CM Jagan: ఏ సచివాలయం నుంచైనా అర్జీ

గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవల కోసం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ప్రజలు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సచివాలయాల్లో పౌర సేవలకు సంబంధించిన

Updated : 28 Jan 2022 04:01 IST

లంచాలకు తావులేకుండా సేవలు
రెండేళ్లలో 3.46 కోట్ల కార్యకలాపాలు
ఏపీ సేవా పోర్టల్‌ ప్రారంభంలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవల కోసం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ప్రజలు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సచివాలయాల్లో పౌర సేవలకు సంబంధించిన ‘ఏపీ సేవా పోర్టల్‌’ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ప్రారంభించారు. వాటి పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు ఏ సచివాలయం పరిధిలోని ప్రజలు అక్కడే వివిధ సేవల కోసం దరఖాస్తు చేసుకునేవారు. ఇకపై ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఒకచోట అర్జీ పెట్టి, మరో చోట సర్టిఫికెట్‌ పొందొచ్చు. దరఖాస్తు చేయగానే రశీదు వస్తుంది. తిరస్కరిస్తే, అందుకు కారణాలేంటో చెబుతారు. పరిష్కారానికి ఎంత సమయం పడుతుంది, ఏ స్థితిలో ఉందో తెలియజేస్తూ అర్జీదారుల మొబైల్‌కు ఎస్సెమ్మెస్‌ వస్తుంది. యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌తో ఆన్‌లైన్‌లో రుసుములు చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాం’ అని వివరించారు.

ఐదు శాఖల నుంచి 122 రకాల సేవలు
‘ఏపీ సేవా పోర్టల్‌లో ఐదు ప్రభుత్వ శాఖల్లోని 122 రకాల సేవలు ప్రస్తుతం ఉపయోగించుకోవచ్చు. రెవెన్యూ, భూ పరిపాలనకు సంబంధించి దాదాపు 35, పురపాలకశాఖలో 25, పౌరసరఫరాల శాఖలో 6, గ్రామీణాభివృద్ధి శాఖలో 3, విద్యుత్తు శాఖకు సంబంధించి 53కి పైగా సేవలను పొందొచ్చు. లంచాలకు తావులేకుండా అంతా డిజిటలైజ్‌ చేస్తున్నాం. గ్రామ సచివాలయాల సిబ్బంది నుంచి రాష్ట్ర సచివాలయంలోని ఉన్నతాధికారుల వరకు ఒకే డిజిటల్‌ వేదికగా పనిచేయడం ప్రారంభిస్తారు. దస్త్రాలపై డిజిటల్‌ సిగ్నేచర్‌తో ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. సచివాలయాల ద్వారా రెండేళ్లలో 3.46 కోట్ల మందికి సేవలందించడం గొప్ప విషయం. కొత్త పోర్టల్‌తో మరో ముందడుగు పడనుంది’ అని సీఎం అభిప్రాయపడ్డారు.‘ఇప్పటికే ప్రకటించినట్లుగా సచివాలయాల ఉద్యోగులను క్రమబద్ధీకరించే ప్రక్రియ పూర్తి చేయాలి. ఉగాది నాటికి ఉద్యోగులకు ఏకరూప దుస్తులు ఇవ్వాలి. ఖాళీ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాలి. ఎవరైనా లంచం అడిగితే, ప్రజలు ఫిర్యాదు చేసేలా, సలహాలు, సూచనలు అందించేలా పోర్టల్‌లో తగిన మార్పులు చేయాలి. మే నాటికి ఆధార్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేలా సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయాలి. ఉత్తమ సేవలందిస్తున్న వాలంటీర్లను ఉగాది సందర్భంగా సత్కరించి, వారికి ప్రోత్సాహకాలు అందించాలి’ అని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని