JJM Works: ఏపీ సర్కారు మొద్దునిద్రతో రూ.5,736 కోట్లకు గండి!

కేంద్ర నిధులను ఉపయోగించుకోవాలని ఏ రాష్ట్రమైనా ఆరాటపడుతుంది. వివిధ పథకాల కింద వీలైనంత రాబట్టుకునేందుకు ఆయా రాష్ట్రప్రభుత్వాలు దిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తుంటాయి.

Updated : 26 May 2024 08:56 IST

వాటా నిధులు ఇవ్వకపోవడంతో జేజేఎం నిధులు కోల్పోయిన రాష్ట్రం
ఐదేళ్లలో చేసిన పనుల విలువ రూ.4,200 కోట్లే

ఈనాడు, అమరావతి: కేంద్ర నిధులను ఉపయోగించుకోవాలని ఏ రాష్ట్రమైనా ఆరాటపడుతుంది. వివిధ పథకాల కింద వీలైనంత రాబట్టుకునేందుకు ఆయా రాష్ట్రప్రభుత్వాలు దిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తుంటాయి. మన రాష్ట్రం మాత్రం ఇందుకు విరుద్ధంగా.. నిర్లక్ష్య ధోరణి చూపింది. జలజీవన్‌ మిషన్‌ (జేజేఎం) పథకం కింద కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించుకోలేదు. ఫలితంగా గత రెండేళ్లలో రూ.5,736.92 కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. గ్రామాల్లో ఇంటింటికీ రక్షిత నీటిని అందించాలని జేజేఎం పథకం కింద కేంద్రం నిధులిస్తోంది. 2019-29లో రాష్ట్రానికి రూ.15,300 కోట్ల అంచనాలతో ప్రాజెక్టు మంజూరుచేసింది. రాష్ట్రవాటాగా 50% నిధులు సమకూరిస్తే.. కేటాయించిన దాంట్లోంచి కేంద్రం అంతే మొత్తంలో విడుదల చేస్తుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సమకూర్చడంలో మొదటి నుంచీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కేంద్రం నుంచి రూ.10,200 కోట్ల విలువైన పనులకు పరిపాలన అనుమతులు తీసుకున్నా గత ఐదేళ్లలో రూ.4,200 కోట్ల విలువైనవే పూర్తి చేయగలిగింది. ఇంత జరిగినా కేంద్రం ఏటా రాష్ట్రానికి నిధులు వినియోగించుకోవాలని గుర్తుచేస్తూనే ఉంది. ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. దీంతో జేజేఎం పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే దాదాపు రూ.1,200 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. పెండింగ్‌ బిల్లుల జాప్యంతో గుత్తేదారులు పనులు ఆపేస్తున్నారు. 


నిధులిచ్చినా వినియోగించుకోలేని దుస్థితి

జేజేఎం నిధులు వినియోగించుకోవడంలో మిగతా రాష్ట్రాలు పోటీపడుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆ చొరవ కనిపించడం లేదు. 2022-23లో కేంద్రం కేటాయించిన నిధుల్లో ఏపీ ఒక్క రూపాయీ ఉపయోగించుకోలేదు. ఆ ఏడాది కేంద్రం రూ.3,458.20 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్రం వాటిని పక్కన పెట్టింది. మొదటివిడత నిధులు సింగిల్‌ నోడల్‌ ఎకౌంట్‌లో రాష్ట్రం జమచేస్తే... తమ వాటా ఇస్తామని కేంద్రం చెప్పినా పట్టించుకునే దిక్కే లేదు.


రెండేళ్ల నిధులు ఒకేసారి ఇచ్చినా అదే నిర్లక్ష్యం 

వివిధ కారణాలతో 2022-23లో నిధులు వినియోగించుకోలేపోయామన్న రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆ ఏడాది నిధులతోపాటు 2023-24కు సంబంధించినవీ కలిపి రూ.6,530.49 కోట్లు కేటాయించింది. వీటి ఉపయోగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. తొలుత తన వాటాగా రూ.793.57 కోట్లు విడుదల చేయడంతో ఈ ఏడాది మార్చి చివరినాటికి కేంద్రం కూడా అంతే మొత్తం విడుదల చేసింది. మిగతావీ ఇస్తాం.. రాష్ట్ర వాటా విడుదల చేయాలని కేంద్రం సూచించినా ఫలితం లేకపోయింది. దీంతో రెండేళ్లకు కేంద్రం కేటాయించిన నిధుల్లో నుంచి రూ.5,736.92 కోట్లు రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా ఇదే పథకానికి 2024-25లో కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని