Gavi matam: గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి

కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు.

Updated : 20 May 2024 04:24 IST

గతంలో సస్పెండ్‌ చేసినా.. మళ్లీ పోస్టింగ్, పదోన్నతి
ఆయన కుటుంబ ఆధీనంలోనే 22.40 ఎకరాలు
విలువ రూ.10 కోట్లపైనే 
కంచే చేనుమేసినా.. చోద్యం చూస్తున్న దేవాదాయ శాఖ


దేవాదాయశాఖ ఉద్యోగి కుటుంబం ఆధీనంలో ఉన్న.. బళ్లారి జిల్లా చేళ్లగుర్కి వద్ద గవి మఠానికి చెందిన భూములు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-ఉరవకొండ: కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. ఆలస్యంగా ఇది వెలుగుచూశాక ఆయనపై మొక్కుబడి చర్యలతోనే అధికారులు మమ అనిపించారు. దీంతో ఆయన దర్జాగా మళ్లీ ఉద్యోగంలోకి చేరి, పదోన్నతి కూడా పొందారు. మఠం భూములు మాత్రం ఆయన కుటుంబ ఆధీనంలోనే ఉన్నాయి. దేవాదాయశాఖ పనితీరు ఎంత ఘనంగా ఉందో దీనిని బట్టే అంచనా వేయొచ్చు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉన్న గవి మఠానికి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి 3వేల ఎకరాల వరకు భూములు ఉన్నాయి. గతంలో ఈ మఠంలో కారుణ్య నియామకం ద్వారా గుమస్తాగా ఉద్యోగం పొందిన ఎం.మల్లికార్జున.. మఠం భూములనే కొట్టేశారు. అనంతపురం జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా చేళ్లగుర్కి గ్రామ పరిధిలో సర్వే నంబరు 111 బిలో 3.35 ఎకరాలు, 114లో 19.05 ఎకరాలు కలిపి మొత్తం 22.40 ఎకరాలను.. మల్లికార్జున, అతని సోదరులు, సోదరి తదితర కుటుంబసభ్యుల పేరిట కర్ణాటక రెవెన్యూ రికార్డుల్లో పేరు ఎక్కించుకున్నారు. వాటి ఆధారంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు సైతం గతంలో పొందారు. ఈ భూములు అనంతపురం-ఉరవకొండ-బళ్లారి జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నాయి. వీటి విలువ ఎకరానికి రూ.50 లక్షలకు పైనే ఉంది. అంటే మల్లికార్జున కుటుంబసభ్యులు కొట్టేసిన మఠం భూముల విలువ రూ.10 కోట్ల పైమాటే.

సస్పెన్షన్‌.. పోస్టింగ్‌.. పదోన్నతి

గతంలో మఠం ఈఓగా పనిచేసిన ఓ అధికారి.. మఠానికి చెందిన భూముల వివరాలతో ఆస్తుల జాబితా తయారు చేశారు. అప్పటి వరకు మఠం భూములపై సరైన రికార్డులు లేవు. ఆస్తుల జాబితా తయారు చేయడంతో.. చేళ్లగుర్కి వద్ద 22.40 ఎకరాలు మఠానికి చెందిన భూమి ఉందని గుర్తించారు. అయితే దానికి మఠం ఉద్యోగి మల్లికార్జున, అతని కుటుంబీకులు పాస్‌పుస్తకాలు తయారుచేయించి, సొంతం చేసుకున్నట్లు తేలడంతో.. ఆయనను దేవాదాయశాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు. తర్వాత ఆ భూములు వెనక్కి ఇచ్చేస్తానంటూ కేవలం తెల్లకాగితంపై రాసిచ్చి, తర్వాత మఠం పేరిట మ్యుటేషన్‌ చేయలేదు. ఇవేమీ పట్టించుకోని అధికారులు.. ఆ భూములను లీజుకు ఇచ్చేందుకు వీలుగా వేలం నిర్వహణకు కొంతకాలం కిందట సిద్ధమయ్యారు. అయితే ఆ ఉద్యోగి సోదరుడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. ఇప్పటికీ ఆ ఉద్యోగి మల్లికార్జున పేరిట ఉన్న భూమిని వెనక్కి ఇవ్వలేదు. ఈ భూములన్నీ కర్ణాటక ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ కింద తమకు దక్కినట్లేనంటూ వితండవాదం చేస్తున్నారని తెలిసింది. ఇంత జరిగినా దేవాదాయశాఖ అధికారులు అతనిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. దీంతో అప్పటికే గుంతకల్లు సమీపంలోని కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందిన ఆయన, ప్రస్తుతం గ్రేడ్‌-1 ఈఓగా గుంతకల్లు గ్రూప్‌ ఆలయాల ఈఓగా విధులు నిర్వహిస్తున్నారు.

ఉరవకొండలోని గవి మఠం

క్రిమినల్‌ చర్యలు లేవు

వాస్తవానికి ఇలా దేవాదాయ మఠం భూమిని కాజేసిన ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించాలని, అతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకునే యోచన చేయలేదు. తాజాగా ఈ నెల మొదటివారంలో దేవాదాయశాఖ కమిషనర్‌.. రాష్ట్రంలోని 31 పెద్ద మఠాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గవి మఠం భూమిని.. ఉద్యోగే (ప్రస్తుతం అధికారి) కొట్టేసిన అంశంపై చర్చ జరిగింది. పైగా ఆయనకు పదోన్నతి లభించిన విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. దీంతో ఆయనపై శాఖాపరమైన చర్యలతో పాటు, క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించారు.

కర్ణాటకలో భూముల కోసం వెతుకులాట

గవి మఠానికి కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, సింధనూరు, రాయచూరు, కంప్లి, మైసూరు, గౌరిబిదనూరు తదితర ప్రాంతాల్లో కలిపి 1,700 ఎకరాలు ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదు. గతంలో పనిచేసిన కొందరు ఈఓలు.. ఈ భూముల వివరాల కోసం కర్ణాటకలోని ఆయా జిల్లాల్లో రెవెన్యూ అధికారులకు పదేపదే లేఖలు రాసినా స్పందన రాలేదు. తాజాగా ఈ మఠం భూములన్నీ గుర్తించి, వాటికి జియో కోఆర్డినేట్స్‌ ద్వారా రికార్డులు సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని