Nandyal: నంద్యాలలో అల్లు అర్జున్‌ ప్రచారం.. ఈసీ వేలు ఎస్పీ వైపు..!

వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా నంద్యాలలో సినీ హీరో అల్లు అర్జున్‌ ప్రచారం చేసిన ఉదంతంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు.

Updated : 25 May 2024 07:31 IST

ఈనాడు, కర్నూలు, నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా నంద్యాలలో సినీ హీరో అల్లు అర్జున్‌ ప్రచారం చేసిన ఉదంతంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల ఎస్పీతోపాటు పోలీసు ఉన్నతాధికారులను బాధ్యుల్ని చేసి మరీ ఆదేశాలు జారీ చేస్తే.. తప్పంతా కానిస్టేబుళ్లదే అయినట్లు వారిపై వేటు వేశారు. నాటి ఘటనలకు నంద్యాల రెండో పట్టణ ఎస్‌బీ కానిస్టేబుల్‌ నాయక్, తాలుకా ఎస్‌బీ కానిస్టేబుల్‌ నాగరాజులను వీఆర్‌కు పంపడం పోలీసుల్లో చర్చనీయాంశమైంది. ఈ నెల 11న అల్లు అర్జున్‌ నంద్యాల వచ్చిన సందర్భంగా ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల ఎమ్మెల్యే కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలో సెక్షన్‌ 30, 144లు అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం పెనుదుమారాన్నే రేపింది. ఆ రోజు నంద్యాలలో ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. నంద్యాల ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి, డీఎస్పీ ఎన్‌.రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. వారిపై 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తిచేయాలని కూడా సూచించింది. ఆయా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదుగానీ..తొలివేటు మాత్రం ఎస్‌బీ కానిస్టేబుళ్లపై పడడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని