AP High Court: రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం మార్పులేంటి?

భూ యజమానులకు తెలియకుండా, నోటీసిచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.

Published : 21 May 2024 04:56 IST

అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: భూ యజమానులకు తెలియకుండా, నోటీసిచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రికార్డుల్లో మార్పుచేర్పులు చేయాలనుకుంటే ప్రభావిత వ్యక్తికి నోటీసులిచ్చి, వాదనలు విన్న తర్వాతే ప్రక్రియ చేపట్టాలని తేల్చిచెప్పింది. నిబంధనలను పాటించకుండా రికార్డుల్లో మార్పులు చేయడం సరికాదంది. ఇష్టానుసారంగా రికార్డులు మార్చడం ‘చిన్నం పాండురంగం’ కేసులో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని ప్రకటించింది. నెల్లూరు జిల్లా పరికోటకు చెందిన పిటిషనర్ల భూములను ‘ప్రభుత్వ భూములుగా’ పేర్కొంటూ రికార్డులు మారుస్తూ కలిగిరి తహశీల్దార్‌ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసింది. వారి భూముల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. మరోవైపు తమ భూముల రికార్డులను మూడోపక్షానికి అనుకూలంగా మార్చారంటూ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలేనికి చెందిన పి.సత్యనాగేంద్రప్రసాద్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో పూర్తి వివరాలు సమర్పించాలని సహాయ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.సుబ్బారెడ్డి ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. భూ యజమానులకు సమాచారం లేకుండా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయడం, ఈ వ్యవహారంపై హైకోర్టులో తరచూ వ్యాజ్యాలు దాఖలు అవుతుండడంపై న్యాయమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని