పొద్దు తిరిగే ఆరోగ్యం

పోషకాల్లో పొద్దు తిరుగుడు విత్తనాల తీరే వేరు. మిగతావాటితో పోలిస్తే విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వీటిల్లో మరింత ఎక్కువ.

Published : 07 May 2024 00:18 IST

పోషకాల్లో పొద్దు తిరుగుడు విత్తనాల తీరే వేరు. మిగతావాటితో పోలిస్తే విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వీటిల్లో మరింత ఎక్కువ. ఇవి థైరాయిడ్‌ సక్రమంగా పనిచేయటానికీ తోడ్పడతాయి. పొద్దు తిరుగుడు పలుకుల్లో విటమిన్‌ ఇ, ఫ్లేవనాయిడ్ల వంటి యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఇవి విశృంఖల కణాలను అడ్డుకోవటం ద్వారా క్యాన్సర్ల నివారణకు దోహదం చేస్తాయి. వీటిల్లోని లినోలిక్‌ ఆమ్లం క్యాన్సర్‌ నిరోధక కొవ్వు ఆమ్లంగా పనిచేస్తున్నట్టు అధ్యయనాల్లో తేలింది. నువ్వులు, వేరశనగలు, అవిసె గింజలతో పోలిస్తే పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఈ ఆమ్లం మోతాదు చాలా అధికం. వీటిల్లోని విటమిన్‌ ఇ క్యాన్సర్‌ నిరోధకంగానే కాదు, కణస్థాయిలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తగ్గటానికీ తోడ్పడుతుంది. ఇలా గుండెజబ్బు నివారణకూ సాయం చేస్తుంది. పైగా చెడ్డ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల మోతాదులనూ తగ్గిస్తుంది. ఫైటోస్టెరాల్స్‌ అనే రసాయనాలు అదనపు కొవ్వును శరీరం గ్రహించుకోకుండా నిలువరిస్తాయి. ఇవీ గుండెకు మేలు చేసేవే. థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయటానికి అయోడిన్‌, సెలీనియం తగినంత అవసరం. ఒక కప్పు పొద్దు తిరుగుడు పలుకులతో 24 మైక్రోగ్రాముల సెలీనియం అందుతుంది. ఇది రోజుకు అవసరమైన మోతాదులో సుమారు 34 శాతానికి సమానం. కప్పు పొద్దు తిరుగుడు విత్తనాలతో 150 మి.గ్రా మెగ్నీషియం, 0.5 మి.గ్రా పాంటోథెనిక్‌ ఆమ్లం లభిస్తాయి. ఇవి కండరాలు పట్టేయకుండా చూస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు