Ex CS Jawahar Reddy: సాగనంపడం లేదు.. జవహర్‌రెడ్డిది ఆర్జిత సెలవేనట!

‘వినండహో.. మాజీ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆర్జిత సెలవు మంజూరుచేయాలని ఆయన దరఖాస్తు చేయగా సీఎస్‌ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీచేశారు’ అని సమాచార, పౌర సంబంధాలశాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Published : 08 Jun 2024 04:14 IST

పత్రికా ప్రకటన ఇచ్చిన సమాచార, పౌర సంబంధాలశాఖ
చంద్రబాబు ప్రమాణస్వీకారం లోపే సెలవుపై వెళ్లాలని సంకేతాలు

ఈనాడు, అమరావతి: ‘వినండహో.. మాజీ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆర్జిత సెలవు మంజూరుచేయాలని ఆయన దరఖాస్తు చేయగా సీఎస్‌ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీచేశారు’ అని సమాచార, పౌర సంబంధాలశాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అదేంటీ..! ఐఏఎస్‌ అధికారులు ఆర్జిత సెలవుపై వెళ్తే పత్రికా ప్రకటన ఇస్తారా? అని అంతగా ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే అక్కడ సెలవు పెట్టింది వైకాపా విధేయ అధికారిగా ముద్రపడిన జవహర్‌రెడ్డి. పత్రికా ప్రకటన ఇచ్చింది అదే పార్టీకి మరింత వీరవిధేయుడైన సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి. ఒకరిని పదవి నుంచి తప్పిస్తుంటే.. మరొకరు దాన్ని అవమానంగా భావించారేమో? పదుల సంఖ్యలో పింఛనుదారుల మరణాలకు కారణమైన జవహర్‌రెడ్డిని పదవి నుంచి తప్పించాలని తెలుగుదేశం, మిత్రపక్షాలు గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశాయి. అయినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించి.. త్వరలో ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారానికి ముందే సెలవుపై వెళ్లాలని జవహర్‌రెడ్డికి సంకేతాలు అందాయి. అప్పటికీ ఎలాగోలా కొనసాగాలని ప్రయత్నించినా సాధ్యం కాక.. గత్యంతరం లేని పరిస్థితుల్లో సెలవుకు దరఖాస్తు చేశారు. ఇలా సాగనంపారంటే బాగుండదనుకున్నారేమో! ఆర్జిత సెలవు మంజూరైందని.. విజయ్‌కుమార్‌రెడ్డి పత్రికా ప్రకటన ఇప్పించారు.


మాజీ సీఎస్‌ జవహర్‌రెడ్డికి 27 వరకు ఆర్జిత సెలవులు మంజూరు

ఈనాడు, అమరావతి: మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి ఈ నెల 7 నుంచి 27వ తేదీ వరకు ఆర్జిత సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని కోరుతూ జవహర్‌రెడ్డి గురువారం ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో అఖిల భారత లీవ్‌ రూల్స్‌ 1955 ప్రకారం ఆర్జిత సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. సెలవుల అనంతరం జవహర్‌రెడ్డి తదుపరి పోస్టింగ్‌ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు