. అదే సమయంలో అక్కడ నీటిమట్టం 19 మీటర్లు ఉండేలా పంపులు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోస్తూ ఉండాలి. ఒకవైపు నదిలో వరద ప్రవహిస్తున్నా డయాఫ్రం వాల్ నిర్మాణ పనులకు అంతరాయం కలగకూడదనేది ప్రధాన ఉద్దేశం.
బట్రస్ డ్యాం నిర్మాణం కొలిక్కి...
పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యాం నిర్మించి ఏడేళ్లవుతోంది. ఈ డ్యాం జీవితకాలం ఐదేళ్లుగా అంచనా. ఎగువ కాఫర్ డ్యాం సామర్థ్యం ఎలా ఉందో విదేశీ నిపుణుల బృందం పరిశీలించింది. ఆ డ్యాం గట్టితనం కోసం బట్రస్ డ్యాం నిర్మించాలని సిఫార్సు చేసింది. ఎగువ కాఫర్ డ్యాం దిగువన ఇది నిర్మిస్తున్నారు. మొత్తం 7.62 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాలి. ఇంతవరకు దాదాపు ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. జూన్ నెలాఖరుకు బట్రస్ డ్యాం నిర్మాణం పూర్తవుతుంది.
‘పోలవరం’ 48 గేట్ల నుంచి దిగువకు ప్రవాహం

స్పిల్‌వే నుంచి నీటి ప్రవాహం
పోలవరం, న్యూస్‌టుడే: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. మొన్నటి వరకు స్పిల్‌వే దిగువన ఉన్న రివర్ స్లూయిస్ గేట్ల ద్వారా ప్రవాహం వెళ్లేది. శనివారం నీటిమట్టం క్రస్టుగేట్ల స్థాయి 25.72 మీటర్లు దాటి 25.95 మీటర్లకు చేరింది. దీంతో స్పిల్‌వే 48 గేట్ల నుంచి నీటి ప్రవాహం దిగువకు పారుతోంది. ప్రస్తుతం పది వేల క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించం: మంత్రి అనిత
 - 
                        
                            

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
 - 
                        
                            

తెదేపా క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
 - 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 - 
                        
                            

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
 


