వర్సిటీ నిధులపై సర్కారు పట్టు!

విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం డిపాజిట్లను తమ ఆర్థిక సంస్థలో డిపాజిట్లు చేయించే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందుకోసం ఈనెల 25న

Published : 29 Nov 2021 03:10 IST

రూ.448 కోట్లను మళ్లించేందుకు ముమ్మర యత్నాలు
5.5 శాతం వడ్డీకి హామీ!

ఈనాడు, అమరావతి-ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం డిపాజిట్లను తమ ఆర్థిక సంస్థలో డిపాజిట్లు చేయించే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందుకోసం ఈనెల 25న జారీ చేసిన జీవో 1998ను ప్రామాణికంగా తీసుకుంది. ఇందులో ప్రభుత్వానికి చెందిన రెండు సంస్థల డిపాజిట్లు బ్యాంకుల్లో దుర్వినియోగమైన విషయాన్ని ప్రస్తావించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీఎల్‌)లో డిపాజిట్లు చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని వర్సిటీపై ఒత్తిడి వస్తోందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. సోమవారం ఉదయంలోగానే నిధుల బదిలీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయా సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. దీనిపై చర్చించేందుకు సమావేశమవుదామంటూ సంఘాల నేతలు ఉద్యోగులకు సమాచారాన్ని పంపించారు. వర్సిటీ నిధులను ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీఎల్‌కు మళ్లించాలని ఈనెల మొదట్లో ప్రభుత్వం అంతర్గతంగా ఆదేశించింది. దీనిపై చర్చించేందుకు వర్సిటీ పాలకమండలి ఈనెల 13న సమావేశమైంది. వర్సిటీ నిధులను ఆరు బ్యాంకుల్లో భద్రపరిచామని, టెండరులో వడ్డీ ఎక్కువగా ఇచ్చే ఏ బ్యాంకులోనైనా డిపాజిట్లు చేస్తామని పాలకమండలి అప్పట్లో తీర్మానించింది. ఈ పరిణామం ప్రభుత్వ వర్గాలను ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. తదనంతర పరిణామాల్లో ప్రభుత్వం ఏకంగా అన్ని శాఖలను ఉద్దేశించి ఈనెల 25న ఆర్థికశాఖ పేరుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వుల్లో పలు బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు దుర్వినియోగమవుతున్నందున ‘ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీఎల్‌’లోనే డిపాజిట్లు చేయాలని మార్గనిర్దేశం చేశారు. తదనుగుణంగా విశ్వవిద్యాలయానికి అంతర్గతంగా పంపిన మరో ఉత్తర్వులో వడ్డీని 5.5% చెల్లిస్తామని సూత్రప్రాయంగా తెలిపారు. ఈ మేరకు వెంటనే నిధులు మళ్లించాలని రెండు రోజులుగా ఒత్తిళ్లు వస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. వాస్తవానికి విశ్వవిద్యాలయానికి చెందిన రూ.448,02,16,885.82 కోట్లు బ్యాంకుల్లో ఉండగా, కెనరా బ్యాంకు అత్యధికంగా 5.1% వడ్డీ ఇస్తోందని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అంతకంటే   ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం విశేషం. ఒకేసారి డిపాజిట్లు మ్యాచురిటీ కావు. ఈ నేపథ్యంలోనే  రూ.2 కోట్ల చొప్పున డిపాజిట్లు చేస్తున్నారు. వీటిని సత్వరం ఉపసంహరించుకుంటే విశ్వవిద్యాలయం నష్టపోతుందని సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. అయినా.. ఇవేమీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. ప్రభుత్వానికి నిధులు వెళ్లి ఆ తరువాత అవసరాలకు రాకుంటే పరిస్థితేమిటనే అంశంపై సోమవారం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని