చివరి అంకానికి అమరావతి ఉద్యమం.. కూటమి గెలుపుతో శిబిరాల తొలగింపు

వైకాపా సర్కారు నిరంకుశ వైఖరితో నిద్రలేని రాత్రులు గడిపిన అమరావతి అన్నదాతలు.. రాష్ట్రంలో కూటమి ఘనవిజయంతో ఊరట చెందారు.

Updated : 06 Jun 2024 09:25 IST

చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు ప్రకటించే అవకాశం

దొండపాడు శిబిరంలో కూటమి గెలుపుతో నినాదాలు చేస్తున్న రైతులు, మహిళలు

ఈనాడు-అమరావతి, తుళ్లూరు-న్యూస్‌టుడే: వైకాపా సర్కారు నిరంకుశ వైఖరితో నిద్రలేని రాత్రులు గడిపిన అమరావతి అన్నదాతలు.. రాష్ట్రంలో కూటమి ఘనవిజయంతో ఊరట చెందారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యమబాటలో ఉన్న రైతులు, మహిళలకు మంచి రోజులొచ్చాయి. అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో ఉద్యమాన్ని విరమించనున్నారు. 

జగన్‌ జమానాలో కంటిమీద కునుకు కరవు

రాజధాని లేని రాష్ట్రం కోసం 28,587 మంది రైతులు 34,385 ఎకరాల భూమిని సమీకరణలో ఇచ్చారు. నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్న దశలో వైకాపా అధికారంలోకి వచ్చింది. వచ్చీరాగానే ప్రజావేదికను పడగొట్టి విధ్వంసానికి నాంది పలికింది. అనంతరం జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి కకావికలమైంది. 2019 డిసెంబరు 17న ప్రారంభమైన అమరావతి ఉద్యమం ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్విరామంగా 1,632 రోజులుగా సాగుతూనే ఉంది. తమ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా తెలియజేసేందుకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతి వరకు మహాపాదయాత్ర చేశారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు మరో పాదయాత్ర నిర్వహించారు. అమరావతిని రక్షించుకునే క్రమంలో 270 మందికి పైగా రైతులు, రైతుకూలీలు మరణించారు.

ఆ రోజు ప్రకటన: ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రైతులకు అనుకూల పరిస్థితి వచ్చింది. ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీనిచ్చిన తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించింది. ఇక అమరావతికి మంచిరోజులు వచ్చాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సారథ్యంలో రాజధాని నిర్మాణం శరవేగంగా జరిగి అమరావతి విశ్వనగరంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యమానికి ముగింపు పలకనున్నారు. దీనిపై అమరావతి పరిరక్షణ సమితి నేతలు బుధవారం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఎలా ముగించాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రాజధాని గ్రామాల్లో ఏర్పాటైన శిబిరాలను తొలగించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం వేదికపైనే అమరావతి రైతులకు హామీ ఇచ్చి ఉద్యమం విరమింపజేస్తారని భావిస్తున్నారు.


దళితుల జీవితాల్లో వెలుగులు

వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లూ దళితులపై ఉక్కుపాదం మోపింది. కౌలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులు పెట్టింది. రాజధాని నిర్మాణం నిలిచిపోవడంతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పనుల కోసం కార్మికులు వలసపోవాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి విజయంతో అమరావతి నిర్మాణం పునఃప్రారంభమై స్థానికంగా కార్మికులు, యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయి. 

చిలకా బసవయ్య, కన్వీనర్, అమరావతి దళిత బహుజన ఐకాస


భావితరాలకు బంగారు భవిష్యత్తు

రాష్ట్రానికి జీవనాడి లాంటి అమరావతిని కాపాడుకునేందుకు ప్రజలు కసిగా ఓట్లు వేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీసీలపై దమనకాండ సాగించింది. ముస్లింలపై నిత్యం దాడులు జరిగాయి. ప్రజలు కలిసికట్టుగా అరాచక పాలనకు అడ్డుకట్ట వేశారు. రాజధాని రైతులను ప్రభుత్వం నరకయాతన పెట్టింది. కూటమి ప్రభుత్వం రాకతో పేదల్లో ఆశలు చిగురించాయి. చంద్రబాబు సారథ్యంలో అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. రాజధాని పేదల పరిస్థితి మెరుగుపడుతుంది.

షేక్‌ సాహెబ్‌జాన్, కన్వీనర్, అమరావతి మైనారిటీ ఐకాస


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని