AP Fibernet: ఏపీ ఫైబర్‌నెట్‌లో దస్త్రాల ధ్వంసం!

ఏపీ ఫైబర్‌నెట్‌లో కీలక దస్త్రాలను కొందరు సిబ్బంది ధ్వంసం చేయడంతోపాటు గుట్టుగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన కొన్ని పత్రాలను ఇప్పటికే మాయం చేసినట్లు తెలిసింది.

Published : 07 Jun 2024 06:20 IST

నిఘా వర్గాల ఆధీనంలో కార్యాలయం
అధికారులను ప్రశ్నించిన పోలీసులు 

ఈనాడు, అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్‌లో కీలక దస్త్రాలను కొందరు సిబ్బంది ధ్వంసం చేయడంతోపాటు గుట్టుగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన కొన్ని పత్రాలను ఇప్పటికే మాయం చేసినట్లు తెలిసింది. దీనిపై నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాడే.. బుధవారం మధ్యాహ్నమే విజయవాడలోని ఫైబర్‌నెట్‌ కార్యాలయాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. 24 గంటలూ నిఘా ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వచ్చి, వెళ్లే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తున్నారు. సంస్థ ఎండీ మధుసూదన్‌రెడ్డి, ఆర్థిక, పరిపాలన విభాగాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లతో విజయవాడ సౌత్‌ జోన్‌ ఏసీపీ రతన్‌రాజు, సైబర్‌ క్రైం ఏసీపీ తేజేశ్వరరావు విడివిడిగా సమావేశమయ్యారు. ఫైళ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.

గత ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలే కారణమా?: వైకాపా ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌ పాలనా వ్యవహారాల్లో జరిగిన అవకతవకలపై కొన్ని కీలక పత్రాలను ఇప్పటికే కార్యాలయం నుంచి తరలించినట్లు సమాచారం. మిగిలిన వాటిని తీసుకెళ్లడానికి వీల్లేక ముక్కలుగా చించివేసి అక్కడే చెత్త కుండీల్లో వేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో ఫైబర్‌ నెట్‌ సేవలు విస్తరించకుండా కొన్ని తిరోగమన నిర్ణయాలు తీసుకున్నారు. వీటి తాలూకు ఫైళ్లను ఆన్‌లైన్‌లో కాకుండా, ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇలా సంస్థకు ఆర్థికంగా నష్టం వాటిల్లేలా నిర్ణయాలు తీసుకున్న సంగతి బయటపడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సంస్థలో ఏయే విభాగాలున్నాయి? వాటిలో ఉన్న ఫైళ్లు ఎన్ని? అవన్నీ సురక్షితంగా ఉన్నాయా? తదితర వివరాలను రెండు రోజులుగా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ-ఫైళ్లు, సంస్థ డేటాను ట్యాంపర్‌ చేయడం, తొలగించడం వంటి చర్యలకు పాల్పడవద్దని కార్యాలయ సిబ్బందికి స్పష్టంచేశారు. మరోపక్క, ఫైబర్‌నెట్‌ డేటాను భద్రపర్చే సర్వర్‌ విశాఖపట్నంలో ఉంది. అక్కడి నుంచి కూడా డేటా చోరీ కాకుండా నిఘా పెట్టాలని పోలీసులు విశాఖలోని సిబ్బందికి సమాచారమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని