MLA Pinnelli: కారుతో ఢీకొట్టి.. నడుం పైనుంచి పోనిచ్చి

కర్రలు, బీరు సీసాలతో దాడులు చేశారు. ఆపై కారుతో ఢీకొట్టించారు.. యువకుడి పైనుంచి కారు పోనిచ్చారు.. దీంతో అతని కాళ్లు, నడుం విరిగిపోయాయి.

Updated : 24 May 2024 06:44 IST

ఏ పార్టీకీ సంబంధం లేని యువకుడిపై దాడి
చావు బతుకుల్లో ఆస్పత్రిలో పోరాటం
వెలుగులోకి పిన్నెల్లి మరో అరాచకం

ఆస్పత్రిలో లేవలేని స్థితిలో.. తల్లిదండ్రులతో భవానీప్రసాద్‌

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: కర్రలు, బీరు సీసాలతో దాడులు చేశారు. ఆపై కారుతో ఢీకొట్టించారు.. యువకుడి పైనుంచి కారు పోనిచ్చారు.. దీంతో అతని కాళ్లు, నడుం విరిగిపోయాయి. ఆరునెలల వరకూ ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కూలిచేసే కుటుంబం.. ఆరునెలల కిందట ప్రసవించిన భార్య, వృద్ధ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌ రోజున చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెం (కేపీ గూడెం) పోలింగ్‌ కేంద్రంలో చేసిన విధ్వంసకాండలో ఏ పార్టీకీ సంబంధం లేని భవానీప్రసాద్‌ అనే యువకుడు తీవ్ర గాయాలపాలై నడవలేని, కూర్చోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. 

మే 13న జరిగిన దాడి భవానీప్రసాద్‌ మాటల్లో.. ‘‘పోలింగ్‌ కేంద్రంలో ఉన్న కుర్రాళ్లకు భోజనం ఇవ్వడానికి వెళ్లాను. అంతలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏడు వాహనాలతో వచ్చారు. వాటిలోంచి పలువురు వచ్చి చుట్టుముట్టారు. తెదేపా వారికోసం వెతుకుతూ వచ్చి బీరు సీసాలు, రాడ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. మేమంతా పరుగులు పెట్టాం. అంతలో నా ఫోన్‌ కింద పడిపోయింది. తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా నన్ను కారుతో ఢీకొట్టారు. దీంతో ఎగిరి కిందపడ్డా. నా నడుంపై నుంచి కారుతో తొక్కించారు. నాకు కాళ్లు, నడుం పనిచేయడం లేదు. మూత్రనాళం దెబ్బతిందని, శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. నేను కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుందన్నారు. మొదట పొట్టకు ఆపరేషన్‌ చేయాలని ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేశాం. మాపై దాడులు చేసి వెళ్లిపోయాక పోలీసులు వచ్చారు. నేను పనికి వెళితేనే నా కుటుంబం గడిచేది. ఆరు నెలల వరకూ మాకు పూట ఎలా గడుస్తుందో అర్థం కావట్లేదు.’’


తిరుపతి ఉప ఎన్నికలో కన్నీరు పెట్టుకున్న ఆర్డీవో

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలువురు అధికారులు, ప్రిసైడింగ్‌ అధికారులను భయభ్రాంతులకు గురిచేశారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు 2020 సెప్టెంబరులో మృతిచెందారు. అనంతరం 2021 ఏప్రిల్‌ 17న ఉప ఎన్నిక నిర్వహించారు. అప్పటి వైకాపా అభ్యర్థి మద్దెల గురుమూర్తికి భారీ ఆధిక్యం తెచ్చేందుకు వీలుగా పలువురు ఎమ్మెల్యేలను ఇన్‌ఛార్జులుగా పార్టీ అధిష్ఠానం నియమించింది. పిన్నెల్లికి సూళ్లూరుపేట నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తూ.. నాయుడుపేటను ప్రత్యేకంగా ఇచ్చారు.

మావోయిస్టు ప్రాంతానికి బదిలీ అవుతావు: ఉపఎన్నిక సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఓజిలి మండలంలో పలు పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌ జరిగింది. దీన్ని గుర్తించిన ప్రిసైడింగ్, సెక్టార్‌ అధికారులు అప్పటి రిటర్నింగ్‌ అధికారి, నాయుడుపేట ఆర్డీవో సరోజిని దృష్టికి తీసుకొచ్చారు. ఆమె పోలీసులు, ఇతర అధికారులకు సూచనలు చేశారు. ఈ విషయం పిన్నెల్లికి తెలియడంతో ఆయన వెంటనే ఆర్డీవో సరోజినిని హెచ్చరించారు. ‘ఏమనుకుంటున్నావో.. మావోయిస్టు ప్రాంతానికి బదిలీ చేయాల్సి ఉంటుంది’ అని బెదిరించారు. ఆ విషయాన్ని ఆమె తోటి అధికారులకు చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని