AB Venkateswara Rao: పోస్టింగ్‌ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!

ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ.

Updated : 18 May 2024 16:34 IST

ఏబీ వెంకటేశ్వరరావుపై పగబట్టిన ప్రభుత్వం
ఐదేళ్లుగా సస్పెన్షన్లు, అక్రమ కేసులతో వేధింపులు
క్యాట్‌ తీర్పు ఇచ్చి 10 రోజులవుతున్నా విధుల్లోకి తీసుకోలేదు
ఈ నెల 31న ఏబీవీ పదవీ విరమణ
అప్పటివరకూ విధుల్లోకి తీసుకోకూడదనే ఎత్తుగడ
అన్నీ తానై అమలుచేస్తున్న సీఎస్‌ జవహర్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. గత ఐదేళ్లుగా ఏబీవీకి పోస్టింగ్‌ ఇవ్వకుండా, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టిన జగన్‌ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికారగణం ఆయనపై ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నాయి. ఏబీవీ సస్పెన్షన్‌ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలిచ్చి పది రోజులవుతున్నా ఇప్పటివరకూ ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెలాఖరున ఏబీవీ పదవీవిరమణ చేయనున్నారు. అప్పటివరకూ తాత్సారం చేసి ఆయన్ను విధుల్లోకి తీసుకోకుండానే పదవీ విరమణ చేయించాలనే ఎత్తుగడ దీని వెనక ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏబీవీ     సస్పెన్షన్‌ను ఎత్తేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం ఏపీ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌లో పిటిషన్‌ వేశారు. సీజే అనుమతి లభించకపోవడంతో ఆ పిటిషన్‌ అడ్మిట్‌ కాలేదు. పోలింగ్‌ అనంతర హింసకు బాధ్యుడ్ని చేస్తూ ఈసీ తనపై చర్యలు తీసుకుంటే తన తర్వాత వచ్చే అధికారి ఏబీవీకి పోస్టింగ్‌ ఇచ్చేస్తారేమోనని సీఎస్‌ జవహర్‌రెడ్డి దిల్లీలో ఈసీ ఎదుట హాజరుకావడానికి ముందే... క్యాట్‌ తీర్పుపై హైకోర్టులో సవాలు చేశారనే అనుమానం ఐపీఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తద్వారా ఆయన సీఎస్‌ పోస్టులో లేకున్నా.. ఏబీవీకి పోస్టింగ్‌ రాకుండా అడ్డంకులు సృష్టించారన్న వాదన వినిపిస్తోంది. వాస్తవంగా క్యాట్‌ ఆదేశాలను అమలు    చేయకపోవడం ధిక్కారమే అవుతుంది.

సీఎస్‌కు దరఖాస్తు చేసుకుని వారం అవుతున్నా...

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ చెల్లదంటూ ఈ నెల 8న హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) తీర్పు వెలువరించింది. ఆ ప్రతులు బయటకు రావడానికి మూడు రోజుల సమయం పట్టింది. ఆ వెంటనే సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఏబీవీ కలిసి ఆ తీర్పు ప్రతితో పాటు, తనను విధుల్లోకి తీసుకోవాలని     దరఖాస్తు సమర్పించారు. ఇది జరిగి వారం రోజులు   దాటిపోయింది. ప్రస్తుతం కోడ్‌ అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం అనుమతి పొంది ఏబీవీని విధుల్లోకి తీసుకుని పోస్టింగ్‌ ఇవ్వాలి. ఆ దస్త్రాన్ని ఎన్నికల సంఘానికి కాకుండా సీఎం జగన్‌కు పంపించినట్లు సమాచారం. ఈలోగా ఏబీవీపై ప్రాసిక్యూషన్‌కు  కేంద్రం నుంచి అనుమతి పొందారు. రాష్ట్రంలోని ఓ ప్రముఖ దేవస్థానం ఈఓ.. కేంద్ర హోంశాఖలో మంత్రాంగం నడిపించి ఏబీవీ ప్రాసిక్యూషన్‌కు అనుమతి తెచ్చారని సమాచారం. 

పోస్టింగ్‌ ఇవ్వకుండానే పదవీ విరమణ చేయించే దురుద్దేశం

ఏబీ వెంకటేశ్వరరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సర్వీసు మరో 13 రోజులే ఉంది. ఇలాంటి సందర్భాల్లో సీఎస్‌ స్థానంలో ఎవరున్నా క్యాట్‌ ఆదేశాలను ఆఘమేఘాలపై అమలుచేస్తారు. కానీ జవహర్‌రెడ్డి తీరు చూస్తుంటే మాత్రం.. ఈ 13 రోజులు ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా దురుద్దేశపూరిత జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తోందన్న చర్చ ఐపీఎస్‌ వర్గాల్లో నడుస్తోంది. పదవీవిరమణ చేసేవరకూ విధుల్లోకి తీసుకోకూడదనే ఎత్తుగడ దీని వెనక ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్యాట్‌ ఆదేశాలు అమలుచేసి ఏబీవీకి పోస్టింగ్‌ ఇవ్వడానికి, ప్రాసిక్యూషన్‌తో సంబంధం లేకపోయినా సరే ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వట్లేదు. చివరికి విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏబీవీ, ఆయన సతీమణి కవిత ఓట్లనూ తొలగించేశారు. ప్రభుత్వ ఫ్యాక్షనిజం వల్ల ఇప్పటికే అత్యంత విలువైన కాలాన్ని, సర్వీసును కోల్పోయిన ఏబీవీకి.. పదవీకాలం చివర్లోనూ ఇబ్బందులు తప్పట్లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని