AP Police: రాజకీయ పోలీసింగే.. దొంగల్ని పట్టేదేలే!

ఐదేళ్లుగా రాజకీయ పోలీసింగ్‌కే పరిమితమై ప్రాథమిక విధుల్ని విస్మరించిన ఏపీ పోలీసు విభాగం... చోరీ సొత్తు రికవరీల్లో విఫలమైంది. చోరీలు, దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల్లో బాధితులు పోగొట్టుకుంటున్న మొత్తాల్ని తిరిగి రాబట్టడంలో వెనకబడింది.

Updated : 29 May 2024 08:13 IST

చోరీ సొత్తు రికవరీల్లో విఫలం
సామాజిక మాధ్యమాల్లో  పోస్టు పెడితే చాలు వేట
చోరుల్ని పట్టుకోవడంలో ఆ చొరవ ఏదీ?

ఈనాడు, అమరావతి: ఐదేళ్లుగా రాజకీయ పోలీసింగ్‌కే పరిమితమై ప్రాథమిక విధుల్ని విస్మరించిన ఏపీ పోలీసు విభాగం... చోరీ సొత్తు రికవరీల్లో విఫలమైంది. చోరీలు, దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల్లో బాధితులు పోగొట్టుకుంటున్న మొత్తాల్ని తిరిగి రాబట్టడంలో వెనకబడింది. 2019 నుంచి 2022 మధ్య నాలుగేళ్ల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా రూ.571 కోట్ల విలువైన సొత్తును దొంగలు దోచుకోగా అందులో రూ.299.2 కోట్ల విలువైనవి మాత్రమే పోలీసులు తిరిగి రాబట్టగలిగారు. మరో రూ.272 కోట్లు రికవరీ చేయలేకపోయారు. అధికార వైకాపా నాయకుల సేవలో తరిస్తూ.. ప్రతిపక్షాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాలపై అణచివేత, నిర్బంధాలు అమలు చేయటం, అక్రమ కేసులు బనాయించటం వంటి కార్యకలాపాల్లో తలమునకలై ఉండటంతో చోరీలు, దొంగతనాలు, దోపిడీలు వంటి కేసుల పరిశోధన, దర్యాప్తుపై శ్రద్ధ కొరవడింది. పర్యవసానంగా ఆయా నేరాల్లో రికవరీలు తగ్గిపోయాయి. సాధారణంగా ఈ తరహా నేరాల్లో ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు సత్వరం స్పందించి నిందితుల్ని పట్టుకోగలిగితే చోరీకి గురైన సొత్తులో ఎక్కువ శాతం రికవరీకి అవకాశం ఉంటుంది. అయితే వైకాపా ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని వెంటాడి, వేటాడి మరీ అరెస్టు చేసేందుకు, వారు ఎక్కడున్నా పట్టుకునేందుకు చూపిన చొరవ, ఉత్సాహాన్ని పోలీసులు దొంగల్ని పట్టుకోవటం, చోరీ సొత్తు రికవరీ చేయటంలో మాత్రం కనబరచలేదు.

పోగొట్టుకుంటున్న సొత్తు విలువ ఏటేటా పెరుగుదల 

రాష్ట్రంలో 2019లో జరిగిన దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాల్లో బాధితులు రూ.130.6 కోట్ల విలువైన సొత్తును పొగొట్టుకోగా... 2022లో జరిగిన ఈ తరహా నేరాల్లో రూ.179.80 కోట్ల విలువైన సొత్తు నష్టపోయారు. 2019తో పోలిస్తే 2022లో బాధితులు కోల్పోయిన సొత్తు విలువ 37.67 శాతం పెరిగింది. రికవరీల్లో మాత్రం వెనకబడ్డారు. 

  • రాష్ట్రంలో ఏటా సగటున రూ.140 కోట్ల విలువైన సొత్తు దొంగలు దోచుకుంటున్నారు. అందులో ఎక్కువ భాగం నగదు, బంగారు, వజ్రాభరణాలే. దొంగలు వెంటనే ఆ నగదు ఖర్చు చేసేసి, వస్తువులను వేర్వేరు రూపాల్లోకి మార్చేస్తున్నారు. ఆ సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. పోలీసులు ఆయా కేసుల విషయంలో సత్వర స్పందించకపోవడం, నిందితుల్ని గుర్తించి, వారిని పట్టుకోవడంలో జాప్యం చేయటం వల్ల అప్పటికే వారు సగానికి పైగా చోరీ సొత్తు ఖర్చు చేసేసి ఉంటున్నారు. 
  • మరికొన్ని సందర్భాల్లో నిందితుల నుంచి పూర్తిస్థాయిలో చోరీ సొత్తును రాబట్టగలిగినా,, కొందరు పోలీసు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ అందులో కొంత దిగమింగుతున్నారు. ఇలాంటివి కూడా రికవరీల శాతం తగ్గిపోవటానికి కారణమవుతోంది. 
  • మరీ పెద్దవైతే తప్ప చిన్న దొంగతనాలు, చోరీల దర్యాప్తుపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టట్లేదు. చోరీ సొత్తును రాబట్టే అంశంలో నైపుణ్యలేమి ఈ రికవరీల తగ్గటానికి మరో కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు