Andhra Pradesh: కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే ప్రక్షాళన మొదలు

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరక ముందే, మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయక ముందే... వివిధ శాఖల్లో ప్రక్షాళన మొదలైంది.

Updated : 10 Jun 2024 06:57 IST

అవినీతికి కేంద్రాలైన గనులు, ఎక్సైజ్‌ శాఖలపై ప్రత్యేకదృష్టి 
వివాదాస్పద అధికారులపై వరుసగా బదిలీ వేటు
కీలకపత్రాలు, దస్త్రాలు నాశనం చేయకుండా చర్యలు 
అధికారులెవరినీ రిలీవ్‌ చేసి పంపొద్దని ఆదేశాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరక ముందే, మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయక ముందే... వివిధ శాఖల్లో ప్రక్షాళన మొదలైంది. వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకులతో అంటకాగుతూ, అడ్డగోలు దోపిడీకి యథేచ్ఛగా సహకరించిన అధికారులపై వేటు వేయడం, డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు ఈ హడావుడిలో రిలీవై వెళ్లిపోకుండా నిరోధించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయి. వైకాపా హయాంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు, వివాదాలకు నిలయాలైన ప్రభుత్వశాఖలు, విభాగాల్లో ముఖ్యమైన దస్త్రాల్ని, పత్రాల్ని నాశనం చేయకుండా నిరోధించే చర్యలు మొదలయ్యాయి. మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి దస్త్రాలు, పత్రాలేవీ బయటకు వెళ్లకుండా చూడాలని, భద్రపరచాలని గవర్నర్‌ కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. మరోపక్క చంద్రబాబు ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే పరుగులు తీయడం మొదలుపెట్టింది. వైకాపాతో అంటకాగుతూ, పూర్తిగా ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేసిన సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఇప్పటికే సెలవుపై పంపించారు. అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరొందిన గనులశాఖ డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి, ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి, సీఐడీ చీఫ్‌ సంజయ్, సిట్‌ చీఫ్‌ కొల్లి రఘురామ్‌రెడ్డిపై బదిలీ వేటు పడింది. జగన్‌ ప్రభుత్వంలో రూ.వేల కోట్ల అవినీతికి కేంద్ర బిందువులైన గనులు, ఎక్సైజ్‌శాఖలో ఇప్పటికే తీవ్రస్థాయిలో ప్రకంపనలు మొదలయ్యాయి. దస్త్రాలు, కీలక డాక్యుమెంట్లు తస్కరించారన్న ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదుచేసింది. గత ఐదేళ్లలో యథేచ్ఛగా చెలరేగిపోయిన అధికారుల్లో ఈ పరిణామాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఐదేళ్ల జగన్‌ పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా గాడిన పెట్టాలన్న కృతనిశ్చయంతో చంద్రబాబు ఉన్నట్టుగా సమాచారం. ఆ సంకేతాలకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం వేగంగా కదులుతోంది.


..అప్పుడే సర్దుకుంటే ఎలా? ఆగండి!

జగన్‌ ప్రభుత్వం కేంద్రం, ఇతర రాస్త్రాల నుంచి అస్మదీయులు, దాదాపుగా ఒకే సామాజికవర్గానికి చెందిన పలువురిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి, అర్హత లేకపోయినా కీలక బాధ్యతలు అప్పగించింది. వారిలో చాలామంది ప్రభుత్వ అవినీతికి కొమ్ముకాశారు. కొందరు ఎన్నికల ఫలితాలు రాగానే సర్దుకునే ప్రయత్నం చేస్తారని.. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరేవరకూ ఎవరినీ బదిలీ చేయవద్దని, సెలవుపై వెళతామన్నా అనుమతులు ఇవ్వవద్దని, రిలీవ్‌ చేయొద్దని ఆదేశాలు జారీచేసింది. సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌ తనను రిలీవ్‌ చేస్తే వెళ్లిపోతానని కోరినా... కుదరదని స్పష్టం చేసినట్టు తెలిసింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే జిల్లాల నుంచి రాష్ట్రస్థాయి వరకు పెద్ద ఎత్తున అధికారుల ప్రక్షాళన ఉంటుంది. 

రాజధాని పనుల్లో కదలిక

రాజధాని అమరావతిలో గడచిన ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టకుండా, దాన్నో చిట్టడివిలా మార్చేసిన సీఆర్‌డీఏలో కదలిక మొదలైంది. రాజధానిలో పిచ్చిమొక్కలు తొలగించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. రాజధానికి ప్రమాణస్వీకారం చేసినచోట ఏర్పాటు చేసిన గ్యాలరీని వైకాపా హయాంలో దుండగులు ధ్వంసం చేసినా చీమకుట్టినట్టయినా లేని సీఆర్‌డీఏ అధికారులు... ఆదివారం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, గ్యాలరీని పునరుద్ధరించే పనులు హుటాహుటిన చేస్తున్నారు. సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ఆదివారం రాజధానిలో పర్యటించి తాజా పరిస్థితిని సమీక్షించారు. 

సమీక్షలకు ప్రభుత్వశాఖల సన్నద్ధత

చంద్రబాబు పరిపాలన శైలి, అధికారుల్ని ఆయన పరుగులు పెట్టించే విధానం గురించి బాగా తెలిసిన వివిధ ప్రభుత్వశాఖలు... కొత్త ప్రభుత్వం కొలువుతీరగానే ఆయన చేపట్టే సమీక్షలకు సిద్ధమవుతున్నాయి. నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులో వ్యవహారాలపై జలవనరులశాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని అధికారులకు చంద్రబాబు ఇప్పటికే సూచించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాపించే అవకాశమున్నందున, ముందుజాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్‌కోల పరిస్థితిపైనా సమాచారం తెప్పించుకున్నారు. చాలాచోట్ల వీధిదీపాలు వెలగడం లేదని తెలుసుకుని, వెంటనే పరిస్థితి చక్కదిద్దాలని అధికారులకు ఆయన సూచించినట్టు సమాచారం.


గనులు, ఎక్సైజ్‌ శాఖల్లో ప్రకంపనలు

వైకాపా పాలనలో అత్యంత వివాదాలకు, అవినీతికి నిలయాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గనులు, ఎక్సైజ్‌ శాఖలపై ఎన్నికల ఫలితాలు రాగానే ప్రభుత్వం దృష్టిపెట్టింది. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి వైకాపాకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు... ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసింది. ఆయన ఈ నెల 6న సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలు, ఇతర పత్రాల్ని కారులో దొంగతనంగా తరలిస్తుండగా చూశానని కంచికచర్లకు చెందిన గద్దె శివకృష్ణ ఫిర్యాదుచేయడంతో సీఐడీ కేసు నమోదుచేసింది. శుక్రవారం సీఐడీ బృందాలు హుటాహుటిన హైదరాబాద్‌ వెళ్లి వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించాయి. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వ పెద్దలు, ఆ పార్టీ నాయకులు, వారి అస్మదీయులు మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకుని, జే బ్రాండ్‌ మద్యంతో భారీగా దోచుకున్నారు. ఎన్నికల్లో వైకాపా ఘోరంగా ఓడిపోవడంతో... ఆ దోపిడీ, కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాల్ని, పత్రాల్ని, హార్డ్‌డిస్క్‌లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నించినట్టు సీఐడీ గుర్తించింది.

  • ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సర్వీసెస్‌కి చెందిన వెంకట్‌రెడ్డిని జగన్‌ ప్రభుత్వం డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి గనులశాఖ సంచాలకుడిని చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేసిన వెంకట్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పెద్దల దోపిడీకి ఆయన అడ్డగోలుగా సహకరించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గనులశాఖ సంచాలకుడిగా, ఏపీఎండీసీకి ఇన్‌ఛార్జి ఎండీగా హవా చలాయించిన వెంకట్‌రెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆ వెంటనే ఏపీఎస్పీ బెటాలియన్‌కి చెందిన పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటలకు ఇబ్రహీంపట్నంలోని గనులశాఖ సంచాలకుడి కార్యాలయానికి, రాత్రి ఒంటిగంట సమయంలో ఏపీఎండీసీ కార్యాలయానికి వెళ్లి, తనిఖీలు నిర్వహించారు. దస్త్రాలు, హార్డ్‌కాపీలు ఉన్నాయో, లేదో సరిచూసుకుని తాళాలు వేశారు. 
  • ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలతో పాటు, తమ అవినీతిని, అక్రమాల్ని ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెట్టి, వేధించేందుకు జగన్‌ ప్రభుత్వం సాధనంగా వాడుకున్న సీఐడీ, సిట్‌ కార్యాలయాలపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. అక్కడి పత్రాలేవీ బయటకు వెళ్లకుండా వాటికి తాళాలు వేసింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని