IAS,IPS transfers: వైకాపా వీర విధేయ ఐపీఎస్‌లపై వేటు

వైకాపా వీర విధేయ.. వివాదాస్పద ఐపీఎస్‌లపై బదిలీ వేటు పడింది. సీఐడీ ఏడీజీ ఎన్‌.సంజయ్‌తోపాటు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీ, ఎక్స్‌అఫిషియో కార్యదర్శి, సిట్‌ చీఫ్‌ కొల్లి రఘురామ్‌రెడ్డిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది.

Published : 08 Jun 2024 06:00 IST

సీఐడీ ఏడీజీ సంజయ్,  సిట్‌ చీఫ్‌ రఘురామ్‌రెడ్డి బదిలీ
డీజీపీ కార్యాలయంలో  రిపోర్టు చేయాలని ప్రభుత్వ ఆదేశం

ఈనాడు, అమరావతి: వైకాపా వీర విధేయ.. వివాదాస్పద ఐపీఎస్‌లపై బదిలీ వేటు పడింది. సీఐడీ ఏడీజీ ఎన్‌.సంజయ్‌తోపాటు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీ, ఎక్స్‌అఫిషియో కార్యదర్శి, సిట్‌ చీఫ్‌ కొల్లి రఘురామ్‌రెడ్డిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. వారిద్దరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వీరిద్దరూ.. పలువురు తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపారు. వైకాపా అభ్యర్థుల విజయానికి వీలుగా రఘురామ్‌రెడ్డి పనిచేశారని గతంలో ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు తరలించిన సమయంలోనూ ఆయన కీలకంగా పనిచేశారు. సీఐడీ ఏడీజీగా పనిచేసిన సంజయ్‌ వైకాపా పెద్దల ఆదేశాల మేరకు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు సహా పలు అక్రమ కేసులు బనాయించారు. దిల్లీ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో పత్రికా సమావేశాలు పెట్టి చంద్రబాబుపై బురదజల్లారు. వీరిద్దరిని ఆయా పదవుల నుంచి తప్పించిన ప్రభుత్వం.. డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. 

వెంకటరెడ్డి, మధుసూదన్‌రెడ్డి పైనా.. 

ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి, గనులశాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి పైనా ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వీరిద్దరినీ సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానంలో అనుచిత లబ్ధి పొందారంటూ చంద్రబాబుపై గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఫిర్యాదు చేయగా, సీఐడీ కేసు నమోదు చేసింది. వీరిద్దరూ వైకాపా ప్రభుత్వానికి లబ్ధి కలిగేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.

సీఎంఓలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంఓలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కార్యదర్శి రేవు ముత్యాలరాజు, అదనపు కార్యదర్శి నారాయణ భరత్‌ గుప్తాలను బదిలీ చేశారు. ఈ ముగ్గురు అధికారులను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని